Fertilization
-
గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్
సాక్షి, అమరావతి: సాగులో సూక్ష్మ ఎరువుల వినియోగం పెంచడం ద్వారా కూలీల వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) అందిస్తున్న కిసాన్ డ్రోన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 60 మంది నిరుద్యోగ యువత, పొదుపు సంఘాలకు శిక్షణ ఇచ్చి డ్రోన్లను అందజేసింది. రానున్న వ్యవసాయ సీజన్లో మరో 65 కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.తొలి దశలో రాష్ట్రంలో 160 డ్రోన్స్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. డిమాండ్‌ను బట్టి మరింత మందికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది 60 డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. ఈ ఏడాది మరో 65 మందికి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం ఎంపిక చేసిన నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై.. 18–50 సంవత్సరాల మధ్య వయసు వారు శిక్షణకు అర్హులు.మహిళలకు 15 రోజుల శిక్షణఆసక్తి, అర్హత ఉన్న వారికి 15 రోజులపాటు చెన్నైలోని దక్ష, మైసూర్‌లోని జనరల్ ఏరోనాటిక్స్ సంస్థల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుండగా.. రూ.15 వేలు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.35 వేలు ఇఫ్కో భరిస్తుంది. అదే పొదుపు సంఘాల మహిళలకైతే శిక్షణ ఉచితంగానే అందిస్తుంది. ఇప్పటికే ఇఫ్కో ద్వారా 70 మంది గ్రామీణ యువతతోపాటు 12 మంది పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి కాగానే డ్రోన్ పైలట్ లైసెన్స్ జారీ చేస్తున్నారు.రూ.15 లక్షల విలువైన డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనంలైసెన్స్ పొందిన అభ్యర్థులకు రూ.15 లక్షల విలువైన అత్యాధునిక డ్రోన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తున్నారు. యూనిట్ వ్యయంలో రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తే చాలు. ఎలక్ట్రిక్ వెహికల్‌పై రెండు రోజులపాటు క్షేత్రస్థాయి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇందుకోసం మరో రూ.16 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 20 వేల ఎకరాల్లో పిచికారీ లేదా ఐదేళ్ల తర్వాత గానీ డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనం అభ్యర్థుల పేరిట బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఈ మేరకు ఇఫ్కోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.జూన్‌లో అర్హుల గుర్తింపు2024–25 సీజన్లో మరో 65 మందికి కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి అర్హులైన వారిని గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వారికి దశల వారీగా శిక్షణ ఇచ్చిన తర్వాత ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.స్వయం ఉపాధి పొందుతున్నాంనేను బీ ఎస్సీ కంప్యూటర్స్ చేశా. ఇఫ్కో ద్వారా మద్రాస్ ఐఐటీలో డ్రోన్ పైలట్‌గా శిక్షణ పొందా. ఇఫ్కోతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించగా.. ఆ సంస్థ నాకు రూ.15 లక్షల విలువైన కిసాన్ డ్రోన్, ఎలక్ట్రికల్ వాహనం ఇచ్చింది. రైతు పొలాల్లో అద్దె ప్రాతిపదికన పురుగు మందులు, నానో ఎరువులు పిచికారీ చేసినందుకు ఎకరాకు రూ.300 తీసుకుంటున్నా. – కయ్యూరు మహేష్, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లాఖర్చు తగ్గుతోందిఇఫ్కో ద్వారా శిక్షణ పొంది కిసాన్ డ్రోన్ తీసుకున్నాం. గతంలో ఎకరాకు పిచికారి చేయాలంటే రూ.500 నుంచి రూ.600 వరకు కూలీలకు చెల్లించాల్సి వచ్చేది. కూలీలు దొరక్క చాలా ఇవ్వండి పడేవాళ్లం. కిసాన్ డ్రోన్‌తో 25 ఎకరాల వరకు పిచికారి చెయగలుగుతున్నాం. ఇప్పుడు కేవలం 4–5 నిముషాల్లో ఎకరా విస్తీర్ణంలో పిచికారీ పూర్తవుతోంది. వృథా కూడా ఏమీ ఉండటం లేదు. ఎకరాకు రూ.300 వరకు ఆదా అవుతోంది. – కొక్కిరాల వెంకట సుబ్బారావు, దుగ్గిరాల, బాపట్ల జిల్లారైతు ఖర్చులు తగ్గించడమే లక్ష్యంనిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న సంకల్పంతోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా, డీఏపీ ఎరువులకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వాటి వినియోగం పెరగాలంటే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. గతేడాది 60 మందికి శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది మరో 65 మందికి కిసాన్ డ్రోన్స్‌తో కూడిన ఎలక్ట్రికల్ వాహనాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం – టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
అప్పుడు తన్నులు.. ఇప్పుడు టన్నులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎరువుల కోసం పోలీసులతో తన్నులు తినాల్సి వచ్చేదని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో టన్నుల కొద్దీ ఎరువులు అందుబాటులో ఉంటున్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను ప్రజలకు పంపిణీ చేయడానికి పోటీ పడుతుండగా, ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం తిట్లలో పోటీ పడుతున్నారని విమర్శించారు. శనివారం ఆయన సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడు తూ, రోజుకో మేనిఫెస్టో విడుదల చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్, తాగునీరు ఎందుకు సరఫరా చేయలేదని ప్రశ్నించారు. ఆకలైనప్పుడు అన్నం పెట్టే చేతకాని వాడు, ఎన్నికలు వస్తుండటంతో గోరుముద్దలు తినిపిస్తానని చెబుతున్న తీరును ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవు తున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనకు కేసీఆర్ పాలనకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ మీటింగ్‌ల పేరుతో కాంగ్రెస్ జిమ్మిక్కులు సీడబ్ల్యూసీ మీటింగ్‌ల పేరుతో కాంగ్రెస్ జిమ్మిక్కులకు పాల్పడుతోందని, ఎవరెన్ని చేసినా రానున్న ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయడం కుదరదని, రాష్ట్రానికి పర్మినెంట్ గ్యారెంటీ కేసీఆరేనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర హ్యాండ్లూం కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. -
ఖటీఫ్
వేరుశనగ విత్తకు ఇక ఐదు రోజులే! ఇప్పటికీ 20 శాతం మించని సాగు వర్షాభావంతో అల్లకల్లోలంగా వ్యవసాయం జిల్లాలో వర్షం తుంపర్లు, చిరుజల్లులకే పరిమితం సాగులోని పంటలు కూడా ఎండుముఖం ‘ప్రత్యామ్నాయానికి’ వ్యవసాయ శాఖ చర్యలు ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం : 8.00 లక్షల హెక్టార్లు ఇప్పటి వరకు సాగు : 1.62 లక్షల హెక్టార్లు వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం : 6.04 లక్షల హెక్టార్లు ఇప్పటి వరకు సాగు : 1.33 లక్షల హెక్టార్లు సాధారణ వర్షపాతం : 120 మిల్లీమీటర్లు ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం : 83 మిల్లీమీటర్లు అనంతపురం అగ్రికల్చర్: చినుకు రాలక పంటల సాగు పడకేసింది. ప్రకృతి కరుణించకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. సీజన్లో 8లక్షల హెక్టార్లలో వర్షాధార పంటలు సాగులోకి రావాల్సి ఉండగా.. వర్షాభావంతో ఇప్పటికీ 20 శాతం మించలేదు. 6.04 లక్షల హెక్టార్లలో వేరుశనగ వేస్తారని అంచనా వేయగా.. 22 శాతంతో 1.33 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. మిగతా పంటలు 2లక్షల హెక్టార్లలో వేసే అవకాశం ఉందని అంచనా వేయగా.. అవి కూడా 20వేల హెక్టార్ల వద్దే నిలిచిపోయాయి. క్రాప్ బుకింగ్ చేస్తే కచ్చితమైన వివరాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా రైతుల బలం, బలహీనతగా పరిగణించే ప్రధాన పంట వేరుశనగ విత్తుకు నెలాఖరు వరకూ సమయం ఉంది. ఆ తర్వాత వేసినా ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆగస్టులో ప్రత్యామ్నాయ పంటలే ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే జొన్నలు, రాగులు, ఉలవలు, పెసలు, అలసంద, కొర్ర, సజ్జ తదితర పంటలు ఎన్ని వేసినా 2 నుంచి 3లక్షల హెక్టార్లకు మించకపోవచ్చని తెలుస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత సీజన్లో 3 నుంచి 4లక్షల హెక్టార్లు బీళ్లుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ముఖం చాటేసిన నైరుతి ఎన్నో ఆశలు పెట్టుకున్న నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో వర్షాలు పడలేదు. నైరుతి రాకమునుపే అంటే.. జూన్ 8వ తేదీలోగా జిల్లాలో మంచి వర్షం కురిసింది. ఆ తర్వాత తేలికపాటి నుంచి తుంపర్లకే పరిమితమైంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా.. 59 మిల్లీమీటర్లకు మించలేదు. పంటల సాగుకు కీలకమైన జూలై నెలలో 67.4 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 23 మి.మీ., నమోదైంది. నాలుగు రోజుల కిందట రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసినా ‘అనంత’లో తుంపర్లు, చిరుజల్లులకే పరిమితం కావడం.. ఇక వర్షం వస్తుందనే నమ్మకం కూడా రైతుల్లో సన్నగిల్లింది. 22 మండలాల్లో మోస్తరుగా పంటల సాగు జూన్‌లో అక్కడక్కడ కురిసిన మోస్తరు వర్షాలకు 22 మండలాల్లో మాత్రమే కొంత వరకు వేరుశనగ పంటలు విత్తుకున్నారు. తాడిమర్రి మండలంలో అత్యధికంగా 11వేల హెక్టార్లు, ఆత్మకూరులో 10వేల హెక్టార్లు, కనగానపల్లిలో 9,200 హెక్టార్లు, గుడిబండలో 7,600 హెక్టార్లు, చెన్నేకొత్తపల్లిలో 6,600 హెక్టార్లు, బ్రహ్మసముద్రంలో 6,500 హెక్టార్లు, గుమ్మగట్టలో 6వేల హెక్టార్లు, బత్తలపల్లిలో 5,300 హెక్టార్లు, నల్లమాడలో 5,200 హెక్టార్ల విస్తీర్ణంలో విత్తనం పడింది. బుక్కరాయసముద్రం, బుక్కపట్టణం, కొత్తచెరువు, ముదిగుబ్బ, ఓడీ చెరువు, తనకల్లు, చిలమత్తూరు, గుత్తి, పామిడి, ధర్మవరం, ఉరవకొండ, గుంతకల్లు, అమరాపురం, మడకశిర, కుందుర్పి, కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లో మోస్తరుగా వేరుశనగ వేశారు. మొత్త మ్మీద ధర్మవరం వ్యవసాయ డివిజన్లో 36వేల హెక్టార్లు, కదిరి డివిజన్లో 20వేల హెక్టార్లు, అనంతపురం డివిజన్లో 16వేల హెక్టార్లు, మడకశిర డివిజన్లో 15వేల హెక్టార్లు, కళ్యాణదుర్గం డివిజన్లో 12వేల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. మిగతా డివిజన్లు, మండలాల్లో నామమాత్రంగా పంట వేశారు. మిగతా పంటల విషయానికొస్తే కంది 13వేల హెక్టార్లు, పత్తి 8,500 హెక్టార్లు, మొక్కజొన్న 2,600 హెక్టార్లు, ఆముదం 1,600 హెక్టార్లు, జొన్న 1,300 హెక్టార్లలో సాగు చేశారు. మిగతా పంటలు వందల హెక్టార్లకే పరిమితమయ్యాయి. అన్ని రకాల పంటలు కలిపి తాడిమర్రి, ఆత్మకూరు మండలాల్లో 12వేల హెక్టార్ల చొప్పున వేశారు. వేసిన పంటలు కూడా ఎండుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నెలాఖరుకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఆగస్టులో పంటసాగుకు పంపిణీ చేయడానికి వీలుగా ఈనెలాఖరుకు ప్రత్యామ్నాయ విత్తనాలు తెప్పించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. 5.50 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం ఇప్పటికే 67వేల క్వింటాళ్లతో ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక కమిషనరేట్‌కు పంపినట్లు చెప్పారు. అందులో ఉలవలు 31,623 క్వింటాళ్లు, జొన్నలు 18,974 క్వింటాళ్లు, కొర్రలు 6,325 క్వింటాళ్లు, అలసందలు 3,795 క్వింటాళ్లు, పెసలు 3,795 క్వింటాళ్లు, రాగులు 1,265 క్వింటాళ్లు, పొద్దుతిరుగుడు 1,265 క్వింటాళ్లు అవసరమని నివేదించామన్నారు.