సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎరువుల కోసం పోలీసులతో తన్నులు తినాల్సి వచ్చేదని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో టన్నుల కొద్దీ ఎరువులు అందుబాటులో ఉంటున్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ సర్కారు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్‌లను ప్రజలకు పంపిణీ చేయడానికి పోటీ పడుతుండగా, ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం తిట్లలో పోటీ పడుతున్నారని విమర్శించారు.
శనివారం ఆయన సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడు తూ, రోజుకో మేనిఫెస్టో విడుదల చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్, తాగునీరు ఎందుకు సరఫరా చేయలేదని ప్రశ్నించారు.
ఆకలైనప్పుడు అన్నం పెట్టే చేతకాని వాడు, ఎన్నికలు వస్తుండటంతో గోరుముద్దలు తినిపిస్తానని చెబుతున్న తీరును ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవు తున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనకు కేసీఆర్ పాలనకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు.
సీడబ్ల్యూసీ మీటింగ్‌ల పేరుతో కాంగ్రెస్ జిమ్మిక్కులు
సీడబ్ల్యూసీ మీటింగ్‌ల పేరుతో కాంగ్రెస్ జిమ్మిక్కులకు పాల్పడుతోందని, ఎవరెన్ని చేసినా రానున్న ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయడం కుదరదని, రాష్ట్రానికి పర్మినెంట్ గ్యారెంటీ కేసీఆరేనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర హ్యాండ్‌లూం కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment