ఖటీఫ్
- వేరుశనగ విత్తకు ఇక ఐదు రోజులే!
- ఇప్పటికీ 20 శాతం మించని సాగు
- వర్షాభావంతో అల్లకల్లోలంగా వ్యవసాయం
- జిల్లాలో వర్షం తుంపర్లు, చిరుజల్లులకే పరిమితం
- సాగులోని పంటలు కూడా ఎండుముఖం
- ‘ప్రత్యామ్నాయానికి’ వ్యవసాయ శాఖ చర్యలు
ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం : 8.00 లక్షల హెక్టార్లు
ఇప్పటి వరకు సాగు : 1.62 లక్షల హెక్టార్లు
వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం : 6.04 లక్షల హెక్టార్లు
ఇప్పటి వరకు సాగు : 1.33 లక్షల హెక్టార్లు
సాధారణ వర్షపాతం : 120 మిల్లీమీటర్లు
ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం : 83 మిల్లీమీటర్లు
అనంతపురం అగ్రికల్చర్:
చినుకు రాలక పంటల సాగు పడకేసింది. ప్రకృతి కరుణించకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. సీజన్‌లో 8లక్షల హెక్టార్లలో వర్షాధార పంటలు సాగులోకి రావాల్సి ఉండగా.. వర్షాభావంతో ఇప్పటికీ 20 శాతం మించలేదు. 6.04 లక్షల హెక్టార్లలో వేరుశనగ వేస్తారని అంచనా వేయగా.. 22 శాతంతో 1.33 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. మిగతా పంటలు 2లక్షల హెక్టార్లలో వేసే అవకాశం ఉందని అంచనా వేయగా.. అవి కూడా 20వేల హెక్టార్ల వద్దే నిలిచిపోయాయి. క్రాప్ బుకింగ్ చేస్తే కచ్చితమైన వివరాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా రైతుల బలం, బలహీనతగా పరిగణించే ప్రధాన పంట వేరుశనగ విత్తుకు నెలాఖరు వరకూ సమయం ఉంది. ఆ తర్వాత వేసినా ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆగస్టులో ప్రత్యామ్నాయ పంటలే ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే జొన్నలు, రాగులు, ఉలవలు, పెసలు, అలసంద, కొర్ర, సజ్జ తదితర పంటలు ఎన్ని వేసినా 2 నుంచి 3లక్షల హెక్టార్లకు మించకపోవచ్చని తెలుస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత సీజన్‌లో 3 నుంచి 4లక్షల హెక్టార్లు బీళ్లుగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
ముఖం చాటేసిన నైరుతి
ఎన్నో ఆశలు పెట్టుకున్న నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో వర్షాలు పడలేదు. నైరుతి రాకమునుపే అంటే.. జూన్ 8వ తేదీలోగా జిల్లాలో మంచి వర్షం కురిసింది. ఆ తర్వాత తేలికపాటి నుంచి తుంపర్లకే పరిమితమైంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా.. 59 మిల్లీమీటర్లకు మించలేదు. పంటల సాగుకు కీలకమైన జూలై నెలలో 67.4 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 23 మి.మీ., నమోదైంది. నాలుగు రోజుల కిందట రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసినా ‘అనంత’లో తుంపర్లు, చిరుజల్లులకే పరిమితం కావడం.. ఇక వర్షం వస్తుందనే నమ్మకం కూడా రైతుల్లో సన్నగిల్లింది.
22 మండలాల్లో మోస్తరుగా పంటల సాగు
జూన్‌లో అక్కడక్కడ కురిసిన మోస్తరు వర్షాలకు 22 మండలాల్లో మాత్రమే కొంత వరకు వేరుశనగ పంటలు విత్తుకున్నారు. తాడిమర్రి మండలంలో అత్యధికంగా 11వేల హెక్టార్లు, ఆత్మకూరులో 10వేల హెక్టార్లు, కనగానపల్లిలో 9,200 హెక్టార్లు, గుడిబండలో 7,600 హెక్టార్లు, చెన్నేకొత్తపల్లిలో 6,600 హెక్టార్లు, బ్రహ్మసముద్రంలో 6,500 హెక్టార్లు, గుమ్మగట్టలో 6వేల హెక్టార్లు, బత్తలపల్లిలో 5,300 హెక్టార్లు, నల్లమాడలో 5,200 హెక్టార్ల విస్తీర్ణంలో విత్తనం పడింది. బుక్కరాయసముద్రం, బుక్కపట్టణం, కొత్తచెరువు, ముదిగుబ్బ, ఓడీ చెరువు, తనకల్లు, చిలమత్తూరు, గుత్తి, పామిడి, ధర్మవరం, ఉరవకొండ, గుంతకల్లు, అమరాపురం, మడకశిర, కుందుర్పి, కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లో మోస్తరుగా వేరుశనగ వేశారు. మొత్త మ్మీద ధర్మవరం వ్యవసాయ డివిజన్‌లో 36వేల హెక్టార్లు, కదిరి డివిజన్‌లో 20వేల హెక్టార్లు, అనంతపురం డివిజన్‌లో 16వేల హెక్టార్లు, మడకశిర డివిజన్‌లో 15వేల హెక్టార్లు, కళ్యాణదుర్గం డివిజన్‌లో 12వేల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. మిగతా డివిజన్లు, మండలాల్లో నామమాత్రంగా పంట వేశారు. మిగతా పంటల విషయానికొస్తే కంది 13వేల హెక్టార్లు, పత్తి 8,500 హెక్టార్లు, మొక్కజొన్న 2,600 హెక్టార్లు, ఆముదం 1,600 హెక్టార్లు, జొన్న 1,300 హెక్టార్లలో సాగు చేశారు. మిగతా పంటలు వందల హెక్టార్లకే పరిమితమయ్యాయి. అన్ని రకాల పంటలు కలిపి తాడిమర్రి, ఆత్మకూరు మండలాల్లో 12వేల హెక్టార్ల చొప్పున వేశారు. వేసిన పంటలు కూడా ఎండుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
నెలాఖరుకు ప్రత్యామ్నాయ విత్తనాలు
ఆగస్టులో పంటసాగుకు పంపిణీ చేయడానికి వీలుగా ఈనెలాఖరుకు ప్రత్యామ్నాయ విత్తనాలు తెప్పించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. 5.50 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం ఇప్పటికే 67వేల క్వింటాళ్లతో ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక కమిషనరేట్‌కు పంపినట్లు చెప్పారు. అందులో ఉలవలు 31,623 క్వింటాళ్లు, జొన్నలు 18,974 క్వింటాళ్లు, కొర్రలు 6,325 క్వింటాళ్లు, అలసందలు 3,795 క్వింటాళ్లు, పెసలు 3,795 క్వింటాళ్లు, రాగులు 1,265 క్వింటాళ్లు, పొద్దుతిరుగుడు 1,265 క్వింటాళ్లు అవసరమని నివేదించామన్నారు.