వారి కళ్లకు కరువు కనిపించదు | devinder sharma article on Drought | Sakshi
Sakshi News home page

వారి కళ్లకు కరువు కనిపించదు

Published Wed, May 17 2017 1:44 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

వారి కళ్లకు కరువు కనిపించదు - Sakshi

వారి కళ్లకు కరువు కనిపించదు

విశ్లేషణ
తరచుగా నేను బెంగళూరు వెళుతూ ఉంటాను. సంవత్సరానికి కనీసం నాలుగు సార్లయినా వెళతాను. ఇన్ని పర్యాయాలు ఆ నగరానికి వెళ్లినా, కర్ణాటక తీవ్ర దుర్భిక్షంతో నకనకలాడుతున్న సంగతి ఏనాడూ నా అనుభవానికి రాలేదు. మహా నగర జీవితమంటేనే అంత కాబోలు. అక్కడికి ముప్పయ్‌ కిలోమీటర్ల దూరంలోనే కరువు తాండవిస్తున్న సంగతి సంకేతప్రాయంగా కూడా అవగతం కాదు. 176 తాలూకాలలో 139 కంటే ఎక్కువ తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారని నాకు చెప్పారు. ఇంకా విషాదం ఏమిటంటే, గడచిన పదహారు సంవత్సరాలలో పదకొండేళ్లుగా కర్ణాటక రాష్ట్రం కరువుతో అలమటిస్తున్నది.

‘అనంత’ కరువు
ఆంధ్రప్రదేశ్‌లోనిదే అయినా బెంగళూరుకు కూతవేటు అవతలే ఉంది అనంతపురం జిల్లా. ‘న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’(ఏప్రిల్‌ 28)లో వెలువడిన ఒక వార్తా కథనం నా కళ్లల్లో నీళ్లు రప్పించింది. ‘మా నాన్న వచ్చాడా?’– ఇది అప్పుడే స్కూలు నుంచి వచ్చిన 12 సంవత్సరాల దివాకర్‌ వేసిన ప్రశ్న. ఇందుకు పినతండ్రి ఈశ్వరయ్య, ‘రాలేదు, వచ్చే నెలలో వస్తాడు. వచ్చేటప్పుడు నీకు బెంగళూరు నుంచి బోలెడు బొమ్మలు తెస్తాడు’ అని జవాబిచ్చాడు. అంతే, చేతిలోని పుస్తకాల సంచీ చిరాకుగా విసిరేసి, యూనిఫారమ్‌ మార్చుకుని, తన సైకిల్‌ వేసుకుని తాళాలు బిగించి ఉన్న ఇళ్ల మధ్య నుంచి సాగుతున్న వీధిలోకి వెళ్లిపోయాడు.

జిల్లా కేంద్రం అనంతపురం గురించీ, ఆ జిల్లాలోని పల్లెలు ఎలా వెలవెలపోతున్న తీరు గురించి వివరిస్తూ జర్నలిస్ట్‌ హరీశ్‌ గిలాయ్‌ రాసిన కథనం మరొకటి. అది గ్రామీణ భారతపు విషాదాన్ని వెల్లడించే కథనం. అయితే దీనిని ఎవరూ చదవరు. ఆ జిల్లాలోని నల్లమాడ మండలం, కూటపల్లి గ్రామం స్మశానాన్ని మరపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సగానికి పైగా ఇళ్లకు తాళాలు కనిపిస్తాయి. అక్కడ అటూ ఇటూ తిరుగుతున్న పెద్దలు కనిపిస్తారు. లేదంటే వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు.

నిజనిర్ధారణ సంఘం తరఫున వెళ్లిన అదితి మాలిక్, గీతికా మంత్రిల నివేదిక (ది న్యూస్‌ మినిట్, మే 9) మన గుండెలను కదిపి కుదిపే వాస్తవాలను వెల్లడిస్తుంది. కొంతమంది తమ పిల్లలను కూడా అక్కడే వదిలిపెట్టి, కూలీనాలీ వెతుక్కుంటూ ఎలా వలసపోయారో ఆ నివేదిక చెప్పింది. భూక్యా శ్యాములమ్మ వయసు పన్నెండేళ్లు. అనంతపురం జిల్లా కరెడ్డిపల్లి గ్రామంలోనే ఉండి తన తమ్ముడినీ, చెల్లెలినీ పోషిస్తోంది. బక్కపలచగా ఉండే శ్యాములమ్మ పక్క ఊళ్లో ఉన్న చౌకధరల దుకాణం నుంచి పాతిక కిలోల బియ్యం మోసుకువస్తుంది. ఆమె తండ్రి తాగుడుకు బానిసై గత ఏడాదే చనిపోయాడు. అందుకే ఆ కుటుంబానికి ఆమే దిక్కయింది. ఇది బాలీవుడ్‌ సినిమాలో దృశ్యంలా కనిపించవచ్చు. కానీ అదొక వాస్తవిక చిత్రమన్న సంగతిని మనం మరిచిపోరాదు.

ఆ గ్రామానికే చెందిన రమాదేవి కథ కూడా అంతే. తల్లిదండ్రులు ఇద్దరూ పని వెతుక్కుంటూ కేరళ వెళ్లారు. ‘కొన్నిసార్లు నా రక్షణ గురించి నాకు భయమేస్తూ ఉంటుంది’అని చెప్పింది రమాదేవి. ఇంట్లో ఆడపిల్ల ఒక్కర్తిని విడిచిపెట్టి తల్లిదండ్రులు పనుల కోసం వెళ్లిపోయారంటే ఆ కరువు ఎంత భయంకరమైన స్థాయిలో ఉంటుంది? అన్న ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ వాళ్లకు మరో మార్గం లేదు. తల్లిదండ్రులు ఎవరైనా కూడా తమ బిడ్డలను వదిలిపెట్టి దూరంగా ఉండాలని అనుకోరు. ఇదికూడా హాలీ వుడ్‌ సినిమా హోమ్‌ ఎలోన్‌లోని దృశ్యం కాదు. ఇలా వందలమంది చిన్నారులను వదిలిపెట్టి ఎందరో పనులు వెతుక్కుంటూ వలస వెళ్లారు. వరసగా ఆరో సంవత్సరం కూడా అనంతపురం జిల్లా కరువు బారిన పడింది.

దైవభూమి దృశ్యం
దైవభూమిగా ఇంకెంత మాత్రం చెప్పడానికి వీలుకాని కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో నివశించే కుటుంబాలు వారానికి 10 నుంచి 15 బకెట్ల నీటితో జీవనం సాగిస్తున్నాయి. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ (మే 8)లో వార్తా కథనం రాసిన షుజా ఫిలిప్‌ అట్టప్పాడి గురించి కళ్లకు కట్టారు. అక్కడ నిరుడే కాదు, ఈ సంవత్సరం కూడా కరువు తాండవిస్తోంది. నిజానికి కేరళ గడచిన 115 సంవత్సరాలలో ఏనాడూ చూడనంత కరువును ఇప్పుడు చూస్తోంది. 2016 అక్టోబర్‌లోనే ఆ రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించారు.

కానీ, ఆ రాష్ట్రంలోని నగరాలు తిరువనంతపురం గానీ, కోచి గానీ, లేదంటే కోజికోడ్‌ వెళితే ఇంత దారుణమైన కరువు కాటకాలు తాండవిస్తున్నాయన్న సంగతి మచ్చుకైనా తెలియదు. ఇక తమిళనాడులోని కరువు ప్రాంతాలలో ఐదురోజులు పర్యటించిన తరువాత స్వరాజ్‌ అభియాన్‌ ప్రముఖుడు యోగేంద్ర యాదవ్‌ తీవ్ర స్థాయిలో క్షోభను వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దారుణమైన నిర్లక్ష్యం అక్కడి యంత్రాంగాన్ని పూర్తిగా స్తంభించిపోయేటట్టు చేసింది. దీనితో రాష్ట్రంలో బలవన్మరణాలు పెరి గాయి’’ అని ఆయన రాశారు. అలాగే, ‘‘పశువుల మరణాలు రాష్ట్రంలో కరువు పరిస్థితికి సూచనలు’’అని కూడా యాదవ్‌ రాశారు.

న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర కొద్ది రోజుల క్రితం వరకు కొందరు తమిళనాడు రైతులు చేసిన దీక్షకు మీడియాలో పెద్ద చోటే దక్కింది. రూ. 40,000 కోట్ల మేరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్‌తో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. కానీ ఇది జాతిని కదిలించలేకపోయింది. ‘‘ఇది మునుపెన్నడూ లేని పరిస్థితి’’అని వ్యవసాయ వాతావరణ పరిశోధన విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎస్‌. పన్నీర్‌సెల్వం ‘ఇండియా స్పెండ్‌’తో చెప్పారు.

తమిళనాడులోని 32 జిల్లాలకు గాను 21 జిల్లాలు కరువు కోరలలో చిక్కుకున్నాయని ఆయన వెల్లడించారు. గడచిన 140 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడనంత కరువును ప్రస్తుతం ఆ రాష్ట్రం అనుభవిస్తోంది. కానీ ఈ రాష్ట్రంలో కూడా అంతే. చెన్నై లేదా కోయంబత్తూరు, మరేదైనా ఇతర నగరానికి వెళ్లండి! అసలు ఆ నగరాలకి కొద్దిదూరంలోనే కరువు కరాళ నృత్యం చేస్తున్న ప్రాంతాలు ఉన్న సంగతి కాస్త కూడా తెలియదు.

నగరాలకు సమస్యలెందుకు రావు?
మరొక అంశం కూడా నాకు వింతగా అనిపిస్తుంది. ఈ కరువుకాటకాలెప్పుడూ పల్లెప్రజలనే ఎందుకు ప్రధానంగా పట్టి పీడిస్తాయి? ఎంతో అరుదుగా తప్ప నగరాల జోలికీ, పట్టణాల జోలికీ ఆ దుర్భిక్షం ఎందుకు తాకదు? ఇందుకు నేను దేవుణ్ణి నిందించను. ఆయన అంత పక్షపాతంగా అయితే ఉండడు. ఎలాంటి తప్పు లేకున్నా పల్లెల్లో నివశిస్తున్న ప్రజలను దేవుడు శిక్షించడని నేను చెబుతాను. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలే కరువు కాటకాలకు ఎందుకు లక్ష్యంగా మారుతున్నారు? గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలోని లాతూర్‌ ఇందుకు మినహాయింపు అనుకోవచ్చు. కానీ చెన్నై సంగతి అలా కాదు. అక్కడ ఏర్పడిన నీటి కరువును తట్టుకోవడానికి ఆ నగరం నీళ్లను మోసుకొచ్చే రైళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

అయితే కరువు నీటి సమస్యను మాత్రమే తీసుకుని రాదు. దానితో ఇంకా అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయితే అవేవీ నగరాల అనుభవంలోకి రావు కూడా. ఇదంతా ఏమిటంటే, అభివృద్ధి క్రమం చోటు చేసుకున్న అసమతౌల్యత ఫలితమే. అసలు అభివృద్ధి విధానమే నగరాలు, పట్టణాలు కరువు పరిణామాల బారిన పడని రీతిలో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. గ్రామాలు, పట్టణాల మధ్య విభజన సుస్పష్టం. దుర్భిక్షం ద్వారా తలెత్తే పరిణామాల బారిన పడకుండానే నగరవాసులకు పూచీ పడినట్టు ఉంటుంది. గ్రామాల గుండా ప్రవహించే కాలవలు, నదులు ఎండిపోతుంటాయి. కానీ నగరాలలో కుళాయి నీరు మాత్రం ఎలాంటి దుర్భర పరిస్థితులలో కూడా రోజులో ఉదయం కొన్ని గంటలు, సాయంత్రం కొన్ని గంటల పాటైనా ధారగా ప్రవహిస్తూనే ఉంటుంది.

న్యూఢిల్లీ తనకు అవసరమైన నీటిని హిమాచల్‌ ప్రదేశ్‌లోని రేణుకా డ్యాం నుంచి తెచ్చుకుంటుంది. అలాగే ముంబై నగరం సమీపంలోని పశ్చిమ కనుమల నుంచి తెచ్చుకుంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాలు సమస్యలతో ఎంత సతమతమవుతున్నా ఈ నగరాలు ఏమీ పట్టనట్టే ఉండిపోతున్నాయి. పట్టణవాసులు, నగరవాసులు తమదైన ప్రపంచంలో తేలియాడుతూ ఉంటారు. తాము నివశిస్తున్న పట్టణానికీ లేదా నగరానికీ S కొద్దిదూరంలోనే ఉన్న కష్టాలను వారు గమనించరు. మన నాగరిక ప్రపంచం మనలని అలాంటి ధోరణికి తీసుకువెళ్లింది. సెల్ఫీల ప్రపంచంలో స్వార్థం తారస్థాయికి చేరుకుంది.

వ్యాసకర్త: దేవిందర్‌శర్మ
వ్యవసాయ నిపుణులు
ఈ మెయిల్‌ : hunger55@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement