అనంత వేదన పట్టదా బాబూ ?
-
చంద్రబాబు విధానాల వల్లే వ్యవసాయ సంక్షోభం
-
మూడేళ్లలో 4 లక్షల మంది వలస.. 180 మంది ఆత్మహత్య
-
కరువు పోవాలంటే చంద్రబాబు పీఠం దిగాలి
-
రైతు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
-
ధర్మవరంలో కదంతొక్కిన అన్నదాతలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
-
ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
ధర్మవరం :
రైతులు, ప్రజలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. కరువు, చంద్రబాబు కవలపిల్లలని, ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించితే కానీ రాష్ట్రంలో కరువు పోదని అన్నారు. కరువు సహాయక చర్యలు, రైతాంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతుధర్నా చేపట్టారు.
ముందుగా బత్తలపల్లి మండల కేంద్రం నుంచి ధర్మవరం వరకు 13 కిలో మీటర్ల మేర భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాకు నియోజకవర్గంలోని రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు తరిమెల శరత్‌చంద్రారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోటి సూర్యప్రకాష్‌బాబు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఈ మూడేళ్ల పాలనలో రైతులకు అందుతున్న అన్ని పథకాలను నిలిపివేశారన్నారు.
వైఎస్సార్ హయాంలో ఉపాధి హామీ ద్వారా వలసలను నివారిస్తే..ప్రస్తుతం ఉపాధి నిధులను రోడ్లు వేసేందుకు మళ్లించి ‘తమ్ముళ్ల’కు ప్రయోజనం కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల జిల్లాలోని రైతులు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారన్నారు. గతంలో నలుగురికి పని ఇచ్చిన రైతులు ప్రస్తుతం ఆత్మాభిమానాన్ని చంపుకుని రోడ్లు ఊడ్చే కూలీలుగా మారారని, మురికికాలువల పక్కన జీవిస్తున్నారని తెలిపారు. మరికొందరు భిక్షాటన చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా కోర్ డ్యాష్‌బోర్డు ద్వారా తనకు నేరుగా తెలుస్తుందని చెప్పుకునే చంద్రబాబు.. అనంతపురం జిల్లాలో కరువు, వలసలు, రైతు ఆత్మహత్యల గురించి తెలుసుకోకపోవడం విడ్డూరమన్నారు. గత ఖరీఫ్‌లో నాలుగు రోజుల్లోనే ఐదు లక్షల ఎకరాల్లో పంటను కాపాడామని చెప్పి జిల్లా రైతాంగాన్ని మోసం చేశారని, రెయిన్‌గన్‌ల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా ఇస్తామని చెప్పి ఆరు నెలలు కావస్తున్నా ఒక్క రైతుకూ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. జిల్లాలోని అన్ని చెరువులకు నీరిస్తామని గొప్పలు చెప్పుకున్నారని, కనీసం ఒక్క ఎకరానికీ ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. బిల్లులు ఆపేసి పండ్లతోటల రైతులను నాశనం చేస్తున్నారన్నారు.
రూ.కోట్లు ఎలా వెనకేసుకోవాలి.. తన కొడుకును ఎలా వృద్ధిలోకి తీసుకురావాలనే ధ్యాస తప్ప చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రమూ పట్టడం లేదన్నారు. రైతు సమస్యలపై పోరాడే నాయకుడు ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబును గద్దె దించి.. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసి రైతాంగానికి పూర్వవైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ధర్మవరం ఆర్డీఓ బాలానాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు పోతుకుంట రామయ్య, బగ్గిరి బయపరెడ్డి, వడ్డిరామలింగారెడ్డి, ఇందుకూరి నారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు గడ్డం కుళ్లాయప్ప, కౌన్సిలర్లు బీరే ఎర్రిస్వామి, చందమూరి నారాయణరెడ్డి, చిన్న తిమ్మన్న, గొట్లూరు సింగిల్‌విండో అధ్యక్షులు గిరక రామాంజినేయులు, సర్పంచ్‌ల సం ఘం అ«ధ్యక్షులు గెలివి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.