devender sharma
-
ఆహార దిగుమతి.. చైనా గుణపాఠాలు
దేశంలోని 95 శాతం ప్రజల ఆహార అవసరాన్ని దేశీయ ఉత్పత్తిద్వారానే నెరవేర్చాలని చైనా 1996లో లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2011 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారిపోయింది. మన దేశంలోనూ ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలు వ్యవసాయ సంస్కరణల పేరిట ఉన్న సౌకర్యాలను కూడా తొలగించే పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు పరివర్తన అనేది.. చైనాను నిర్వహించలేని ఆహార సంక్షోభంలోకి ఎలా నెట్టివేసిందనే అంశంపై చైనా మనకు పెద్ద గుణపాఠం నేర్పుతోంది. అదే బాటలో మనమూ నడిస్తే భారత్‌కు ఎవరు తిండి పెడతారు అనే ప్రశ్న మన భవిష్యత్ తరాలను కూడా వెంటాడుతుంది. సరిగ్గా 150 ఏళ్ల క్రితం గ్రేట్ ఐరిష్ కరువు బారిన పడి 10 లక్షలమంది చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఐర్లండ్‌లోని యూనివర్సిటీ కాలేజి కోర్క్‌లో 1998లో నిర్వహించిన ఒక అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ సభికులు నన్ను ప్రశ్నించారు. భారత్‌కు తిండి పెట్టేది ఎవరు? ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణ పరిశోధకుడు, చింతనాపరుడు లెస్టర్ బ్రౌన్ ప్రతిపాదించిన ఒక పరికల్పనను ప్రపంచం చర్చిస్తున్న సందర్భంగా ఆ ప్రశ్న వెలువడింది. అమెరికా కేంద్రంగా పనిచేసే పర్యావరణ మేధోమధన సంస్థ వరల్డ్ వాచ్ ఇనిస్టిట్యూట్ సంస్థాపకుడు, తర్వాత ఎర్త్ పాలసీ ఇనిస్టిట్యూట్ అధ్యక్షుడు లెస్టర్ బ్రౌన్ చైనాకు ఎవరు తిండి పెడతారు (హూ విల్ ఫీడ్ చైనా) అనే పుస్తకంలో తన విశ్లేషణను తీసుకొచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక సెమినార్లు, సదస్సులలో తీవ్ర వాదోపవాదాలకు తావిచ్చింది. అగణిత మేధోపండితులు కూడా లెస్టర్ బ్రౌన్ పరికల్పనను బలపర్చారు. కాగా కొంతమంది నిపుణులు ఆయన వాదనను బహిరంగంగానే సవాలు చేశారు. కానైతే.. సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా ఆవిర్భవించింది. ఆహార సంక్షోభ తీవ్రతను పైకి తోసిపుచ్చుతున్నప్పటికీ, గత ఏడాది ఆగస్టులో ఒక్క మెతుకు ఆహారాన్ని కూడా వృథా చేయవద్దని చైనా ప్రజలను కోరుతూ సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఆపరేషన్ క్లీన్ ప్లేట్ (ఆహార వృధాను అరికట్టే చర్య) పథకాన్ని ప్రారంభించడంతో చైనా పరిస్థితిపై ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనాలో ఒక సంవత్సరంలో 6 శాతం ఆహారం మాత్రమే వృథా అవుతుందని అంచనా వేసినా, అది 20 కోట్లమంది ప్రజలకు సరిపోయే ఆహారాన్ని అందిస్తుంది. చివరకు కస్టమర్లు కోరినంత తిండి పెట్టవద్దని చైనాలో రెస్టారెంట్లపై ఆంక్షలు విధించారు. ఉదాహరణకు విని యోగదారులు అయిదు మీల్స్ ఆర్డర్ చేస్తే నలుగురికి సరిపోయే తిండి మాత్రమే పెట్టాలని రెస్టారెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆహార వృథాపై చైనా ప్రభుత్వ ఆంక్షలు.. ప్రతి సోమవారం నిరాహార దీక్ష పూనాలంటూ నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1965లో భారతీయులను కోరిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. నిజానికి 1965లో అంటే దేశంలో హరిత విప్లవం ప్రారంభానికి సంవత్సరం ముందు ఏర్పడిన తీవ్రమైన ఆహార కొరతను అధిగమించడానికి భారతదేశం కోటి టన్నుల ఆహారధాన్యాలను దిగుమతి చేసుకుంది. హరిత విప్లవం మొదలైన తర్వాత భారత్ ఆహార పదార్థాల విషయంలో స్వావలంబనను సాధించింది కానీ ఆహారం సులభంగా అందుబాటులోకి వస్తుండటంతో నిర్లక్ష్యం దేశాన్ని అలుముకుంది. చైనా కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చాలా పెద్ద ముందంజ వేసింది. 1996లో చైనా ఒక విధానంపై దృష్టి పెడుతూ దేశంలోని 95 శాతం ప్రజల ఆహార అవసరాన్ని దేశీయ ఉత్పత్తిద్వారానే నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2011 నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకటన మేరకు, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారిపోయింది. ఆదాయాలు పెరగడంతో మధ్యతరగతి ప్రజల ఆహార ప్రాధాన్యతల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. చైనా వాడుకగా పండించే ఆహార ఉత్పత్తులనుంచి చైనా మధ్యతరగతి మాంసం, పాలతో సహా ఇతర పోషకాహార ఉత్పత్తులను డిమాండ్ చేయడం మొదలెట్టింది. ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు చోటుచేసుకోవడంతో ఆహార స్వావలంబన విధానం నుంచి చైనా ప్రభుత్వం గమనం మార్చుకుని తగుమాత్రం ఆహార దిగుమతులను అనుమతించింది. అదేసమయంలో భారీ ఎత్తున ప్రజలు నగరాల బాట పట్టడం, వ్యవసాయరంగం నుంచి రైతాంగం భారీ స్థాయిలో పారిశ్రామిక కార్మికవర్గంలోకి పరివర్తన చెందడం అనేది ఆహార ఉత్పత్తిలో అంతరాన్ని సృష్టించింది. పైగా, రసాయన ఎరువులు అధికంగా వాడే సాంద్ర వ్యవసాయ పద్ధతులతో సాగుభూములు కలుషితమయ్యాయి. భూగర్భ జలాలు క్షీణించి పోవడంతో కాలుష్యం కూడా పెరిగిపోయింది. ఈ పర్యావరణపరమైన క్షీణత సాగు భూముల విస్తీర్ణాన్ని తగ్గించివేసింది. దీంతో తన ఆహార భద్రత కోసం 12 కోట్ల హెక్టార్ల సాగు భూమిని కాపాడుకోక తప్పదంటూ చైనా ప్రకటించింది. చైనాలో సగటు వ్యవసాయ భూమి విస్తీర్ణం ఇప్పుడు 1.6 ఎకరాలకు పడిపోయింది. నైట్రోజన్తోపాటు రసాయనిక ఎరువుల వాడకం తీవ్రమవడం, రైతులకు ప్రత్యక్ష నగదు మద్దతును అందించడం కారణంగా 2017లో 60 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అదనంగా ఉత్పత్తయ్యాయి. కానీ, బీఫ్‌తో సహా ఇతర పోషకాహార పదార్థాల కోసం చైనాలో డిమాండ్ పెరిగిపోయింది. ఉదాహరణకు చైనాలో బీఫ్ ఉత్పత్తులకు డిమాండ్ 19,000 శాతానికి అమాంతంగా పెరిగిపోయింది. దీంతో భారత్, పాక్‌తో సహా ప్రపంచమంతటినుంచి చైనా ఆహార పదార్థాల కోసం అర్రులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిచ్ రేటింగుల ప్రకారం 2020 సంవత్సరంలో మొక్కజొన్న, గోధుమ, జొన్న, బార్లీ పంటల దిగుమతులు చైనాలో వరుసగా 136, 140, 437, 36.3 శాతం వరకు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సోయాబీన్స్‌ను ఉత్పత్తి చేస్తున్న బ్రెజిల్నుంచి ఇప్పటికే గరి ష్టంగా సోయాబీన్ దిగుమతులు మొదలెట్టిన చైనా, ఇప్పుడు వాటికోసం అమెరికావైపు చూపు సారిస్తోంది. ప్రపంచంలోనే గోధుమలను అత్యధికంగా పండిస్తున్న రెండో దేశంగా గుర్తింపు పొందిన చైనా ప్రపంచవ్యాప్తంగా పండే మొత్తం గోధుమ నిల్వల్లో సగం మేరకు సొంతం చేసుకుంది. ప్రపంచంలోని మొక్కజొన్న నిల్వల్లో 65 శాతాన్ని చైనా ఇప్పటికే సొంతం చేసుకుంది. దేశీయంగా ఆహార అవసరాలను తీర్చలేకపోతున్న చైనా, ఇప్పుడు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాలను కొనివేయడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాల కొనుగోలుపైనా చైనా చూపు సారిస్తోంది. 2010 నుంచి చైనా విదేశాల్లో 94 బిలియన్ డాలర్లు పెట్టి 32 లక్షల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసిందని జ్చటఝl్చnఛీజట్చb.ఛిౌఝ వెబ్సైట్ అంచనా వేసింది. చైనా అనుభవాల నుంచి భారత్ ముఖ్యమైన గుణపాఠాలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు చైనా పరివర్తన అనేది ఆ దేశాన్ని ఇక నిర్వహించలేని ఆహార సంక్షోభంలోకి ఎలా పడవేసిందనే అంశంపై చైనా మనకు పెద్ద గుణపాఠం నేర్పుతోంది. ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనాను మార్చివేసిన ప్రయోగం ఇప్పుడు అవసవ్య దిశలో పయనించబోతోంది. ఎందుకంటే కారుచౌకతో దొరికే శ్రామికలను అందించడంలో ఆఫ్రికా చైనాతో పోటీపడుతోంది. దీంతో చైనాలో మళ్లీ వ్యవసాయ క్షేత్రాలను పునరుద్ధరించడం అనేది అతి పెద్ద సవాలు కానుంది. చైనా ప్రతి ఏడాది 206 బిలియన్ డాలర్ల మేరకు వ్యవసాయ సబ్సిడీలను అందిస్తోంది. దీనికి ప్రతి ఏటా ఆహార ధాన్యాల దిగుమతిపై ఖర్చుపెడుతున్న వందల కోట్ల డాలర్లను కూడా కలుపుకోవాలి. చైనాలోని చిన్న కమతాల వ్యవసాయ క్షేత్రాలను ఆర్థిక శక్తి కేంద్రాలుగా మార్చడానికి ఇంతే మొత్తం ఖర్చు పెట్టినట్లయితే, అతిపెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తిదారు అయిన చైనా ప్రపంచ అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. ఇది ఒకరకంగా ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గం. సాగుభూములపై అధికంగా వ్యయం చేయడం వల్ల దీర్ఘకాలంలో స్వావలంబన సాధ్యపడుతుంది. కానీ చైనా ఇక్కడే విఫలమైంది. భారత్ కూడా ఆ దారిలో పయనిస్తే తట్టుకోలేదు. మరోమాటలో చెప్పాలంటే భారత్‌కు ఎవరు తిండి పెడతారు అనే ప్రశ్న మన భవిష్యత్ తరాలను కూడా వెంటాడుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ-మెయిల్ : : hunger55@gmail.com -
‘మందుల’ వాడకంలో మనమే టాప్
క్రిమిసంహారక మందుల తయారీ సంస్థల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా రైతుల ప్రాణాలను బలిగొంటున్నాయని, ఆ మందులను పంటపొలాల్లో వాడుతున్న రైతులు కేన్సర్ వ్యాధికి గురవుతున్నారని అంతర్జాతీయ అధ్యయనాలు భయంగొలిపే నివేదికలను వెలువరిస్తున్నాయి. ప్రపంచ పురుగుమందుల్లో 59 శాతంవరకు వినియోగిస్తున్న భారతదేశం అంతర్జాతీయంగా పురుగుమందుల వినియోగంలో అగ్రస్థానం పొందినట్లు తెలిసింది. పురుగుమందుల కంపెనీలు తయారు చేస్తున్న మందుల్లో 99.9 శాతం మందులు పర్యావరణంలో కలిసిపోతుండగా 0.1 శాతం మందులు మాత్రమే క్రిములను ప్రభావితం చేస్తున్నాయని ప్రొ. డేవిడ్ పిమెంటర్ యాభయ్యేళ్ల క్రితమే తన శాస్త్ర పరిశోధనా పత్రంలో సమర్పించారు. దీన్ని ముందుగానే గ్రహించి ఉంటే ప్రపంచం పురుగుమందులకు వ్యతిరేకంగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుని ఉండేది. అంతర్జాతీయ వ్యవసాయ రసాయనిక ఉత్పత్తుల బహుళజాతి సంస్థ బేయర్–మోన్శాంటో తయారు చేసిన రౌండప్, డికాంబా అనే క్రిమిసంహాకర మందులు కేన్సర్ వ్యాధికారకాలను కలిగి ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఆ సంస్థ కేసులు ఎదుర్కొం టోంది. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ ఎన్జీఓ పబ్లిక్ ఐ, యూకేకు చెందిన గ్రీన్ పీస్ సంస్థలకు చెందిన జర్నలిస్టు పరిశోధనా బృందం ‘అన్‌ఎర్త్‌డ్’ చేసిన పరిశోధనలో.. అత్యంత ప్రమాదకరమైన పురుగుమందుల్లో 59 శాతంవరకు వినియోగిస్తున్న భారతదేశం అంతర్జాతీయంగా పురుగుమందుల వినియోగంలో అగ్రస్థానం పొందినట్లు తెలిసింది. అయితే ది గార్డియన్ పత్రిక నివేదిక ప్రకారం, వ్యవసాయ రసాయన ఉత్పత్తుల కంపెనీలు ఈ డేటాతో విభేదిస్తున్నాయి. పరిశోధనా బృందం ప్రకటించిన సమాచారం తప్పుదోవ పట్టిస్తోందని బేయర్ కంపెనీ చెబుతోంది కానీ దాన్ని తన సొంత డేటాతో ఎదుర్కోలేకపోయింది. మరోవైపున ఆగ్రో–కెమికల్ పరిశ్రమకు చెందిన బలమైన లాబీ గ్రూప్ అయిన క్రాప్ లైఫ్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటన చేస్తూ, తన ఉత్పత్తులలో 15 శాతం మాత్రమే అత్యంత ప్రమాదకరమైనవిగా ఉంటున్నాయని, వీటిలో కూడా 10 శాతం మందులను రైతులు సురక్షితంగా వాడుతున్నారని తెలిపింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా ఆహార, వ్యవసాయ సంస్థ అభిప్రాయం ప్రకారం అత్యంత ప్రమాదకరమైన పురుగుమందులు అంటే.. ‘అంతర్జాతీయంగా ఆమోదించిన వర్గీకరణ వ్యవస్థల ప్రకారం మానవ ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి తీవ్రమైన, దీర్ఘకాలిక హాని కలిగించేవి’ అని అర్థం. ఇది 1980లలో నోబెల్ గ్రహీత నార్మన్ బొర్లాగ్తో నేను జరిపిన చర్చను గుర్తుకు తెచ్చింది. పర్యావరణ ఉద్యమానికి దారిచూపుతున్నట్లుగా అప్పట్లో ప్రచారమైన రేచల్ కార్ల్సన్ రాసిన ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకంపై నేను సంధించిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆమె ఒక దుష్టశక్తి అని అభివర్ణించారు. ఆమెలాంటి వ్యక్తులు ప్రపంచంలోనుంచి ఆకలిని తరిమివేయాలని అసలు కోరుకోరని ఆయన విమర్శించారు. పైగా పురుగుమందులు అనేవి ఔషధాల వంటివి అనేశారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుని రైతులు వాటిని ఉపయోగించాలన్నారు. ఆరోజు బొర్లాగ్ చెప్పిన మాటలు చర్చనీయాంశమే. కానీ ఆయన అభిప్రాయాలు క్రిములు కలిగించే నష్టాన్నుంచి పంటలను కాపాడేందుకు పురుగుమందులను ఉపయోగించే హరిత విప్లవానికి కీలక వ్యూహాన్ని ఏర్పర్చాయి. కానీ ఏళ్లు గడిచేకొద్దీ, పురుగుమందులు పర్యావరణానికి మరిం తగా హాని కలిగించాయి. రసాయనమందుల వినియోగం, దుర్వినియోగం అనేవి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ నష్టాలకు, పర్యావరణ అసమతుల్యతకు, పురుగుమందుల ప్రభావం నిరోధకతకు, మొత్తం ఆహార సరఫరా వ్యవస్థనే కలుషితం చేసిందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంత అధికంగా పురుగుమందులు వాడితే అంత అధికంగా ఆకలిని తొలగించవచ్చనే అభిప్రాయం భ్రాంతి మాత్రమే అని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి హిలాల్ ఎల్వర్ పేర్కొన్నారు. మరింతగా పురుగుమందులు వాడితే ఆకలి సమస్యపై అంత ఎక్కువగా స్వారీ చేయవచ్చనడంలో నిజం లేదు. ఎప్‌ఏఓ ప్రకారం, ఈరోజు మనం 700 కోట్లమందికి ప్రపంచంలో తిండిపెడుతున్నాం. ఉత్పత్తి కచ్చితంగా పెరిగింది. కానీ దారిద్య్రం, అసమానత్వం, పంపిణీయే అసలు సమస్య. పురుగుమందులను దీర్ఘకాలంగా వాడటం అనేది కేన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులకు దారితీస్తోందని, హార్మోన్ల విచ్ఛిన్నత, మానవ శరీర అభివృద్ధి క్రమరాహిత్యం, సంతాన విహీనత వంటివి కూడా తలెత్తుతున్నాయని పై నివేదిక వివరించింది. రౌండప్ పురుగుమందులో వాడుతున్న గ్లైపోసేట్ మనుషుల్లో కేన్సర్‌కు కారణమవుతోందన్న అంశాన్ని జతచేస్తూ ఇంటర్నేషనల్ ఏజెన్సీ రీసెర్చ్ ఆన్ కేన్సర్ నివేదికను ప్రచురించిన తర్వాత, విషపూరితమైన పురుగుమందుల వాడకానికి వ్యతిరేకంగా అమెరికాలో అనేక వ్యాజ్యాలు ప్రారంభమయ్యాయి. గ్లిపోసేట్కు, కేన్సర్ వ్యాధికి మధ్య లింకు ఉన్నట్లు యూరోపియన్ కమిషన్, అమెరికా పర్యావరణ రక్షణ ఏజెన్సీ వంటి రెగ్యులేటరీ సంస్థలు చెప్పడం లేదని మోన్శాంటో చెప్పింది కానీ పలువురు కేన్సర్ రోగులు పురుగుమందుల కంపెనీలపై లీగల్ కేసులు పెట్టడం ప్రారంభించారు. తాజా గణాంకాలను చూస్తే ఇంతవరకు పురుగుమందుల కంపెనీలపై 42,000 కేసులు పెట్టారు. కాగా ఫిర్యాదుదారుల సంఖ్య ఇప్పటికే లక్షకు పైగా దాటినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక్క గ్లైపోసేట్‌కు వ్యతిరేకంగానే కాకుండా, మరొక క్రిమిసంహారక మందు అయిన డికాంబాపై కూడా న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 15న మిస్సోరి రైతుకు తన పీచ్ ఆర్చర్డ్ తోటను పురుగుమందులు ధ్వంసం చేసిపడేశాయన్న ఆరోపణతో ఏకీభవిం చిన అమెరికా ఫెడరల్ కోర్టు 265 మిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని పురుగుమందుల కంపెనీలను ఆదేశించింది. తన పొరుగున ఉన్న పొలం యజమాని చల్లిన డికాంబా క్రిమిసంహాకర మందు పక్కనే ఉన్న తన పూలతోటకు వ్యాపించి తోట మొత్తాన్ని పాడు చేసిందంటూ ఆ రైతు బేయర్, బీఎఎస్ఎఫ్ అనే బడా ఆగ్రో–కెమికల్ కంపెనీలపై ఫిర్యాదు చేశారు. డికాంబా పురుగుమందు ప్రభావాన్ని తట్టుకునే పత్తిపంట కోసం పొరుగు రైతు ఈ కంపెనీల మందును చల్లగా అది పక్కనున్న తన పొలంలోని పీచ్ అర్చర్డ్ తోటలోని ఆకులను, చెట్లను చంపేసిందని ఆ రైతు వాదించి మరీ గెలిచారు. అయితే గ్లైపోసేట్ పురుగుమందుకు వ్యతిరేకంగా నడుస్తున్న న్యాయపరమైన లావాదేవీని మనం నిశితంగా పరిశీలించాలి. ఇంతవరకు గ్లైపోసేట్‌కు వ్యతిరేకంగా మూడు వ్యాజ్యాలలో నలుగురు ఫిర్యాదీదారులకు న్యాయస్థానం 2.3 బిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని తీర్పు ఇచ్చింది. తన పురుగుమందులు వాడేటప్పుడు కేన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని వినియోగదారులను నిర్దిష్టంగా హెచ్చరించడంలో పురుగుమందుల కంపెనీ విఫలమైందని తీర్పులు స్పష్టం చేశాయి. మొట్టమొదటగా 2018 ఆగస్టు నెలలో డెవైన్ జాన్సన్ అనే తోటల పెంపకందారుకు శాన్ప్రాన్సిస్కో న్యాయస్థానం 289 మిలి యన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని పురుగుమందుల కంపెనీలను ఆదేశించింది. తన పొలంలో గ్లైపోసేట్‌కు చెందిన వివిధ రకాల కాంబినేషన్లను స్ప్రే చేశానని, దీంతో తాను లింపోమా వ్యాధికి గురయ్యానని ఆ రైతు చెప్పారు. ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 10 వేల పురుగుమందుల విషప్రభావానికి సంబంధించిన కేసులు సగటున నమోదవుతున్నాయని డౌన్ టు ఎర్త్ పత్రిక పేర్కొంది. 2015లో ప్రమాదవశాత్తూ పురుగుమందులతో విషప్రభావానికి గురై 7,060 మంది చనిపోయారని జాతీయ నేర నమోదు బ్యూరో పేర్కొంది. వాస్తవానికి దేశంలో రూ. 20,000 కోట్ల విలువైన క్రిమిసంహారక పరిశ్రమలు 2024 వరకు ప్రతి ఏటా 8.1 శాతంతో వృద్ధి సాధించనున్నాయని అంచనా. అంటే పురుగుమందుల కంపెనీల క్రమబద్ధీకరణ విషయంలో లొసుగులను పరిష్కరించడం ఎంత అవసరమో దీన్ని బట్టి తెలుస్తోంది. కేంద్రం తీసుకురానుందని చెబుతున్న పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ 2020ను త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్టం క్రిమిసంహారక మందుల కంపెనీలను క్రమబద్ధీకరించడమే కాకుండా తమ మందుల వాడకం ద్వారా రైతులకు కలుగుతున్న ఆరోగ్యపరమైన నష్టాలకు కూడా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పైగా వేలాది మంది రైతులు వేయబోయే కేసులను కూడా మననంలో ఉంచుకోవలసిన అవసరం ఉంది అయితే దాదాపు అయిదు దశాబ్దాల క్రితం 1970లలో కార్నెల్ యూనివర్సిటీకి చెందిన సుప్రసిద్ధ ప్రొఫెసర్ డేవిడ్ పిమెంటర్ చెప్పిన మాటలను ప్రపంచం పట్టించుకుని ఉంటే ఈ 50 ఏళ్లలో జరుగుతూ వచ్చిన నష్టాన్ని నివారించి ఉండేది. పురుగుమందుల కంపెనీలు తయారు చేస్తున్న మందుల్లో 99.9 శాతం మందులు పర్యావరణంలో కలిసిపోతుండగా 0.1 శాతం మందులు మాత్రమే క్రిములను ప్రభావితం చేస్తున్నాయని ఆయన ఆనాడే తన శాస్త్ర పరిశోధనా పత్రంలో సమర్పించారు. అంటే పురుగుమందుల్లోని రసాయనాలు ఒక శాతం మాత్రమే తమ లక్ష్యాన్ని తాకుతున్నాయని అర్థం. దీన్ని ముందుగానే గ్రహించి ఉంటే ప్రపంచం పురుగుమందులకు వ్యతిరేకంగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుని ఉండేది. కానీ ఇంతవరకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వ్యాసకర్త: దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు, ఈ–మెయిల్ : hunger55@gmail.com -
సమృద్ధి వెలుగులో ఆకలి నీడలు
దేశంలోని అదనపు ఆహార నిల్వల సంచులను ఒకదానిపై ఒకటిగా పేర్చుకుంటూ పోతే వాటిపై నడుచుకుంటూ చంద్రుడి వద్దకు వెళ్లి మళ్లీ తిరిగిరావచ్చు. పైగా మన ఆహార నిల్వలు రానురాను పెరుగుతూనే ఉన్నాయి. ఇంత సమృద్ధిగా ఆహార నిల్వలు ఉన్నప్పటికీ పొరుగు దేశాల్లోకంటే ఆకలి బాధా సూచికలో భారత ర్యాంకు ఘోరంగా పడిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఆహారోత్పత్తిలో, అదనపు మిగులులో రికార్డులన్నింటినీ బద్దలు చేస్తున్న భారత్‌లో ప్రతిరోజూ 2,400 మంది చిన్నారులు రకరకాల పోషకాహార లేమితో అల్లాడుతూ మృత్యువాత పడుతుండటం సమృద్ధి వెనుక దాగిన చీకట్లను స్పష్టంగా చూపుతోంది. ప్రతి ఏటా 8 లక్షల మంది పిల్లలు ఆకలిదప్పులతో కన్నుమూస్తున్న స్థితిలో, జనాభాలో అధిక శాతానికి తగిన పోషకాహారం లేని నేపథ్యంలో భారత్ ఆర్థిక అగ్రరాజ్యంగా మారాలనే కలను ఎన్నటికీ సాకారం చేసుకోలేదు. సమృద్ధికి సంబంధించిన ఈ వింత పరామితి ఇప్పటికీ ఊహకు అందనివిధంగానే ఉంటోంది. ఒకవైపున దేశంలో గోధుమ నేలలు విస్తారమైన పంట లతో కళకళలాడుతుండగా మరోవైపున ప్రపంచ క్షుద్బాధా సూచి (జీహెచ్ఐ) భారత్‌కు అకలితో అలమటించిపోతున్న 117 దేశాల్లో 102వ స్థానమిచ్చింది. ఇది చాలదన్నట్లుగా, తాజా యూనిసెఫ్ నివేదిక అయిదేళ్లలోపు పిల్లలు అధిక మరణాల పాలవుతున్న దేశాల జాబితాలో భారత్‌ను చేర్చింది. గత ఏడాది భారత్‌లో 8.82 లక్షలమంది చిన్నపిల్లలు మరణించారని యూనిసెఫ్ నివేదించింది. ఒకవైపున వినియోగదారీ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తనకు తలకు మించిన భారంగా తయారవుతున్న ఆహారధాన్యాల నిల్వలను కాస్త తగ్గించి పుణ్యం కట్టుకోవలసిందిగా భారత విదేశాంగ శాఖను వేడుకుంటోంది. భారత ఆహార సంస్థ వద్ద పేరుకుపోతున్న ఆహార ధాన్యాలలో అదనపు నిల్వలను ప్రపంచంలో అవసరమైన దేశాలకు అందించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఈ మంత్రిత్వ శాఖ భారత విదేశాంగ శాఖను కోరింది. విచిత్రం ఏమిటంటే దేశంలో 6 నుంచి 23 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్లో 90 శాతం మందికి తినడానికి తగినంత ఆహారం లేక అల్లాడిపోతున్న పరిస్థితుల్లో మన ఆహార ధాన్యాల నిల్వలను బయటిదేశాలకు పంపవలసిందిగా వేడుకోవడమే. ఆకలి, పోషకాహార సమస్యను తీవ్రతరం చేస్తూ మన అమూల్య వనరులైన పిల్లల జీవితాల్లో నిశ్శబ్ద విషాదాన్ని సృష్టిస్తుండగా, బయటిదేశాలకు మానవీయప్రాతిపదికన ఆహార నిల్వలను అందించాలన్న ప్రతిపాదన కంటే మించిన అభాస మరొకటి ఉండదు. దేశంలో ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు తగిన తిండి లేకుండా బక్కచిక్కిపోతున్న వాస్తవం తెలిసిన విషయమే. అక్టోబర్ 1 నాటికి 307.70 లక్షల టన్నుల ఆహార ధాన్యాల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా భారత ఆహార సంస్థ ఇప్పటికే రెట్టింపు స్థాయిలో 669.15 లక్షల టన్నుల వరి, గోధుమ పంటను సెప్టెంబర్ 1 నాటికే సేకరించింది. వరి పంట ఇప్పుడు తారస్థాయిలో పోగవుతున్న స్థితిలో రాబోయే కొద్ది వారాల్లో కేంద్ర ఆహార నిల్వల గిడ్డం గులు ధాన్య సమృద్ధితో పొంగిపొరలనున్నాయి. దీనికితోడుగా దేశంలో 2018–19 సంవత్సరంలో పళ్లు, కూరగాయలు 314.5 మిలి యన్ టన్నులకు పోగుపడ్డాయి. ఇక పాల ఉత్పత్తి 176 మిలియన్ టన్నులతో రికార్డు సృష్టించింది. అంటే దేశంలో పోషకాహారానికి కొరతే లేదని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఆహార ధాన్యాలను ఇంత సమృద్ధిగా నిల్వ ఉంచుకున్న దేశంలో అత్యధిక జనాభా ఆకలితో అలమటిస్తుండటం కంటే మించిన అసందర్భం ఉండదు. దీన్ని మరింత సులువుగా చెప్పుకుందాం. దేశంలోని అదనపు ఆహార నిల్వల సంచులను ఒకదానిపై ఒకటిగా పేర్చుకుంటూ పోతే వాటిపై నడుచుకుంటూ చంద్రుడి వద్దకు వెళ్లి మళ్లీ తిరిగిరావచ్చు. ఇంత సమృద్ధికరంగా ఆహార నిల్వలు ఉన్నప్పటికీ పొరుగు దేశాల్లోకంటే ఆకలి బాధా సూచికలో భారత ర్యాంకు ఘోరంగా పడిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కెనడా తన రికార్డును మెరుగుపర్చుకుని అంతర్జాతీయంగా 25వ ర్యాంకులో నిలబడగా, బ్రిక్స్ దేశాలన్నిటికంటే భారత్ వెనుకబడిపోయింది. శ్రీలంక (66), నేపాల్ (73), బంగ్లాదేశ్ (88), పాకిస్తాన్ (94) ర్యాంకులతో మనకంటే ఎంతో మెరుగ్గా ఉండగా, చివరకు వెనిజులా (65), ఉత్తర కొరియా (92), ఇథియోపియా (93) ర్యాంకులతో మనల్ని అధిగమించటం బాధాకరం. నిజానికి, 2006 నుంచి ప్రపంచ క్షుద్బాధా సూచిని ప్రకటిస్తుండగా, 14 రిపోర్టుల తర్వాత కూడా భారత్ ఆకలి, పోషకాహార లేమి సంబంధించి ఏమాత్రం మెరుగుపడలేదు. ఇది మన ప్రాధాన్యతల ఎంపికకు సంబంధించిన సమస్య. కొన్నేళ్లుగా అత్యధిక ఉత్పాదకతను సాధించడంపైనే మన విధాన నిర్ణేతల దృష్టి ఉంటూ, దేశంలో ప్రబలుతున్న ఆకలిని, పోషకాహార లేమిని తేలికగా పక్కనపెడుతూ వస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అధికంగా అభివృద్ధి చెందితే ఆకలిదప్పులతో జీవిస్తున్న వారి జనాభా దానికదే తగ్గిపోతుందనే ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతా దృక్పథాన్ని దేశంలో కంటికి కనబడే ఆకలి, కనిపించకుండా మరుగున ఉండే ఆకలి రెండూ వెక్కిరిస్తూ వస్తున్నాయి. పైగా, ఆర్థిక వ్యవస్థ పెరుగుదలతోపాటే ఆకలి, పోషకాహార లేమి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పోషకాహార లేమిని ‘జాతీయ అవమానం’గా భావించాలని ప్రకటించినా పరిస్థితిలో మార్పు లేదు. ఆకలిని తొలగించడం సంక్లిష్టమైన, సవాలుతో కూడిన కర్తవ్యమని అర్థం చేసుకుంటాను కానీ గత కొన్నేళ్లుగా పిల్లల పోషకాహార లేమి, ఆహార దుబారా వంటి అంశాల్లో దేశం ప్రగతి సాధించి ఉంటే ఆకలి చరిత్రను నివారించడం అనే భారీ లక్ష్యం అసాధ్యమై ఉండేది కాదు. జనాభాలోని మూడింట రెండొంతుల మందికి సబ్సిడీ కింద ఆహార ధాన్యాలను అందించే లక్ష్యంతో 2013 జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకురావడమే కాకుండా, పిల్లల్లో పోషకాహార లేమితో తలపడేందుకు, ఆకలిని నిర్మూలించేందుకు అనేక పథకాలను కేంద్ర స్థాయిలో ప్రవేశపెట్టినప్పటికీ సూక్ష్మ ఆర్థిక విధానాలలో.. వీటిని సాధించాల్సిన లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకోలేదు. పైగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు కూడా అలా ఆహార సబ్సిడీలను పెంచడం వల్ల ద్రవ్యలోటు పెరిగిపోతుందని మన జాతీయ స్రవంతి ఆర్థికవేత్తలు నిరసన గళం వినిపించారు. తీవ్రమైన దారిద్య్రాన్ని, ఆకలిని నిర్మూలించేందుకు నాటి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా 2003లో ప్రారంభించిన ‘జీరో హంగర్’ (సంపూర్ణంగా ఆకలిని నిర్మూలించడం) కార్యక్రమంతో భారత్ విధానాలను పోల్చి చూద్దాం. జీరో హంగర్ కార్యక్రమం కింద వ్యవసాయంలో వ్యవస్ధాగతమైన మార్పులను నాటి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం కింద 2011 నాటికే బ్రెజిల్లో దాదాపు మూడు కోట్ల 20 లక్షలమంది ప్రజలు (జనాభాలో 16 శాతం) దారిద్య్రం కోరల నుంచి బయటపడ్డారని ప్రముఖ పత్రిక ‘ది గార్డియన్’ పేర్కొంది. దీనికి ‘బోల్సా ఫ్యామిలియా’ వంటి నగదు బదిలీ పథకాలు తోడై జనాభాలో పావు శాతం పైగా ప్రజలకు నిజంగా ఊతమిచ్చాయి. ఆహార భద్రత, విద్య, వైద్యాలను అందుబాటులో ఉంచడం, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి వాటి కలయికే బోల్సా ఫ్యామిలియా. పర్యవసానంగా కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే బ్రెజిల్ ప్రపంచ క్షుద్బాధా సూచి కలో 18వ ర్యాంకులో నిలిచింది. అంటే ఆకలి నివారణలో చైనాకంటే అగ్ర స్థాయిని బ్రెజిల్ సాధించింది. సారాంశంలో బ్రెజిల్ అమలు పర్చిన జీరో హంగర్ విధానాలు ఆహారోత్పత్తిని ఆకలి నిర్మూలనతో ముడిపెట్టడంలో విజయవంతమయ్యాయి. ఈ పథకంలోనూ కొన్ని తేడాలు ఉండవచ్చు కానీ, ఆకలిని పూర్తిగా నిరోధించడానికి బ్రెజిల్ ఇప్పటికీ నిర్ణీత గడువుతో కూడిన పథకాలను అమలు చేస్తోంది. భారత్‌లో ఆహార ఉత్పత్తిని పెంచడంపైనే పాలకుల విధానాలు దృష్టి పెడుతూ ఆహారధాన్యాలు తక్కువగా ఉంటున్న ప్రాంతాలకు అదనపు ఆహార నిల్వలను తరలించే పద్ధతిని అమలుచేస్తూ ఉన్నప్పటికీ, రైతుల సంక్షేమానికి మాత్రం ఏ ప్రభుత్వమూ ప్రాధాన్యత ఇచ్చిన చరిత్ర లేదు. వ్యవసాయంలో 60 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటున్న దేశంలో జీరో హంగర్ని సాధించడానికి చేసే ఏ పథకమైనా వ్యవసాయాన్ని మౌలికంగా పునరుద్ధరించాల్సి ఉంటుంది. వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచవలసి ఉంది. అయితే ఆర్బీఐ ప్రకారం 2011–12 నుంచి 2016–17 మధ్య ప్రభుత్వరంగ సంస్థలు వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు మన స్థూల దేశీయోత్పత్తిలో 0.4 శాతం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఆకలితో, పోషకాహార లేమితో పోరాడ్డానికి సంబంధించి లెక్కలేనన్ని వాగ్దానాలు చేశారు. హామీలు గుప్పిం చారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, భారత్‌లో ప్రతి రోజూ 2,400 మంది చిన్నారులు రకరకాల పోషకాహార లేమితో అల్లాడుతూ మృత్యువాత పడుతుండటమే. దేశంలో జరుగుతున్న ఈ భారీ మానవ విషాదానికి.. పిల్లల నోటికి సరైన మోతాదులో మనం ఆహారాన్ని అందించకపోవడమే కారణం. ఆహార ఉత్పత్తిలో కొరత లేదు. ఆర్థిక విధానాలను ప్రకటించి అమలుచేసే సామర్థ్యంలో కొరత లేదు. కానీ, ఆకలిని తొలగించడానికి బలమైన రాజకీయ సంకల్పం నిజంగా కరువైపోయింది. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది పిల్లలు ఆకలిదప్పులకు తాళలేక కన్నుమూస్తున్న స్థితిలో, జనాభాలో అధిక శాతానికి తగిన పోషకాహారం లేని నేపథ్యంలో భారత్ ఆర్థిక అగ్రరాజ్యంగా మారాలనే కలను ఎన్నటికీ సాకారం చేసుకోలేదు. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ :hunger55@gmail.com -
పంటల సమృద్ధికి దుబారా పోటు
ఉత్తర భారత ధాన్యాగారమైన పంజాబ్, హరియాణా రాష్ట్రాలు గోధుమ, వరి పంటల దిగుబడిలో ప్రతి ఏటా రికార్డులను చెదరగొడుతూ ఉన్నాయి. కానీ పంటల సమృద్ధిని మించి పోటీపడుతున్న ఆహార ధాన్యాల దుబారా మన ధాన్య సేకరణ, నిల్వల విధానాన్నే పరిహసిస్తోంది. గోధుమ పంట సీజన్ ముగుస్తున్నప్పటికీ కొత్త పంటను నిల్వచేయడానికి పంజాబ్‌లో ఎలాంటి నిల్వ సౌకర్యాలు లేకపోవడం విచారకరం. ఆహారధాన్యాల ఉత్పత్తి విషయంలో ప్రతి సంవత్సరం సంబంధిత అధికారులు లక్ష్యాలు విధిస్తూ పోవడం పాలసీ ఎజండాగా ఉంటూవస్తోంది తప్పితే.. పండించిన, సేకరించిన ప్రతి వరి, గోధుమ గింజను నిల్వచేయడాన్ని నిర్వహించడం ఎలా అనేది మన రాజకీయ ప్రాధాన్యతలలో అట్టడుగున ఉండటమే విచారకరం. ఆహార ధాన్యాలు మానవ వినియోగానికి పనికిరాకుండా పోవడం జాతి మొత్తం సిగ్గుపడాల్సిన విషయం. ప్రజాస్వామ్యానికి చెందిన అతి పెద్ద పండుగ అయిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సీజన్లో గోధుమ పంట విరగపండిందని వార్తలొస్తున్నాయి. భారతదేశ గోధుమ ధాన్యాగారమైన పంజాబ్, హరి యాణా రాష్ట్రాల్లో ఎంత పంట పండిందనే విషయంలో అధికారిక లెక్కలను ఖరారు చేయడానికి కాస్త సమయం పడుతుంది కానీ, ఈసారి గోధుమ పంట 310 లక్షల టన్నులతో రికార్డు సృష్టించనుందని ప్రారంభ అంచనా. పంజాబ్‌లో ఈ దఫా 180 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుందని భావిస్తుండగా పొరుగున ఉన్న హరియాణాలో 130 లక్షల టన్నుల గోధుమ పంట పండుతుందని అంచనా వేస్తున్నారు. శీతాకాలం విస్తరించిన కారణంగా గోధుమ పంట కాస్త ఆలస్యమయింది కానీ అదే సమయంలో పంట దిగుబడి పెరగడానికి ఈ పరిస్థితి దోహదపడింది. ఇక పంజాబ్‌లో ఈ సంవత్సరం హెక్టారుకు 52 క్వింటాళ్ల మేరకు గోధుమ దిగుబడి రావచ్చని భావిస్తున్నారు. ఇది జాతీయ సగటు అయిన 32 క్వింటాళ్ల కన్నా చాలా ఎక్కువ. కానీ గోధుమ భారీ దిగుబడి వార్తలు సంతోషం కలిగిస్తున్నప్పటికీ పంట నిల్వ సౌకర్యాల్లో తీవ్రమైన కొరత నిరాశ కలిగిస్తోంది. మండీ అంచులను దాటి జాతీయ రహదారుల పక్కనే గోధుమ పంటను నిల్వ చేస్తుండటాన్ని పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో అడుగడుగునా కనబడుతుంది. ధాన్య సేకరణ కార్యక్రమాలు ప్రారంభం కాకముందే వందలాది, వేలాది గోధుమ బస్తాలు మండీలకు పోటెత్తుతుండటం శుభవార్తే. పంటల నిల్వ సౌకర్యాల లేమి గోధుమ పంట సీజన్ ముగుస్తున్న తరుణంలో, కొత్త పంటను నిల్వ చేయడానికి ఆ రాష్ట్రంలో ఎలాంటి నిల్వ సౌకర్యాలు లేకపోవడం విచారకరం. ఇప్పటికే గత ఏడాది సేకరించిన 12 లక్షల టన్నుల గోధుమ పంట అలాగే నిల్వ ఉండిపోయింది. క్యాప్ స్టోరేజ్ అని దీన్ని పిలుస్తున్నారు. అంటే బహిరంగ స్థలాల్లో గోధుమ పంటను ఉంచి నల్ల టార్పాలిన్ కప్పి ఉంచుతున్నారు. పంజాబ్‌లో మొత్తం గోధుమ నిల్వ సామర్థ్యం 158.5 లక్షల టన్నులు కాగా గత సీజన్లో ఇప్పటికే 143 లక్షల టన్నుల వరకు వరి, గోధుమ పంటను నిల్వ చేసి ఉంచారు. అదనంగా 75 లక్షల టన్నుల క్యాప్ స్టోరేజి కూడా అందుబాటులో ఉంది కానీ గత సీజన్ పంటకు సంబంధించి 12 లక్షల టన్నుల దిగుబడి నిల్వ రూపంలో ఉంది. అదనంగా వరి మిల్లర్లు 20 నుంచి 22 వ్యాగన్ల మేరకు ఆడించిన వరిధాన్యాన్ని త్వరలో ధాన్య సేకరణ కేంద్రాలకు పంపనున్నారు. గోధుమతో పోలిస్తే వరికి నిల్వ నష్టాలు ఎక్కువ కాబట్టి ఈ పంటను ఇండోర్ కేంద్రాల్లో అంటే గోడౌన్లలో నిల్వ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంవత్సరం తర్వాత సంవత్సరం మనదేశంలో నడుస్తున్న కథ ఇదే మరి. 132 లక్షల టన్నుల గోధుమ దిగుబడి వస్తుందన్న అంచనా నేపథ్యంలో కొనుగోలు చేసే ఈ పంటలో చాలా భాగం బహిరంగ స్థలాల్లోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరం కూడా మండీలకు కొత్త పంట రావడం మొదలయ్యేటప్పటికి 20 లక్షల టన్నుల గోధుమ బస్తాలను బహిరంగ స్థలాల్లోనే నిల్వ చేశారు. ధాన్య సేకరణ ముమ్మరంగా జరిగే నాటికి 70 లక్షల టన్నుల తాజా పంటను క్యాప్ స్టోరేజీ కింది బహిరంగ స్థలాల్లోనే టార్పాలిన్ల కింద నిల్వ చేసి ఉంచారు. దీనికి ప్రధాన కారణం గత సంవత్సరం కొనుగోలు చేసిన వరి, గోధుమ పంటను నిల్వ కేంద్రాలనుంచి తరలించడంలో అసమర్థతే అని చెప్పాలి. మరో మాటలో చెప్పాలంటే గత సంవత్సరం మొత్తం 90 లక్షల టన్నుల గోధు మలను సేకరించి బహిరంగ స్థలాల్లో నిల్వ ఉంచగా దానిలో 12 లక్షల టన్నుల గోధుమ ఇంకా అక్కడే మగ్గుతోంది. పంజాబ్‌లో గోడౌన్లలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ పేరుకుపోయిన గోధుమల మేటలను వీలైనంత త్వరగా రాష్ట్రం దాటించే ప్రయత్నం చేస్తే పరిస్థితి కాస్త మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. ధాన్యసేకరణ సీజన్ ముగిసిపోయే నాటికి రాష్ట్రంలో ధాన్యాల నిల్వకు తగిన చోటు ఖాళీ అవుతుందని భావిస్తున్నట్లు పంజాబ్ ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి కేఏపీ సిన్హా పేర్కొన్నట్లు పత్రికల్లో వార్తలు. రాష్ట్ర పాలనాయంత్రాంగం ప్రతి సంవత్సరం ఒకటికి రెండుసార్లు తప్పనిసరిగా ఎదుర్కొంటున్న ఈ పాలనాపరమైన అడ్డం కులను ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. గోధుమ పంట చేతికి వచ్చే సీజ న్లో, వరి పంట చేతికొచ్చే సమయంలో ఏటా రెండుసార్లు నిల్వకు సంబంధించిన సంక్షోభం ఎదురవుతూనే ఉంటుంది. ధాన్య నిల్వలకు రాజకీయ ప్రాధాన్యత లేదా? ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ ధాన్యాల నిల్వ ప్రక్రియ, దానిలోని అడ్డం కులు, అవాంతరాలకు చెందిన వాస్తవ పరిస్థితి మరింత దిగజారిపోతోందే తప్ప సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశ లేశమాత్రం కని పించడం లేదు. గత ముప్పై ఏళ్లుగా ఉత్తర భారత ధాన్యాగారంలో ఆహారధాన్యాల నిల్వ కార్యక్రమాల్లో ఎంత తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయో నేను నిత్యం పరిశీలిస్తూ వచ్చాను. ఆహారధాన్యాల ఉత్పత్తి విషయంలో ప్రతి సంవత్సరం సంబంధిత అధికారులు లక్ష్యాలు విధిస్తూ పోవడం పాలసీ ఎజెండాగా ఉంటూవస్తోంది తప్పితే పండించిన, సేకరించిన ప్రతి వరి, గోధుమ గింజను నిల్వచేయడాన్ని నిర్వహించడం ఎలా అనేది మన రాజకీయ ప్రాధాన్యతలలో అట్టడుగున ఉండటమే విచారకరం. సమృద్ధికి సంబంధించిన ఈ సరికొత్త విరోధాభాస – అత్యధిక పంటలు, విపరీతమైన ఆహార దుబారా– అనేది ఆహార నిర్వహణతో ముడిపడి ఉన్న అన్ని సూత్రాలను తోసిపుచ్చుతూండటం గమనార్హం. పండిన పంటలను సరైన రీతిలో నిల్వ చేసుకోలేని ఈ అసమర్థత పట్ల మన విధాన నిర్ణేతలు ఎందుకు దృష్టి సారించరో, అలాంటి ప్రయత్నానికి కూడా వారెందుకు పూనుకోరో నాకు అర్థం కానే కాదు. చాలా సార్లు నాకు అనిపిస్తుంటుంది.. ఆహార ధాన్యాల దుబారాని తగ్గించడం అనేది రైతు చేపట్టాల్సిన లక్ష్యమనీ, అదే సమయంలో విలువైన ఆహార ధాన్యాల సేకరణను పూర్తిగా దుబారా చేయడం అనేది ప్రభుత్వానికి చెందిన చెక్కుచెదరని హక్కు అనీ నాకు చాలాసార్లు అనిపించేది. నిల్వచేసిన ఆహార ధాన్యాల నాణ్యత విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిర్దయ కానీ, కఠిన వైఖరి కానీ ఏ స్థాయికి దిగజారిపోయాయంటే నాణ్యత లేని నిల్వ కారణంగా ఆహారధాన్యాలు మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాకుండా పోతుంటాయి. ఇది జాతి మొత్తం సిగ్గుపడాల్సిన విషయం. ఏది ఏమైనా.. ఆహార ధాన్యాల నిల్వను, ధాన్య భాండాగారాలను నిర్మించడానికి మనకు రాకెట్ సైన్స్ ఏదీ అవసరం లేదు. ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు డబ్బు మదుపు చేస్తోందని నేను వింటూంటాను. కానీ వాస్తవాచరణలో ప్రభుత్వం తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని సూపర్ హైవేలను నిర్మించే పనిలోనే గుమ్మరిస్తూ ఉండటం చాలా పరిపాటిగా జరుగుతోంది. జాతీయ రహదారుల యంత్రాంగాన్ని విస్తరించడానికి నేను ఏమాత్రం వ్యతిరేకిని కాదు. కానీ ప్రభుత్వ రంగ మదుపులకోసం ఆరాటపడుతున్న అనేక ఇతర రంగాలు ఉన్నాయి. 2017లో మన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేస్తూ 2022 సంవత్సరం నాటికి దేశంలో 83,677 కిలోమీటర్ల మేరకు రహదారులను నిర్మించడానికి రూ. 6.92 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ అందించనున్నట్లు తెలిపారు. యుద్ధప్రాతిపదికన ధాన్య నిల్వ కేంద్రాల నిర్మాణం అయితే కేంద్ర ఆర్థిక మంత్రి జాతీయ రహదారుల విస్తరణకోసం కేటాయించిన ఈ రూ. 6.92 లక్షల కోట్ల మదుపులో కేవలం లక్ష కోట్ల రూపాయలను ఆహార ధాన్యాల నిల్వ కేంద్రాలను నిర్మించడంలో ఉపయోగించినట్లయితే, సరైన ధాన్య నిల్వల సౌకర్యాల లేమి కారణంగా సంభవిస్తున్న తీవ్రాతితీవ్రమైన ఆహార ధాన్యాల దుబారాకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యకు సులభ పరిష్కారం లభిస్తుంది. గతంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 2.5 లక్షల పంచాయితీలో పంచాయితీ గృహాలను నిర్మించింది. ఆ సమయంలో కూడా దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వ కేంద్రాలను నిర్మించడానికి తగిన మదుపును కేటాయించాలని నేను చెబుతూ వచ్చాను. అంతకు మించి, గోడవున్లలో ముగ్గిపోతున్న ఆహార ధాన్యాలు, మండీల్లో నీటీ మడుగుల్లో పడి ఉంటున్న ఆహార ధాన్య బస్తాలుకు సంబంధించి టీవీలలో కనిపించే చిత్రాలు మన అసమర్థతకు గానూ క్షమించలేని దృశ్యాలుగా ఉంటాయి. పైగా, ప్రపంచ క్షుద్బాధా సూచికను పరిశీలిస్తే మొత్తం 119 దేశాల్లో భారతదేశం 103వ స్థానంలో నిలబడి అధోగతిలో ఉంటోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచంలో ఆకలిగొన్న జనాభాలో పాతిక వంతు భారతదేశంలోనే జీవిస్తున్నారు. సమృద్ధిగా ఆహార పంటల దిగుబడి జరుగుతున్నప్పటికీ వాటిని నిల్వ చేసి ఉంచే సరైన వసతులు లేని దేశంలో పరిస్థితిని ఇంతకుమంచి ఉన్నతంగా ఎలా ఆలోచించగలం? ఆహార ధాన్యాల దుబారాకు సంబంధించిన ఈ భారీ సమస్య ఎందుకు మన దేశంలో రాజకీయ ప్రాధాన్యతల్లో ఒకటిగా కాకుండా పోయిందనే విషయం నాకు ఇప్పటికీ అర్ధం కాదు. మనం వెతికి చూడాల్సిన శాశ్వత పరిష్కారం ఇది మాత్రమే. దేవిందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు -
వారి కళ్లకు కరువు కనిపించదు
విశ్లేషణ తరచుగా నేను బెంగళూరు వెళుతూ ఉంటాను. సంవత్సరానికి కనీసం నాలుగు సార్లయినా వెళతాను. ఇన్ని పర్యాయాలు ఆ నగరానికి వెళ్లినా, కర్ణాటక తీవ్ర దుర్భిక్షంతో నకనకలాడుతున్న సంగతి ఏనాడూ నా అనుభవానికి రాలేదు. మహా నగర జీవితమంటేనే అంత కాబోలు. అక్కడికి ముప్పయ్ కిలోమీటర్ల దూరంలోనే కరువు తాండవిస్తున్న సంగతి సంకేతప్రాయంగా కూడా అవగతం కాదు. 176 తాలూకాలలో 139 కంటే ఎక్కువ తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారని నాకు చెప్పారు. ఇంకా విషాదం ఏమిటంటే, గడచిన పదహారు సంవత్సరాలలో పదకొండేళ్లుగా కర్ణాటక రాష్ట్రం కరువుతో అలమటిస్తున్నది. ‘అనంత’ కరువు ఆంధ్రప్రదేశ్లోనిదే అయినా బెంగళూరుకు కూతవేటు అవతలే ఉంది అనంతపురం జిల్లా. ‘న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’(ఏప్రిల్ 28)లో వెలువడిన ఒక వార్తా కథనం నా కళ్లల్లో నీళ్లు రప్పించింది. ‘మా నాన్న వచ్చాడా?’– ఇది అప్పుడే స్కూలు నుంచి వచ్చిన 12 సంవత్సరాల దివాకర్ వేసిన ప్రశ్న. ఇందుకు పినతండ్రి ఈశ్వరయ్య, ‘రాలేదు, వచ్చే నెలలో వస్తాడు. వచ్చేటప్పుడు నీకు బెంగళూరు నుంచి బోలెడు బొమ్మలు తెస్తాడు’ అని జవాబిచ్చాడు. అంతే, చేతిలోని పుస్తకాల సంచీ చిరాకుగా విసిరేసి, యూనిఫారమ్ మార్చుకుని, తన సైకిల్ వేసుకుని తాళాలు బిగించి ఉన్న ఇళ్ల మధ్య నుంచి సాగుతున్న వీధిలోకి వెళ్లిపోయాడు. జిల్లా కేంద్రం అనంతపురం గురించీ, ఆ జిల్లాలోని పల్లెలు ఎలా వెలవెలపోతున్న తీరు గురించి వివరిస్తూ జర్నలిస్ట్ హరీశ్ గిలాయ్ రాసిన కథనం మరొకటి. అది గ్రామీణ భారతపు విషాదాన్ని వెల్లడించే కథనం. అయితే దీనిని ఎవరూ చదవరు. ఆ జిల్లాలోని నల్లమాడ మండలం, కూటపల్లి గ్రామం స్మశానాన్ని మరపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సగానికి పైగా ఇళ్లకు తాళాలు కనిపిస్తాయి. అక్కడ అటూ ఇటూ తిరుగుతున్న పెద్దలు కనిపిస్తారు. లేదంటే వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు. నిజనిర్ధారణ సంఘం తరఫున వెళ్లిన అదితి మాలిక్, గీతికా మంత్రిల నివేదిక (ది న్యూస్ మినిట్, మే 9) మన గుండెలను కదిపి కుదిపే వాస్తవాలను వెల్లడిస్తుంది. కొంతమంది తమ పిల్లలను కూడా అక్కడే వదిలిపెట్టి, కూలీనాలీ వెతుక్కుంటూ ఎలా వలసపోయారో ఆ నివేదిక చెప్పింది. భూక్యా శ్యాములమ్మ వయసు పన్నెండేళ్లు. అనంతపురం జిల్లా కరెడ్డిపల్లి గ్రామంలోనే ఉండి తన తమ్ముడినీ, చెల్లెలినీ పోషిస్తోంది. బక్కపలచగా ఉండే శ్యాములమ్మ పక్క ఊళ్లో ఉన్న చౌకధరల దుకాణం నుంచి పాతిక కిలోల బియ్యం మోసుకువస్తుంది. ఆమె తండ్రి తాగుడుకు బానిసై గత ఏడాదే చనిపోయాడు. అందుకే ఆ కుటుంబానికి ఆమే దిక్కయింది. ఇది బాలీవుడ్ సినిమాలో దృశ్యంలా కనిపించవచ్చు. కానీ అదొక వాస్తవిక చిత్రమన్న సంగతిని మనం మరిచిపోరాదు. ఆ గ్రామానికే చెందిన రమాదేవి కథ కూడా అంతే. తల్లిదండ్రులు ఇద్దరూ పని వెతుక్కుంటూ కేరళ వెళ్లారు. ‘కొన్నిసార్లు నా రక్షణ గురించి నాకు భయమేస్తూ ఉంటుంది’అని చెప్పింది రమాదేవి. ఇంట్లో ఆడపిల్ల ఒక్కర్తిని విడిచిపెట్టి తల్లిదండ్రులు పనుల కోసం వెళ్లిపోయారంటే ఆ కరువు ఎంత భయంకరమైన స్థాయిలో ఉంటుంది? అన్న ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ వాళ్లకు మరో మార్గం లేదు. తల్లిదండ్రులు ఎవరైనా కూడా తమ బిడ్డలను వదిలిపెట్టి దూరంగా ఉండాలని అనుకోరు. ఇదికూడా హాలీ వుడ్ సినిమా హోమ్ ఎలోన్‌లోని దృశ్యం కాదు. ఇలా వందలమంది చిన్నారులను వదిలిపెట్టి ఎందరో పనులు వెతుక్కుంటూ వలస వెళ్లారు. వరసగా ఆరో సంవత్సరం కూడా అనంతపురం జిల్లా కరువు బారిన పడింది. దైవభూమి దృశ్యం దైవభూమిగా ఇంకెంత మాత్రం చెప్పడానికి వీలుకాని కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో నివశించే కుటుంబాలు వారానికి 10 నుంచి 15 బకెట్ల నీటితో జీవనం సాగిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (మే 8)లో వార్తా కథనం రాసిన షుజా ఫిలిప్ అట్టప్పాడి గురించి కళ్లకు కట్టారు. అక్కడ నిరుడే కాదు, ఈ సంవత్సరం కూడా కరువు తాండవిస్తోంది. నిజానికి కేరళ గడచిన 115 సంవత్సరాలలో ఏనాడూ చూడనంత కరువును ఇప్పుడు చూస్తోంది. 2016 అక్టోబర్‌లోనే ఆ రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించారు. కానీ, ఆ రాష్ట్రంలోని నగరాలు తిరువనంతపురం గానీ, కోచి గానీ, లేదంటే కోజికోడ్ వెళితే ఇంత దారుణమైన కరువు కాటకాలు తాండవిస్తున్నాయన్న సంగతి మచ్చుకైనా తెలియదు. ఇక తమిళనాడులోని కరువు ప్రాంతాలలో ఐదురోజులు పర్యటించిన తరువాత స్వరాజ్ అభియాన్ ప్రముఖుడు యోగేంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో క్షోభను వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దారుణమైన నిర్లక్ష్యం అక్కడి యంత్రాంగాన్ని పూర్తిగా స్తంభించిపోయేటట్టు చేసింది. దీనితో రాష్ట్రంలో బలవన్మరణాలు పెరి గాయి’’ అని ఆయన రాశారు. అలాగే, ‘‘పశువుల మరణాలు రాష్ట్రంలో కరువు పరిస్థితికి సూచనలు’’అని కూడా యాదవ్ రాశారు. న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర కొద్ది రోజుల క్రితం వరకు కొందరు తమిళనాడు రైతులు చేసిన దీక్షకు మీడియాలో పెద్ద చోటే దక్కింది. రూ. 40,000 కోట్ల మేరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్‌తో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. కానీ ఇది జాతిని కదిలించలేకపోయింది. ‘‘ఇది మునుపెన్నడూ లేని పరిస్థితి’’అని వ్యవసాయ వాతావరణ పరిశోధన విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎస్. పన్నీర్‌సెల్వం ‘ఇండియా స్పెండ్’తో చెప్పారు. తమిళనాడులోని 32 జిల్లాలకు గాను 21 జిల్లాలు కరువు కోరలలో చిక్కుకున్నాయని ఆయన వెల్లడించారు. గడచిన 140 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడనంత కరువును ప్రస్తుతం ఆ రాష్ట్రం అనుభవిస్తోంది. కానీ ఈ రాష్ట్రంలో కూడా అంతే. చెన్నై లేదా కోయంబత్తూరు, మరేదైనా ఇతర నగరానికి వెళ్లండి! అసలు ఆ నగరాలకి కొద్దిదూరంలోనే కరువు కరాళ నృత్యం చేస్తున్న ప్రాంతాలు ఉన్న సంగతి కాస్త కూడా తెలియదు. నగరాలకు సమస్యలెందుకు రావు? మరొక అంశం కూడా నాకు వింతగా అనిపిస్తుంది. ఈ కరువుకాటకాలెప్పుడూ పల్లెప్రజలనే ఎందుకు ప్రధానంగా పట్టి పీడిస్తాయి? ఎంతో అరుదుగా తప్ప నగరాల జోలికీ, పట్టణాల జోలికీ ఆ దుర్భిక్షం ఎందుకు తాకదు? ఇందుకు నేను దేవుణ్ణి నిందించను. ఆయన అంత పక్షపాతంగా అయితే ఉండడు. ఎలాంటి తప్పు లేకున్నా పల్లెల్లో నివశిస్తున్న ప్రజలను దేవుడు శిక్షించడని నేను చెబుతాను. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలే కరువు కాటకాలకు ఎందుకు లక్ష్యంగా మారుతున్నారు? గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలోని లాతూర్ ఇందుకు మినహాయింపు అనుకోవచ్చు. కానీ చెన్నై సంగతి అలా కాదు. అక్కడ ఏర్పడిన నీటి కరువును తట్టుకోవడానికి ఆ నగరం నీళ్లను మోసుకొచ్చే రైళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే కరువు నీటి సమస్యను మాత్రమే తీసుకుని రాదు. దానితో ఇంకా అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయితే అవేవీ నగరాల అనుభవంలోకి రావు కూడా. ఇదంతా ఏమిటంటే, అభివృద్ధి క్రమం చోటు చేసుకున్న అసమతౌల్యత ఫలితమే. అసలు అభివృద్ధి విధానమే నగరాలు, పట్టణాలు కరువు పరిణామాల బారిన పడని రీతిలో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. గ్రామాలు, పట్టణాల మధ్య విభజన సుస్పష్టం. దుర్భిక్షం ద్వారా తలెత్తే పరిణామాల బారిన పడకుండానే నగరవాసులకు పూచీ పడినట్టు ఉంటుంది. గ్రామాల గుండా ప్రవహించే కాలవలు, నదులు ఎండిపోతుంటాయి. కానీ నగరాలలో కుళాయి నీరు మాత్రం ఎలాంటి దుర్భర పరిస్థితులలో కూడా రోజులో ఉదయం కొన్ని గంటలు, సాయంత్రం కొన్ని గంటల పాటైనా ధారగా ప్రవహిస్తూనే ఉంటుంది. న్యూఢిల్లీ తనకు అవసరమైన నీటిని హిమాచల్ ప్రదేశ్‌లోని రేణుకా డ్యాం నుంచి తెచ్చుకుంటుంది. అలాగే ముంబై నగరం సమీపంలోని పశ్చిమ కనుమల నుంచి తెచ్చుకుంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాలు సమస్యలతో ఎంత సతమతమవుతున్నా ఈ నగరాలు ఏమీ పట్టనట్టే ఉండిపోతున్నాయి. పట్టణవాసులు, నగరవాసులు తమదైన ప్రపంచంలో తేలియాడుతూ ఉంటారు. తాము నివశిస్తున్న పట్టణానికీ లేదా నగరానికీ S కొద్దిదూరంలోనే ఉన్న కష్టాలను వారు గమనించరు. మన నాగరిక ప్రపంచం మనలని అలాంటి ధోరణికి తీసుకువెళ్లింది. సెల్ఫీల ప్రపంచంలో స్వార్థం తారస్థాయికి చేరుకుంది. వ్యాసకర్త: దేవిందర్‌శర్మ వ్యవసాయ నిపుణులు ఈ మెయిల్ : hunger55@gmail.com -
అరచేతి స్వర్గం ‘ఆదాయ భద్రత’
విశ్లేషణ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు అల్ప ఉత్పాదకతే అనడం తప్పు. అసలు సమస్య రైతు ‘ఆదాయ భద్రతే.’ వ్యవసాయం లాభసాటి కాకపోవడానికి కారణం, దిగుబడులను పెంచడం రైతులకు తెలియక కాదు. ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం ఉద్దేశపూర్వకంగా రైతులను పేదరికంలో ఉంచి, శిక్షిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతుకు ఉత్పత్తి వ్యయంపై 50శాతం లాభం ఇస్తామన్న వాగ్దానం నుంచి వెనక్కు మళ్లి, ఐదేళ్ల తర్వాత ఉత్తుత్తి ‘ఆదాయ భద్రత’ కల్పిస్తామనడం శోచనీయం. దేశంలోని 17 రాష్ట్రాలలో వ్యవసాయ కార్యకలాపాల నుంచి రైతుకు వచ్చే సగటు వార్షిక ఆదాయం రూ. 20,000. రైతు సొంత వినియోగం కోసం ఉంచుకునే ఉత్పత్తుల విలువను కూడా కలుపుకొని లెక్కించిన సగటు ఇది. మరో విధంగా చెప్పాలంటే, ఈ రాష్ట్రాలలో రైతుకు సగటున నెలకు రూ. 1,666ల అత్యల్ప వేతనం మాత్రమే లభిస్తుంది. మీరు వింటున్నది నిజమే, రూ. 1,666 మాత్రమే. ఇప్పుడిక మీరే ఆ స్థానంలో నిలిచి చూడండి. మీరే ఒక రైతైతే నెలకు మీకు రూ. 1,666 ఆదాయం మాత్రమే వస్తుంటే ఏం చేస్తారు? మరో ఐదేళ్లు వేచి చూస్తారా? ఆశను నమ్ముకునే బతుకుతూ, ఆ శుభోదయం ఎన్నటికో కదా... అని ఆలోచిస్తూ గడుపుతారా? ఐదేళ్లకు అక్కడికే చేరుస్తామని హామీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో 2016-17 బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ... ‘‘మనం ‘ఆహార భద్రత’కు మించి ఆలోచించి, రైతుకు ‘ఆదాయ భద్రత’ ఉన్నదనే భాననను కల్పించాల్సిన అవసరం ఉంది’’ అంటున్నప్పుడు ఊపిరి బిగబట్టి చూశాను. అయితే ఆయన 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మాత్రం వాగ్దానం చేశారు. అది ఇంకా ఐదేళ్ల సుదూరంలో ఉంది, నా ఆశలన్నీ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. రైతులు మరో ఐదేళ్లు ఆగాలని ఆర్థిక మంత్రి కోరుతున్నారు. ఐదేళ్ల తర్వాత, ఆ వాగ్దానాన్ని నెరవేర్చినా, ఆ 17 రాష్ట్రాలలోని రైతుల నెలసరి ఆదాయం రూ. 3,332కు చేరుతుంది. నిరంతర కృషితో ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో సఫలమైందని సగర్వంగా 2022 ఆర్థిక సర్వే బడాయిపోతుందని అనుకుంటున్నాను. నిజమే, ఎంత గొప్ప ‘విజయం’ అని ఆర్థికవేత్తలూ అంటారు. కానీ ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసి చూస్తే అప్పటికి ఆ రూ. 3,332 సైతం నేడు రైతుకు లభిస్తున్న రూ. 1,666కు సమానమే అవుతుంది. ప్రభుత్వం కల్పించదలచుకున్న ‘ఆదాయ భద్రత ఉన్నదనే భానన’ కచ్చితంగా ఇదే. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో, ఆర్థిక సర్వే సైతం సవివరంగా పేర్కొన్నట్టు గత కొన్నేళ్లుగా వ్యవసాయరంగం దుర్భర పరిస్థి తులను ఎదుర్కొంటున్న సమయంలో... ప్రభుత్వం శస్త్ర చికిత్సలాంటి తక్షణ చర్యలేమైనా చేపడుతుందేమోనని నేను ఆశించాను. రైతు ఆత్మ హత్యల పరంపర సగటున రోజుకు 42 నుంచి, 2015లో రోజుకు 52కు గంతు వేయడాన్ని పరిగణనలోకి తీసుకుంటే... వ్యవసాయరంగం పట్ల తక్షణమే శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఉంది. బడ్జెట్ ప్రసంగంలో ఓ 50 సార్లు వ్యవసాయరంగాన్ని గురించి ప్రస్తావించినంత మాత్రాన తీవ్ర నిర్లక్ష్యానికి, ఉపేక్షకు గురైన ఆ రంగానికి ఒరిగేది ఏమీ లేదు. ఉత్పాదకత తక్కువ నడం అబద్ధం నేటి వ్యవసాయ సంక్షోభం వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటం ఫలితం కాదు. పంటల దిగుబడులను పెంచడం ఎలాగో రైతులకు తెలియకపోవడం వల్ల వారి ఆదాయాలు ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోవడం లేదు. ఉత్పాదకత ముఖ్యమైనదే. కానీ దానికి తగ్గట్టుగా లాభసాటి ధరలు లేకపోతే రైతు ఆదాయం దెబ్బ తినిపోతుంది. వ్యవ సాయంలో దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రమైన పంజాబ్‌నే ఉదాహరణగా తీసు కోండి. పంజాబ్ రైతులు 99 శాతం నీటి పారుదల సదుపాయం గల ప్రాంతంలో హెక్టారుకు 4,500 కిలోల గోధుమను, 6,000 కిలోల వరిని పండిస్తున్నారు. ఇది చాలా అత్యధిక ఉత్పాతదకతే. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యాలుగా పేర్కొన్న సాగునీటి సదుపాయాల విస్తరణ సహా అన్ని సూచికలూ ఇప్పటికే అక్కడ ఉన్నాయి. అయినాగానీ, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) లెక్కల ప్రకారం, ఒక హెక్టారులో గోధుమ లేదా వరి సాగుచేస్తే (సాధారణ పంటల పద్ధతినే అనుసరించిన ట్టయితే) లభించే నికర ఆదాయం దాదాపు రూ. 36,000. అంటే నెలకు రూ. 3,000 మాత్రమే. 7వ పేకమిషన్ అమలు లోకి వచ్చాక ఒక బంట్రోతుకు లభించే నెలసరి మూల వేతనం రూ. 18,000తో దీన్ని పోల్చి చూడండి. కొత్తగా నియమించిన బంట్రోతు సైతం ఉద్యోగంలో చేరిన వెంటనే ఆదాయపు పన్ను చెల్లింపుదారుల పరిధిలోకి వచ్చినా నేను ఆశ్చర్యపోను. కాబట్టి, భారత వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు అల్ప ఉత్పాదకతేనని ఆర్థిక సర్వే-2016 అనడం తప్పు. అసలు మౌలిక సమస్య, ఆర్థిక మంత్రి సరిగ్గానే చెప్పినట్టు ‘ఆదాయ భద్రతే’. రైతు ఊసెత్తినే వామపక్షవాది ముద్ర రైతుల ఆదాయాల గురించి మాట్లాడితే చాలు ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, ప్రధాన స్రవంతి మీడియా మీమీద వామపక్షవాది ముద్రను వేసేయడానికి శత విధాలా ప్రయత్నిస్తారు. బడ్జెట్ ప్రసంగంలో ‘వ్యవసాయం’ అనే పదాన్ని కేవలం నొక్కి చెప్పినందుకే చాలా టీవీ చానళ్ల చర్చా బృందాల సభ్యులు తిరస్కార భావంతో నిర్ఘాంతపోవడం గమనించాను. వ్యవసాయం లాభసాటి కాకుండా పోవడానికి కారణం అది అనుత్పాదకమైనది కావడం కాదు, ఇన్నేళ్లుగానూ ఉద్దేశపూర్వకంగానే దాన్ని పేదరికంలో ఉంచేస్తుండటం వల్లనే అనే విషయం వారికి అర్థం కాలేదు. 1970లో రైతులకు క్వింటాలుకు (100 కిలోలు) గోధుమ కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) రూ. 76 లభించేది. 45 ఏళ్ల తర్వాత, 2015లో గోధుమ మద్దతు ధర క్వింటాలుకు రూ. 1,450కు పెరిగింది. అంటే 19 రెట్లు పెరిగింది. అదే కాలంలో ప్రభుత్వోద్యోగుల మూల వేతనం (డీఏతో కలిపి) 120-150 రెట్లు పెరిగింది. కళాశాల అధ్యాపకులు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల వేతనాలు 150 నుంచి 170 రెట్లు, పాఠశాల ఉపాధ్యాయుల వేతనాలు 280 నుంచి 320 రెట్లు, దేశంలోని అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ అధికారుల వేతనాలు ఏకంగా 1,000 రెట్లు పెరిగాయి. గత 45 ఏళ్లలో ఉద్యోగుల వేతనాలు అసాధారణంగా పెరిగిప్పటికీ, రైతులు తమకు న్యాయంగా రావాల్సిన వాటి కోసమే అల్లాడవలసి వస్తోంది. గోధుమ ధర కూడా అదే కొలబద్దతో పెరిగితే కనీసం 100 రెట్లు పెరిగి ఉండేది, గోధుమ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 7,600 కావాల్సింది. గోధుమ ధర ఆ రీతిన పెరిగితే ఆహార ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోందనేది దీనికి ప్రతి వాదన. కాబట్టి ఇన్నేళ్లుగానూ కేవలం ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసమే రైతులను శిక్షిస్తున్నారు. ‘రైతుకు యాభై శాతం లాభం’ ఏది? అందుకే ఎన్డీఏ ప్రభుత్వం, రైతుకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభం ఇస్తామన్న వాగ్దానం నుంచి వెనక్కు మళ్లింది. కనీస మద్దతు ధర పెరుగుదలను బట్టి చూస్తే రైతు ఆదాయం నామ మాత్రంగా ఏటా 3.2 నుంచి 3.6 శాతం మేరకు పెరుగుతూ వచ్చింది. సంఘటిత రంగంలోని ఇతరులంతా భారీగా వేతనాలలో పెరుగుదలను అందుకుంటున్నా, రైతు లను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. ప్రభుత్వం, తనకు ఉన్న ‘రైతు వ్యతిరేక’ గుర్తింపును తొలగించుకోవ డానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. అందుకోసం వ్యవసాయ రంగంపై ప్రభుత్వ మదుపులను భారీగా పెంచడంతోపాటూ, వ్యవసాయ ఆదాయాన్ని వేగంగా పెంపొందింపజేయడానికి చర్యలను కూడా చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం గనుక, వ్యవసాయదారులకు రూ. 3 లక్షల కోట్ల ఆర్థిక బెయిలవుట్ ప్యాకేజీ (ఉద్దీపన పథకాన్ని) ప్రకటించి, దానిని అనుసరించి రైతులకు నెలకు తప్పక ఇంటికి తీసుకుపోగల ఆదాయం ప్యాకేజీకి హామీని కల్పించడానికి జాతీయ రైతు ఆదాయ కమిషన్‌ను ఏర్పరిస్తే... ఆర్థిక వృద్ధి చక్రాలు వేగంగా తిరిగి ఉండేవి. 60 కోట్ల మంది రైతులకు ‘ఆదాయ భద్రత’ లభించడమే కాదు, భారీ ఎత్తున దేశీయ డిమాండును కూడా సృష్టించి పారిశ్రామిక వృద్ధిని పునరుజ్జీవితం చేసి ఉండేది. సబ్కా సాత్ సబ్కా వికాస్‌ను (అందిరితో కలిసి అందరికీ సౌభాగ్యం) నిజంగానే సాధించగల ఔషధం ఇది మాత్రమే. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు, దేవిందర్‌శర్మ hunger55@gmail.com -
బడ్జెట్‌కు రైతే భారమా?
విశ్లేషణ దేశ శ్రామికవర్గంలోని 52 శాతానికి వ్యవసాయమే ఉపాధి కల్పిస్తున్నది. మరోమాటలో చెప్పాలంటే దేశంలో అత్యధికంగా, ప్రధానంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే. కానీ కొన్ని దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారం ఈ రంగానికి ఆర్థిక వనరులు అందకుండా చేస్తున్నారు. ఈ రంగం మీద పాలకులు చూపుతున్న ఉదాసీనత కారణంగా వరస నష్టాలనే చవి చూస్తున్నది. రైతులు బలవన్మరణాలు నిరాఘాటంగా సాగిపోతూ, రోజుకు 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే లక్షణాలేవీ కనిపించడం లేదు. రష్యా, జపాన్ మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఆవిర్భవిస్తున్న బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు విపత్కర పరిస్థితులలో చిక్కు కున్నాయి. ఇక దేశీయ పారిశ్రామిక వృద్ధిని చూస్తే ప్రయోజనకరంగా కనిపించదు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాలను కల్పించే ఆర్థిక వృద్ధిని నిలకడగా ఉంచడానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏం చేస్తారన్నదానిమీదే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఉద్యోగాలు చూపించలేని వృద్ధి అర్థరహితం. గడచిన పుష్కరకాలంగా ఉన్నత వృద్ధి రేటే కనిపిస్తుంది. అయితే అది ఉద్యోగాలను తగినంతగా చూపించని వృద్ధి. యూపీఏ పదేళ్ల పాలనలో కోటీ యాభయ్ లక్షల ఉద్యోగాలు ఆ వృద్ధి ద్వారా సాధ్యమైనాయి. గడచిన కొన్నేళ్లుగా కర్మాగారాలలో బాగా తగ్గిపోతూ వస్తున్న ఉద్యోగాల సంఖ్య కారణంగా ఈ రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశాలు కూడా మృగ్యం. పారిశ్రామిక విధానం, విస్తరణ శాఖ (డీఐపీపీ) ప్రచురించిన గణాంకాలు దీనినే సూచిస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన కొత్త పథకాల కోసం డీఐపీపీకి అందిన ప్రతిపాదనలను చూసినా 4.11 లక్షల ఉద్యోగాలు కల్పించడమే సాధ్యమని అర్థమవుతుంది. ఉద్యోగాలను సృష్టించడమే ధ్యేయమన్న రీతిలో అరుణ్‌జైట్లీ ఎజెండా ఆర్థికవృద్ధి పెంపు చుట్టూ పరిభ్రమిస్తున్నా, ఇలాంటి అవసరాన్ని తీర్చేందుకు వ్యవసాయ రంగం కూడా ఉన్నదన్న వాస్తవాన్ని ఆయన గుర్తించడంలేదు. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ రంగమే, దేశీయ అవసరాలకు తగినట్టు విస్తారంగా ఉపాధి కల్పించగలదనీ, మందకొడిగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థకు పుష్టిని ఇవ్వగలదనీ జైట్లీ మరచిపోతున్నారు. మన కి ఇష్టం ఉన్నా లేకున్నా, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడానికి ఏదైనా మార్గం ఉన్నదీ అంటే అది వ్యవసాయ రంగమేనన్నది నిజం. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 15- 29 వయసు కలిగిన 153 మిలియన్ల నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారన్న వాస్తవం గమనిస్తే వ్యవసా యానికి ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. 2020 సంవత్సరానికి మరో 153 మిలియన్ల ఉద్యోగార్థులు వీరికి తోడవుతారు. అదనపు ఉపాధి అవకాశాలు చూపడానికి మార్గాలు మరింత సన్నగిల్లుతాయి. ఇది భారత్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం ఎదుర్కొనే సమస్య. నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్న సేద్యం ఈ దుస్థితి నుంచి విముక్తం కావడానికి 2016 బడ్జెట్ ఒక అవకాశం కల్పిస్తుంది. ఆర్థికవృద్ధి పటిష్టత ద్వారా ఉద్యోగాలు లభించే సదవకాశం ఆవిరైపోయింది. హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్‌లలో జాట్లు, గుజరాత్లో పటీదార్లు, మహారాష్ట్రీయులు, కర్ణాటకలో లింగాయత్‌లు- వీరంతా ఆందోళనలకు దిగుతున్నారు. ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ జరుగుతున్న వీరి ఆందోళనలు హింసాత్మకం కూడా అవుతు న్నాయి. కొన్ని దశాబ్దాలుగా సేద్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఆ రంగం లాభసాటి వ్యాపకం కాకుండా పోయిన ఫలితమే ఇది. ఇదంతా చూస్తే, కొన్ని వర్గాల వారికి పన్ను రాయితీలు కల్పించడం ద్వారా సాధ్యమయ్యే త్వరిత ఆర్థికవృద్ధి వల్ల సంపద కింది వర్గాలకు కూడా చేరి, నిరుద్యోగ సమస్య వంటివి తొలగిపోతాయన్న (ట్రికిల్ డౌన్ ) సిద్ధాంతంలోని డొల్లతనం కూడా అవగతమవుతుంది. సేద్యం ద్వారా లభించే ఆదాయం ఇప్పుడు పాతాళ ప్రమాణానికి చేరుకుంది. దీనితో వ్యవసాయాన్ని వదులుకుని చాలామంది చిన్నాచితకా ఉద్యోగాల కోసం నగరాల బాట పడుతున్నారు. ఈ ధోరణి పూర్తిగా మారాలి. ఆ ధోరణిని మార్చుకోవడం మినహా గత్యంతరం లేదు కూడా. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ శ్రామికవర్గంలోని 52 శాతానికి వ్యవసాయమే ఉపాధి కల్పిస్తున్నది. మరోమాటలో చెప్పాలంటే దేశంలో అత్యధికంగా, ప్రధానంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే. కానీ కొన్ని దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారం ఈ రంగానికి ఆర్థిక వనరులు అందకుండా చేస్తున్నారు. ఈ రంగం మీద పాలకులు చూపుతున్న ఉదాసీనత కారణంగా వరస నష్టాలనే చవి చూస్తున్నది. రైతులు బలవన్మరణాలు నిరాఘాటంగా సాగిపోతూ, ఇప్పుడు సగటున రోజుకు 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించింది. ఇక కరువు కాటకాలు తీవ్రంగా ఉన్న బుందేల్‌ఖండ్ ప్రాంత రైతాంగం బతక డానికి రక్తం అమ్ముకుంటున్నారు. ఇదంతా చూస్తే సంవత్సరం తరువాత సంవత్సరం వ్యావసాయిక సంక్షోభం ఎంత తీవ్రమవుతున్నదో అర్థమవుతుంది. గడచిన ఏడాది బడ్జెట్‌ను ప్రతిపాదించినప్పుడు జైట్లీ అతి పెద్ద సవాలుగా మారిన వ్యవసాయ ఆదాయాల జాబితాను చదివి వినిపించారు. కానీ బడ్జెట్ ఉపన్యాసం చివరికి వచ్చే సరికి, ఆ ఆర్థిక ఇక్కట్ల నుంచి రైతాంగాన్ని బయటపడవేయడం గురించి ఆయన మరచిపోయారు. జాతీయ నమూనాల సర్వే సంస్థ (ఎన్.ఎస్.ఎస్.ఒ.) గణాంకాల ప్రకారం 2014లో సగటు రైతు కుటుంబం నెలసరి ఆదాయం రూ. 6,000. నిజానికి ఇందులో సగం మాత్రమే సేద్యం నుంచి దక్కుతోంది. మిగతా మొత్తం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటి వ్వవసాయేతర మార్గాల ద్వారా లభిస్తున్నది. వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్ లెక్కలు కూడా ఉన్నాయి. వ్యవసాయంలో బాగా ముందడుగు వేసిన పంజాబ్ వంటి రాష్ట్రంలోనే హెక్టార్‌కు గోధుమ, ధాన్యం పంటల మీద వస్తున్న నికర ఆదాయం రూ. 3,000. పంజాబ్ వంటి రాష్ట్రంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే, దేశంలో మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో ఊహించడం కష్టం కాదు. నలుగురైదుగురు ఉండే ఒక రైతు కుటుంబం నెలసరి ఆదాయం రూ. 6,000 అయితే, ఆ కుటుంబాలలోని యువతరం ఏదో ఒక ఉద్యోగం కోసం నగరాల వైపు చూడడం వింతేం కాదు. పరిశ్రమలకు చౌకగా కార్మికులు దొరకడం కోసం శ్రామికులు వ్యవసాయ రంగం నుంచి వైదొలగడమే పెద్ద సంస్కరణ అని రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ్‌రాజన్, నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పన్‌గారియా పదే పదే చెప్పారు. ఇది ప్రపంచ బ్యాంక్, ప్రపంచ మార్కెట్ వ్యూహాలకు అనుగుణంగా చెప్పిన మాటే. ఈ నేపథ్యంలో జైట్లీ వ్యవసాయ రంగానికి ప్రాణం పోయడం గురించి ఆలోచించాలి. ఈ అంశాల మీద దృష్టి పెట్టాలి ఈ పరిస్థితులలో సేద్యానికి ఊపిరి పోయడానికి ఐదు అంశాల మీద దృష్టి పెట్టడం అవసరమనిపిస్తోంది. వరసగా రెండేళ్లు దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడం, 2015లో మున్నెన్నడూ లేని స్థాయిలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి మూడు లక్షల కోట్ల రూపాయలతో కేంద్రం ఒక ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుందని ఆశించాలి. 2008-09 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం కుంగిపోయినప్పుడు దానిని కష్టాల నుంచి గట్టెక్కించడానికి మూడు లక్షల కోట్ల రూపాయలతోనే ఒక ప్యాకేజీని ప్రకటించిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. వ్యవసాయ రంగానికి ప్రకటించే ఇలాంటి ఆర్థిక ప్యాకేజీ వల్ల పది కోట్ల రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయి. 2016-17 సంవత్సరానికి వ్యవసాయ రంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను లక్ష కోట్ల రూపాయలకు పెంచాలి. ఈ రంగానికి ఒక అర్థవంతమైన వెసులుబాటు కల్పించడానికి ప్రతి బడ్జెట్లోనూ కేటాయిం పులను 25 శాతం పెంచాలి. నిజానికి 52 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం కంటే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఇచ్చే పనుల కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తున్న సంగతి చాలా మందికి తెలియదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి కేటాయించిన మొత్తం రూ. 15,267 కోట్లు. అంతకు ముందు 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇంకా తక్కువగా రూ. 12,006 కోట్లు కేటాయించారు. స్వామినాథన్ సంఘం సిఫారసు చేసిన విధంగా వ్యవసాయ ఉత్పత్తి వ్యయం మీద 50 శాతం లాభం అందించే ఉద్దేశం ఏదీ కేంద్రం దగ్గర లేదని ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలియచేసింది. ఇలా యాభయ్ శాతం లాభం కల్పిస్తే మార్కెట్‌పై చెడు ప్రభావాలు కనిపిస్తాయని కేంద్రం అభిప్రాయపడింది. కాబట్టి రైతుల ఆదాయ జాతీయ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించాలి. ఇది రైతు కుటుంబాల కనీస ఆదాయం ఎంత ఉండాలో ఆలోచిస్తుంది. ఒక బంట్రోతు ఉద్యోగానికి నెలసరి రూ. 18,000 మూలవేతనంగా ఏడో వేతన సంఘం నిర్ణయించింది. కానీ ఒక రైతు కుటుంబం నెలసరి ఆదాయం రూ. 6,000కు మించరాదు. ఇలాంటి వ్యత్యా సాలను సరిచేయడం అత్యవసరం. మౌలిక వసతుల కల్పన పెట్టుబడులను వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వైపు మళ్లించాలి. మార్కెట్ యార్డుల నిర్మా ణానికి చాలినంత పెట్టుబడులను అందుబాటులో ఉంచాలి. ఐదు కిలో మీటర్ల పరిధిలో ఒక మార్కెట్ యార్డు వంతున అందుబాటులోకి తేవాలంటే దేశానికి 42,000 యార్డులు అవసరమవుతాయి. కానీ ప్రస్తుతం ఏపీఎంసీ ఆధ్వర్యంలో 7,000 యార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో గోదాములు, వాటిని అనుసంధానిస్తూ లింకు రోడ్ల నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టాలి. గ్రామీణ వాణిజ్యానికి కూడా ప్రోత్సాహం అవసరం. కొత్తగా ప్రారంభించే సంస్థలకు మూడేళ్ల పన్ను మినహాయింపు కల్పించాలి. ఇతర రాయితీలన్నీ కూడా వర్తింప చేయాలి. పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్టే వ్యవసాయదారులు అధిపతులుగా ఉన్న సంస్థలకు కూడా ప్రయోజనాలు కల్పించాలి. వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు: దేవిందర్‌శర్మ hunger55@gmail.com -
ధరల బాదుడుకు రాచబాట
విశ్లేషణ జీఎస్టీ సంస్కరణ భారాన్ని వినియోగదారులపైకి నెట్టకుండా ఉండడం ముఖ్యం. పార్లమెంటులోనూ, ఇప్పుడు సన్నద్ధం చేస్తున్న జీఎస్టీ నమూనా చట్టంలోనూ ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. సర్వీస్ ట్యాక్స్‌పై గరిష్టపరిమితికి అవధిని నిర్ణయించి తీరాలి. సర్వీస్ ట్యాక్స్‌ను కనిష్ట స్థాయి రేటైన 12 శాతానికి పరిమితం చేయాలని నా సూచన. కార్పొరేట్ రంగానికి ఏటా ఇంచుమించు జీడీపీలో 2.7 శాతం మేరకు పన్ను మినహాయింపులను ఇస్తున్నారు. వాటికి స్వస్తి పలకడం ద్వారా ప్రభుత్వం పన్నుల పునాదిని విస్తరింపజేసుకోవాలి. మా పొరుగింటాయన తన ఇంటిని కూలగొట్టి, అత్యాధునికంగా పునర్నిర్మించుకొని ఆ నిర్మాణ వ్యయం బిల్లులను నాకు పంపితే ఎలా ఉంటుంది? ‘వినూత్నమైనది’, ‘చరిత్రాత్మకమైనది’, ‘నేటి పరిస్థితిని పూర్తిగా మార్చేసేది’ అంటున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) పై జరుగుతున్న చర్చ సరిగ్గా దీన్నే విస్మరిస్తోంది. భారత కార్పొరేట్ రంగానికి సంబంధించి జీఎస్టీ సమూల మార్పును తెస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పదేపదే చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వాట్), లగ్జరీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వగైరాలన్నిటి స్థానంలో జీఎస్టీ అమల్లోకి వస్తుంది. పన్నుల దొంతర ఫలితంగా వృద్ధి కుంటు పడడాన్ని ఇది చాలా వరకు తగ్గిస్తుందని ఆశిస్తున్నారు. తద్వారా స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 0.9 నుంచి 1.7 శాతం పెరుగుతుందని భావిస్తు న్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థలో రకరకాల పన్నులను లేదా కొందరు అనేట్టు పన్ను మీద పన్ను విధించడం మాత్రమేగాక, ఇది పన్నుల వసూలులోని ప్రతి దశలోనూ విచ్చలవిడి అవినీతిని అనుమతించింది. అందుకు కారణాలు ఏవైనా, చివరికి రిటైల్ ధరలను చెల్లించే కొనుగోలు దారులే ఈ అధిక పన్నుల భారాన్నంతా మోయాల్సి వస్తోంది. కార్పొరేట్ల సౌఖ్యానికి సామాన్యునిపై భారం జీఎస్టీ, వస్తుసేవల ఉత్పత్తిదారులకు ఏ ప్రయాసాలేని పన్నుల వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. పలు చోట్ల పలు రకాల పన్నులను చెల్లించాల్సి రావడానికి బదులుగా వారు ఇప్పుడు ఒకే ఒక్క పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇంతా చేసి అది వృద్ధి రేటును పెంపొందింపజేస్తుందా, లేదా? అనే విషయాన్ని పక్కన పెడదాం. అంతకంటే ముఖ్యంగా అది వ్యాపారం సులువుగా సాగే అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బాగానే ఉంది గానీ, చివరికి ఈ సంస్కరణకు అయ్యే వ్యయ భారాన్ని వినియోగదారులు ఎందుకు భరించాలో అంతుబట్టడం లేదు. జీఎస్టీ సరిగ్గా మా పొరుగింటాయన కథ లాంటిదే. ఇంటి పునర్నిర్మాణం చేపట్టినవారే ఆ వ్యయాన్ని భరించాలి. అలాగే ఈ పన్నుల సంస్కరణ ఎవరి కోసమో వారే దీని భారాన్ని భరించాలి. దీనివల్ల లబ్ధి పొందేది మన కార్పొరేట్ రంగమే. ఆ వ్యయాన్ని చెల్లించాలని వారినే అడగాల్సింది పోయి, దాన్ని వినియోగదారులపైకి నెట్టారు. ఈ అధిక జీఎస్టీ రేటు వినియోగదారులకు మింగుడుపడేలా చేయాలనే అరుణ్ జైట్లీ 2015 బడ్జెట్లో సర్వీసు ట్యాక్స్‌ను 12.36 నుంచి 14 శాతా నికి పెంచారు. 2015-16లో సామాన్యుల జేబుల నుంచి ఇలా ఎంత గుం జారో 2016 బడ్జెట్ నాటికిగానీ తెలియదు. అయితే గత ఏడాది సర్వీస్ ట్యాక్స్ ద్వారా మాత్రమే ప్రభుత్వానికి రూ. 50,000 కోట్లు అదనపు రాబడి వచ్చిందనే దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు. సర్వీసు ట్యాక్స్ క్రమంగా పెరుగుతూ పోవడాన్ని బట్టి రేపు 18 శాతం ప్రామాణిక రేటు చొప్పున జీఎస్టీ అమల్లోకి వచ్చాక అమాయక ప్రజాబాహుళ్యం దాదాపు రూ. 2.5 లక్షల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని నా అంచనా. మరోవిధంగా చెప్పాలంటే, జీఎస్టీ సంస్కరణలకు అయ్యే వ్యయ భారాన్నంతటినీ భరించాల్సింది వినియోగదారులే. కాగా, దాని ఏకైక లబ్ధిదారైన కార్పొరేట్ రంగం మాత్రం ఏమీ చెల్లించదు. జీఎస్టీ అంటే ఒకే పన్ను రేటు కాబట్టి సర్వీసు ట్యాక్స్ కూడా అందులోనే కలిసిపోయి ఉంటుంది. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న ‘రెవెన్యూ న్యూట్రల్ రేట్’ (ఆర్ఎన్ఆర్) పద్ధతిలోనే పన్నుల వసూలు జరగడానికి హామీ ఉండ టం, అది ఇప్పటికంటే పడిపోకుండా ఉండటం ఆవశ్యకం కావచ్చు. ప్రస్తుతం ఉన్న పలు దొంతరల పన్నుల విధానంలో కంటే జీఎస్టీ వల్ల ప్రభుత్వ రాబడి పడిపోతుంది. ఆ లోటును భర్తీచేసుకునే ఉత్తమ మార్గం సామాన్యుల పైన భారాన్ని మరింత పెంచడమేనని ప్రభుత్వం భావిస్తోంది. ‘రెవెన్యూ న్యూట్రల్ రేట్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ రేట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’పై నియమించిన అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఉద్దేశపూర్వకంగానే పన్నుల వసూళ్ళు అధిక రేటులో ఉండేందుకు కృషి చేసిందని దాని నివేదికే తెలిపింది. అది సగటున 15-15.5 శాతం ఆర్ఎన్ఆర్ రేటునూ, రెండు రకాల పన్నుల విధానాన్నీ సూచించింది. కొన్ని వస్తువులకు 12 శాతాన్ని, మిగతా వాటికి 17-18% ప్రామాణిక రేటును సూచించింది. పదాల గారడీయే ధరల తగ్గుదలా? వ్యాట్ కూడా ఒక విధమైన జీఎస్టీనే. వ్యాట్‌ను ప్రవేశపెట్టిన 165 దేశాల్లో చాలా వరకు పలు సమస్యలను ఎదుర్కొన్నాయని కూడా అది చెప్పింది. ఒకే జీఎస్టీ రేటును లేదా రెండు రేట్లను ప్రవేశపెట్టినాగానీ ప్రవేశపెట్టినాగానీ అది ఒక సవాలే. ఫెడరల్ వ్యవస్థను కలిగిన పెద్ద ఆర్థికవ్యవస్థలు ఉన్న యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేసియా వంటి దేశాలు సైతం ఈ పన్నుల విధానం అమలులో తీవ్ర సమస్యలను ఎదు ర్కోవాల్సి వచ్చింది. ఆ సాధకబాధకాలను గురించి నేను మాట్లాడటం లేదు. దానివల్ల సామాన్యునిపై పడుతున్న అదనపు భారాన్ని గురించి మాత్రమే చర్చిస్తున్నా. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లలో జీఎస్టీ అమలు ఫలితంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిందని ఆ నివేదికే పేర్కొంది. ఆ దేశాలలో జరిగి నట్లుగానే ఇక్కడ కూడా మొదట ధరలు పెరిగినా, తరువాత తగ్గుతాయనడం ఆర్థిక పద మాయాజాలంతప్ప మరేం కాదు. పప్పుల ధరలనే తీసుకుందాం. జూన్-అక్టోబర్ మధ్య సామాన్యులు వాడే కందిపప్పు ధర రూ.70 నుంచి రూ.170-200కు పెరిగింది. ప్రస్తుతం అది రూ. 120 కి తగ్గిందనుకుంటే, మూల ధర రూ. 70 స్థాయి నుంచి చూస్తే కచ్చితంగా ద్రవ్యోల్బణం తగ్గినట్టే. కానీ వాస్తవంలో ధర రూ.70 నుంచి పెరిగి రూ. 120 వద్ద నిలిచినట్టే. వచ్చే ఏడాది తిరిగి పప్పుధర పెరిగితే ఆ పెరుగుదలను కిలోకు రూ. 70 నుంచి గాక, రూ.120 ప్రాతిపదికన లెక్కగడతారు. దీనికితోడు సర్వీస్ ట్యాక్స్ పెరగడం ఒక్కదానివల్లనే ధరలు గణనీయంగా పెరుగుతాయని ఆశించ వచ్చు. 24 సేవలను ఈ జాబితాలో చేర్చారు. ఈ పన్నుల భారానికి తోడు పెరిగే ద్రవ్యోల్బణం ప్రజలపై అదనంగా మోపే పరోక్ష పన్ను అవుతుంది. అంటే ఆచరణలో మీపై రెండుసార్లు పన్ను విధిస్తారు. కట్టెకు నూనె రాసి కొట్టడం అంటే ఇదే పెట్రోలియం (తొలి కొన్నేళ్లు మాత్రమే), విద్యుత్తు, రియల్ ఎస్టేట్, ఆల్క హాల్ జీఎస్టీ పరిధికి వెలుపలే ఉన్నాయి. పెట్రోలియం, ఆల్కహాల్ రాష్ట్రా లకు అతిపెద్ద రాబడి వనరనీ, వాటి మొత్తం పరోక్షపన్నుల రాబడిలో 29 శాతమనీ, రాష్ట్రాల మొత్తం రాబడిలో 41.8 శాతం జీఎస్టీలో కలిసిపో తుందనీ ఆ నివేదికే తెలిపింది. జీఎస్టీ రెండంతస్తుల పన్నుల వ్యవస్థ. కేంద్రం (సీజీఎస్టీ), రాష్ట్రాలు (ఎస్జీఎస్టీ) ఇలా రెండుసార్లు పన్ను విధిం చడం వల్లనే జీఎస్టీ వల్ల కలుగుతుందంటున్న ప్రయోజనంలో అత్యధిక భాగం హరించుకుపోతుంది. ప్రామాణికమైన పన్ను స్లాబు గరిష్టంగా 18 శాతం ఉంటుందని ఇంత వరకు చెబుతున్నారు. కానీ దాన్ని రాజ్యాంగబద్ధమైన పరిమితిగా చేయ డానికి ఆర్థికమంత్రి అంగీకరించడం లేదు. అంటే గరిష్ట పరిమితి పెంచడానికి అవకాశాన్ని తెరచి ఉంచినట్టే. జీఎస్టీ రేటుకు రెండు అంతస్తుల రేట్లతో పూర్తి పొందికను సాధించాక, కనిష్ట రేటును 12 శాతంగా, గరిష్ట రేటును 22 శాతంగా నిర్ణయిస్తారని నిపుణుల విశ్వాసం. అంటే సర్వీస్ ట్యాక్స్‌ను 22 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్టే. అందుకే గరిష్ట పరిమితిపై అవధి విధింపునకు అంగీకరించడం లేదు. సర్వీసు ట్యాక్స్‌ను 12.36 నుంచి 14 శాతానికి ఈ ఏడాది పెంచినప్పుడు ఎవరూ గగ్గోలు పెట్టలేదు. పైగా దానిపైన 0.5 శాతం స్వచ్ఛ భారత్ సెస్‌ను కూడా విధించారు. ఈ విధంగా క్రమక్రమంగా, దశలవారీ పద్ధతిలో ఎప్పటికప్పుడు సర్వీస్ ట్యాక్స్‌ను పెంచ డం వల్ల అదనపు పన్నుల భారం వినియోగదారులకు తేలికగా మింగుడు పడుతుంది. కట్టెకి నూనె రాసి కొట్టడం అంటే ఇదే. అందువలన జీఎస్టీ సంస్కరణ భారాన్ని వినియోగదారులపైకి నెట్ట కుండా ఉండడం ముఖ్యం. పార్లమెంటులోనూ, ఇప్పుడు సన్నద్ధం చేస్తున్న జీఎస్టీ నమూనా చట్టంలోనూ ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంది. సర్వీస్ ట్యాక్స్‌పై గరిష్టపరిమితికి అవధిని నిర్ణయించడం మాత్రమే అందుకు మార్గం. మన దేశం రెండు రేట్ల విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది కాబట్టి, సర్వీస్ ట్యాక్స్‌ను కనిష్ట స్థాయి రేటైన 12 శాతానికి పరిమితం చేయాలని నా సూచన. ప్రామాణిక రేటు 18 శాతం, బహుశా హెచ్చుతగ్గులకు వీలైనది. కానీ దాని కనిష్ట స్థాయి 12 శాతానికి మించి పెరగడాన్ని అనుమతించరాదు. కార్పొరేట్ రంగానికి ఏటా ఇంచుమించు జీడీపీలో 2.7 శాతం మేరకు పన్ను మినహాయింపులను ఇస్తున్నారు. వాటి కి స్వస్తి పలకడం ద్వారా ప్రభుత్వం పన్నుల పునాదిని విస్తరింపజేసుకోవాలి. వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు : దేవిందర్ శర్మ(hunger55@gmail.com) -
మన అన్నదాతే దేశానికి ఆదర్శం
తెలుగునాట రైతులు అనుసరిస్తున్న సాగు విధానాన్ని ప్రధాని మన్మోహన్ దేశ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? ఒక రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలలో రైతులు సాధించిన మహత్తర కార్యాన్ని దేశవ్యాప్తంగా రైతులు 3.5 కోట్ల ఎకరాలలో ఎందుకు సాధించలేరు? ప్రధాని మన్మోహన్ సింగ్ కందిరీగ తుట్టెను కది పారు. జన్యుమార్పిడి పం టలపై నెలకొన్న ‘అశాస్త్రీయ’ అభిప్రాయాలను పట్టించుకోవద్దంటూ ఆయన ఇటీవల సలహా ఇచ్చారు. వ్యవసాయోత్పత్తిని పెంచేందుకు బయోటెక్నాలజీ ఎంతగానో ఉపకరిస్తుందనీ, తమ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధిలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తుందని ప్రకటించారు. ఎంతో ప్రమాదకరమైన జీఎం టెక్నాలజీని ప్రధాని సమర్థించిన మర్నాడే మోన్శాంటో షేరు 5.45 శాతం పెరిగింది. కాబట్టి ఈ వ్యవహారంలో ఆయా కంపెనీలకు భారీ ప్రయోజనాలున్నాయి. జీఎం పంటలకు భారత్ అనుమతి నిరాకరిస్తే అది కోట్లాది డాలర్ల పరిశ్రమలకు చావుదెబ్బ అవుతుంది. జీఎం పంటల క్షేత్ర పరీక్షలకు ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించడం, వ్యవసాయంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా వ్యతిరేకించడంతో పరిశ్రమ తెరవెనుక మార్గాల ద్వారా ఒత్తిళ్లను మరింతగా పెంచింది. ఇప్పుడు జీఎం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దిగుబడులను ఇబ్బడిముబ్బడిగా పెంచవచ్చని ప్రధాని అంటున్నారు. పరిశ్రమ కూడా అదే మాట చెపుతోంది. అయితే అమెరికాలో 20 ఏళ్ల క్రితం తొలిసారిగా జీఎం పంటను ప్రవేశపెట్టినప్పటికీ దిగుబడిని పెం చిన దాఖలా లేదు. 2050 నాటికి పెరగనున్న ప్రపంచ జనాభా ఆహార అవసరాలకు సరిపడా ఆహారధాన్యాలు కావాలంటే ఉత్పత్తిని భారీగా పెంచాల్సి ఉంటుందని, కాబట్టి జీఎం పంటల ద్వారానే ఇది సాధ్యపడుతుందని చేసే వాదన వాస్తవం కాదు. దీంట్లో అసలు నిజం ఏమిటో చూద్దాం. ప్రపంచ దేశాలలోని జనాభాకు ఆహార కొరత ఉందా? ప్రపంచ దేశాలలో మొత్తం 1,400 కోట్ల మందికి సరిపోయే ఆహారధాన్యాలు ఉత్పత్తి అయ్యాయని 2013లో యూఎస్డీఏ అంచనా వేసింది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న జనాభాకు రెట్టింపు మందికి సరిపోయే స్థాయిలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. అసలు సమస్య ఆహార కొరత కాదు, ఆహార వృథా. ఉత్పత్తి అయిన ఆహారంలో దాదాపు 40 శాతం దాకా వృథా అవుతోంది. ఇండియాలో రోజూ 25 కోట్ల మంది అర్ధాకలితో పస్తులుంటున్నారు. వీరు ఈ దుర్భర పరిస్థితులు ఎదుర్కొనడానికి కారణం ఆహారధాన్యాల ఉత్పత్తిలో కొరత కానేకాదు! గత ఏడాది జూన్‌లో మన దేశంలోని గిడ్డంగులలో రికార్డుస్థాయిలో 82.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉన్నాయి. దీనిలో మనదేశం 20 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది, మరో 20 మిలియన్ టన్నులు కూడా ఎగుమతి చేసే ఆలోచనలో ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి బదులు ఆహార ధాన్యాల సేకరణను తగ్గించేందుకు, ఎఫ్‌సీఐ గిడ్డంగులలో ఉన్న భారీ సరుకు నిల్వలను కమోడిటీ ట్రేడింగ్‌కు ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. చైనాలో పంటలను ఆశించే చీడపీడలను నిర్మూలించేందుకు అక్కడి రైతులు 20 రెట్లు అధికంగా క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. మన దేశంలో కూడా ఇదే పరిస్థితి. ఇండియాలో కూడా క్రిమిసంహారక మందుల వాడకం బాగా పెరిగింది. జీఎం పంటల ద్వారా దిగుబడి పెరగనప్పుడు, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గనప్పుడు, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి భరోసా లేనప్పుడు ప్రధాని మన్మోహన్ జీఎం టెక్నాలజీని ఎందుకు సమర్థిస్తున్నారో అర్థం కాదు. జీఎం పైర్లతో నేలలన్నీ విషతుల్యం కావడమే కాకుండా, భూగర్భజలాలను తోడేస్తున్నారు. రసాయన, క్రిమిసంహారక మందుల వాడకంతో ఆహారధాన్యాలు కల్తీ అవుతున్నాయి. దీని పర్యవసానంగానే ఇప్పుడు రైతులంతా పర్యావరణం దెబ్బతినని వ్యవసాయ పద్ధతులపై దృష్టిపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడకుండా 35 లక్షల ఎకరాలలో రైతులు సాగుచేస్తున్నారు. దీనిలో 20 లక్షల ఎకరాలలో రైతులు ఎరువులను కూడా వాడడం లేదు. ఉత్పత్తితోపాటు భూసారం కూడా పెరుగుతోంది. కాలుష్యం తగ్గుతోంది. రైతుల ఆదాయాలు పెరుగుతున్నందున వారు బలవన్మరణాలకు పాల్పడాల్సిన పరిస్థితులు లేవు. ఆంధ్రప్రదేశ్ రైతులు అనుసరిస్తున్న సాగు విధానాన్ని ప్రధాని మన్మోహన్ దేశ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? ఒక రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలలో రైతులు సాధించిన మహత్తర కార్యాన్ని దేశవ్యాప్తంగా రైతులు 3.5 కోట్ల ఎకరాలలో ఎందుకు సాధించలేరు? ఇతర రాష్ట్రాల రైతులు ఆంధ్రప్రదేశ్ రైతుల మార్గాన్ని అనుసరిస్తేనే వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుంది. (వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు) - దేవిందర్ శర్మ -
ఆ హక్కులతో రైతన్నే ‘రారాజు’!
ముఖాముఖి: 12 కొత్త హక్కులతో కూడిన డిక్లరేషన్‌పై చర్చకు తెరలేచింది. సాగు పద్ధతిని ఎంచుకునే హక్కు, విత్తనాలు, సంప్రదాయక వ్యవసాయ విజ్ఞానం కలిగి ఉండే హక్కు, వ్యవసాయోత్పత్తుల ధర, అమ్మకంపై నిర్ణయాధికార హక్కు, భూమి హక్కుతోపాటు మేధో హక్కులను తిరస్కరించే హక్కు వీటిల్లో పొందుపరచడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యవస్థలు నానాటికీ బహుళజాతి కంపెనీల చెప్పుచేతల్లోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగసంక్షోభం తీవ్రతరమవుతున్నది. అణగారిపోతున్న వారిలో బక్కచిక్కిన బడుగు రైతులు, గ్రామీణ కూలీలు, ఆదివాసీలు ముందు వరుసలో ఉంటారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిన్న, సన్నకారు రైతులు, పాడి రైతులు, గ్రామీణ వ్యవసాయ కూలీలతోపాటు మత్స్యకారులు, ఆదివాసులు పేదరికంతో అల్లాడుతున్నారు. వీరందర్నీ కలిపి ‘రైతులు, గ్రామీణ పేదలు’ అని ఐక్యరాజ్యసమితి వ్యవహరిస్తోంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గ్రామీణులకు వెన్నుదన్నుగా నిల వడానికి సాధారణ మానవ హక్కులు చాలవని, కొత్తగా కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించాలని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల మండలి (హెచ్చార్సీ) నిశ్చితాభిప్రాయంతో ఉంది. ఈ దిశగా అంతర్జాతీయ చట్టం తేచ్చేం దుకు ఇటీవల తొలి అడుగు వేయడం శుభపరిణామం. ప్రత్యేక వర్కింగ్ గ్రూప్‌ను హెచ్చార్సీ ఏర్పాటు చేసింది. 47 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. దీని తొలి సమావేశం గత నెల 15-19 తేదీల్లో జెనీవాలో జరిగింది. 12 కొత్త హక్కులతో కూడిన డిక్లరేషన్‌పై చర్చకు తెరలేచింది. సాగు పద్ధతిని ఎంచుకునే హక్కు, విత్తనాలు, సంప్రదాయక వ్యవసాయ విజ్ఞానం కలిగి ఉండే హక్కు, వ్యవసాయోత్పత్తుల ధర, అమ్మకంపై నిర్ణయాధికార హక్కు, భూమి హక్కుతోపాటు మేధో హక్కులను తిరస్కరించే హక్కు వీటిల్లో పొందుపరచడం విశేషం. చైనా, భారత్, ఇండోనేసియా సహా 23 దేశాలు సానుకూలంగా స్పందించాయి. అమెరికా, యూరోపియన్ దేశా ల కూటమి, జపాన్ వంటి 9 దేశాలు వ్యతిరేకించగా, 15 దేశాలు తటస్థంగా ఉండిపోయాయి. ఏకాభిప్రాయం కోసం వివిధ దేశాలతో హెచ్చార్సీ చర్చలు ప్రారంభించింది. వచ్చే ఏడాదిలో జరిగే వర్కింగ్ గ్రూప్ తదుపరి సమావేశంలో ఈ హక్కులకు ఆమోదముద్ర పడవచ్చు. ప్రపంచీకరణ దుష్ర్పభావాల దాడి నుంచి చిన్న రైతులు, గ్రామీణ పేదలను కాపాడుకోవాలనుకునే దేశాలకు ఈ కొత్త హక్కులు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఐరాస దృష్టిలో రైతు... ఐక్యరాజ్యసమితి, ఆహార వ్యవసాయ సంస్థ దృష్టిలో రైతులంటే.. నేలతల్లితో, ప్రకృతితో నేరుగా, ప్రత్యేక అనుబంధం కలిగి ఉండి ఆహారం, ఇతర వ్యవసాయోత్పత్తులను పండించేవారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు చిన్న రైతులతో కలిసి స్వయంగా పొలం పనులు చేసేవారు. భూమిలేని వివిధ రకాల గ్రామీణులు కూడా రైతులే. వ్యవసాయదారులతోపాటు పశువులను పెంచేవారు, పశువులను మేపేవారు, గ్రామాల్లో వ్యవసాయ సంబంధమైన పనిముట్లు తయారు చేసే వృత్తిదారులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, చేతివృత్తిదారులు, సంచార జీవులు, వేట, అటవీ ఉత్పత్తులను సేకరించి జీవించే ఆదివాసులు... వీరందరూ రైతులే. వాణిజ్య దృష్టితో భారీ యంత్రాలను ఉపయోగించి వ్యవసాయం చేసే భారీ కమతాల ఆసాములను ‘రైతులు’గా ఈ డిక్లరేషన్ గుర్తించడంలేదు. అందుకే అమెరికా, యూరోపియన్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ హక్కుల పట్ల మన దేశం సానుకూలంగా ఉన్నప్పటికీ వర్కింగ్ గ్రూప్‌లో ఎంత దృఢంగా నిలబడుతుందన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేం దుకు ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని జెనీవా సమావేశంలో అనధికార ప్రతినిధిగా పాల్గొన్న దేవీందర్ శర్మ అంటున్నారు. చండీగఢ్‌కు చెందిన శర్మ ప్రముఖ వ్యవసాయ, ఆహార, వాణిజ్య విధాన విశ్లేషకుడు, కాలమిస్టుగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రధానాంశాలు. చిన్న రైతులు, ఇతర గ్రామీణ పేదలకు కొత్త హక్కుల అవసరం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో సగానికి సగం మంది అర్ధాకలితో బాధపడుతున్నారు. మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న రైతులు ఆదాయ భద్రత లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భారీగా సబ్సిడీలు ఇస్తున్న అమెరికా, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా తదితర సంపన్న దేశాల్లో కూడా రైతులు ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యలపాలవుతున్నారు. 2007-09 మధ్య ఫ్రాన్స్‌లో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతీయుల్లో 54 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికి 2.9 లక్షల మంది ైరె తులు ఆత్మహత్య చేసుకున్నారు. మన దేశం లో 2 నిముషాలకో రైతు, యూరప్‌లో నిముషానికో రైతు వ్యవసాయం వదిలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 350 మంది రైతులు సాగు వదిలేసి వలసపోతున్నారు. రైతులను రక్షించుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది. అందుకే రైతులకు ప్రత్యేక హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ కొత్త హక్కులు ఎన్నాళ్లకు అందివస్తాయి? రైతులకు తమ వంగడాలపై బ్రీడింగ్ హక్కులు కల్పించడానికి 22 ఏళ్లు పట్టింది. ఈ హక్కుల విషయంలో అన్నేళ్లు కాదు గానీ, కొన్ని ఏళ్లే పట్టవచ్చు. ప్రతిపాదనలు పదేళ్ల నుంచే ఉన్నా... వర్కింగ్ గ్రూప్‌లో ఈ ఏడాది చర్చ ప్రారంభమైంది. వచ్చే ఏడాది సమావేశంలోనూ చర్చ కొనసాగుతుంది. ఐరాస చేసే హక్కుల తీర్మానాలు సభ్యదేశాల ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. వాటి ఆధారంగా ప్రభుత్వాలు తమ దేశాల్లో చట్టాలు చేస్తాయి. మన దేశంలో ఆహార హక్కు కూడా ఇలా వచ్చిందే. కీలకమైన హక్కులపై సంపన్నదేశాలు విభేదిస్తున్నాయి కదా? విత్తనాలు, భూములు, సంప్రదాయ సాగు విజ్ఞానం, ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతుల ఎంపిక, వ్యవసాయోత్పత్తులకు ధర నిర్ణయించుకునే హక్కు తదితర హక్కులపై తీవ్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. యూరోపియన్ యూనియన్, అమెరికా ఈ హక్కులను వ్యతిరేకిస్తున్నాయి. చర్చల అనంతరం ఈ హక్కు లను ఎన్ని దేశాలు అంగీకరిస్తాయో చూడాలి. అయితే, రైతుల హక్కులపై ఇప్పటికైనా సమితి చర్చ ప్రారంభిం చింది కాబట్టి, రైతులు అధిక సంఖ్యలో ఉన్న మన దేశం చర్చల్లో గట్టిగా నిలబడాలి. వర్కింగ్ గ్రూప్‌లోని మనదేశ ప్రతినిధి ఈ హక్కులకు మద్దతు పలికారు కదా.. ఇంకా చేయాల్సిందేమిటి? భూమి హక్కుపై మన దేశం అభ్యంతరం చెబుతోంది. రైతుల భూములను వారికి ఇష్టం లేకుండా కంపెనీల కోసం స్వల్ప ధరకు ప్రభుత్వం సేకరించి పెట్టడం ఎం దుకు? అవసరమైన కంపెనీలనే రైతులకు నచ్చిన ధర ఇచ్చి కొనుక్కోమనొచ్చు కదా? భారత్ మిగతా హక్కులపై సరే అంటున్నదే గానీ బలమైన గొంతుకను వినిపించడం లేదు. సంపన్న దేశాల ప్రభావానికి లొంగకుండా మన ప్రభుత్వం దృఢమైన వైఖరిని అవలంభించాలి. జెనీవా సమావేశంలో మీరైమైనా ప్రతిపాదించారా? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ సంక్షోభానికి మూలకారణం రైతులకు ఆదాయ భద్రతలేకపోవడం. ఈ హక్కులతో ఆదాయ భద్రత, సామాజిక భద్రత హక్కులు కూడా చేర్చమని నేను, కొందరు ప్రతినిధులం ప్రతిపాదిం చాం. కనీస మద్దతు ధర రైతుకు ఆదాయ భద్రతను కల్పిం చడంలేదు. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలో ‘రైతుల ఆదాయ కమిషన్’ నెలకొల్పాలి. ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆదాయ భద్రత కల్పించడం కమిషన్ లక్ష్యంగా ఉండాలి. రైతులకు అందించే అన్నిరకాల సబ్సిడీలు ఈ కమిషన్ ద్వారానే ఛానలైజ్ అయ్యేలా చూడాలి. అంతర్జాతీయంగా పటిష్టమైన రైతుల హక్కుల చార్టర్‌ను రూపొందించుకుంటే.. ఒకటి రెండేళ్ల తర్వాతైనా దీనికి అనుగుణమైన చట్టాలు స్థానిక రైతులకు అందుబాటులోకి వస్తాయి. గ్రామీణ జనాభాలో 80 శాతం మంది రైతులు, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న మన దేశీ యులకు ఈ హక్కుల అవసరం ఇతరులకన్నా ఎక్కువగా ఉంది. ఈ హక్కులపై గట్టిగా నిలబడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత మన రైతు సంఘాలపై ఉంది. - పంతంగి రాంబాబు ‘సాక్షి’ స్పెషల్ డెస్క్