ఉత్తర భారత ధాన్యాగారమైన పంజాబ్, హరియాణా రాష్ట్రాలు గోధుమ, వరి పంటల దిగుబడిలో ప్రతి ఏటా రికార్డులను చెదరగొడుతూ ఉన్నాయి. కానీ పంటల సమృద్ధిని మించి పోటీపడుతున్న ఆహార ధాన్యాల దుబారా మన ధాన్య సేకరణ, నిల్వల విధానాన్నే పరిహసిస్తోంది. గోధుమ పంట సీజన్ ముగుస్తున్నప్పటికీ కొత్త పంటను నిల్వచేయడానికి పంజాబ్‌లో ఎలాంటి నిల్వ సౌకర్యాలు లేకపోవడం విచారకరం. ఆహారధాన్యాల ఉత్పత్తి విషయంలో ప్రతి సంవత్సరం సంబంధిత అధికారులు లక్ష్యాలు విధిస్తూ పోవడం పాలసీ ఎజండాగా ఉంటూవస్తోంది తప్పితే.. పండించిన, సేకరించిన ప్రతి వరి, గోధుమ గింజను నిల్వచేయడాన్ని నిర్వహించడం ఎలా అనేది మన రాజకీయ ప్రాధాన్యతలలో అట్టడుగున ఉండటమే విచారకరం. ఆహార ధాన్యాలు మానవ వినియోగానికి పనికిరాకుండా పోవడం జాతి మొత్తం సిగ్గుపడాల్సిన విషయం.
ప్రజాస్వామ్యానికి చెందిన అతి పెద్ద పండుగ అయిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సీజన్‌లో గోధుమ పంట విరగపండిందని వార్తలొస్తున్నాయి. భారతదేశ గోధుమ ధాన్యాగారమైన పంజాబ్, హరి యాణా రాష్ట్రాల్లో ఎంత పంట పండిందనే విషయంలో అధికారిక లెక్కలను ఖరారు చేయడానికి కాస్త సమయం పడుతుంది కానీ, ఈసారి గోధుమ పంట 310 లక్షల టన్నులతో రికార్డు సృష్టించనుందని ప్రారంభ అంచనా. పంజాబ్‌లో ఈ దఫా 180 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుందని భావిస్తుండగా పొరుగున ఉన్న హరియాణాలో 130 లక్షల టన్నుల గోధుమ పంట పండుతుందని అంచనా వేస్తున్నారు. శీతాకాలం విస్తరించిన కారణంగా గోధుమ పంట కాస్త ఆలస్యమయింది కానీ అదే సమయంలో పంట దిగుబడి పెరగడానికి ఈ పరిస్థితి దోహదపడింది. ఇక పంజాబ్‌లో ఈ సంవత్సరం హెక్టారుకు 52 క్వింటాళ్ల మేరకు గోధుమ దిగుబడి రావచ్చని భావిస్తున్నారు. ఇది జాతీయ సగటు అయిన 32 క్వింటాళ్ల కన్నా చాలా ఎక్కువ. కానీ గోధుమ భారీ దిగుబడి వార్తలు సంతోషం కలిగిస్తున్నప్పటికీ పంట నిల్వ సౌకర్యాల్లో తీవ్రమైన కొరత నిరాశ కలిగిస్తోంది. మండీ అంచులను దాటి జాతీయ రహదారుల పక్కనే గోధుమ పంటను నిల్వ చేస్తుండటాన్ని పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో అడుగడుగునా కనబడుతుంది. ధాన్య సేకరణ కార్యక్రమాలు ప్రారంభం కాకముందే వందలాది, వేలాది గోధుమ బస్తాలు మండీలకు పోటెత్తుతుండటం శుభవార్తే.
పంటల నిల్వ సౌకర్యాల లేమి
గోధుమ పంట సీజన్ ముగుస్తున్న తరుణంలో, కొత్త పంటను నిల్వ చేయడానికి ఆ రాష్ట్రంలో ఎలాంటి నిల్వ సౌకర్యాలు లేకపోవడం విచారకరం. ఇప్పటికే గత ఏడాది సేకరించిన 12 లక్షల టన్నుల గోధుమ పంట అలాగే నిల్వ ఉండిపోయింది. క్యాప్ స్టోరేజ్ అని దీన్ని పిలుస్తున్నారు. అంటే బహిరంగ స్థలాల్లో గోధుమ పంటను ఉంచి నల్ల టార్పాలిన్ కప్పి ఉంచుతున్నారు. పంజాబ్‌లో మొత్తం గోధుమ నిల్వ సామర్థ్యం 158.5 లక్షల టన్నులు కాగా గత సీజన్‌లో ఇప్పటికే 143 లక్షల టన్నుల వరకు వరి, గోధుమ పంటను నిల్వ చేసి ఉంచారు. అదనంగా 75 లక్షల టన్నుల క్యాప్ స్టోరేజి కూడా అందుబాటులో ఉంది కానీ గత సీజన్ పంటకు సంబంధించి 12 లక్షల టన్నుల దిగుబడి నిల్వ రూపంలో ఉంది. అదనంగా వరి మిల్లర్లు 20 నుంచి 22 వ్యాగన్ల మేరకు ఆడించిన వరిధాన్యాన్ని త్వరలో ధాన్య సేకరణ కేంద్రాలకు పంపనున్నారు. గోధుమతో పోలిస్తే వరికి నిల్వ నష్టాలు ఎక్కువ కాబట్టి ఈ పంటను ఇండోర్ కేంద్రాల్లో అంటే గోడౌన్లలో నిల్వ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
సంవత్సరం తర్వాత సంవత్సరం మనదేశంలో నడుస్తున్న కథ ఇదే మరి. 132 లక్షల టన్నుల గోధుమ దిగుబడి వస్తుందన్న అంచనా నేపథ్యంలో కొనుగోలు చేసే ఈ పంటలో చాలా భాగం బహిరంగ స్థలాల్లోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరం కూడా మండీలకు కొత్త పంట రావడం మొదలయ్యేటప్పటికి 20 లక్షల టన్నుల గోధుమ బస్తాలను బహిరంగ స్థలాల్లోనే నిల్వ చేశారు. ధాన్య సేకరణ ముమ్మరంగా జరిగే నాటికి 70 లక్షల టన్నుల తాజా పంటను క్యాప్ స్టోరేజీ కింది బహిరంగ స్థలాల్లోనే టార్పాలిన్ల కింద నిల్వ చేసి ఉంచారు. దీనికి ప్రధాన కారణం గత సంవత్సరం కొనుగోలు చేసిన వరి, గోధుమ పంటను నిల్వ కేంద్రాలనుంచి తరలించడంలో అసమర్థతే అని చెప్పాలి. మరో మాటలో చెప్పాలంటే గత సంవత్సరం మొత్తం 90 లక్షల టన్నుల గోధు మలను సేకరించి బహిరంగ స్థలాల్లో నిల్వ ఉంచగా దానిలో 12 లక్షల టన్నుల
గోధుమ ఇంకా అక్కడే మగ్గుతోంది.
పంజాబ్‌లో గోడౌన్లలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ పేరుకుపోయిన గోధుమల మేటలను వీలైనంత త్వరగా రాష్ట్రం దాటించే ప్రయత్నం చేస్తే పరిస్థితి కాస్త మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. ధాన్యసేకరణ సీజన్ ముగిసిపోయే నాటికి రాష్ట్రంలో ధాన్యాల నిల్వకు తగిన చోటు ఖాళీ అవుతుందని భావిస్తున్నట్లు పంజాబ్ ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి కేఏపీ సిన్హా పేర్కొన్నట్లు పత్రికల్లో వార్తలు. రాష్ట్ర పాలనాయంత్రాంగం ప్రతి సంవత్సరం ఒకటికి రెండుసార్లు తప్పనిసరిగా ఎదుర్కొంటున్న ఈ పాలనాపరమైన అడ్డం కులను ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. గోధుమ పంట చేతికి వచ్చే సీజ న్‌లో, వరి పంట చేతికొచ్చే సమయంలో ఏటా రెండుసార్లు నిల్వకు సంబంధించిన సంక్షోభం ఎదురవుతూనే ఉంటుంది.
ధాన్య నిల్వలకు రాజకీయ ప్రాధాన్యత లేదా?
ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ ధాన్యాల నిల్వ ప్రక్రియ, దానిలోని అడ్డం కులు, అవాంతరాలకు చెందిన వాస్తవ పరిస్థితి మరింత దిగజారిపోతోందే తప్ప సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశ లేశమాత్రం కని పించడం లేదు. గత ముప్పై ఏళ్లుగా ఉత్తర భారత ధాన్యాగారంలో ఆహారధాన్యాల నిల్వ కార్యక్రమాల్లో ఎంత తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయో నేను నిత్యం పరిశీలిస్తూ వచ్చాను. ఆహారధాన్యాల ఉత్పత్తి విషయంలో ప్రతి సంవత్సరం సంబంధిత అధికారులు లక్ష్యాలు విధిస్తూ పోవడం పాలసీ ఎజెండాగా ఉంటూవస్తోంది తప్పితే పండించిన, సేకరించిన ప్రతి వరి, గోధుమ గింజను నిల్వచేయడాన్ని నిర్వహించడం ఎలా అనేది మన రాజకీయ ప్రాధాన్యతలలో అట్టడుగున ఉండటమే విచారకరం.
సమృద్ధికి సంబంధించిన ఈ సరికొత్త విరోధాభాస – అత్యధిక పంటలు, విపరీతమైన ఆహార దుబారా– అనేది ఆహార నిర్వహణతో ముడిపడి ఉన్న అన్ని సూత్రాలను తోసిపుచ్చుతూండటం గమనార్హం. పండిన పంటలను సరైన రీతిలో నిల్వ చేసుకోలేని ఈ అసమర్థత పట్ల మన విధాన నిర్ణేతలు ఎందుకు దృష్టి సారించరో, అలాంటి ప్రయత్నానికి కూడా వారెందుకు పూనుకోరో నాకు అర్థం కానే కాదు. చాలా సార్లు నాకు అనిపిస్తుంటుంది.. ఆహార ధాన్యాల దుబారాని తగ్గించడం అనేది రైతు చేపట్టాల్సిన లక్ష్యమనీ, అదే సమయంలో విలువైన ఆహార ధాన్యాల సేకరణను పూర్తిగా దుబారా చేయడం అనేది ప్రభుత్వానికి చెందిన చెక్కుచెదరని హక్కు అనీ నాకు చాలాసార్లు అనిపించేది. నిల్వచేసిన ఆహార ధాన్యాల నాణ్యత విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిర్దయ కానీ, కఠిన వైఖరి కానీ ఏ స్థాయికి దిగజారిపోయాయంటే నాణ్యత లేని నిల్వ కారణంగా ఆహారధాన్యాలు మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాకుండా పోతుంటాయి. ఇది జాతి మొత్తం సిగ్గుపడాల్సిన విషయం.
ఏది ఏమైనా.. ఆహార ధాన్యాల నిల్వను, ధాన్య భాండాగారాలను నిర్మించడానికి మనకు రాకెట్ సైన్స్ ఏదీ అవసరం లేదు. ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు డబ్బు మదుపు చేస్తోందని నేను వింటూంటాను. కానీ వాస్తవాచరణలో ప్రభుత్వం తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని సూపర్ హైవేలను నిర్మించే పనిలోనే గుమ్మరిస్తూ ఉండటం చాలా పరిపాటిగా జరుగుతోంది. జాతీయ రహదారుల యంత్రాంగాన్ని విస్తరించడానికి నేను ఏమాత్రం వ్యతిరేకిని కాదు. కానీ ప్రభుత్వ రంగ మదుపులకోసం ఆరాటపడుతున్న అనేక ఇతర రంగాలు ఉన్నాయి. 2017లో మన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేస్తూ 2022 సంవత్సరం నాటికి దేశంలో 83,677 కిలోమీటర్ల మేరకు రహదారులను నిర్మించడానికి రూ. 6.92 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ అందించనున్నట్లు తెలిపారు.
యుద్ధప్రాతిపదికన ధాన్య నిల్వ కేంద్రాల నిర్మాణం
అయితే కేంద్ర ఆర్థిక మంత్రి జాతీయ రహదారుల విస్తరణకోసం కేటాయించిన ఈ రూ. 6.92 లక్షల కోట్ల మదుపులో కేవలం లక్ష కోట్ల రూపాయలను ఆహార ధాన్యాల నిల్వ కేంద్రాలను నిర్మించడంలో ఉపయోగించినట్లయితే, సరైన ధాన్య నిల్వల సౌకర్యాల లేమి కారణంగా సంభవిస్తున్న తీవ్రాతితీవ్రమైన ఆహార ధాన్యాల దుబారాకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యకు సులభ పరిష్కారం లభిస్తుంది. గతంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 2.5 లక్షల పంచాయితీలో పంచాయితీ గృహాలను నిర్మించింది. ఆ సమయంలో కూడా దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వ కేంద్రాలను నిర్మించడానికి తగిన మదుపును కేటాయించాలని నేను చెబుతూ వచ్చాను.
అంతకు మించి, గోడవున్లలో ముగ్గిపోతున్న ఆహార ధాన్యాలు, మండీల్లో నీటీ మడుగుల్లో పడి ఉంటున్న ఆహార ధాన్య బస్తాలుకు సంబంధించి టీవీలలో కనిపించే చిత్రాలు మన అసమర్థతకు గానూ క్షమించలేని దృశ్యాలుగా ఉంటాయి. పైగా, ప్రపంచ క్షుద్బాధా సూచికను పరిశీలిస్తే మొత్తం 119 దేశాల్లో భారతదేశం 103వ స్థానంలో నిలబడి అధోగతిలో ఉంటోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచంలో ఆకలిగొన్న జనాభాలో పాతిక వంతు భారతదేశంలోనే జీవిస్తున్నారు. సమృద్ధిగా ఆహార పంటల దిగుబడి జరుగుతున్నప్పటికీ వాటిని నిల్వ చేసి ఉంచే సరైన వసతులు లేని దేశంలో పరిస్థితిని ఇంతకుమంచి ఉన్నతంగా ఎలా ఆలోచించగలం? ఆహార ధాన్యాల దుబారాకు సంబంధించిన ఈ భారీ సమస్య ఎందుకు మన దేశంలో రాజకీయ ప్రాధాన్యతల్లో ఒకటిగా కాకుండా పోయిందనే విషయం నాకు ఇప్పటికీ అర్ధం కాదు. మనం వెతికి చూడాల్సిన శాశ్వత పరిష్కారం ఇది మాత్రమే.
దేవిందర్ శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment