సందర్భం
భారతదేశ పరిశోధనా రంగంలో ఒక కొత్త అధ్యాయం ‘నూతన విద్యా విధానం– 2020’. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రకారం భారతదేశంలోని విద్యా, పరిశోధన రంగాలను బలోపేతం చేయడానికి ఇది కృషి చేస్తుంది. ఈ దిశలోనే ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ (ఓఎన్‌ఓఎస్) పథకం ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. భారతదేశ పరిశోధనా రంగాన్ని బలోపేతం చేయడంలో నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దిశలో, అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్‌ఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఓఎన్‌ఓఎస్ దేశవ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు నాణ్యమైన శాస్త్రీయ సమాచారాన్ని అందించే దిశగా పనిచేస్తోంది.
భారతీయ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు అంతర్జాతీయ స్థాయి పత్రికలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా పరిశోధన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. ‘ఆత్మనిర్భర భారత్’ కల సాకారం కావడానికి అవసరమైన దేశీయ పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. దేశంలోని అట్టడుగు స్థాయి విద్యా సంస్థ నుండి ఉన్నత స్థాయి విద్యా సంస్థ వరకు సమాచారాన్ని సమానంగా అందిస్తుంది.
ఓఎన్‌ఓఎస్ కింద 2025 జనవరి 1 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జర్నల్స్‌లో ప్రచు రితమైన పరిశోధనా పత్రాలను మన విద్యార్థులు, పరిశోధకులూ పొందనున్నారు. మొదటి దశ కింద 13,400 కంటే ఎక్కువ అంతర్జాతీయ పత్రికలు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం కింద, 451 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 4,864 కళాశాలలు; అలాగే జాతీయ ప్రాముఖ్యం కలిగిన 172 సంస్థలూ, 6,380 ఉన్నత విద్య, పరిశోధనా సంస్థలూ వీటిని ఉపయోగించుకోనున్నాయి.
ఇవి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పబ్లిషర్స్ (ఎల్సెవియర్, స్ప్రింగర్ నేచర్, వైలి తదితర)తో సహా 30 ప్రచురణ సంస్థలు ప్రచురించే అగ్ర జర్నల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాబోయే మూడేళ్లపాటు ఇలా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
రెండవ, మూడవ దశల్లో ప్రభుత్వ–ప్రైవేట్ నమూనా ద్వారా చొరవను ప్రైవేట్ విద్యా సంస్థలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మూడవ దశలో పబ్లిక్ లైబ్రరీలలో ఏర్పాటు చేసిన యాక్సెస్ పాయింట్ల ద్వారా అంతర్జాతీయ పత్రికలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మూడు సంవత్సరాల కాలానికి 6,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమం సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌గా ప్రారంభించబడుతుంది. ప్రపంచంలో జర్మనీ, చెకోస్లోవేకియా వంటి దేశాల్లో ఇప్పటికే ఇటువంటి వ్యవస్థ దిగ్విజయంగా నడుస్తోంది.
ఈ పథకం పరిశోధనలు కేంద్రీకృతం కాకుండా అన్ని రాష్ట్రాలలో, అన్ని పరిశోధనా సంస్థలలో, రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల్లో ఆవిష్కరణాత్మక పరిశో ధనలను ప్రోత్సహిస్తుంది. పట్టణ – గ్రామీణ పరిశోధనా సంస్థల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తుంది.
అయితే ఈ పథకం అమలులో పలు సవాళ్ళూ ఎదురు కానున్నాయి. ప్రధానంగా, అంతర్జాతీయ పత్రికల చందా ఖర్చులు సంవత్సరానికొకసారి పెరుగుతుండడం కీలక సమస్య. రూ. 6,000 కోట్ల భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, అన్ని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల అవస రాలను తీర్చడం సవాలుగా మారవచ్చు. అలాగే సంపాదకీయ హక్కులు, మేధా సంపత్తి సమస్యలు ముందుకు రావచ్చు.
ఈ తరహా అంత ర్జాతీయ ఒప్పందాలు చాలాసార్లు సాంకేతికత, భాష, మరియు అవసరాల ఆధారంగా వివిధ సంస్థలకు అసమాన అనుభవాలను కలిగించ వచ్చు. అనేక స్థాయుల్లో సమాచార కొరత వల్ల పథకం గురించి అవగాహన లేని పరిస్థితి తలెత్తవచ్చు. ప్రత్యేకించి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో
వసతుల కొరత వల్ల వనరులను పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
మొత్తం మీద వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ పథకం భారతదేశంలోని విద్య– పరిశోధన రంగాలకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే అగ్ర పరిశోధనా కేంద్రంగా మారే అవకాశం ఉంది.
డా‘‘ రవి కుమార్ చేగోని
వ్యాసకర్త తెలంగాణ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment