సమృద్ధి వెలుగులో ఆకలి నీడలు | Article On Hunger Deaths In India | Sakshi
Sakshi News home page

సమృద్ధి వెలుగులో ఆకలి నీడలు

Published Wed, Oct 30 2019 1:00 AM | Last Updated on Wed, Oct 30 2019 1:01 AM

Article On Hunger Deaths In India - Sakshi

దేశంలోని అదనపు ఆహార నిల్వల సంచులను ఒకదానిపై ఒకటిగా పేర్చుకుంటూ పోతే వాటిపై నడుచుకుంటూ చంద్రుడి వద్దకు వెళ్లి మళ్లీ తిరిగిరావచ్చు. పైగా మన ఆహార నిల్వలు రానురాను పెరుగుతూనే ఉన్నాయి. ఇంత సమృద్ధిగా ఆహార నిల్వలు ఉన్నప్పటికీ పొరుగు దేశాల్లోకంటే ఆకలి బాధా సూచికలో భారత ర్యాంకు ఘోరంగా పడిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఆహారోత్పత్తిలో, అదనపు మిగులులో రికార్డులన్నింటినీ బద్దలు చేస్తున్న భారత్‌లో ప్రతిరోజూ 2,400 మంది చిన్నారులు రకరకాల పోషకాహార లేమితో అల్లాడుతూ మృత్యువాత పడుతుండటం సమృద్ధి వెనుక దాగిన చీకట్లను స్పష్టంగా చూపుతోంది. ప్రతి ఏటా 8 లక్షల మంది పిల్లలు ఆకలిదప్పులతో కన్నుమూస్తున్న స్థితిలో, జనాభాలో అధిక శాతానికి తగిన పోషకాహారం లేని నేపథ్యంలో భారత్‌ ఆర్థిక అగ్రరాజ్యంగా మారాలనే కలను ఎన్నటికీ సాకారం చేసుకోలేదు.

సమృద్ధికి సంబంధించిన ఈ వింత పరామితి ఇప్పటికీ ఊహకు అందనివిధంగానే ఉంటోంది. ఒకవైపున దేశంలో గోధుమ నేలలు విస్తారమైన పంట లతో కళకళలాడుతుండగా మరోవైపున ప్రపంచ క్షుద్బాధా సూచి (జీహెచ్‌ఐ) భారత్‌కు అకలితో అలమటించిపోతున్న 117 దేశాల్లో 102వ స్థానమిచ్చింది. ఇది చాలదన్నట్లుగా, తాజా యూనిసెఫ్‌ నివేదిక అయిదేళ్లలోపు పిల్లలు అధిక మరణాల పాలవుతున్న దేశాల జాబితాలో భారత్‌ను చేర్చింది. గత ఏడాది భారత్‌లో 8.82 లక్షలమంది చిన్నపిల్లలు మరణించారని యూనిసెఫ్‌ నివేదించింది.

ఒకవైపున వినియోగదారీ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తనకు తలకు మించిన భారంగా తయారవుతున్న ఆహారధాన్యాల నిల్వలను కాస్త తగ్గించి పుణ్యం కట్టుకోవలసిందిగా భారత విదేశాంగ శాఖను వేడుకుంటోంది. భారత ఆహార సంస్థ వద్ద పేరుకుపోతున్న ఆహార ధాన్యాలలో అదనపు నిల్వలను ప్రపంచంలో అవసరమైన దేశాలకు అందించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఈ మంత్రిత్వ శాఖ భారత విదేశాంగ శాఖను కోరింది. విచిత్రం ఏమిటంటే దేశంలో 6 నుంచి 23 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్లో 90 శాతం మందికి తినడానికి తగినంత ఆహారం లేక అల్లాడిపోతున్న పరిస్థితుల్లో మన ఆహార ధాన్యాల నిల్వలను బయటిదేశాలకు పంపవలసిందిగా వేడుకోవడమే. ఆకలి, పోషకాహార సమస్యను తీవ్రతరం చేస్తూ మన అమూల్య వనరులైన పిల్లల జీవితాల్లో నిశ్శబ్ద విషాదాన్ని సృష్టిస్తుండగా, బయటిదేశాలకు మానవీయప్రాతిపదికన ఆహార నిల్వలను అందించాలన్న ప్రతిపాదన కంటే మించిన అభాస మరొకటి ఉండదు. దేశంలో ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు తగిన తిండి లేకుండా బక్కచిక్కిపోతున్న వాస్తవం తెలిసిన విషయమే.

 అక్టోబర్‌ 1 నాటికి 307.70 లక్షల టన్నుల ఆహార ధాన్యాల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా భారత ఆహార సంస్థ ఇప్పటికే రెట్టింపు స్థాయిలో 669.15 లక్షల టన్నుల వరి, గోధుమ పంటను సెప్టెంబర్‌ 1 నాటికే సేకరించింది. వరి పంట ఇప్పుడు తారస్థాయిలో పోగవుతున్న స్థితిలో రాబోయే కొద్ది వారాల్లో కేంద్ర ఆహార నిల్వల గిడ్డం గులు ధాన్య సమృద్ధితో పొంగిపొరలనున్నాయి. దీనికితోడుగా దేశంలో 2018–19 సంవత్సరంలో పళ్లు, కూరగాయలు 314.5 మిలి   యన్‌ టన్నులకు పోగుపడ్డాయి. ఇక పాల ఉత్పత్తి  176 మిలియన్‌ టన్నులతో రికార్డు సృష్టించింది. అంటే దేశంలో పోషకాహారానికి కొరతే లేదని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఆహార ధాన్యాలను ఇంత సమృద్ధిగా నిల్వ ఉంచుకున్న దేశంలో అత్యధిక జనాభా ఆకలితో అలమటిస్తుండటం కంటే మించిన అసందర్భం ఉండదు.

దీన్ని మరింత సులువుగా చెప్పుకుందాం. దేశంలోని అదనపు ఆహార నిల్వల సంచులను ఒకదానిపై ఒకటిగా పేర్చుకుంటూ పోతే వాటిపై నడుచుకుంటూ చంద్రుడి వద్దకు వెళ్లి మళ్లీ తిరిగిరావచ్చు. ఇంత సమృద్ధికరంగా ఆహార నిల్వలు ఉన్నప్పటికీ పొరుగు దేశాల్లోకంటే ఆకలి బాధా సూచికలో భారత ర్యాంకు ఘోరంగా పడిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కెనడా తన రికార్డును మెరుగుపర్చుకుని అంతర్జాతీయంగా 25వ ర్యాంకులో నిలబడగా, బ్రిక్స్‌ దేశాలన్నిటికంటే భారత్‌ వెనుకబడిపోయింది. శ్రీలంక (66), నేపాల్‌ (73), బంగ్లాదేశ్‌ (88), పాకిస్తాన్‌ (94) ర్యాంకులతో మనకంటే ఎంతో మెరుగ్గా ఉండగా, చివరకు వెనిజులా (65), ఉత్తర కొరియా (92), ఇథియోపియా (93) ర్యాంకులతో మనల్ని అధిగమించటం బాధాకరం. నిజానికి, 2006 నుంచి ప్రపంచ క్షుద్బాధా సూచిని ప్రకటిస్తుండగా, 14 రిపోర్టుల తర్వాత కూడా భారత్‌ ఆకలి, పోషకాహార లేమి సంబంధించి ఏమాత్రం మెరుగుపడలేదు.

ఇది మన ప్రాధాన్యతల ఎంపికకు సంబంధించిన సమస్య. కొన్నేళ్లుగా అత్యధిక ఉత్పాదకతను సాధించడంపైనే మన విధాన నిర్ణేతల దృష్టి ఉంటూ, దేశంలో ప్రబలుతున్న ఆకలిని, పోషకాహార లేమిని తేలికగా పక్కనపెడుతూ వస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అధికంగా అభివృద్ధి చెందితే ఆకలిదప్పులతో జీవిస్తున్న వారి జనాభా దానికదే తగ్గిపోతుందనే ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతా దృక్పథాన్ని దేశంలో కంటికి కనబడే ఆకలి, కనిపించకుండా మరుగున ఉండే ఆకలి రెండూ వెక్కిరిస్తూ వస్తున్నాయి. పైగా, ఆర్థిక వ్యవస్థ పెరుగుదలతోపాటే ఆకలి, పోషకాహార లేమి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పోషకాహార లేమిని ‘జాతీయ అవమానం’గా భావించాలని ప్రకటించినా పరిస్థితిలో మార్పు లేదు.

ఆకలిని తొలగించడం సంక్లిష్టమైన, సవాలుతో కూడిన కర్తవ్యమని అర్థం చేసుకుంటాను కానీ గత కొన్నేళ్లుగా పిల్లల పోషకాహార లేమి, ఆహార దుబారా వంటి అంశాల్లో దేశం ప్రగతి సాధించి ఉంటే ఆకలి చరిత్రను నివారించడం అనే భారీ లక్ష్యం అసాధ్యమై ఉండేది కాదు. జనాభాలోని మూడింట రెండొంతుల మందికి సబ్సిడీ కింద ఆహార ధాన్యాలను అందించే లక్ష్యంతో 2013 జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకురావడమే కాకుండా, పిల్లల్లో పోషకాహార లేమితో తలపడేందుకు, ఆకలిని నిర్మూలించేందుకు అనేక పథకాలను కేంద్ర స్థాయిలో ప్రవేశపెట్టినప్పటికీ సూక్ష్మ ఆర్థిక విధానాలలో.. వీటిని సాధించాల్సిన లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకోలేదు. పైగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు కూడా అలా ఆహార సబ్సిడీలను పెంచడం వల్ల ద్రవ్యలోటు పెరిగిపోతుందని మన జాతీయ స్రవంతి ఆర్థికవేత్తలు నిరసన గళం వినిపించారు.

తీవ్రమైన దారిద్య్రాన్ని, ఆకలిని నిర్మూలించేందుకు నాటి బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డా సిల్వా 2003లో ప్రారంభించిన ‘జీరో హంగర్‌’ (సంపూర్ణంగా ఆకలిని నిర్మూలించడం) కార్యక్రమంతో భారత్‌ విధానాలను పోల్చి చూద్దాం. జీరో హంగర్‌ కార్యక్రమం కింద వ్యవసాయంలో వ్యవస్ధాగతమైన మార్పులను నాటి బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం కింద 2011 నాటికే బ్రెజిల్‌లో దాదాపు మూడు కోట్ల 20 లక్షలమంది ప్రజలు (జనాభాలో 16 శాతం) దారిద్య్రం కోరల నుంచి బయటపడ్డారని ప్రముఖ పత్రిక ‘ది గార్డియన్‌’ పేర్కొంది. దీనికి ‘బోల్సా ఫ్యామిలియా’ వంటి నగదు బదిలీ పథకాలు తోడై జనాభాలో పావు శాతం పైగా ప్రజలకు నిజంగా ఊతమిచ్చాయి. ఆహార భద్రత, విద్య, వైద్యాలను అందుబాటులో ఉంచడం, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి వాటి కలయికే బోల్సా ఫ్యామిలియా. పర్యవసానంగా కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే బ్రెజిల్‌ ప్రపంచ క్షుద్బాధా సూచి కలో 18వ ర్యాంకులో నిలిచింది. అంటే ఆకలి నివారణలో చైనాకంటే అగ్ర స్థాయిని బ్రెజిల్‌ సాధించింది.

సారాంశంలో బ్రెజిల్‌ అమలు పర్చిన జీరో హంగర్‌ విధానాలు ఆహారోత్పత్తిని ఆకలి నిర్మూలనతో ముడిపెట్టడంలో విజయవంతమయ్యాయి. ఈ పథకంలోనూ కొన్ని తేడాలు ఉండవచ్చు కానీ, ఆకలిని పూర్తిగా నిరోధించడానికి బ్రెజిల్‌ ఇప్పటికీ నిర్ణీత గడువుతో కూడిన పథకాలను అమలు చేస్తోంది. భారత్‌లో ఆహార ఉత్పత్తిని పెంచడంపైనే పాలకుల విధానాలు దృష్టి పెడుతూ ఆహారధాన్యాలు తక్కువగా ఉంటున్న ప్రాంతాలకు అదనపు ఆహార నిల్వలను తరలించే పద్ధతిని అమలుచేస్తూ ఉన్నప్పటికీ, రైతుల సంక్షేమానికి మాత్రం ఏ ప్రభుత్వమూ ప్రాధాన్యత ఇచ్చిన చరిత్ర లేదు. వ్యవసాయంలో 60 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటున్న దేశంలో జీరో హంగర్‌ని సాధించడానికి చేసే ఏ పథకమైనా వ్యవసాయాన్ని మౌలికంగా పునరుద్ధరించాల్సి ఉంటుంది. వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచవలసి ఉంది. అయితే ఆర్బీఐ ప్రకారం 2011–12 నుంచి 2016–17 మధ్య ప్రభుత్వరంగ సంస్థలు వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు మన స్థూల దేశీయోత్పత్తిలో 0.4 శాతం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని దశాబ్దాలుగా ఆకలితో, పోషకాహార లేమితో పోరాడ్డానికి సంబంధించి లెక్కలేనన్ని వాగ్దానాలు చేశారు. హామీలు గుప్పిం చారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, భారత్‌లో ప్రతి రోజూ 2,400 మంది చిన్నారులు రకరకాల పోషకాహార లేమితో అల్లాడుతూ మృత్యువాత పడుతుండటమే. దేశంలో జరుగుతున్న ఈ భారీ మానవ విషాదానికి.. పిల్లల నోటికి సరైన మోతాదులో మనం ఆహారాన్ని అందించకపోవడమే కారణం. ఆహార ఉత్పత్తిలో కొరత లేదు. ఆర్థిక విధానాలను ప్రకటించి అమలుచేసే సామర్థ్యంలో కొరత లేదు. కానీ, ఆకలిని తొలగించడానికి బలమైన రాజకీయ సంకల్పం నిజంగా కరువైపోయింది. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది పిల్లలు ఆకలిదప్పులకు తాళలేక కన్నుమూస్తున్న స్థితిలో, జనాభాలో అధిక శాతానికి తగిన పోషకాహారం లేని నేపథ్యంలో భారత్‌ ఆర్థిక అగ్రరాజ్యంగా మారాలనే కలను ఎన్నటికీ సాకారం చేసుకోలేదు.

దేవీందర్‌ శర్మ  
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ :hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement