Hunger deaths
-
నాలుగు నెలలు.. కరువు కోరల్లోకి 60 లక్షల మంది!
నాలుగు నెలలుగా యుద్ధ వాతావరణం. ఐదువేల మందికిపైగా మృతి. ప్రాణ భయంతో వలసలు పోయిన లక్షల మంది. కరువుకు కూతవేటు దూరంలో మరో అరవై లక్షల మంది. అంతర్యుద్ధంతో సూడాన్ ఎంతగా నాశనం అయ్యిందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు. సూడాన్‌లో పారామిలిటరీ ఫోర్స్, సైన్యం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అమాయకులు బలవుతున్నారు. ఆర్మీ జనరల్ అబ్దెల్ ఫట్టాహ్ అల్ బుర్హాన్, పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ కమాండర్ మొహమ్మద్ హందన్ దాగ్లో మధ్య విలీన చర్చలు విఫలం కావడంతో.. పరస్సర దాడులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మొదలైన ఈ అంతర్యుద్ధంతో ఐదు వేల మందిదాకా మృతి చెందినట్లు పలు నివేదికలు చెబుతున్నారు. ఆ సంక్షోభాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. మూర్ఖంగా ముందుకే పోతున్నాయి రెండు వర్గాలు. ఊహించని ప్రాణ నష్టం చిన్నారులు ఈ స్థాయిలో మరణిస్తారని ఊహించలేదు. ఆకలి కేకల్ని నిర్మూలించగలిగే పరిస్థితులు ఉన్నా.. వాళ్లు చనిపోవడం బాధాకరం అని సేవ్ ది చిల్ట్రన్ అనే ఎన్జీవో ఒక ప్రకటన విడుదల చేసింది. మరణాలు మాత్రమే కాదు.. దాదాపు 40 వేల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, చికిత్స అందకపోతే వాళ్ల ప్రాణాలకు కూడా ముప్పేనని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ గతంలోనే చెప్పింది. అంతర్యుద్ధంతో.. యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. మరోవైపు సూడాన్ నుంచి 44 లక్షల మంది సురక్షిత ప్రాంతాలు.. పొరుగు దేశాలకు తరలి వెళ్లి ఉంటారని యూఎన్వో శరణార్థి విభాగం అంచనా వేస్తోంది. సూడాన్‌లో కరువు కోరల్లో 60 లక్షల మంది ఉన్నారనే హెచ్చరికలూ జారీ అవుతున్నాయి. పరస్పర దాడుల వల్ల.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకుపోయాయి. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారు. మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అయిపోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. అంతర్జాతీయంగా పలు ఛారిటీలు, సంస్థలు సాయం అందించేందుకు ముందుకు వెళ్తున్నా.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల దాడులతో వాటికి విఘాతం ఏర్పడుతోంది. -
ఆకలి కేకలు.. దయనీయ స్థితిలో ఉత్తర కొరియా
పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది ఉత్తర కొరియా పరిస్థితి. అధ్యక్షుడు కిమ్ వరుస క్షిపణి పరీక్షలతో దాయాది దక్షిణ కొరియాకు, దాని మద్దతుదారు అమెరికాకు సవాళ్లు విసురుతుంటే దేశం మాత్రం కనీవినీ ఎరుగని కరువు కోరల్లో చిక్కి అల్లాడుతోంది. తిండికి లేక జనం అలమటిస్తున్నారు. తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగకుంటే 1990ల్లో దేశం చవిచూసిన 20 లక్షల పై చిలుకు ఆకలి చావుల రికార్డు చెరిగిపోయేందుకు ఎంతోకాలం పట్టదంటూ ఆందోళన వ్యక్తమవుతోంది...! అటు కాలం కనికరించడం లేదు. తీవ్ర వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో గతేడాది పంట దిగుబడులు కుదేలయ్యాయి. ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతో ఇంతో ఆదుకుంటూ వచ్చిన ప్రజా పంపిణీ వ్యవస్థ చేతులెత్తేసింది. ఇంతకాలం మార్కెట్లో దొరుకుతూ వచ్చిన చైనా తిండి గింజలు, నిత్యావసరాలు కరోనా కట్టడి దెబ్బకు మూడేళ్లుగా అసలే అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో ఉత్తర కొరియా అక్షరాలా ఆకలి కేకలు పెడుతోంది. జనాభాలో అధిక శాతం రోజుకు ఒక్క పూట కూడా తిండికి లేక అలమటిస్తున్నారు. నియంతృత్వపు ఇనుప తెరలు దాటుకుని ఏ విషయమూ బయటికి రాదు గనుక అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. కానీ ఇప్పటికే లక్షలాది మంది కరువు బారిన పడ్డట్టు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరువు మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్నట్టు చె బుతున్నాయి. అస్తవ్యస్త పాలనకు మారుపేరైన కిమ్ ప్రభుత్వమే ఇందుకు ప్రధాన దోషిగా కనిపిస్తోంది. కారణాలెన్నో... ► కొరియా కరువుకు చాలా కారణాలున్నాయి. కరోనా దెబ్బకు ఆహార కొరత తీవ్రతరమైంది. ► ప్రభుత్వం తీవ్ర ఆంక్షలను విధించి అత్యంత కఠినంగా అమలు చేయడం, సరిహద్దులను పూర్తిగా మూసేయడంతో సమస్య మరింత పెరిగింది. 2.5 కోట్ల జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి కనీసం 55 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. కాగా వార్షిక సగటు ఉత్పత్తి 45 లక్షల టన్నులే. మిగతా 10 శాతం లోటు చాలావరకు చైనాతో సాగే అనధికారిక వర్తకం ద్వారా పూడేది. తిండి గింజలు, నిత్యావసరాలతో పాటు పలు ఇతర చైనా సరుకులు 2020 దాకా దేశంలోకి భారీగా వచ్చేవి. ముఖ్యంగా గ్రామీణుల అవసరాలు చాలావరకు వీటిద్వారానే తీరేవి. కానీ మూడేళ్లుగా ఆంక్షల దెబ్బకు ఈ వర్తకం దాదాపుగా పడకేసింది. ఇది సగటు కొరియన్లకు చావుదెబ్బగా మారింది. దీనికి తోడు గతేడాది తిండి గింజల ఉత్పత్తి 35 లక్షల టన్నులకు మించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ► ప్రభుత్వం వద్ద భారీగా ఆహార నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే చైనా నుంచి భారీగా బియ్యం, గోధుమ పిండి తదితరాలను దిగుమతి చేసుకుంది కూడా. కానీ ‘ముందుజాగ్రత్త’ చర్యల్లో భాగంగా వాటిని కావాలనే దాచి ఉంచిందని పరిశీలకులు చెబుతున్నారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రజల్లో చాలామందికి కొనుగోలు శక్తి క్షీణించడంతో వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. కిలో బియ్యం ధర ఏకంగా 220 రూపాయలకు ఎగబాకిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ► వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చి దేశాన్ని స్వయంసమృద్ధంగా మార్చుకుంటామంటూ తాజాగా జరిగిన 4 రోజుల వర్కర్స్ పార్టీ సమావేశాల్లో కిమ్ గంభీరంగా ఉపన్యాసమిచ్చారు. అది ఏ మేరకు వాస్తవ రూపు దాలుస్తుందన్న దానిపైనే కొరియన్ల భవితవ్యం ఆధారపడుతుంది. తీవ్ర అసమానతలు ► ఉత్తర కొరియా ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల జాబితాలో ఉంది. ప్రజల తలసరి ఆదాయం కేవలం రూ.1.3 లక్షలు! ► దేశంలో సామాజిక అసమానతలు చాలా ఎక్కువ. ► అత్యధికులకు, ముఖ్యంగా గ్రామీణులకు అన్నం, కాయగూరలే ప్రధానాహారం. ► మాంసాహారం, పండ్లు వారికి అందని ద్రాక్షే. ► పట్టణాల్లో పరిస్థితి కాస్త మెరుగు. రాజధాని ప్యాంగ్యాంగ్లో స్థోమత ఉంటే అన్నిరకాల ఆహారమూ దొరుకుతుంది. ► దేశంలో ప్రైవేట్‌లో ఆహారం, ఆహార ధాన్యాల అమ్మకం నిషిద్ధం. కానీ కొన్నేళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. దాంతో ప్రైవేట్ క్రయ విక్రయాలను ప్రభుత్వం చూసీ చూడనట్టు పోతోంది. నిధులన్నీ సైన్యానికే! ► ఉత్తర కొరియా 12 లక్షల మందితో కూడిన ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైన్యాన్ని పోషిస్తోంది. ► ఏటా జీడీపీలో ఏకంగా నాలుగో వంతు సైన్యంపైనే వెచ్చిస్తోంది. ► 2022లోనైతే దేశ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 70 ఖండాంతర, క్రూయిజ్ క్షిపణులను పరీక్షించింది! ► తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇటీవలే భారీ సంఖ్యలో ఖండాంతర క్షిపణులు తదితరాలతో నెల రోజుల క్రితమే అతి పెద్ద సైనిక పరేడ్‌ను నిర్వహించింది! ► ఇలా వనరులన్నీ రక్షణ రంగానికే మళ్లుతుండటంతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం దక్కకుండా పోతోంది. ► కిమ్ అణు పరీక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విధించిన ఆంక్షలతో పరిస్థితి మరింత విషమించింది. ► కేవలం గతేడాది క్షిపణి పరీక్షలకు వెచ్చించిన నిధులతో దేశ జనాభా మొత్తానికీ ఏడాది పాటు చాలినన్ని తిండి గింజలు అందించవచ్చని అంచనా. ఆ కరువుకు 20 లక్షల మంది బలి! 1990ల్లో ఉత్తర కొరియా చవిచూసిన భయానక కరువు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పకుంటారు. ‘ఆర్డియస్ మార్చ్’గా పిలిచే ఈ కరువుకు అస్తవ్యస్త పాలన, సోవియట్ నుంచి సాయం ఆగిపోవడంతో పాటు 1995లో వచ్చిన భారీ వరదలు తక్షణ కారణంగా మారాయి. వాటి దెబ్బకు దేశంలో వరి పంట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో వంతుకు పైగా పొలాలు రోజల తరబడి అడుగుల లోతు నీటిలో మునిగిపోయాయి! జనమంతా పనీపాటా వదిలేసి కేవలం తిండి గింజల కోసం రోజుల తరబడి పొలాల వెంబడి తిరుగుతూ అలమటించిన దృశ్యాలు అప్పట్లో అందరినీ కలచివేశాయి. కనీవినీ ఎరగని ఆ కరువుకు రెండు కోట్ల జనాభాలో పదో వంతుకు పైగా, అంటే 20 లక్షల మందికి పైగా బలైనట్టు చెబుతారు. అంతేగాక ఏకంగా 62 శాతం మందికి పైగా చిన్నారులు పౌష్ఠికాహార లోపానికి గురై శాశ్వత ఆరోగ్య తదితర సమస్యల బారిన పడ్డారు. రెండు మూడేళ్ల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చినా చిన్నారులు మాత్రం కోలుకోలేకపోయారు. నేటికీ ఉత్తర కొరియాలో 22 శాతం మంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు అంచనా! – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుండెలను పిండేసే ఘటన.. ఆకలి చావులు, అలమటించిన బతుకులు
అంతులేని ఆకలి.. వర్ణించనలివికాని దైన్యం.. భరించలేని ఆవేదన.. ఇవన్నీ గత కొన్ని నెలలుగా ఆ కుటుంబం అనుభస్తున్న బాధలు. చివరికి తమ వారు మరణించినా కాటికి చేర్చలేని దుస్థితి వారిది. ఇంటి నుంచి వస్తున్న దుర్శాసన భరించలేక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తేకానీ.. వారి దుర్భర జీవితం బయటి ప్రపంచానికి తెలియలేదు. చెన్నై: ఆకలితో అలమటించి ఓ వృద్ధురాలు, మరో వ్యక్తి వారం రోజుల క్రితం మరణించారు. ఈ మృత దేహాలకు అంత్యక్రియలు చేసే స్థామత లేక తాము కూడా ఆకలితో చచ్చి పోదామని భావించిన ఓ తల్లి, తనయుడు వారం పాటు ఒకే గదిలో కాలం గడిపారు. ఇంట్లో నుంచి వచ్చిన దుర్వాసతో సోమవారం పోలీసులు రంగంలోకి దిగారు. మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించి, తల్లి, కుమారుడిని ఆసుప్రతికి తరలించారు. వివరాలు.. ఈరోడ్ జిల్లా గోబి చెట్టి పాళయం వండి పేట కుమరన్ వీధికి చెందిన కనకంబాల్ (80), ఆమె కుమార్తె శాంతి (60), అల్లుడు మోహన సుందరం(74)తో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. శాంతి, మోహన సుందరం దంపతులకు కుమార్తె శశిరేఖ(27), కుమారుడు శరవణ కుమార్(23) ఉన్నారు. ఈక్రమంలో కనకంబాల్, సుందరం, శాంతి అనారోగ్యం, వయోభారం సమస్యలతో బాధ పడుతున్నారు. కుమారుడు శరవణకుమార్ మానసిక ఎదుగుదల లేనివాడు. ఈక్రమంలో ఆ కుటుంబాన్ని శశిరేఖ పోషిస్తూ వచ్చింది. ఇటీవల ఆమెకు వివాహం చేసి కాంగేయానికి పంపించేశారు. అప్పటి నుంచి ఆదాయం లేక పేదరికంతో పస్తులు ఉన్న రోజులే ఈ కుటుంబానికి ఎక్కువ. వారం పాటు శవజాగారం ఇరుగు పొరుగు వారు ఏదైనా ఇస్తే తినడం లేదా, నీళ్లు తాగి పడుకోవడం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో వీరి ఇంటి నుంచి సోమవారం దుర్వాసన రావడాన్ని ఇరుగు పొరుగు వారు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, మోహన సుందరం, కనకంబాల్ మరణించి ఉండటం, వారి మృత దేహాల పక్కనే శాంతి, శరణ కుమార్ కూర్చుని ఉండడం చూసి విస్మయం చెందారు. అత్యంత దీన స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. విచారణలో ఆ ఇద్దరు మరణించి వారం రోజులు అయినట్లు తేలింది. ఆకలితో అలమటించి ఆ ఇద్దరు మరణించారని, అంత్యక్రియలకు స్థోమత కూడా లేదని, తాము చచ్చిపోతామని భావించే వారం నుంచి ఇంట్లోనే ఉన్నట్లు శాంతి పేర్కొనడం పోలీసుల్ని సైతం కంట తడి పెట్టించింది. దీంతో కనకాంబాల్ , మోహన్ సుందరం మృత దేహాలకు పోస్టుమార్టం అనంతరం పోలీసులే అంత్యక్రియలు చేశారు. కాంగేయంలో ఉన్న కుమార్తె శశిరేఖకు సమాచారం అందించారు. ఆమె కూడా కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తుండటంతో ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అన్నం పెట్టలేక... బిడ్డలనే అమ్మేస్తున్నారు!
డొక్కలీడ్చుకుపోయి.. ఎముకలపై చర్మం మాత్రమే ఉన్న చిన్నారులు... కుటుంబాన్ని బతికించుకునేందుకు శరీర అవయవాలను అమ్ముకుంటున్న పెద్దలు.. మిగిలిన బిడ్డలను బతికించుకోవడానికి ఓ బిడ్డను అమ్ముకుంటున్న కుటుంబాలు... పుట్టెడు దు:ఖాన్ని దాచేసి ఏ భావమూ కనిపించకుండా నిర్విరాకరంగా నఖాబ్ మాటున కళ్లు... ఇది ప్రస్తుత ఆఫ్గన్ ముఖ చిత్రం. తినేందుకు తిండి లేదు. చేసేందుకు పనిలేదు. ఎక్కడ చూసినా కరువు. ఆకలి చావులు. మానవతా దృక్పథంతో ప్రపంచం ఆఫ్గనిస్తాన్ ను ఆదుకోవాలని ఐక్యరాజ్యసమితి కోరుతోంది. కాబూల్: ప్రపంచానికి కరోనా ఒక్కటే బాధ. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన అఫ్గానిస్తాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లాక... ఆర్థిక సంక్షోభం, కరువు వేధిస్తోంది. అమెరికా తమ ఫెడరల్ బ్యాంకు నుంచి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అఫ్గాన్ అందాల్సిన నిధులను స్తంభింపజేయడంతో... ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆహార సంక్షోభంతో ఆకలిచావులు పెరిగిపోయాయని.. ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్ డేవిడ్ బేస్లీ మళ్లీ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల వశమవ్వడానికి ముందు కూడా అఫ్తానిస్తాన్‌లో కరువు ఉంది. కానీ... ఆ తరువాత మరింత పెరిగింది. వేలాది మంది ఉపాధ్యాయులు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు.. వారు వీరనే తేడా లేదు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. దేశంలో ప్రధాన ఆధారం వ్యవసాయం. ఈ ఏడు వ్యవసాయమే లేదు. దీంతో రెండున్నర కోట్లకు కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. కూరగాయలు, మాంసం, పాలు ఏవీ లేవు. ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీల్లో పోషకాహార లోపం పెరిగిపోతోంది. కుటుంబానికి పిడికెడన్నం పెట్టడం కోసం కడుపున పుట్టిన పిల్లలను, ఇంట్లో ఉన్న వస్తువులను సైతం అమ్ముకుంటున్నారు. పదిలక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్నారు. సగం పైగా జనాభాకు కేవలం నీళ్లు, బ్రెడ్ మాత్రమే దొరుకుతోంది. ఒక్కోసారి అది కూడా ఉండటం లేదు. పనిలేదు, ఆదాయం లేదు. ఇంట్లో పిల్లల కడుపునింపే పరిస్థితి లేదు. ఆకలితో అలమటిస్తున్న పిల్లల ముఖాలు చూసే ధైర్యం చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. ‘ఆఫ్ఘన్ ప్రజలు మనుగడ కోసం తమ పిల్లలను, వారి శరీర భాగాలను విక్రయిస్తున్నారు. దేశంలో సగానికి పైగా జనాభా ఆకలితో అలమటిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఆఫ్గానిస్తాన్‌కు సహాయాన్ని వేగవంతం చేయాలి’ అని ఆయన కోరారు. మనవాతా హృదయంతో యావత్ ప్రపంచం స్పందించాలని బేస్లీ కోరారు. ఆఫ్గానిస్తాన్‌లో కరువు, మహమ్మారి, ఆర్థిక పతనం, సంవత్సరాల సంఘర్షణ ప్రభావాలతో పోరాడుతోంది. నాలుగు కోట్ల మందిలో దాదాపు రెండున్నర కోట్ల ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ శీతాకాలంలో సగానికి పైగా జనాభా కరువు బారినపడ్డారు. ఈ సంవత్సరం జనాభాలో 97 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడిపోవచ్చని బేస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టులో అమెరికా, మిత్రదేశాలు దేశం వదిలి వెళ్లినప్పటికీ అనేక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సాయం చేస్తూనే ఉన్నాయి. కొంత ఆహార సంక్షోభం, మానవతా సంక్షోభాన్ని కొంత తగ్గించగలిగాయి. అయినా పరిస్థితుల్లో రావాల్సినంత మార్పు రాలేదు. అందుకే ప్రస్తుత ఆకలి సంక్షోభాన్ని పరిష్కరించడానికి అఫ్గాన్‌కు సహాయం చేయాలని ప్రపంచంలోని సంపన్నులకు బేస్లీ పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాలు సాయం అందిస్తున్నాయని.. మానవాతా వాదులంతా ఇంకా సాయం చేయాలని బేస్లీ కోరారు. ‘ప్రపంచంలోని బిలియనీర్లు తరగని ఆస్తులు సంపాదించారు. ఆ సంపద పెరుగుదల నికర విలువ రోజుకు నాలుగువేల కోట్లు. ఇలాంటి స్వల్పకాలిక సంక్షోభాలను పరిష్కరించడానికి మీ ఒకరోజు నికర విలువ పెరుగుదల సరిపోతుంది. కాబట్టి మంచి మనసుతో సహాయం చేయడానికి ముందుకు రండి’ అని బిలియనీర్లకు పిలుపునిచ్చారు. యురోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నార్వే, యూకే, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు, ప్రత్యేక రాయబారులతో జనవరి 24న ఓస్లోలో సమావేశమై ఆఫ్గన్ పరిస్థితులపై చర్చించారు. ఆఫ్గన్ల ఆకలి తీర్చాలంటే ఆహార భద్రతా కార్యక్రమానికి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కావాలని తెలిపింది. -
Afghan Crisis: ఏం మిగల్లేదు! అఫ్గన్ ఆర్తనాదాలు
అనుకున్నదానికంటే వేగంగా అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది. మూడు నెలల పాలనలో తాలిబన్లకు పెద్దగా చేయడానికి ఏం లేకుండా పోయింది. దీంతో అఫ్గన్ నేలకు తగిలిన ‘ఆర్థిక’ గాయం మానకపోగా.. పుండు మరింత పెద్దది అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత దయనీయమైన సంక్షోభం చూడబోతున్నామన్న ఐరాస, కొన్ని ప్రపంచ దేశాల అంచనాలే నిజం కావడానికి ఎంతో టైం పట్టేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన మిలియన్ డాలర్ల సహాయం పత్తా లేకుండా పోయింది. అఫ్గనిస్తాన్‌కు చెందిన బిలియన్ల ఆస్తులు నిలిచిపోయాయి. ఆర్థిక ఆంక్షలు కొత్త ప్రభుత్వానికి గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి దూరం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏర్పడ్డ నగదు కొరత.. వ్యాపారాలు, బ్యాంకుల నిర్వహణకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఇక కరెన్సీ కొరత అఫ్గన్ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అకౌంట్లలో డబ్బులున్నా.. నిల్వలు నిండుకోవడంతో బ్యాంకులకు క్లోజ్డ్ బోర్డులు కనిపిస్తున్నాయి. కరెన్సీ కోసం వందల కిలోమీటర్లు వెళ్లినా లాభం లేకపోవడంతో దొరికిన వస్తువునల్లా తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి డబ్బును తెచ్చుకుంటున్నారు కొందరు. బ్యాంకుల ముందు నగదు కోసం బారులు తీరిన జనం ఉత్పత్తుల కొరతతో ఆహార, ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు అఫ్గన్ అంతటా ఇదే పరిస్థితి. వీటికి తోడు ఆకలి కేకలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా 30 లక్షల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులకు గురవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి పది లక్షల చిన్నారులు మరణించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫర్నీచర్ అమ్ముకుని మరీ.. ఆర్థికంగా చితికిపోయిన వందల కుటుంబాలు రాజధాని కాబూల్ రోడ్ల మీదకు చేరి ఇంట్లోని సామాన్లు అమ్మేసుకుంటున్నారు. ఆకలి తీర్చుకునేందుకు వస్తు మార్పిడికి పాల్పడుతున్నారు. ఇక ప్రధాన నగరాల ఆస్పత్రుల్లో మందుల కొరత, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది ఉద్యోగాలకు గుడ్‌బై చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు చిన్నపిల్లలతో నిండిపోతున్నాయి. పిల్లలకు తిండి పెట్టలేని తల్లిదండ్రులు.. అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో చేర్పిస్తున్న దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఆధారపడడం వల్లే! అఫ్గనిస్తాన్ ఎన్నో ఏండ్లుగా దిగుమతి ఆహారం, నిత్యావసరాలు, ఇంధనాల మీదే ఆధారపడి ఉంటోంది. సొంతంగా ఎలాంటి వనరులను వృద్ధి చేసుకోలేదు. ప్రతీదానికి పొరుగు దేశాల వైపు చూస్తుండేది. తాలిబన్ ఆక్రమణ తర్వాత సరిహద్దులు కూడా మూసుకుపోవడంతో ఆహారం, మందులతో సహా అన్నింటి కొరత ఏర్పడింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసేది. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేసేది ప్రభుత్వం. కానీ, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక బైడెన్ ప్రభుత్వం ఏకంగా 9.5 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేసింది. అంతేకాదు అఫ్గన్ కేంద్రీయ బ్యాంక్‌కు అవసరమైన డాలర్ల పంపడం ఆపేసింది. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ఓ దేశం త్వరగతిన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ప్రపంచ సమాజం చూడబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తాలిబన్ ప్రభుత్వానిది. గతంలో లక్షల మందికి ఉపాధి కల్పించిన ప్రైవేట్ సెక్టార్.. ఇప్పుడు మూగబోయింది. వచ్చే ఏడాది జూన్ కల్లా 97 శాతం అఫ్గనిస్తాన్ జనాభా దారిద్ర్యరేఖ దిగువకు మునిగిపోనుందని యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విశ్లేషించింది. దీనికితోడు ఉపాధి కరువు, అవినీతి, పేదరికం, కరువు.. తాలిబన్ పాలనలో అఫ్గన్ నేలను ఆర్తనాదాలు పెట్టిస్తోంది. కరెన్సీ కొరతను అధిగమించేందుకు విత్‌డ్రా కరెన్సీపై పరిమితులు విధించిన అఫ్గన్ ప్రభుత్వం.. చైనా, పాకిస్థాన్, ఖతర్, టర్కీ దేశాలకు ఆ లోటును పూడ్చేందుకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు వీలైనంత మేర సాయం ద్వారా ఉపశమనం అందించాలని, లేదంటే యూరప్ దేశాలకు వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. సెప్టెంబర్‌లో బైడెన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూనే.. మానవతా ధృక్పథంతో కొన్ని మినహాయింపులతో సాయం అందించేందుకు ఒప్పుకుంది. కానీ, ఆ మినహాయింపుల ద్వారా ఒరిగింది ఏంలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న కరెన్సీ ఆంక్షలు ఇలాగే కొనసాగితే అఫ్గన్ పౌరుల జీవితాలు తలకిందులు అవుతాయి. ఈ పరిణామాలు ఊహించలేనంత ఘోరంగా ఉంటాయనేది నిపుణుల హెచ్చరిక. అయితే బిలియన్నర డాలర్ల సాయాన్ని తాజాగా ప్రకటించిన అమెరికా, యూరప్ యూనియన్లు.. అఫ్గన్ అంతర్గత వ్యవస్థ బలపడనంత వరకు మానవతా కోణంలో బయటి దేశాల నుంచి సాయం ఎంత అందినా లాభం ఉండదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఆకలిచావులు ఉండొద్దు: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల సంక్షేమం రాజ్యాంగపరమైన బాధ్యత అని, దేశంలో ఆకలిచావులు సంభవించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమ్యూనిటీ కిచెన్లపై మూడువారాల్లోగా ప్రణాళిక రూపొందించి అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇదే చివరి అవకాశమని దేశవ్యాప్త ప్రణాళిక అయి ఉండాలని స్పష్టం చేసింది. ఇందుకోసం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించింది. సామాజిక వేత్తలు అనున్ ధావన్, ఇషాన్ ధావన్, కుంజన సింగ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం ముందుకొచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అఫిడవిట్ సంపూర్ణంగా దాఖలు చేయడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. కోర్టు ఒకటి చెబితే మరొకటి అఫిడవిట్లో ఉంటోందని పేర్కొంది. ‘‘ఆకలి విషయంలో కేంద్రం శ్రద్ధ చూపుతానంటే రాజ్యాంగం, చట్టాలు అడ్డుచెప్పవు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు అవుతోంది. చివరి అవకాశంగా రెండు వారాల్లో సమావేశం నిర్వహించండి’ అని ధర్మాసనం పేర్కొంది. -
ఎలన్ మస్క్ సవాల్: అలా చేస్తే రూ.45 వేల కోట్లు ఇస్తాను
వాషింగ్టన్: ప్రపంచ కుబేరులు వారి సంపదలో చాలా తక్కువ మొత్తాన్ని దానం చేస్తే భూమ్మీద ఆకలి సమస్య ఉండదన్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) వ్యాఖ్యలపై స్పేస్ ఎక్స్ ఫౌండర్, బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. ఈ క్రమంలో యూఎన్డబ్ల్యూఎఫ్పీకి ఓ సవాలు విసిరారు ఎలన్ మస్క్. ఆకలి సమస్యను పరిష్కరించడానికి యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ మంచి ప్రణాళికతో వస్తే తాను 6 బిలియన్ డాలర్లు(4,49,13,30,00,000 రూపాయలు) ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఎలన్ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ సంస్థ డైరెక్టర్ సీఎన్ఎన్తో మాట్లాడుతూ.. ‘‘మస్క్ లేదా ఇతర ప్రపంచ కుబేరుల సంపదలో కేవలం 2 శాతం దానం చేస్తే ప్రపంచంలో ఉన్న ఆకలి సమస్యను తీర్చవచ్చు’’ అన్నారు. సీఎన్ఎన్లో వచ్చిన ఈ వార్త కథనం క్లిప్పింగ్‌ని ఎలన్ మస్క్ సంస్థ సహా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎలి డేవిడ్ ట్వీట్ చేశారు. (చదవండి: ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్..! నీ రాక..వారికి శాపమే..!) ఎలి డేవిడ్ ట్వీట్‌పై మస్క్ స్పందిస్తూ.. ‘‘6 బిలియన్ల సంపదతో ప్రపంచ ఆకలిని ఎలా తీర్చగలదో యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ఇక్కడ ట్విటర్ థ్రెడ్‌లో నాకు తెలిపితే.. నేను ఇప్పుడే టెస్లా స్టాక్‌ను అమ్మి.. ఆ మొత్తాన్ని దానం చేస్తాను’’ అన్నారు. అంతేకాక ఈ డబ్బును ఎలా వినియోగిస్తున్నారనే దాని గురించి ప్రజలకు బహిరంగ పర్చాలని.. ఒపెన్‌గా ఉండాలని సూచించారు మస్క్. యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ.. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ల మంది సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ఈ అంశంపై యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లీ.. ‘‘మస్క్ తన సందలో కేవలం 2 శాతం దానం చేస్తే.. 42 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు. వీరంతా ఆకలితో అలమటిస్తున్నారు. మనం వారిని ఆదుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’’ అని తెలిపారు. (చదవండి: ఎలన్ నువ్వు అసాధ్యుడివయ్యా..! అనుకుంటే ఏదైనా చేస్తావ్..!) తన వ్యాఖ్యలపై బిస్లీ మరింత వివరణ ఇస్తూ.. ‘‘ఈ బిలియనీర్ల సంపద ప్రపంచ ఆకలిని తీర్చుతుందని మేం చెప్పడం లేదు. ఒక్కసారి ఇచ్చే ఈ మొత్తం.. ప్రస్తుతం ఆకలి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న 42 మిలియన్ల మందిని కాపాడగలదు. 155 మిలియన్ల మంది ఆకలి తీర్చాలంటే 8.4 బిలియన్ల సంపద కావాలి’’ అన్నారు. చదవండి: ఎలన్‌మస్క్ నంబర్ 1 ధనవంతుడయ్యాడంటే కారణమిదే - ఆనంద్ మహీంద్రా -
ఆ ‘వైరస్’ తో నిమిషానికి 11 మంది మృతి
వెబ్‌డెస్క్: ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా. అయితే కరోనాను మించిన మరో మహమ్మారి చాప కింద నీరులా భూమ్మీద దేశాలను పట్టి పీడిస్తోంది. కరోనాను మించిన మరణాలు ఈ మహమ్మారి కాటుకు గురవుతున్నాయి. కరోనాను మించిన ఆ భయంకర వైరస్ పేరు ఆకలి. అవును ఆక్స్ ఫాం అనే సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలు ఆకలి చావులు పెరిగినట్టు తేలింది. ఆకలిరాజ్యం పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ ఆకలి వైరస్ ఎక్కువైంది పేరిట విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఈ నివేదిక ప్రకారం ఈ భూమ్మిదీ నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక, తినడానికి తిండి లేక చనిపోతున్నారని తేలింది. కరోనాను మించి ఇవ్వాళ ‘ద హంగర్ వైరస్ మల్టిప్లైస్ (ఆకలి వైరస్ అధికమైంది)’ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే.. ఆకలితో 11 మంది ఊపిరి వదులుతున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభంలో 15.5 కోట్ల మంది చిక్కుకున్నారని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 2 కోట్ల మంది ఎక్కువగా ఆకలి బారిన పడ్డారని తెలిపింది. సైనిక సంక్షోభం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారేనని తెలిపింది. వీరికి తినడానికి బుక్కెడు బువ్వ దొరకట్లేదు. ఆకలి వారి ప్రాణాలను తోడేస్తోంది. రోజూ వందలాది మందిని కబళిస్తోంది. మరోవైపు కరోనా కారణంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేద ప్రాంతాలకు అందుతోన్న సాయం కూడా తగ్గుతోంది. సైన్యంపైనే ఖర్చు కరోనా, లాక్ డౌన్ లతో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి యుద్ధ వాతావరణం తోడు కావడంతో సుమారు 5.2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారని ఆక్స్ ఫాం ఆవేదన వ్యక్తం చేసింది. చాలా దేశాలు కరోనా ఉన్నా యుద్ద పరిస్థితుల కారణంగా తమ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాల పటిష్ఠత కోసం ఖర్చు చేయక తప్పలేదని వెల్లడించింది. ఈ ఖర్చు రూ. 5,100 కోట్ల డాలర్లు దాటిందని.... పేదల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్న దాని కన్నా ఇది ఆరు రెట్లు ఎక్కువని తేల్చి చెప్పింది. అంతర్ యుద్దాలతో ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ వంటి అంతర్ యుద్దాల్లో చిక్కుకున్న దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాబిన్నమైందని, దాంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం వరకు పెరిగాయని సూత్రీకరించింది. ఈ దశాబ్దంలోనే ధరల పెరుగుదలలో ఇదే అత్యధికమని ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితంగా నిరుపేదలు ఆకలి రాజ్యంలోకి నెట్టివేయబడుతున్నారని పేర్కొంది. -
ఉపాధి లేక ఆకలి చావు
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): కరోనాతో ఉపాధి లేక ఓ వ్యక్తి ఆకలితో మృతి చెందిన సంఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన బద్దారం కిష్టయ్య(40) గత కొద్ది సంవత్సరాలుగా పట్టణంలోని ఓ హోటల్లో పని చేస్తు జీవిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వ్యాపిస్తుండడంతో హోటల్ నిర్వహణ సరిగా లేక పోవడంతో దొరికిన చోట పని చేస్తు జీవిస్తున్నాడు. పట్టణంలో ఇటీవల వైరస్ ఉధృతి పెరగడంతో గత నెల 24 నుంచి 31 వరకు పూర్తిగా లాక్డౌన్ ఉండడంతో ఎక్కడ పని దొరకక, హోటల్ నడవక పోవడంతో ఆకలిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ప్రతి రోజు ప్రభుత్వ ఆస్పత్రి పాత భవనం వద్ద పడుకునే వాడని స్థానికులు తెలిపారు. ఆదివారం ఉదయం వరకు కిష్టయ్య నిద్ర లేవక పోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మృతుడి అన్నదమ్ములకు సమాచారం అందించడంతో వారు వచ్చి కిష్టయ్య మృత దేహాన్ని తీసుకుని వెళ్లారు. అన్నాసాగర్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
కరోనా ఉనికిని అంగీకరించాల్సిందే!
బెంగళూరు: లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు కొనసాగించడం సరికాదని ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. అలా చేస్తే.. కోవిడ్–19 మరణాల కన్నా ఆకలితో చనిపోయేవారి సంఖ్య ఎక్కువవుతుందని హెచ్చరించారు. ఇకపై కరోనా ఉనికిని అంగీకరించక తప్పదని స్పష్టం చేశారు. సాధారణ స్థితికి వెళ్లక తప్పదని, ఆరోగ్యవంతులు తమ విధులను నిర్వర్తించాలని, అదే సమయంలో, వైరస్ ప్రభావం తీవ్రంగా పడే వ్యక్తులను కాపాడుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. ‘లాక్‌డౌన్‌ను ఎక్కువ కాలం కొనసాగించకూడదు. అదే జరిగితే కోవిడ్‌తో కన్నా ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి తలెత్తుతుంది’ అని ‘ఎకనమిక్ టైమ్స్’ బుధవారం నిర్వహించిన ‘ఈటీ అన్వైర్డ్– రీఇమాజినింగ్ బిజినెస్’ అనే వెబినార్‌లో దేశ ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. -
చావడం ఖాయం..ఆకలి పాట
-
కరోనా నుంచి తప్పించుకున్నా.. చావడం ఖాయం
అంతకంతకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఎంత కలవరపెడ్తున్నాయో.. లాక్డౌన్ నేపథ్యంలో వలస కులీల ‘లాంగ్‌మార్చ్’ కూడా అంతే కలవరపెడ్తోంది. మన దేశంలో కరోనా మరణాల కంటే లాక్డౌన్ వల్ల ఆకలి చావులే ఎక్కువగా నమోదవుతాయి అని నిపుణులూ అంటున్నారు. ‘వలస కార్మికులంతా ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండిపోండి.. నిత్యావసర సరకులతోపాటు కొంత డబ్బూ అందజేస్తాం’ అని రాష్ట్రప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభత్వమూ ప్రకటించింది. అయినా చాలా మంది వలస కూలీలు భయాందోళనలకు గురవుతున్నారు. అన్నం దొరక్క తల్లడిల్లిపోతున్నారు. అప్పటికి మొన్న (14, ఏప్రిల్) ప్రధాని ప్రసంగం వరకు ఓపిక పట్టారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్టు ప్రధాని చెప్తారేమోనని ఆశపడ్డారు. (ఆకలితో 8 ఏళ్ల బాలుడి మృతి) కనీసం వెసులుబాటైనా కల్పిస్తారేమోననే మాట కోసం ఎదురుచూశారు. అలాంటిదేమీ ప్రధాని నోట వినపడకపోయే సరికి నిరాశ చెందారు. నిస్పృహకు లోనయ్యారు. ముంబైలో దాదాపు 20 వేల మంది వలస కార్మికులు ఒక్కసారిగా బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. మనసున్న వాళ్లను కదిలించే.. కలచివేసే సంఘటన ఇది. అంతకుముందే వందల మంది కార్మికులు నడక మొదలుపెట్టారు వాళ్ల ఇళ్లకు చేరుకోవడానికి. గమ్యం చేరుకోకముందే దాదాపు రెండువందల మంది అసువులుబాశారు. వీటన్నిటితో కలత చెందిన కవి... సంగీతకారుడు పూజన్ సాహిల్ ‘భూఖ్ ( ఆకలి)’ పేరుతో ఓ పాటరాసి సంగీతం సమకూర్చి.. వలస కూలీల కాలి బాట దృశ్యాలతో వీడియో సాంగ్‌గా మలిచాడు. ‘జో బీమారి సే బచే, తో భూఖ్ సె మర్‌జాయేంగే.. (కరోనా నుంచి తప్పించుకున్నా ఆకలితో చావడం ఖాయం) అని సాగే ఈ లెటెస్ట్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సమృద్ధి వెలుగులో ఆకలి నీడలు
దేశంలోని అదనపు ఆహార నిల్వల సంచులను ఒకదానిపై ఒకటిగా పేర్చుకుంటూ పోతే వాటిపై నడుచుకుంటూ చంద్రుడి వద్దకు వెళ్లి మళ్లీ తిరిగిరావచ్చు. పైగా మన ఆహార నిల్వలు రానురాను పెరుగుతూనే ఉన్నాయి. ఇంత సమృద్ధిగా ఆహార నిల్వలు ఉన్నప్పటికీ పొరుగు దేశాల్లోకంటే ఆకలి బాధా సూచికలో భారత ర్యాంకు ఘోరంగా పడిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఆహారోత్పత్తిలో, అదనపు మిగులులో రికార్డులన్నింటినీ బద్దలు చేస్తున్న భారత్‌లో ప్రతిరోజూ 2,400 మంది చిన్నారులు రకరకాల పోషకాహార లేమితో అల్లాడుతూ మృత్యువాత పడుతుండటం సమృద్ధి వెనుక దాగిన చీకట్లను స్పష్టంగా చూపుతోంది. ప్రతి ఏటా 8 లక్షల మంది పిల్లలు ఆకలిదప్పులతో కన్నుమూస్తున్న స్థితిలో, జనాభాలో అధిక శాతానికి తగిన పోషకాహారం లేని నేపథ్యంలో భారత్ ఆర్థిక అగ్రరాజ్యంగా మారాలనే కలను ఎన్నటికీ సాకారం చేసుకోలేదు. సమృద్ధికి సంబంధించిన ఈ వింత పరామితి ఇప్పటికీ ఊహకు అందనివిధంగానే ఉంటోంది. ఒకవైపున దేశంలో గోధుమ నేలలు విస్తారమైన పంట లతో కళకళలాడుతుండగా మరోవైపున ప్రపంచ క్షుద్బాధా సూచి (జీహెచ్ఐ) భారత్‌కు అకలితో అలమటించిపోతున్న 117 దేశాల్లో 102వ స్థానమిచ్చింది. ఇది చాలదన్నట్లుగా, తాజా యూనిసెఫ్ నివేదిక అయిదేళ్లలోపు పిల్లలు అధిక మరణాల పాలవుతున్న దేశాల జాబితాలో భారత్‌ను చేర్చింది. గత ఏడాది భారత్‌లో 8.82 లక్షలమంది చిన్నపిల్లలు మరణించారని యూనిసెఫ్ నివేదించింది. ఒకవైపున వినియోగదారీ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తనకు తలకు మించిన భారంగా తయారవుతున్న ఆహారధాన్యాల నిల్వలను కాస్త తగ్గించి పుణ్యం కట్టుకోవలసిందిగా భారత విదేశాంగ శాఖను వేడుకుంటోంది. భారత ఆహార సంస్థ వద్ద పేరుకుపోతున్న ఆహార ధాన్యాలలో అదనపు నిల్వలను ప్రపంచంలో అవసరమైన దేశాలకు అందించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఈ మంత్రిత్వ శాఖ భారత విదేశాంగ శాఖను కోరింది. విచిత్రం ఏమిటంటే దేశంలో 6 నుంచి 23 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్లో 90 శాతం మందికి తినడానికి తగినంత ఆహారం లేక అల్లాడిపోతున్న పరిస్థితుల్లో మన ఆహార ధాన్యాల నిల్వలను బయటిదేశాలకు పంపవలసిందిగా వేడుకోవడమే. ఆకలి, పోషకాహార సమస్యను తీవ్రతరం చేస్తూ మన అమూల్య వనరులైన పిల్లల జీవితాల్లో నిశ్శబ్ద విషాదాన్ని సృష్టిస్తుండగా, బయటిదేశాలకు మానవీయప్రాతిపదికన ఆహార నిల్వలను అందించాలన్న ప్రతిపాదన కంటే మించిన అభాస మరొకటి ఉండదు. దేశంలో ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు తగిన తిండి లేకుండా బక్కచిక్కిపోతున్న వాస్తవం తెలిసిన విషయమే. అక్టోబర్ 1 నాటికి 307.70 లక్షల టన్నుల ఆహార ధాన్యాల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా భారత ఆహార సంస్థ ఇప్పటికే రెట్టింపు స్థాయిలో 669.15 లక్షల టన్నుల వరి, గోధుమ పంటను సెప్టెంబర్ 1 నాటికే సేకరించింది. వరి పంట ఇప్పుడు తారస్థాయిలో పోగవుతున్న స్థితిలో రాబోయే కొద్ది వారాల్లో కేంద్ర ఆహార నిల్వల గిడ్డం గులు ధాన్య సమృద్ధితో పొంగిపొరలనున్నాయి. దీనికితోడుగా దేశంలో 2018–19 సంవత్సరంలో పళ్లు, కూరగాయలు 314.5 మిలి యన్ టన్నులకు పోగుపడ్డాయి. ఇక పాల ఉత్పత్తి 176 మిలియన్ టన్నులతో రికార్డు సృష్టించింది. అంటే దేశంలో పోషకాహారానికి కొరతే లేదని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఆహార ధాన్యాలను ఇంత సమృద్ధిగా నిల్వ ఉంచుకున్న దేశంలో అత్యధిక జనాభా ఆకలితో అలమటిస్తుండటం కంటే మించిన అసందర్భం ఉండదు. దీన్ని మరింత సులువుగా చెప్పుకుందాం. దేశంలోని అదనపు ఆహార నిల్వల సంచులను ఒకదానిపై ఒకటిగా పేర్చుకుంటూ పోతే వాటిపై నడుచుకుంటూ చంద్రుడి వద్దకు వెళ్లి మళ్లీ తిరిగిరావచ్చు. ఇంత సమృద్ధికరంగా ఆహార నిల్వలు ఉన్నప్పటికీ పొరుగు దేశాల్లోకంటే ఆకలి బాధా సూచికలో భారత ర్యాంకు ఘోరంగా పడిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కెనడా తన రికార్డును మెరుగుపర్చుకుని అంతర్జాతీయంగా 25వ ర్యాంకులో నిలబడగా, బ్రిక్స్ దేశాలన్నిటికంటే భారత్ వెనుకబడిపోయింది. శ్రీలంక (66), నేపాల్ (73), బంగ్లాదేశ్ (88), పాకిస్తాన్ (94) ర్యాంకులతో మనకంటే ఎంతో మెరుగ్గా ఉండగా, చివరకు వెనిజులా (65), ఉత్తర కొరియా (92), ఇథియోపియా (93) ర్యాంకులతో మనల్ని అధిగమించటం బాధాకరం. నిజానికి, 2006 నుంచి ప్రపంచ క్షుద్బాధా సూచిని ప్రకటిస్తుండగా, 14 రిపోర్టుల తర్వాత కూడా భారత్ ఆకలి, పోషకాహార లేమి సంబంధించి ఏమాత్రం మెరుగుపడలేదు. ఇది మన ప్రాధాన్యతల ఎంపికకు సంబంధించిన సమస్య. కొన్నేళ్లుగా అత్యధిక ఉత్పాదకతను సాధించడంపైనే మన విధాన నిర్ణేతల దృష్టి ఉంటూ, దేశంలో ప్రబలుతున్న ఆకలిని, పోషకాహార లేమిని తేలికగా పక్కనపెడుతూ వస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అధికంగా అభివృద్ధి చెందితే ఆకలిదప్పులతో జీవిస్తున్న వారి జనాభా దానికదే తగ్గిపోతుందనే ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతా దృక్పథాన్ని దేశంలో కంటికి కనబడే ఆకలి, కనిపించకుండా మరుగున ఉండే ఆకలి రెండూ వెక్కిరిస్తూ వస్తున్నాయి. పైగా, ఆర్థిక వ్యవస్థ పెరుగుదలతోపాటే ఆకలి, పోషకాహార లేమి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పోషకాహార లేమిని ‘జాతీయ అవమానం’గా భావించాలని ప్రకటించినా పరిస్థితిలో మార్పు లేదు. ఆకలిని తొలగించడం సంక్లిష్టమైన, సవాలుతో కూడిన కర్తవ్యమని అర్థం చేసుకుంటాను కానీ గత కొన్నేళ్లుగా పిల్లల పోషకాహార లేమి, ఆహార దుబారా వంటి అంశాల్లో దేశం ప్రగతి సాధించి ఉంటే ఆకలి చరిత్రను నివారించడం అనే భారీ లక్ష్యం అసాధ్యమై ఉండేది కాదు. జనాభాలోని మూడింట రెండొంతుల మందికి సబ్సిడీ కింద ఆహార ధాన్యాలను అందించే లక్ష్యంతో 2013 జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకురావడమే కాకుండా, పిల్లల్లో పోషకాహార లేమితో తలపడేందుకు, ఆకలిని నిర్మూలించేందుకు అనేక పథకాలను కేంద్ర స్థాయిలో ప్రవేశపెట్టినప్పటికీ సూక్ష్మ ఆర్థిక విధానాలలో.. వీటిని సాధించాల్సిన లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకోలేదు. పైగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు కూడా అలా ఆహార సబ్సిడీలను పెంచడం వల్ల ద్రవ్యలోటు పెరిగిపోతుందని మన జాతీయ స్రవంతి ఆర్థికవేత్తలు నిరసన గళం వినిపించారు. తీవ్రమైన దారిద్య్రాన్ని, ఆకలిని నిర్మూలించేందుకు నాటి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా 2003లో ప్రారంభించిన ‘జీరో హంగర్’ (సంపూర్ణంగా ఆకలిని నిర్మూలించడం) కార్యక్రమంతో భారత్ విధానాలను పోల్చి చూద్దాం. జీరో హంగర్ కార్యక్రమం కింద వ్యవసాయంలో వ్యవస్ధాగతమైన మార్పులను నాటి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం కింద 2011 నాటికే బ్రెజిల్లో దాదాపు మూడు కోట్ల 20 లక్షలమంది ప్రజలు (జనాభాలో 16 శాతం) దారిద్య్రం కోరల నుంచి బయటపడ్డారని ప్రముఖ పత్రిక ‘ది గార్డియన్’ పేర్కొంది. దీనికి ‘బోల్సా ఫ్యామిలియా’ వంటి నగదు బదిలీ పథకాలు తోడై జనాభాలో పావు శాతం పైగా ప్రజలకు నిజంగా ఊతమిచ్చాయి. ఆహార భద్రత, విద్య, వైద్యాలను అందుబాటులో ఉంచడం, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి వాటి కలయికే బోల్సా ఫ్యామిలియా. పర్యవసానంగా కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే బ్రెజిల్ ప్రపంచ క్షుద్బాధా సూచి కలో 18వ ర్యాంకులో నిలిచింది. అంటే ఆకలి నివారణలో చైనాకంటే అగ్ర స్థాయిని బ్రెజిల్ సాధించింది. సారాంశంలో బ్రెజిల్ అమలు పర్చిన జీరో హంగర్ విధానాలు ఆహారోత్పత్తిని ఆకలి నిర్మూలనతో ముడిపెట్టడంలో విజయవంతమయ్యాయి. ఈ పథకంలోనూ కొన్ని తేడాలు ఉండవచ్చు కానీ, ఆకలిని పూర్తిగా నిరోధించడానికి బ్రెజిల్ ఇప్పటికీ నిర్ణీత గడువుతో కూడిన పథకాలను అమలు చేస్తోంది. భారత్‌లో ఆహార ఉత్పత్తిని పెంచడంపైనే పాలకుల విధానాలు దృష్టి పెడుతూ ఆహారధాన్యాలు తక్కువగా ఉంటున్న ప్రాంతాలకు అదనపు ఆహార నిల్వలను తరలించే పద్ధతిని అమలుచేస్తూ ఉన్నప్పటికీ, రైతుల సంక్షేమానికి మాత్రం ఏ ప్రభుత్వమూ ప్రాధాన్యత ఇచ్చిన చరిత్ర లేదు. వ్యవసాయంలో 60 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటున్న దేశంలో జీరో హంగర్ని సాధించడానికి చేసే ఏ పథకమైనా వ్యవసాయాన్ని మౌలికంగా పునరుద్ధరించాల్సి ఉంటుంది. వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచవలసి ఉంది. అయితే ఆర్బీఐ ప్రకారం 2011–12 నుంచి 2016–17 మధ్య ప్రభుత్వరంగ సంస్థలు వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు మన స్థూల దేశీయోత్పత్తిలో 0.4 శాతం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఆకలితో, పోషకాహార లేమితో పోరాడ్డానికి సంబంధించి లెక్కలేనన్ని వాగ్దానాలు చేశారు. హామీలు గుప్పిం చారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, భారత్‌లో ప్రతి రోజూ 2,400 మంది చిన్నారులు రకరకాల పోషకాహార లేమితో అల్లాడుతూ మృత్యువాత పడుతుండటమే. దేశంలో జరుగుతున్న ఈ భారీ మానవ విషాదానికి.. పిల్లల నోటికి సరైన మోతాదులో మనం ఆహారాన్ని అందించకపోవడమే కారణం. ఆహార ఉత్పత్తిలో కొరత లేదు. ఆర్థిక విధానాలను ప్రకటించి అమలుచేసే సామర్థ్యంలో కొరత లేదు. కానీ, ఆకలిని తొలగించడానికి బలమైన రాజకీయ సంకల్పం నిజంగా కరువైపోయింది. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది పిల్లలు ఆకలిదప్పులకు తాళలేక కన్నుమూస్తున్న స్థితిలో, జనాభాలో అధిక శాతానికి తగిన పోషకాహారం లేని నేపథ్యంలో భారత్ ఆర్థిక అగ్రరాజ్యంగా మారాలనే కలను ఎన్నటికీ సాకారం చేసుకోలేదు. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ :hunger55@gmail.com -
ఆకలి రాజ్యం
ఛిఏమిటీ.. మీరు ప్రపంచంలో ఆకలి లెక్కలు వేసి మాకు చెబుతారా? త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి... ఆకలి రాజ్యమా. ఏం లెక్కలివి? ఎవరి లెక్కలివి? అయిదేళ్లు నిండని పాపలకు మేం సరిగా అన్నంపెట్టడం లేదా? ఆర్నెల్ల పసికందుల నుంచి రెండేళ్ల పాపలలో 84 శాతం మందికి మేం కనీస తిండి కూడా పెట్టడం లేదా? అద్భుతంగా వెలిగిపోతున్న మా దేశాన్ని అంతర్జాతీయంగా పరువు దీయడానికేనా ఈ మాటలు. మొత్తం 119 దేశాలలో మాదేశం 102 రెండవస్థానంలో ఉందన్నా ఫరవాలేదు. దక్షిణాఫ్రికా కన్నా హీనంగా ఉన్నామన్నా సర్దుకుంటాం. కానీ బాంగ్లాదేశ్ కన్నా, చిన్నిచిట్టి దేశం నేపాల్ కన్నా మేం తీసిపోయామా? 2015లో మా దేశానికి కింద పాకిస్తాన్ ఉందని మీరే చెప్పారు. మాకు 93వ ర్యాంకు ఇచ్చి పాక్‌కు 106 ఇచ్చారు. అది న్యాయం. ఆకలి మంటల్లో మేం ఎక్కడున్నా సరే పాకిస్తాన్ కన్నా ముందున్నాం అని అప్పటినుంచి మేం సంతోషిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాకు ఆ అపరిమితానందం కరువుచేస్తారా? మా దాయాది, మా శత్రువు, వారి పేరు చెబితే చాలు మాకు ఓట్లు కుప్పలు తెప్పలుగా పడతాయి. మావాళ్లే ప్రతిసారీ గెలిచినా సరే మేం వారితో క్రికెట్ ఆడనే ఆడం. అటువంటి పాకిస్తాన్ కన్నా మాదేశాన్ని 8 అడుగుల కిందకు తోస్తారా? 2016లో మాకు 97, పాక్‌కు 107 ఇచ్చారు, 2017లో మాకు 100, మా దాయాదికి 106 ఇచ్చారు. ఫరవాలేదు. చివరకు పోయినేడాది 2018లో పాక్‌కు 106 ఇచ్చి మాకు 103వ ర్యాంకు ఇచ్చారు. అదే కరెక్టు. ఈసారి మా ర్యాంక్‌ను 103 నుంచి 102 చేశారు. మాకది పెద్ద ప్రమోషనే కదా అని సంతోషిద్దామనుకున్నాం. కాని పాక్‌కు 93వ ర్యాంక్ ఇచ్చి మమ్మల్ని అవ మానించారు. కనీసం పాక్‌కన్నా ముందున్నాం అని చెప్పినా మిమ్మల్ని క్షమించే వాళ్లం. మీరు టెర్ర రిస్టుల్లో కలిసిపోయారా లేక మా దేశంలో అర్బన్ నక్సలైట్లు మీమీద ఏమైనా మత్తుమందు జల్లారా? మాకు చెత్త ర్యాంకు ఇస్తే ఇచ్చారని సరిపెట్టుకుందామనుకుంటే, బంగ్లాదేశ్‌ను తెగ మెచ్చుకుంటారా? బాలబాలికలకు పోషకాహారం ఇచ్చే బుద్ధి వారికి ఎక్కువగా ఉందా, పరిశుభ్రత కల్పించడంలో, ప్రచారంలో, ఆరోగ్యం రక్షించడంలో బంగ్లాదేశ్‌కు అన్ని మార్కులు, పక్కనే ఉన్న మా దేశానికి మరీ అంత తక్కువ మార్కులు? వేస్తారా? మాకన్నా చిన్న దేశం నేపాల్‌ను అంతగా పొగి డారు. సరే అది మా హిందూ రాజ్యం గనుక ఫరవాలేదు. కాని మరీ అన్ని ప్రశంసలా? 2000 సంవత్సరం తరువాత నేపాల్ వారు ఆకలి మీద యుద్ధంలో చాలా ముందుకు వెళ్లారంటారా? మేమేమీ చేయలేదంటారు. మా దేశంలో చాలామంది పిల్లలు పురిట్లోనే పోయారంటారా? పిల్ల లకు ఎత్తుకు తగిన బరువు, వయసుకు సరిపోయే ఎత్తు లేదంటారా? ఏం మా పిల్లల్ని ఎప్పుడైనా ఎత్తుకున్నారా? లేకపోతే మీకెలా తెలుస్తుందో? మేం స్వచ్ఛభారత్ ద్వారా పారిశుధ్యం చాట డం లేదా, బహిర్భూమిలో విసర్జన మీద యుధ్దం ప్రకటించి, బోలెడు మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం కదా, అంతర్జాలం డాష్‌బోర్డులో క్లిక్ కొడితేచాలు ఏ ఊళ్లో ఎన్ని మరుగుదొడ్లు కట్టామో లెక్క చూసుకునే అద్భుతమైన, అదిరిపోయే పారదర్శక పాలనా విధానాన్ని తీసుకువచ్చాం. మేం ఎంత పారదర్శకంగా ఉన్నామంటే అసలు మాకు ఆర్టీఐతో పనే లేదు తెలుసా. అందుకే మేం మా సమాచార కమిషనర్లకు అంత పెద్ద ర్యాంకు ఎందు కని తగ్గించి పడేశాం. మీరు మా ఆకలి ర్యాంకు పెంచుతారా? మాదేశంలో ప్రతి శుక్రవారం వందల సినిమాలు విడుదల అవుతాయి. వాటిలో బోలెడు సినిమాలు వందల కోట్లు సంపాయిస్తున్నాయి. అయినా మాదేశంలో ఆర్థిక మాంద్యం ఉందని తప్పుడు ప్రచారం చేసి ఫేక్ న్యూస్ పంచుతున్నారని మేం జనానికి నచ్చజెప్పుకుంటున్నాం. కొత్తగా ఈ ఆకలి అంకెల పంచాయతీ ఏమిటి? ఆకలిమంటలు పెరిగాయనే అనుకుందాం. దానికి మేమా కారణం. పర్యావరణ వాతావరణ మార్పులు, భూమి వేడెక్కడం కావచ్చు, పాక్– చైనా సమష్టి కుట్ర కావచ్చు. కమ్యూనిస్టులు తెచ్చిన విదేశీ హస్తం కావచ్చు. పటేల్‌ను పక్కన బెట్టి ప్రధాని అయిన నెహ్రూ రాజకీయ కుట్ర కావచ్చు. మేం మాత్రం కాదు. మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికల సమయంలో ఇదేదో కొత్త కుట్ర అయి ఉంటుంది. మీ ఆకలి లెక్కలు, మా డబ్బుల లెక్కలు చెప్పి మా జనాన్ని భయపెట్టాలని చూడకండి. 370 మాకు చాలు. ఆకలట ఆకలి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఎన్నాళ్లీ ఆకలిమంటలు!
మన దేశం 1951 మొదలుకొని 2017 వరకూ పన్నెండు పంచవర్ష ప్రణాళికలు చూసింది. అటుపై ప్రణాళికా సంఘం కన్నుమూసి నీతి ఆయోగ్ రంగంలోకొచ్చింది. ఆరేళ్లక్రితం ఆహార భద్రతా చట్టం వచ్చింది. వీటన్నిటికీ తోడు నిరుపేదల బతుకులు బాగు చేయడానికంటూ అనేకానేక సంక్షేమ పథ కాలు అమలవుతున్నాయి. ఇన్ని ఉంటున్నా, ఇవన్నీ ఘన విజయం సాధిస్తున్నాయని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నా ఆకలి భూతాన్ని మట్టి కరిపించడంలో ఘోర వైఫల్యం తప్పడం లేదని బుధవారం వెల్లడైన అంతర్జాతీయ నివేదికలోని గణాంకాలు చాటుతున్నాయి. పట్టెడన్నం మెతుకులు దొరక్క అలమటిస్తున్న అభాగ్యులు దేశంలో అధికంగానే ఉన్నారని ఆ గణాంకాలు చెబుతున్నాయి. వాటి ఆధారంగా రూపొందించిన ప్రపంచ ఆకలి సూచీలో తాజాగా మన స్థానం 102. నిరుటితో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడ్డామని, 103 నుంచి కాస్త ఎగబాకామని సంతోషించాలో పొరుగునున్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల కన్నా ఇంకా తీసికట్టుగానే ఉన్నామని బాధపడాలో తోచదు. 2030 నాటికల్లా ఈ భూగోళంపై ఆకలనేదే ఉండరాదని నాలుగేళ్లక్రితం ఐక్యరాజ్యసమితి నిర్దేశిం చింది. అది ఖరారు చేసి, అన్ని దేశాలూ ఆమోదించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆకలిని అంతం చేయడం ఒకటి. కేవలం తిండి దొరకకపోవడం మాత్రమే కాదు...లభించే ఆహారంలో తగినన్ని కేల రీలు లేకపోవడాన్ని కూడా ఈ అధ్యయనం ఆకలిగానే పరిగణిస్తోంది. దేశంలో ఆర్నెల్ల పిల్లలు మొద లుకొని 23 నెలల వయసుండే చిన్నారుల వరకూ చూస్తే వారిలో కేవలం 9.6 శాతంమందికి మాత్రమే కనీస ఆహార అవసరాలు తీరుతున్నాయని ఆ నివేదిక లెక్కేసింది. జనాభారీత్యా చూస్తే మన దేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. కానీ అది మనకన్నా అన్నింటా దూసుకెళ్తోంది. మన దేశంలో 2017–18లో 27.50 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ఇది ప్రపంచ ఉత్పత్తిలో 25శాతం. పాల ఉత్పత్తిలో మనది అగ్రస్థానం. అది 16.5 కోట్ల టన్నులు. ఇలా సమృద్ధిగా ఆహారధాన్యాల ఉత్పత్తి ఉన్నా అన్నార్తుల సంఖ్య అధికంగానే ఉండటం ఆందోళన కలిగించే అంశం. దేశ జనాభాకు కడుపు నిండా తిండి కావాలంటే దాదాపు 23 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవసరమని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనం మిగులులో ఉన్నాం. పండ్లు, కాయగూరల ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే ద్వితీయ స్థానంలో ఉన్నాం. అయినా అయిదేళ్లలోపు పిల్లల్లో తగినంతగా పౌష్టికాహారం లభించక, పారిశుద్ధ్యం సక్రమంగా లేక వ్యాధుల బారిన పడి మరణిస్తున్నవారు 69 శాతమని బుధవారమే వెల్లడైన యునిసెఫ్ నివేదిక కూడా తెలిపింది. పిల్లల్లో తగినంత ఎదుగుదల లోపించడం, వయసుకు తగినట్టుగా బరువు, ఎత్తు లేకపోవడం వంటివన్నీ పౌష్టికాహారలోపంవల్లే ఏర్పడుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఈ కారణంగానే పిల్లల్లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. మరణాన్ని తప్పిం చుకున్న పిల్లలు సైతం సక్రమమైన ఎదుగుదల లోపించి శారీరక, మానసిక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదంటే ఎక్కడ వైఫల్యం ఎదురవుతున్నదో సమీక్షించుకోవాలి. శిశు మరణాలు గతంతో పోలిస్తే మన దేశంలో తగ్గాయి. 2006లో ప్రతి వెయ్యిమంది శిశువులకూ 57 మరణాలుంటే 2017నాటికి ఆ సంఖ్య 33కి తగ్గింది. అయితే ప్రపంచ గణాంకాలరీత్యా ఇంకా ఇది ఎక్కువగా ఉన్నట్టే లెక్క. పశ్చిమ ఆఫ్రికా దేశం సెనెగల్‌లో వెయ్యిమంది శిశువులకూ 29.4 మరణాలు సంభవిస్తున్నాయి. అంటే దాంతో పోల్చినా మనం వెనకబడ్డాం. గతంతో పోలిస్తే మెరుగుదల కని పించినా, కొన్ని రాష్ట్రాలు చాలా విషయాల్లో వెనకబడే ఉంటున్నాయి. శిశు మరణాల రేటు కొన్ని చోట్ల బాగా తగ్గితే కొన్ని ఇంకా యధాతథ స్థితిలో ఉంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాం, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు పలు అంశాల్లో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే బాగా వెనకబడి ఉన్నాయి. పోషణ్ అభియాన్ కింద అయిదేళ్లలో అంటే... 2022 కల్లా దేశంలో పౌష్టికాహార లోపాన్ని గణనీయంగా తగ్గించాలని 2017లో నిర్ణయించారు. దాని ప్రకారం తగినంతగా బరువులేని నవజాత శిశువులు, పిల్లల సంఖ్యలో ఏటా 2 శాతం తగ్గుదల కనబడాలని నిర్దేశించారు. కానీ అయిదేళ్లలో సాధించదల్చుకున్న లక్ష్యానికి ఇది ఏమాత్రం సరిపోదన్నది నిపుణుల భావన. గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారలోపం సృష్టించే సమస్యలతోపాటు పట్టణ ప్రాంతాల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సైతం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వారు తీసుకునే ఆహారంలో తగినన్ని మాంసకృత్తులు లేకపోవడం, శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే బలవర్థకాలు లేకపోవడం వంటి కారణాల వల్ల సమస్యలెదురవుతున్నాయి. ఆదాయం ఎంతో కొంత మెరుగ్గా ఉన్న వర్గాల్లో సైతం పిల్లల స్థితి ఇలా ఉండటం ఆందోళన కలిగించే అంశం. మన దేశంలో అయిదేళ్లలోపు వయసున్న ప్రతి ముగ్గురు పిల్లల్లోనూ ఒకరు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అత్యంత బలహీనులుగా ఉంటున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. దేశ జనాభాలో ఈ పిల్లల సంఖ్య 2 కోట్ల వరకూ ఉంటుందని దాని అంచనా. ప్రపంచ సంస్థలు వెల్ల డించే గణాంకాలన్నీ వాస్తవాలేనని నిర్ధారించనక్కర లేదు. ఆ గణాంకాల సేకరణకు అనుసరించే విధానాలు, వాటిని సేకరించడంలో ఉండే పరిమితులన్నీ నివేదికల రూపకల్పనలో సహజంగానే ప్రభావం చూపుతాయి. కానీ ఏమరుపాటు ఏమాత్రం పనికిరాదు. పరిస్థితులు ఏమంత çసవ్యంగా లేవని మనకు నిత్యం అర్ధమవుతూనే ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా దేశంలో ఆకలి, పేదరికం, అవిద్య వంటివి కనుమరుగు కావడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్నివ్వడంలేదు. 2030నాటి కల్లా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు, సంక్షేమ పథకాలు సమగ్రంగా సమీక్షించుకుని, వాటికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఆకలితో 8 ఏళ్ల బాలుడి మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని బార్వానీ జిల్లాలో హృదయాన్ని కలచివేసే సంఘటన చోటుచేసుకుంది. తినడానికి తిండి దొరక్క ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా అతని కుటుంబంలోని మిగతా ఐదుగురు వాంతులు, డయేరియాతో హాస్పిటల్లో చేరారు. స్థానికుల కథనం ప్రకారం.. ‘గత కొంతకాలంగా రతన్‌కుమార్ కుటుంబానికి తిండి లభించకపోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుంది. కడు పేదరికంలో నివసిస్తున్న ఆ కుటుంబం.. రోజువారి కూలీ పని ద్వారా జీవనం సాగిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా వారికి తినడానికి తిండి లభించలేదు. అందువల్లే ఇలా జరిగింది. వారికి కనీసం ప్రభుత్వం అందించే రేషన్ కూడా లభించడం లేద’ని తెలిపారు. కాగా, ఈ ఘటనపై బార్వానీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అన్షు జావ్లా విచారణకు ఆదేశించారు. గత కొద్ది రోజులుగా వారు ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ అందించే సదుపాయాలు వారికి అందేలా చూస్తామన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
ఆకలిరాజ్యం!
ఇరవై రోజుల్లో దేశమంతా 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతుండగా, ఎక్కడో మారుమూల కాదు... దేశ రాజధాని నగరంలో ముగ్గురు చిన్నారులు పట్టెడన్నం దొరక్క ఆకలికి మాడి మృత్యువాత పడ్డారు. ఈ దుర్వార్త చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇంతగా అభివృద్ధి సాధించిన ఈ దశలో కూడా ఇలాంటి చావులా అని దిగ్భ్రాంతికలగొచ్చు. కానీ న్యూఢి ల్లీలో జరగటం వల్లా... ఒకే కుటుంబంలో ముగ్గురు పసివాళ్లు ప్రాణాలు కోల్పోవటంవల్లా ఈ ఉదంతానికి ప్రాధాన్యత వచ్చిందిగానీ దేశంలో ఈ తరహా మరణాలు సంభవించని రోజంటూ లేదని సామాజిక కార్యకర్తలు చెబుతున్న మాట. నిరుడు అక్టోబర్‌లో విడుదలైన ప్రపంచ ఆకలి సూచీలో 119 దేశాల జాబితా ఉంటే అందులో మన స్థానం 100. మనకన్నా పొరుగునున్న బంగ్లా దేశ్(88), శ్రీలంక(84), మయన్మార్(77), నేపాల్(72) ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఒక్క పాకిస్తాన్ మాత్రం మనకంటే కాస్త వెనకబడి ఉంది. ఎక్కడైనా ఆకలిచావులు సంభవించాయని వార్తలొస్తే మన ప్రభుత్వాలు చాలా నొచ్చుకుంటాయి. ఆకలితో కాదు... అనారోగ్యంతో మరణించారని తేల్చ డానికి ప్రయాసపడతాయి. నిరుడు జార్ఖండ్‌లో పదకొండేళ్ల బాలిక సంతోషి చనిపోయినప్పుడు, ఆ రాష్ట్రంలోనే అంతక్రితం 58 ఏళ్ల సావిత్రిదేవి మరణించినప్పుడు అక్కడి ప్రభుత్వం అవి ఆకలి చావులు కాదు... అనారోగ్యం చావులని వాదించింది. అందుకు పోస్టుమార్టం నివేదికలను సాక్ష్యా లుగా చూపింది. ఒక్క జార్ఖండే కాదు... ఏ రాష్ట్రమైనా ఆ పనే చేస్తోంది. కానీ నిండా పదేళ్లు కూడా లేని ముగ్గురు పిల్లలూ న్యూఢిల్లీలో ప్రభుత్వాలకు ఆ అవకాశం ఇవ్వలేదు. రెండోసారి పోస్టుమార్టం చేయించినా వారి కడుపులు, పేగులూ పూర్తిగా ఖాళీగా ఉన్నాయని తేలింది. తన నలభైయ్యేళ్ల సర్వీసులో ఈ మాదిరి కేసుల్ని ఎప్పుడూ చూడలేదని పోస్టుమార్టం చేసిన వైద్యుడు అన్నాడంటే ఆ పిల్లలు మృత్యువాత పడేముందు అనుభవించిన వేదన ఎటువంటిదో ఊహించుకోవచ్చు. కనీసం ఎనిమిది రోజులనుంచి వారికి తిండి నీళ్లూ లభించలేదని చెబుతున్నారు. తాను అద్దెకు తెచ్చుకున్న రిక్షాను ఎవరో దొంగిలించుకపోవడంతో వారి తండ్రి దిక్కుతోచక, పూట గడవటానికి పని వెతు క్కుంటూ ఎటో వెళ్లాడని స్థానికులు అంటున్నారు. ఆ పిల్లల్ని సాకి కాపాడాల్సిన అమ్మ మతి స్థిమితం తప్పి తన లోకంలో ఉండిపోయింది. పిల్లల మృతదేహాలను తరలిస్తూ ఆసుపత్రి సిబ్బంది తల్లిని కూడా వెంటబెట్టుకు వెళ్తుంటే ‘ఇంత అన్నముంటే పెట్టండ’ంటూ ఆ పిచ్చితల్లి ప్రాథేయ పడింది. పెద్ద పాప వయసు ఎనిమిదేళ్లు దాటలేదు. రెండో పాపకు నాలుగేళ్ల వయసుంటే ఆఖరి చిన్నారికి రెండేళ్లు. మనం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నామని భరోసా ఇవ్వడానికి ప్రభుత్వాలు తరచుగా వృద్ధి రేటును ఉదహరిస్తాయి. ఇంతమందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి బయటపడేశామని ఏటా లెక్కలు ఏకరువు పెడతాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే తామెంత సాధించామో ఘనమైన వాణిజ్య ప్రకటనలతో సమ్మోహనపరిచే ప్రయత్నం చేస్తాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక లెక్క ప్రకారం మన దేశ జనాభాకంతటికీ ఏడాది పొడవునా కడుపు నిండాలంటే దాదాపు 23 కోట్ల టన్నుల ఆహారం అవసరం. కానీ నిరుడు మన ఆహార దిగుబడి దాదాపు 27.5 కోట్ల టన్నులు. అంటే నాలుగున్నర కోట్ల టన్నుల మిగులు సాధిస్తున్నాం. అయినా ఈ దేశంలో ఆకలిచావులు నిత్యకృత్యమవుతు న్నాయి. రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో సంభవిస్తున్న ఆకలిచావుల్లో చాలా భాగం లెక్కకు రావు. మీడియా దృష్టి పడి హడావుడి జరిగినప్పుడు వ్యాధుల కారణంగా మరణించారని చెప్ప డానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. సాధారణంగా ఆకలికి తాళలేనప్పుడు ఒంట్లో సత్తువ తగ్గినప్పుడు విజృంభించే వ్యాధులు ప్రభుత్వాలకు అక్కరకొస్తాయి. మన దేశంలో అంతా బాగానే ఉన్నదని చెప్పడానికి ప్రభుత్వాలు అనేక ఏర్పాట్లు చేసుకున్నాయి. బడికొచ్చే పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకం ఉంది. ఆరేళ్లలోపు పిల్లలకు, గర్భిణులకు, పిల్లల తల్లులకు పౌష్టికాహారం అందించడానికి అంగన్వాడీలున్నాయి. ఇవిగాక బియ్యం, పప్పులు, నూనె, ఉప్పు వగైరాలు చవగ్గా అందించడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ఉంది. వీటిన్నిటికీ మించి అయిదేళ్ల క్రితం మన దేశం ఆర్భాటంగా అమల్లోకి తెచ్చిన ఆహార భద్రతా చట్టం ఉంది. ఇన్ని ఉండగా తలాబ్ చౌక్ ప్రాంతానికి వీటిలో ఏ ఒక్కటీ ఎందుకు పోలేదు? ఆ పిల్లల కుటుంబానికి మాత్రమే కాదు... ఆ చుట్టుపక్కల ఉండే చాలా కుటుంబాలకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. కార్డు కావాలని ఆఫీసుల చుట్టూ తిరిగితే ఏదైనా బిల్లు తీసుకురమ్మంటున్నారని అక్కడివారు ఫిర్యాదు చేస్తున్నారంటే మన ప్రభుత్వాలు ఏరకంగా పనిచేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సమస్త అవసరాలకూ పనికొస్తుందని నమ్మించి ఆధార్‌ను తీసుకొచ్చినా అది ఉంటే చాలదు... బిల్లులు కావాలని ప్రభుత్వ కార్యా లయాలన్నిటా అడుగుతారు. ఎక్కడో బెంగాల్నుంచో, బిహార్నుంచో పొట్టపోసుకోవడానికొచ్చిన కుటుంబాలకు ఇవన్నీ అసాధ్యం గనుక ఏ పథకంలోనూ వారు చేరే అవకాశం ఉండదు. ఏతావాతా సంక్షేమ పథకాలన్నీ కాగితాల్లో నిక్షిప్తమై ఉంటే... సాధారణ పౌరులు ఆకలితో నకనకలాడతారు. ప్రపంచంలో ఇంత అసంబద్ధంగా, ఇంత అన్యాయంగా నడిచే వ్యవస్థలు మరెక్కడా ఉండవు. అయిదేళ్లలోపు పిల్లల్లో సంభవించే సగం మరణాలకు ప్రధాన కారణం పౌష్టికాహారలోపమేనని ఈమధ్యే యునిసెఫ్ నివేదిక తెలిపింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల మరణానికి కారణం మీరంటే మీరని ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ వాదించుకుంటున్నాయి. కానీ నిరుపేద కుటుంబాలకు తగిన గుర్తింపు కార్డులిచ్చి వారికి మెరుగైన ఆహారం, వసతి, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావటం ఎలా అన్న అంశంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. నిరర్ధకమైన వాగ్యుద్ధాలకు స్వస్తి చెప్పి సామాజిక సంక్షేమ పథకాలు లక్షిత వర్గాలకు చేరేందుకు అవసరమైన కార్యాచరణ రూపొం దించటం తక్షణావసరమని పాలకులు గుర్తించాలి. -
ఢిల్లీలో ముగ్గురు చిన్నారుల ఆకలిచావు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆకలిచావులు వెలుగుచూశాయి. సరైన ఆహారం అందక ఢిల్లీలో రెండేళ్లు, నాలుగేళ్లు, ఎనిమిదేళ్ల వయస్సున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలుకోల్పోయిన ఘటన ఢిల్లీలో చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని మండావలి ప్రాంతానికి చెందిన ఓ తల్లి తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న తన ముగ్గురు కుమార్తెలను మంగళవారం జీటీబీ ఆస్పత్రిలో చేర్పించింది. తీవ్ర పోషకాహారలేమి, ఆకలి కారణంగా చిన్నారులు ముగ్గురూ ఆస్పత్రిలో కన్నుమూశారని పోస్ట్‌మార్టమ్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఆకలి చావుల ఘటనతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఢిల్లీ ప్రభుత్వం మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు ఢిల్లీ డెప్యూటీ సీఎం సిసోడియా చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు చిన్నారులున్న ఇంటిని సోదా చేశారు. నీళ్ల విరేచనాల చికిత్సలోవాడే ఔషధ సీసాలు, మాత్రలు ఇంట్లో దొరికాయి. ఐదు రోజుల క్రితమే చిన్నారుల కుటుంబం ఈ ప్రాంతంలో అద్దెకు దిగిందని స్థానికులు చెప్పారు. చిన్నారుల తండ్రి ఆటో రిక్షా నడిపేవారని, దాన్నిఎవరో దొంగలించడంతో పని కోసం కొద్దిరోజులు వేరేచోటుకు వెళ్లాడని స్థానికులు చెప్పారు. -
పశుగ్రాసం కరువై.. ఆకలికి తాళలేక..
దైద(గురజాల రూరల్)/మాచర్ల రూరల్: పశుగ్రాసం కరువై ఆకలికి తాళలేక జొన్న పిలకలు తిన్న 56 గోమాతలు అకాలమృత్యువు పాలయ్యాయి. గుంటూరు జిల్లా గురజాల మండలంలోని దైద గ్రామ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన గుండాల లక్ష్మయ్యకు 100 ఆవులు ఉన్నాయి. గతేడాది లాగే ఈసారీ పల్నాడు ప్రాంతానికి వచ్చి గత 45 రోజుల నుంచి అనేక చోట్ల ఆవులను మేపుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం దైద ప్రాంతానికి ఆవులను మేపటానికి తోలుకొచ్చాడు. పక్కనే ఉన్న పొలంలో జొన్న పిలకలు తిన్న ఆవులు సుడులు తిరుగుతూ కింద పడి మృతిచెందాయి. కొన్ని ఆవులకు రూ.25 వేలు వెచ్చించి 25 పామ్ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసినా ఫలితం లేకపోయింది. మొత్తం 56 ఆవులు మృతిచెందడంతో లక్ష్మయ్య కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది. సుమారు రూ.14 లక్షల నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవులు మృతి చెందటానికి జొన్న పిలకలు విషపూరితమవటమే కారణమని తెలుస్తోంది. నాటు జొన్న కోత అనంతరం వచ్చే పిలకలు సైనేడ్ కంటే ప్రమాదకరమని గురజాల వెటర్నరీ ఏడీ హనుమంతరావు తెలిపారు. -
మమల్ని చంపుతారంట!
రాంచీ : జార్ఖండ్ లో ఈ మధ్యే 11 ఏళ్ల చిన్నారి సంతోష్ కుమారి ఆధార్ అనుసంధానం మూలంగా ప్రాణాలు కోల్పోయిందన్న విమర్శలు తెలెత్తటం తెలిసిందే. నిరక్షరాస్యులైన పేద ప్రజల ఆకలి చావుకు దర్పణం పట్టిన ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే అది ఆధార్ మరణం కాదంటూ యూఐడీఏ చెప్పటం.. మలేరియాతో చిన్నారి చనిపోయిందంటూ ఆరోగ్య శాఖ ప్రకటించటంతో... జార్ఖండ్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ కుటుంబం ఉంటున్న సిమ్‌డేగలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత బాలిక కుటుంబాన్ని చంపుతామంటూ గ్రామస్తులు బెదిరించారని సమాచారం. ఈ మేరకు సంతోషి కుమారి తల్లి కొయిలా దేవి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘మా కుటుంబం భయంతో బతుకుతున్నాం. వెంటనే ఊరు వదిలి వెళ్లాలని.. లేకపోతే చంపేస్తామని బెదిరించారు’’ అని కోయిలా దేవి ఆరోపించారు. దీంతో ఆదివారం పెద్ద ఎత్తున్న పోలీస్ బలగాలు గ్రామంలో మోహరించి పహరా కాస్తున్నాయి. మరోవైపు ఆమెపై ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి సరయు రాయ్ ప్రకటించారు. ఆమెకు ఇకపై ఎలాంటి సమస్య తలెత్తబోదని ఆయన హామీ ఇస్తున్నారు. -
ఆ చిన్నారి ఆధార్ వల్ల చనిపోలేదు
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ కార్డుతో అనుసంధానం కాకపోవటంతో రేషన్ కార్డు రద్దు కావటం..11 ఏళ్ల సంతోషి కుమారి ఆకలిచావు జార్ఖండ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డ్ నిర్వహణ చేపడుతున్న యూఐడీఏఐ(యూనిక్ ఐడెంటిటీ-ఆధార్ టూ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా) స్పందించింది. ఆ చిన్నారి మరణానికి.. ఆధార్ కార్డు లింకుకు సంబంధం లేదని ప్రకటించింది. ఈ మేరకు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పని సరే అయినా.. ప్రయోజనాలను నిలుపుదల చేసినట్లు ఇప్పటిదాకా ఎక్కడా ఫిర్యాదులు నమోదు కాలేదు అని చెప్పారు. 2013 నుంచి సంతోషి కుటుంబ సభ్యులకు ఆధార్ కార్డులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆధార్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం.. అనుసంధానం నిబంధన ఉన్నప్పటికీ.. లబ్ధిదారులకు ఇబ్బంది చేకూర్చేలా వ్యవహరించకూడదని, ప్రత్యామ్నాయల ద్వారా అయినా వారికి అందించాల్సిందేనని పేర్కొని ఉందన్న విషయాన్ని ఆయన ఉటంకించారు. అయితే ఒకవేళ రేషన్ అధికారి గనుక నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించి ఉంటే మాత్రం అతనిపై కఠిన చర్యలు తీసుకోవటం ఖాయమని.. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉండవని భూషణ్ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై జార్ఖండ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి కుటుంబానికి రేషన్ అందకపోవటం.. 8 రోజులుగా ఆ కుటుంబం పస్తులుండటంతో సంతోషి సెప్టెంబర్ 28న చనిపోగా, ఆ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే విమర్శల నేపథ్యంలో ఆమె మలేరియాతో మృతి చెందిందని వైద్యాధికారులు వెల్లడించటం గమనార్హం. అయినా ఆధార్ ఉండాల్సిందే : ఎంపీ మంత్రి భోపాల్ : సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలంటే తప్పనిసరిగా ఆధార్ అవసరమని మధ్యప్రదేశ్ ఆహరశాఖ మంత్రి ఓం ప్రకాశ్ ధ్రువే ఖరాకండిగా చెబుతున్నారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జార్ఖండ్ ఘటన భాధాకరం. మా రాష్ట్రంలో (మధ్యప్రదేశ్) లో ఇలాంటి ఘటనలు జరగటానికి వీల్లేదు. అందుకే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిందే. అని తేల్చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమౌతోందని ఆయన అన్నారు. అంతేకాదు ఆధార్ లేని వారికి వాటిని అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు. కాగా, సుమారు ఆ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 15 గ్రామాల ప్రజలు ఆధార్ కార్డులు లేకుండా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. ఏజెంట్ల తప్పిదాల వల్ల... మరోవైపు యూఐడీఐఏ నియమించే ఏజెంట్లు తప్పిదాల వల్ల కూడా ఆధార్ కార్డులు మంజూరు కాకుండా పోతున్నాయి. పీటీఐ కథనం ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం జిల్లా దుంబ్రిగూడ మండలంలో 11 ఏళ్ల బాలుడు తనకు ఆధార్ కార్డు జారీ కాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కాలర్‌షిప్‌తోపాటు సంక్షేమ పథకాల అనుసంధానంకు అంతరాయం కలగటంతోనే అతను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
విషాదానికే కన్నీళ్లు పెట్టించిన ఆకలిచావు
సాక్షి వెబ్ : అన్నింటికీ ఆధారం ఆధార్ కార్డేనన్న ప్రభుత్వం నిర్ణయం 11 ఏళ్ల బాలిక పాలిట శాపంగా మారింది. ఆధార్ కార్డు లింకు లేదని డీలర్ రేషన్ కార్డును తొలగించడంతో తినడానికి మెతుకు లేక.. ఎనిమిదిరోజులపాటు నరకయాతన అనుభవించిన చిన్నారి.. చివరికి ప్రాణాలు కోల్పోయింది. విషాదానికే కన్నీళ్లు పెట్టించే ఈ వార్త వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి సెప్టెంబర్ 28న చనిపోయింది. అప్పటికి ఎనిమిదిరోజులుగా ఏమీ తినకపోవడం వల్లే బాలిక చనిపోయినట్లు స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో వెల్లడైనట్లు ‘స్క్రోల్ డాట్ ఇన్’ సోమవారం పేర్కొంది. సంతోషి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్ సరుకులే ఆధారం. అంత దీన స్థితిలోనూ సంతోషిని వాళ్లమ్మ స్కూలుకు పంపిస్తుండటం గొప్పవిషయం. అయితే.. సాక్షి వెబ్ ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును తప్పని సరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాన్ని వెలువరించిన దరిమిలా... ఆధార్ కార్డు లేని కారణంగా కోయిలీ దేవి పేరుమీదున్న రేషన్ కార్డు రద్దయింది. ఆధార్ కార్డు లింకు ఉంటేనే సరుకులు ఇస్తానని స్థానిక రేషన్ షాపు డీలర్ తెగేసి చెప్పాడు. సంతోషి కుటుంబంతోపాటు మరో 90 మంది పేదల రేషన్ కార్డులు కూడా ఆధార్ కార్డులు లేని కారణంగా రద్దయ్యాయి. మిగతావారికంటే సంతోషి వాళ్ల స్థితి దారుణంగా ఉందని, ఆ ఒక్క కుటుంబానికి మాత్రం కాస్త వెసులుబాటు కల్పించాలని ఆహార హక్కు కార్యకర్తలు కొందరు మండల అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కానీ ఫలితం లేకపోయింది. దసరా సెలవులు కావడంతో.. : ఆధార్ కార్డు రద్దయిన తర్వాత సంతోషికి స్కూల్లో వడ్డించే మధ్యాహ్న భోజనంతో కడుపు నింపుకునేది. అయితే దసరా పండుగ సందర్భంగా 10 రోజులపాటు సెలవులు ఇవ్వడంతో చిన్నారి పరిస్థితి దారుణంగా తయారైంది. అటు పని, ఇటు రేషన్ దొరక్క సంతోషి తల్లి బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడిపింది. అలా ఆకలితో అలమటిస్తూ సెప్టెంబర్ 28న సంతోషి ప్రాణాలు విడిచింది. స్థానికంగా విషాదం రేపిన ఈ ఘటనపై ప్రభుత్వాధికారులు భిన్నంగా స్పందించారు. సంతోషి కుమారిది ఆకలిచావు కాదని, మలేరియా వల్లే చనిపోయిందంటూనే... రేషన్ కార్డు రద్దయింది మాత్రం వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఒకవైపు రోదసీలో దూసుకుపోతున్న భారతావని.. ప్రపంచ ఆకలి సూచిలో ఉత్తరకొరియా, ఇరాక్లాంటి దేశాల కంటే హీనమైన స్థితిలో(100వ స్థానంలో) ఉంది. ఇది ఎంత వాస్తవమో సంతోషి విషాదాంతం మరోసారి గుర్తుచేసింది. స్వచ్ఛంద కార్యకర్తతో మాట్లాడుతున్న సంతోషి తల్లి కోయిలీదేవి -
ఆకలి చావులు దురదృష్టకరం
- హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ నాగ్‌పూర్: ‘ప్రభుత్వం వద్ద భారీగా ఆహారధాన్యం నిల్వ ఉన్నప్పటికీ దేశంలో ఆకలి చావులు జరుగుతుండటం దురదృష్టకరం’ అని హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ వ్యాఖ్యానించారు. విదర్భ జన్ అందోళన్ సమితి అధ్యక్షుడు కిశోర్ తివారీతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘పర్వతాల్లా పెరుగుతున్న ధాన్యం నిల్వలు, ఆకలితో మగ్గుతున్న కోట్లమంది గురించి ప్రజల ముందు ఉంచుతున్న మిమ్మ ల్ని చూసి గర్వపడుతున్నా’ అని తివారీని ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. గోందియా జిల్లాలో జరిగి న ఆకలి చావుపై ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. జరిగింది ఇదీ.. గోందియా జిల్లాలోని గిరిజన ప్రాంతంలో నివసించే లలితా ఎస్. సింగారీ(36) అనే దళిత వితంతువు ఆకలితో చని పోయింది. దీనిపై తీవ్రం గా స్పందించిన కిశోర్ తివారీ, ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ చట్టాన్ని అమలుచేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచి, గోందియా జిల్లాలో మరణించిన దళిత వితంతువు విషయంపై నివేదిక అందజేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శికి జస్టిస్ భూషన్ గోవాయ్, జస్టిస్ ఇందూ జైన్‌తో కూడిన బెంచి నోటీసులు జారీ చేసింది.