అంతులేని ఆకలి.. వర్ణించనలివికాని దైన్యం.. భరించలేని ఆవేదన.. ఇవన్నీ గత కొన్ని నెలలుగా ఆ కుటుంబం అనుభస్తున్న బాధలు. చివరికి తమ వారు మరణించినా కాటికి చేర్చలేని దుస్థితి వారిది. ఇంటి నుంచి వస్తున్న దుర్శాసన భరించలేక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తేకానీ.. వారి దుర్భర జీవితం బయటి ప్రపంచానికి తెలియలేదు.
చెన్నై: ఆకలితో అలమటించి ఓ వృద్ధురాలు, మరో వ్యక్తి వారం రోజుల క్రితం మరణించారు. ఈ మృత దేహాలకు అంత్యక్రియలు చేసే స్థామత లేక తాము కూడా ఆకలితో చచ్చి పోదామని భావించిన ఓ తల్లి, తనయుడు వారం పాటు ఒకే గదిలో కాలం గడిపారు. ఇంట్లో నుంచి వచ్చిన దుర్వాసతో సోమవారం పోలీసులు రంగంలోకి దిగారు. మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించి, తల్లి, కుమారుడిని ఆసుప్రతికి తరలించారు.
వివరాలు.. ఈరోడ్ జిల్లా గోబి చెట్టి పాళయం వండి పేట కుమరన్ వీధికి చెందిన కనకంబాల్ (80), ఆమె కుమార్తె శాంతి (60), అల్లుడు మోహన సుందరం(74)తో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. శాంతి, మోహన సుందరం దంపతులకు కుమార్తె శశిరేఖ(27), కుమారుడు శరవణ కుమార్(23) ఉన్నారు. ఈక్రమంలో కనకంబాల్, సుందరం, శాంతి అనారోగ్యం, వయోభారం సమస్యలతో బాధ పడుతున్నారు. కుమారుడు శరవణకుమార్ మానసిక ఎదుగుదల లేనివాడు. ఈక్రమంలో ఆ కుటుంబాన్ని శశిరేఖ పోషిస్తూ వచ్చింది. ఇటీవల ఆమెకు వివాహం చేసి కాంగేయానికి పంపించేశారు. అప్పటి నుంచి ఆదాయం లేక పేదరికంతో పస్తులు ఉన్న రోజులే ఈ కుటుంబానికి ఎక్కువ.
వారం పాటు శవజాగారం
ఇరుగు పొరుగు వారు ఏదైనా ఇస్తే తినడం లేదా, నీళ్లు తాగి పడుకోవడం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో వీరి ఇంటి నుంచి సోమవారం దుర్వాసన రావడాన్ని ఇరుగు పొరుగు వారు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, మోహన సుందరం, కనకంబాల్ మరణించి ఉండటం, వారి మృత దేహాల పక్కనే శాంతి, శరణ కుమార్ కూర్చుని ఉండడం చూసి విస్మయం చెందారు. అత్యంత దీన స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. విచారణలో ఆ ఇద్దరు మరణించి వారం రోజులు అయినట్లు తేలింది. ఆకలితో అలమటించి ఆ ఇద్దరు మరణించారని, అంత్యక్రియలకు స్థోమత కూడా లేదని, తాము చచ్చిపోతామని భావించే వారం నుంచి ఇంట్లోనే ఉన్నట్లు శాంతి పేర్కొనడం పోలీసుల్ని సైతం కంట తడి పెట్టించింది. దీంతో కనకాంబాల్ , మోహన్ సుందరం మృత దేహాలకు పోస్టుమార్టం అనంతరం పోలీసులే అంత్యక్రియలు చేశారు. కాంగేయంలో ఉన్న కుమార్తె శశిరేఖకు సమాచారం అందించారు. ఆమె కూడా కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తుండటంతో ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment