మృతురాలు సంతోషి(చెల్లెల్ని ఎత్తుకుంది), ఇంటివద్ద సంతోషి తల్లి కోయిలీ దేవి.
సాక్షి వెబ్ : అన్నింటికీ ఆధారం ఆధార్ కార్డేనన్న ప్రభుత్వం నిర్ణయం 11 ఏళ్ల బాలిక పాలిట శాపంగా మారింది. ఆధార్ కార్డు లింకు లేదని డీలర్ రేషన్ కార్డును తొలగించడంతో తినడానికి మెతుకు లేక.. ఎనిమిదిరోజులపాటు నరకయాతన అనుభవించిన చిన్నారి.. చివరికి ప్రాణాలు కోల్పోయింది. విషాదానికే కన్నీళ్లు పెట్టించే ఈ వార్త వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి సెప్టెంబర్ 28న చనిపోయింది. అప్పటికి ఎనిమిదిరోజులుగా ఏమీ తినకపోవడం వల్లే బాలిక చనిపోయినట్లు స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో వెల్లడైనట్లు ‘స్క్రోల్ డాట్ ఇన్’ సోమవారం పేర్కొంది. సంతోషి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్ సరుకులే ఆధారం. అంత దీన స్థితిలోనూ సంతోషిని వాళ్లమ్మ స్కూలుకు పంపిస్తుండటం గొప్పవిషయం. అయితే.. సాక్షి వెబ్
ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును తప్పని సరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాన్ని వెలువరించిన దరిమిలా... ఆధార్ కార్డు లేని కారణంగా కోయిలీ దేవి పేరుమీదున్న రేషన్ కార్డు రద్దయింది. ఆధార్ కార్డు లింకు ఉంటేనే సరుకులు ఇస్తానని స్థానిక రేషన్ షాపు డీలర్ తెగేసి చెప్పాడు. సంతోషి కుటుంబంతోపాటు మరో 90 మంది పేదల రేషన్ కార్డులు కూడా ఆధార్ కార్డులు లేని కారణంగా రద్దయ్యాయి. మిగతావారికంటే సంతోషి వాళ్ల స్థితి దారుణంగా ఉందని, ఆ ఒక్క కుటుంబానికి మాత్రం కాస్త వెసులుబాటు కల్పించాలని ఆహార హక్కు కార్యకర్తలు కొందరు మండల అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కానీ ఫలితం లేకపోయింది.
దసరా సెలవులు కావడంతో.. : ఆధార్ కార్డు రద్దయిన తర్వాత సంతోషికి స్కూల్లో వడ్డించే మధ్యాహ్న భోజనంతో కడుపు నింపుకునేది. అయితే దసరా పండుగ సందర్భంగా 10 రోజులపాటు సెలవులు ఇవ్వడంతో చిన్నారి పరిస్థితి దారుణంగా తయారైంది. అటు పని, ఇటు రేషన్ దొరక్క సంతోషి తల్లి బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడిపింది. అలా ఆకలితో అలమటిస్తూ సెప్టెంబర్ 28న సంతోషి ప్రాణాలు విడిచింది.
స్థానికంగా విషాదం రేపిన ఈ ఘటనపై ప్రభుత్వాధికారులు భిన్నంగా స్పందించారు. సంతోషి కుమారిది ఆకలిచావు కాదని, మలేరియా వల్లే చనిపోయిందంటూనే... రేషన్ కార్డు రద్దయింది మాత్రం వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఒకవైపు రోదసీలో దూసుకుపోతున్న భారతావని.. ప్రపంచ ఆకలి సూచిలో ఉత్తరకొరియా, ఇరాక్‌లాంటి దేశాల కంటే హీనమైన స్థితిలో(100వ స్థానంలో) ఉంది. ఇది ఎంత వాస్తవమో సంతోషి విషాదాంతం మరోసారి గుర్తుచేసింది.
స్వచ్ఛంద కార్యకర్తతో మాట్లాడుతున్న సంతోషి తల్లి కోయిలీదేవి
Comments
Please login to add a commentAdd a comment