సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ కార్డుతో అనుసంధానం కాకపోవటంతో రేషన్ కార్డు రద్దు కావటం..11 ఏళ్ల సంతోషి కుమారి ఆకలిచావు జార్ఖండ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డ్ నిర్వహణ చేపడుతున్న యూఐడీఏఐ(యూనిక్ ఐడెంటిటీ-ఆధార్ టూ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా) స్పందించింది. ఆ చిన్నారి మరణానికి.. ఆధార్ కార్డు లింకుకు సంబంధం లేదని ప్రకటించింది.
ఈ మేరకు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పని సరే అయినా.. ప్రయోజనాలను నిలుపుదల చేసినట్లు ఇప్పటిదాకా ఎక్కడా ఫిర్యాదులు నమోదు కాలేదు అని చెప్పారు. 2013 నుంచి సంతోషి కుటుంబ సభ్యులకు ఆధార్ కార్డులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆధార్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం.. అనుసంధానం నిబంధన ఉన్నప్పటికీ.. లబ్ధిదారులకు ఇబ్బంది చేకూర్చేలా వ్యవహరించకూడదని, ప్రత్యామ్నాయల ద్వారా అయినా వారికి అందించాల్సిందేనని పేర్కొని ఉందన్న విషయాన్ని ఆయన ఉటంకించారు.
అయితే ఒకవేళ రేషన్ అధికారి గనుక నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించి ఉంటే మాత్రం అతనిపై కఠిన చర్యలు తీసుకోవటం ఖాయమని.. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉండవని భూషణ్ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై జార్ఖండ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి కుటుంబానికి రేషన్ అందకపోవటం.. 8 రోజులుగా ఆ కుటుంబం పస్తులుండటంతో సంతోషి సెప్టెంబర్ 28న చనిపోగా, ఆ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే విమర్శల నేపథ్యంలో ఆమె మలేరియాతో మృతి చెందిందని వైద్యాధికారులు వెల్లడించటం గమనార్హం.
అయినా ఆధార్ ఉండాల్సిందే : ఎంపీ మంత్రి
భోపాల్ : సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలంటే తప్పనిసరిగా ఆధార్ అవసరమని మధ్యప్రదేశ్ ఆహరశాఖ మంత్రి ఓం ప్రకాశ్ ధ్రువే ఖరాకండిగా చెబుతున్నారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జార్ఖండ్ ఘటన భాధాకరం. మా రాష్ట్రంలో (మధ్యప్రదేశ్) లో ఇలాంటి ఘటనలు జరగటానికి వీల్లేదు. అందుకే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిందే. అని తేల్చేశారు.
ఈ మేరకు ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమౌతోందని ఆయన అన్నారు. అంతేకాదు ఆధార్ లేని వారికి వాటిని అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు. కాగా, సుమారు ఆ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 15 గ్రామాల ప్రజలు ఆధార్ కార్డులు లేకుండా ఉన్నారని ఓ సర్వేలో తేలింది.
ఏజెంట్ల తప్పిదాల వల్ల...
మరోవైపు యూఐడీఐఏ నియమించే ఏజెంట్లు తప్పిదాల వల్ల కూడా ఆధార్ కార్డులు మంజూరు కాకుండా పోతున్నాయి. పీటీఐ కథనం ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం జిల్లా దుంబ్రిగూడ మండలంలో 11 ఏళ్ల బాలుడు తనకు ఆధార్ కార్డు జారీ కాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కాలర్‌షిప్‌తోపాటు సంక్షేమ పథకాల అనుసంధానంకు అంతరాయం కలగటంతోనే అతను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment