మన దేశం 1951 మొదలుకొని 2017 వరకూ పన్నెండు పంచవర్ష ప్రణాళికలు చూసింది. అటుపై ప్రణాళికా సంఘం కన్నుమూసి నీతి ఆయోగ్ రంగంలోకొచ్చింది. ఆరేళ్లక్రితం ఆహార భద్రతా చట్టం వచ్చింది. వీటన్నిటికీ తోడు నిరుపేదల బతుకులు బాగు చేయడానికంటూ అనేకానేక సంక్షేమ పథ కాలు అమలవుతున్నాయి. ఇన్ని ఉంటున్నా, ఇవన్నీ ఘన విజయం సాధిస్తున్నాయని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నా ఆకలి భూతాన్ని మట్టి కరిపించడంలో ఘోర వైఫల్యం తప్పడం లేదని బుధవారం వెల్లడైన అంతర్జాతీయ నివేదికలోని గణాంకాలు చాటుతున్నాయి. పట్టెడన్నం మెతుకులు దొరక్క అలమటిస్తున్న అభాగ్యులు దేశంలో అధికంగానే ఉన్నారని ఆ గణాంకాలు చెబుతున్నాయి. వాటి ఆధారంగా రూపొందించిన ప్రపంచ ఆకలి సూచీలో తాజాగా మన స్థానం 102. నిరుటితో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడ్డామని, 103 నుంచి కాస్త ఎగబాకామని సంతోషించాలో పొరుగునున్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల కన్నా ఇంకా తీసికట్టుగానే ఉన్నామని బాధపడాలో తోచదు. 2030 నాటికల్లా ఈ భూగోళంపై ఆకలనేదే ఉండరాదని నాలుగేళ్లక్రితం ఐక్యరాజ్యసమితి నిర్దేశిం చింది. అది ఖరారు చేసి, అన్ని దేశాలూ ఆమోదించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆకలిని అంతం చేయడం ఒకటి. కేవలం తిండి దొరకకపోవడం మాత్రమే కాదు...లభించే ఆహారంలో తగినన్ని కేల రీలు లేకపోవడాన్ని కూడా ఈ అధ్యయనం ఆకలిగానే పరిగణిస్తోంది. దేశంలో ఆర్నెల్ల పిల్లలు మొద లుకొని 23 నెలల వయసుండే చిన్నారుల వరకూ చూస్తే వారిలో కేవలం 9.6 శాతంమందికి మాత్రమే కనీస ఆహార అవసరాలు తీరుతున్నాయని ఆ నివేదిక లెక్కేసింది.
జనాభారీత్యా చూస్తే మన దేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. కానీ అది మనకన్నా అన్నింటా దూసుకెళ్తోంది. మన దేశంలో 2017–18లో 27.50 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ఇది ప్రపంచ ఉత్పత్తిలో 25శాతం. పాల ఉత్పత్తిలో మనది అగ్రస్థానం. అది 16.5 కోట్ల టన్నులు. ఇలా సమృద్ధిగా ఆహారధాన్యాల ఉత్పత్తి ఉన్నా అన్నార్తుల సంఖ్య అధికంగానే ఉండటం ఆందోళన కలిగించే అంశం. దేశ జనాభాకు కడుపు నిండా తిండి కావాలంటే దాదాపు 23 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవసరమని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనం మిగులులో ఉన్నాం. పండ్లు, కాయగూరల ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే ద్వితీయ స్థానంలో ఉన్నాం. అయినా అయిదేళ్లలోపు పిల్లల్లో తగినంతగా పౌష్టికాహారం లభించక, పారిశుద్ధ్యం సక్రమంగా లేక వ్యాధుల బారిన పడి మరణిస్తున్నవారు 69 శాతమని బుధవారమే వెల్లడైన యునిసెఫ్ నివేదిక కూడా తెలిపింది. పిల్లల్లో తగినంత ఎదుగుదల లోపించడం, వయసుకు తగినట్టుగా బరువు, ఎత్తు లేకపోవడం వంటివన్నీ పౌష్టికాహారలోపంవల్లే ఏర్పడుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఈ కారణంగానే పిల్లల్లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. మరణాన్ని తప్పిం చుకున్న పిల్లలు సైతం సక్రమమైన ఎదుగుదల లోపించి శారీరక, మానసిక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదంటే ఎక్కడ వైఫల్యం ఎదురవుతున్నదో సమీక్షించుకోవాలి. శిశు మరణాలు గతంతో పోలిస్తే మన దేశంలో తగ్గాయి. 2006లో ప్రతి వెయ్యిమంది శిశువులకూ 57 మరణాలుంటే 2017నాటికి ఆ సంఖ్య 33కి తగ్గింది. అయితే ప్రపంచ గణాంకాలరీత్యా ఇంకా ఇది ఎక్కువగా ఉన్నట్టే లెక్క. పశ్చిమ ఆఫ్రికా దేశం సెనెగల్‌లో వెయ్యిమంది శిశువులకూ 29.4 మరణాలు సంభవిస్తున్నాయి. అంటే దాంతో పోల్చినా మనం వెనకబడ్డాం. గతంతో పోలిస్తే మెరుగుదల కని పించినా, కొన్ని రాష్ట్రాలు చాలా విషయాల్లో వెనకబడే ఉంటున్నాయి. శిశు మరణాల రేటు కొన్ని చోట్ల బాగా తగ్గితే కొన్ని ఇంకా యధాతథ స్థితిలో ఉంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాం, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు పలు అంశాల్లో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే బాగా వెనకబడి ఉన్నాయి. పోషణ్ అభియాన్ కింద అయిదేళ్లలో అంటే... 2022 కల్లా దేశంలో పౌష్టికాహార లోపాన్ని గణనీయంగా తగ్గించాలని 2017లో నిర్ణయించారు. దాని ప్రకారం తగినంతగా బరువులేని నవజాత శిశువులు, పిల్లల సంఖ్యలో ఏటా 2 శాతం తగ్గుదల కనబడాలని నిర్దేశించారు. కానీ అయిదేళ్లలో సాధించదల్చుకున్న లక్ష్యానికి ఇది ఏమాత్రం సరిపోదన్నది నిపుణుల భావన.
గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారలోపం సృష్టించే సమస్యలతోపాటు పట్టణ ప్రాంతాల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సైతం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వారు తీసుకునే ఆహారంలో తగినన్ని మాంసకృత్తులు లేకపోవడం, శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే బలవర్థకాలు లేకపోవడం వంటి కారణాల వల్ల సమస్యలెదురవుతున్నాయి. ఆదాయం ఎంతో కొంత మెరుగ్గా ఉన్న వర్గాల్లో సైతం పిల్లల స్థితి ఇలా ఉండటం ఆందోళన కలిగించే అంశం. మన దేశంలో అయిదేళ్లలోపు వయసున్న ప్రతి ముగ్గురు పిల్లల్లోనూ ఒకరు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అత్యంత బలహీనులుగా ఉంటున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. దేశ జనాభాలో ఈ పిల్లల సంఖ్య 2 కోట్ల వరకూ ఉంటుందని దాని అంచనా. ప్రపంచ సంస్థలు వెల్ల డించే గణాంకాలన్నీ వాస్తవాలేనని నిర్ధారించనక్కర లేదు. ఆ గణాంకాల సేకరణకు అనుసరించే విధానాలు, వాటిని సేకరించడంలో ఉండే పరిమితులన్నీ నివేదికల రూపకల్పనలో సహజంగానే ప్రభావం చూపుతాయి. కానీ ఏమరుపాటు ఏమాత్రం పనికిరాదు. పరిస్థితులు ఏమంత çసవ్యంగా లేవని మనకు నిత్యం అర్ధమవుతూనే ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా దేశంలో ఆకలి, పేదరికం, అవిద్య వంటివి కనుమరుగు కావడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్నివ్వడంలేదు. 2030నాటి కల్లా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు, సంక్షేమ పథకాలు సమగ్రంగా సమీక్షించుకుని, వాటికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది.
ఎన్నాళ్లీ ఆకలిమంటలు!
Published Fri, Oct 18 2019 4:06 AM | Last Updated on Thu, Oct 24 2019 11:07 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment