మీఠా రోటీ
చలి గడ్డకట్టిస్తోంది. దవడలు బిగుసుకుపోతున్నాయి. పళ్లు కటకటలాడుతున్నాయి. ఈ కాలంలో దేహానికి వెచ్చదనాన్నిచ్చే ఆహారం తినాలి. ఆ ఆహారం రుచిగానూ ఉండాలి. గుజరాతీ మేథీ తెప్లా, యూపీ మీఠారోటీ, తెలుగింటి మునగాకు సూప్, ఆల్ ఇండియా చికెన్ షోర్బా... ఈ వారం ట్రై చేద్దాం.
మీఠా రోటీ
కావలసినవి: గోధుమపిండి– ఒకటిన్నర కప్పులు; బెల్లం తురుము– 8 టేబుల్ స్పూన్‌లు; నువ్వులు – టీ స్పూన్; నెయ్యి – 3 టేబుల్ స్పూన్‌లు.
తయారీ: ► మందపాటి పెనంలో బెల్లం తురుము, కొద్దిగా నీరు పోసి సన్న మంట మీద గరిటెతో కలుపుతూ బెల్లం కరిగే వరకు వేడి చేసి దించేయాలి.
► చల్లారిన తరవాత గోధుమ పిండి, నువ్వులు, కొద్దిగా నెయ్యి వేసి తగినంత నీటిని వేస్తూ ముద్దగా చపాతీల పిండిగా కలపాలి.
► పది నిమిషాల తర్వాత పిండిని నాలుగు భాగాలు చేసి ఒక్కో భాగాన్ని చపాతీల పీట మీద వేసి కొంచెం మందంగా వత్తుకోవాలి.
► పెనం మీద నెయ్యి వేడి చేసి మీడియం మంట మీద రొట్టెలను రెండు వైపులా తిరగ వేస్తూ దోరగా కాలనివ్వాలి. కొద్దిగా నెయ్యి రాసి వేడిగా తినాలి.
మేథీ తెప్లా
కావలసినవి: గోధుమ పిండి– ఒకటిన్నర కప్పు ; శనగపిండి– ముప్పావు కప్పు; మెంతి ఆకులు – కప్పు (తరగాలి); మిర్చి పొడి– టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచికి తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్‌లు.
తయారీ: ► గోధుమ పిండి, శనగపిండిని జల్లించి అందులో మెంతి ఆకు తరుగు, ఉప్పు, మిర్చిపొడి వేసి సమంగా కలిపిన తరవాత నీటిని పోసి గట్టిగా ముద్ద చేయాలి.
► పిండి ముద్దను బాగా మర్దన చేసి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి.
► పిండిని పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకుని చపాతీలు చేసే రోలింగ్ పిన్‌తో పలుచగా వత్తి పెనం మీద వేసి రెండు వైపులా తిరగేస్తూ, మధ్యలో నూనె వేస్తూ కాల్చాలి. గుజరాతీ మెథీ తెప్లా రెడీ.
► పై పరిమాణంతో ఎనిమిది తెప్లాలు చేయవచ్చు.
మునగాకు సూప్
కావలసినవి: మునగాకు – 2 కప్పులు (కడిగిన తర్వాత తరగాలి); తెల్ల ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; అల్లం తురుము – టేబుల్ స్పూన్; వెల్లుల్లి తరుగు – టేబుల్ స్పూన్; టొమాటో ముక్కలు – పావు కప్పు; జీలకర్ర – టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్ ; మిరియాల పొడి– టీ స్పూన్; నీరు – 4 కప్పులు; ఉప్పు– రుచికి తగినంత; నెయ్యి లేదా నూనె – అర టీ స్పూన్.
తయారీ: ► పెనంలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, వెల్లుల్లి, అల్లం వేసి సన్న మంట మీద వేయించాలి.
► ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
► ఇప్పుడు వరుసగా టొమాటో ముక్కలు, మునగాకు, పసుపు, ఉప్పు వేసి నీటిని పోసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికి నీకు సగం అయిన తరవాత స్టవ్ ఆపేసి వడపోయాలి.
► ఈ సూప్‌లో మిరియాల పొడి వేసుకుని తాగాలి.
చికెన్ షోర్బా సూప్
కావలసినవి: చికెన్ బోన్స్– 500 గ్రా ; బోన్‌లెస్ చికెన్– 100 గ్రా (చిన్నగా అర అంగుళం ముక్కలు
చేయాలి); వెల్లుల్లి రేకలు – 10(సన్నగా తరగాలి); మైదా లేదా మెత్తని వరిపిండి – టేబుల్ స్పూన్; వెన్న – టేబుల్ స్పూన్; నూనె – టేబుల్ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; మిరియాల పొడి– 2 టీ స్పూన్‌లు (రుచికి తగినంత); ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినట్లు.
తయారీ: ► చికెన్ బోన్స్‌ను శుభ్రం చేసి మందపాటి పాత్రలో వేసి నాలుగు లేదా ఐదు కప్పుల నీటిని పోయాలి.
► అందులో వెల్లుల్లి తరుగు వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి.
► వేడి తగ్గిన తరవాత వడపోసి ఈ చికెన్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.
► బాణలిలో వెన్న వేడి చేసి చికెన్ ముక్కలు వేసి సన్న మంట మీద ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి.
► మరొక బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర వేయాలి.
► అవి చిటపట వేగిన తరవాత పిండి వేసి కలిబెడుతూ పచ్చిదనం పోయే వరకు వేయించాలి.
► ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ స్టాక్, వెన్నలో వేయించిన చికెన్ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి, సన్నమంట మీద నాలుగు నిమిషాల ఉడికించాలి.
► ఈ చికెన్ షోర్బాను వేడిగా తీసుకోవాలి.
► గర్భిణిగా ఉన్నప్పుడు కొంతమందికి మసాలాతో వండిన కర్రీ సరిగ్గా జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లకు ఇది మంచి ఆహారం, త్వరగా జీర్ణమవుతుంది, పోషకాలు సమృద్ధిగా అందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment