chicken soup
-
‘ఉప్పు’ రెస్టారెంట్లో మూడు ప్రాంతాల వంటకాలు
బంజారాహిల్స్: గోంగూర మటన్, రొయ్యల వేపుడు, కోడిపులుసు, నాటుకోడి ఫ్రై తదితర స్పైసీ రుచులతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఓహిరీస్ హోటల్ ఉప్పు రెస్టారెంట్లో నగర ఆహార ప్రియుల జిహా్వచాపల్యాన్ని తీర్చే వంటకాలు నోరూరిస్తున్నాయి. వీటితో పాటు ఐస్‌క్రీంతో బెల్లంపాకం, పాలజున్ను, బెల్లం ఐస్‌క్రీం, కులీ్ఫ, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణ, కోనసీమ, రాయలసీమ సంప్రదాయ వంటకాలను ఇక్కడ ఆస్వాదించవచ్చునని ఓహిరీస్ గ్రూప్ ఎండీ అమర్ ఓహిరి, జనరల్ మేనేజర్ సపతాదిప్రాయ్ తెలిపారు. ప్రతిరోజూ ప్రత్యేకమైన రీతిలో విభిన్నమైన శాఖాహార, మాంసాహార రుచులను ఇక్కడ అందిస్తున్నామన్నారు. రాయల్ థీమ్‌తో మెనూను ప్రత్యేకంగా తీర్చిదిద్దామన్నారు. రాజమండ్రి నాన్వెజిటేరియన్ థాలి, ఉప్పు స్పెషల్ రాయల్ థాలి వంటివి ఆహార ప్రియులను ఆకట్టుకుంటాయన్నారు. -
చలిని తరిమేసే... వేడి వేడి విందు
చలి గడ్డకట్టిస్తోంది. దవడలు బిగుసుకుపోతున్నాయి. పళ్లు కటకటలాడుతున్నాయి. ఈ కాలంలో దేహానికి వెచ్చదనాన్నిచ్చే ఆహారం తినాలి. ఆ ఆహారం రుచిగానూ ఉండాలి. గుజరాతీ మేథీ తెప్లా, యూపీ మీఠారోటీ, తెలుగింటి మునగాకు సూప్, ఆల్ ఇండియా చికెన్ షోర్బా... ఈ వారం ట్రై చేద్దాం. మీఠా రోటీ కావలసినవి: గోధుమపిండి– ఒకటిన్నర కప్పులు; బెల్లం తురుము– 8 టేబుల్ స్పూన్లు; నువ్వులు – టీ స్పూన్; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు. తయారీ: ► మందపాటి పెనంలో బెల్లం తురుము, కొద్దిగా నీరు పోసి సన్న మంట మీద గరిటెతో కలుపుతూ బెల్లం కరిగే వరకు వేడి చేసి దించేయాలి. ► చల్లారిన తరవాత గోధుమ పిండి, నువ్వులు, కొద్దిగా నెయ్యి వేసి తగినంత నీటిని వేస్తూ ముద్దగా చపాతీల పిండిగా కలపాలి. ► పది నిమిషాల తర్వాత పిండిని నాలుగు భాగాలు చేసి ఒక్కో భాగాన్ని చపాతీల పీట మీద వేసి కొంచెం మందంగా వత్తుకోవాలి. ► పెనం మీద నెయ్యి వేడి చేసి మీడియం మంట మీద రొట్టెలను రెండు వైపులా తిరగ వేస్తూ దోరగా కాలనివ్వాలి. కొద్దిగా నెయ్యి రాసి వేడిగా తినాలి. మేథీ తెప్లా కావలసినవి: గోధుమ పిండి– ఒకటిన్నర కప్పు ; శనగపిండి– ముప్పావు కప్పు; మెంతి ఆకులు – కప్పు (తరగాలి); మిర్చి పొడి– టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచికి తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు. తయారీ: ► గోధుమ పిండి, శనగపిండిని జల్లించి అందులో మెంతి ఆకు తరుగు, ఉప్పు, మిర్చిపొడి వేసి సమంగా కలిపిన తరవాత నీటిని పోసి గట్టిగా ముద్ద చేయాలి. ► పిండి ముద్దను బాగా మర్దన చేసి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ► పిండిని పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకుని చపాతీలు చేసే రోలింగ్ పిన్‌తో పలుచగా వత్తి పెనం మీద వేసి రెండు వైపులా తిరగేస్తూ, మధ్యలో నూనె వేస్తూ కాల్చాలి. గుజరాతీ మెథీ తెప్లా రెడీ. ► పై పరిమాణంతో ఎనిమిది తెప్లాలు చేయవచ్చు. మునగాకు సూప్ కావలసినవి: మునగాకు – 2 కప్పులు (కడిగిన తర్వాత తరగాలి); తెల్ల ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; అల్లం తురుము – టేబుల్ స్పూన్; వెల్లుల్లి తరుగు – టేబుల్ స్పూన్; టొమాటో ముక్కలు – పావు కప్పు; జీలకర్ర – టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్ ; మిరియాల పొడి– టీ స్పూన్; నీరు – 4 కప్పులు; ఉప్పు– రుచికి తగినంత; నెయ్యి లేదా నూనె – అర టీ స్పూన్. తయారీ: ► పెనంలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, వెల్లుల్లి, అల్లం వేసి సన్న మంట మీద వేయించాలి. ► ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ► ఇప్పుడు వరుసగా టొమాటో ముక్కలు, మునగాకు, పసుపు, ఉప్పు వేసి నీటిని పోసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికి నీకు సగం అయిన తరవాత స్టవ్ ఆపేసి వడపోయాలి. ► ఈ సూప్‌లో మిరియాల పొడి వేసుకుని తాగాలి. చికెన్ షోర్బా సూప్ కావలసినవి: చికెన్ బోన్స్– 500 గ్రా ; బోన్‌లెస్ చికెన్– 100 గ్రా (చిన్నగా అర అంగుళం ముక్కలు చేయాలి); వెల్లుల్లి రేకలు – 10(సన్నగా తరగాలి); మైదా లేదా మెత్తని వరిపిండి – టేబుల్ స్పూన్; వెన్న – టేబుల్ స్పూన్; నూనె – టేబుల్ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; మిరియాల పొడి– 2 టీ స్పూన్లు (రుచికి తగినంత); ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినట్లు. తయారీ: ► చికెన్ బోన్స్‌ను శుభ్రం చేసి మందపాటి పాత్రలో వేసి నాలుగు లేదా ఐదు కప్పుల నీటిని పోయాలి. ► అందులో వెల్లుల్లి తరుగు వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. ► వేడి తగ్గిన తరవాత వడపోసి ఈ చికెన్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. ► బాణలిలో వెన్న వేడి చేసి చికెన్ ముక్కలు వేసి సన్న మంట మీద ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి. ► మరొక బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర వేయాలి. ► అవి చిటపట వేగిన తరవాత పిండి వేసి కలిబెడుతూ పచ్చిదనం పోయే వరకు వేయించాలి. ► ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ స్టాక్, వెన్నలో వేయించిన చికెన్ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి, సన్నమంట మీద నాలుగు నిమిషాల ఉడికించాలి. ► ఈ చికెన్ షోర్బాను వేడిగా తీసుకోవాలి. ► గర్భిణిగా ఉన్నప్పుడు కొంతమందికి మసాలాతో వండిన కర్రీ సరిగ్గా జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లకు ఇది మంచి ఆహారం, త్వరగా జీర్ణమవుతుంది, పోషకాలు సమృద్ధిగా అందుతాయి. -
జలుబుకు ఔషధంగా చికెన్ సూప్ ఎలా పనిచేస్తుందంటే..?
బాగా జలుబు చేసినప్పుడు చాలామంది చికెన్ సూప్ చేయించుకుని తాగడం లేదా సూప్‌లా వండిన చికెన్గ్రేవీతో అన్నం తినడం చేస్తుంటారు. చాలామంది ఇది ఓ సంప్రదాయ చికిత్స అనుకుంటారుగానీ... నిజానికి చికెన్సూప్ ఉపశమనానికి బాగానే పనిచేస్తుంది. దీనికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. సూప్‌లా వండిన చికెన్‌లో ‘సిస్టిన్/సిస్టయిన్’ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మాత్రమే గాకుండా... ఇలా వండే సమయంలో ఆ సూప్‌లోకి ఖనిజ లవణాలూ, విటమిన్లతో పాటు మంచి పోషకాలన్నీ ద్రవంలా ఉడికే సూప్‌లోకి స్రవిస్తాయి. ఇదే సూప్‌లోకి ‘గ్లైసిన్’, ‘ప్రోలైన్’ లాంటి అనేక అమైనో యాసిడ్స్ సముదాయమైన జిలాటిన్ కూడా స్రవిస్తుంది. ఈ అమైనో యాసిడ్లూ, ఇతర పోషకాలు కలగలసిన సూప్ మన వ్యాధి నిరోధకశక్తిని మరింతగా పెంచుతుంది. ఈ అంశాలన్నీ జలుబు ఇతరత్రా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అంతేకాదు... ఈ చికెన్సూప్ దాదాపు ద్రవరూపంలో ఉండటం త్వరగా జీర్ణం కావడంతో పాటు అన్ని పోషకాలను వేగంగా దేహానికి అందిస్తుంది. జీర్ణశక్తినీ, కాలేయం పనితీరును మెరుగుపరిచి, ఎముకలను మరింత పటిష్టం చేయడానికీ చికెన్సూప్ దోహదపడుతుంది. -
చికెన్ సూప్‌తో జలుబు తగ్గుతుందట!
బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి చికెన్‌సూప్‌ను చప్పరిస్తూ అలా కాసేపు తాగితే జలుబు తగ్గుతుందనేది చాలాకాలం నుంచి ఉన్న నమ్మకం. అయితే కాస్త ఘాటుగా ఉన్న వేడి వేడి చికెన్‌సూప్‌ను అలా ఆస్వాదించడం వల్ల జలుబు తగ్గిన అనుభూతితో కాస్త ఉపశమనం కలుగుతుంది కానీ... అది వాస్తవం కాదని కొందరంటారు. కానీ చికెన్సూప్ జలుబును తగ్గించడమే కాదు... దాని సువాసనలో ఉండే యాంటీ–ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఒనగూరుతాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కాకు చెందిన అధ్యయనవేత్త. ఇప్పుడిది కేవలం చిట్కా వైద్యం కాదనీ... దీనికి సశాస్త్రీయ ఆధారాలున్నాయని పేర్కొంటున్నారు డాక్టర్ స్టీఫెన్ రెనార్డ్ అనే అక్కడి వైద్యపరిశోధకుడు. బామ్మ చేసే సూప్ అంటూ ‘గ్రాండ్ మా సూప్’ అని పిలిచే ఇందులో ఇన్ఫెక్షన్స్ తో పోరాడే గుణాలున్నట్లు తాను గుర్తించానని చెబుతున్నారాయన, చికెన్ సువాసన (అరోమా)తో సైనసైటిస్ తగ్గుతుందనీ, శ్వాసకోశవ్యవస్థ పైభాగంలో ఏదో అడ్డుకున్నట్లుగా ఉండి గాలి ఆడనట్లుగా ఉండే ఫీలింగ్ కూడా తగ్గుతుందని చెబుతున్నాడు పరిశోధకుడు. -
'ఛీ.. ప్రియాంక వంట కుక్కలు తింటాయి'
లాస్ఏంజెల్స్: బాలీవుడ్లో తనదైన ముద్ర వేసి హాలీవుడ్‌కు పరిచయమై ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ప్రియాంక చోప్రా వంటను ఓ చెఫ్ వెక్కిరించాడు. అది కూడా ప్రియాంకా చేసిన వంట కుక్కలకు పెట్టేదిలా ఉందని. జోర్డన్ రామ్సే.. ఓ బ్రిటీష్ సెలబ్రెటీ చెఫ్. ఆయన వంటలు నలభీమ పాకంలో ఉంటాయి అంటారు చాలా మంది సెలబ్రిటీలు. రామ్సే వంట ఎంత బాగా చేస్తాడో ఇతరులు చేసే వంటకాలను అంతే ఆక్షేపిస్తూ ఉంటాడు. రామ్సే తాజాగా మన ప్రియాంక చోప్రా చేసిన వంటపై కామెంట్ చేశాడు. హాలీవుడ్ ప్రాజెక్టుల కోసం ప్రియాంక ఏడాదిగా అమెరికాలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఓ టాక్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రియాంక సరదాగా కిచిడి, చికెన్ సూప్ చేసి సదరు షోలో చూపించింది. ఆ షోలో రామ్సే కూడా ఉన్నాడు. ప్రియాంక వండింది రుచి చూసి కనీసం ఆమె కూడా ఓ సెలబ్రెటీనే అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ‘ఛీ.. ఇది కుక్కకు పెట్టే ఫుడ్‌లా ఉంది’ అనేశాడు. అంతే ఒక్కసారిగా ప్రియాంక అభిమానులు రామ్సేపై ట్వీటర్ అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రియాంకను అంత మాట అంటావా? అంటూ తిట్టి పోశారు. అయితే, రామ్సే కామెంట్‌పై ప్రియాంక చోప్రా ఇంకా స్పందించలేదు. -
నాటుకోడి పులుసు గురించి మాట్లాడిన చంద్రబాబు
హైదరాబాద్: ఎప్పుడు సీరియస్‌గా ఉండే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నోరూరించే మాటలు మాట్లాడారు. నాటుకోడి పులుసు, రాగి సంకటిల ప్రత్యేకతల గురించి చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి రాసిన నవ్యాంధ్ర పుస్తకాన్ని ఈరోజు ఆయన ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాటుకోడి పులుసు, రాగిసంకటి వంటి రాయలసీమ రుచులకు అంతర్జాతీయ బ్రాండ్ కల్పించాల్సి ఉందన్నారు. ఎక్కడా లేనంత సాంస్కృతిక సంపద తెలుగునాట ఉందని చెప్పారు. వీటికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాల్సి ఉందన్నారు.