
బెంగళూరు: లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు కొనసాగించడం సరికాదని ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. అలా చేస్తే.. కోవిడ్–19 మరణాల కన్నా ఆకలితో చనిపోయేవారి సంఖ్య ఎక్కువవుతుందని హెచ్చరించారు. ఇకపై కరోనా ఉనికిని అంగీకరించక తప్పదని స్పష్టం చేశారు. సాధారణ స్థితికి వెళ్లక తప్పదని, ఆరోగ్యవంతులు తమ విధులను నిర్వర్తించాలని, అదే సమయంలో, వైరస్ ప్రభావం తీవ్రంగా పడే వ్యక్తులను కాపాడుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. ‘లాక్‌డౌన్‌ను ఎక్కువ కాలం కొనసాగించకూడదు. అదే జరిగితే కోవిడ్‌తో కన్నా ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి తలెత్తుతుంది’ అని ‘ఎకనమిక్ టైమ్స్’ బుధవారం నిర్వహించిన ‘ఈటీ అన్‌వైర్డ్– రీఇమాజినింగ్ బిజినెస్’ అనే వెబినార్‌లో దేశ ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment