Infosys founder Narayana Murthy
-
Infosys Narayana Murthy: అమెరికా వ్యాపారవేత్త వల్ల... స్టోర్ రూంలో నిద్రించాను
న్యూఢిల్లీ: అది ఇన్ఫోసిస్ అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న తరుణం. న్యూయార్క్‌కు చెందిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ దాని పెద్ద కస్టమర్లలో ఒకటిగా ఉండేది. దాని అధిపతి డాన్ లైల్స్‌కు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అంటే నచ్చేది కాదు. ఓసారి ఆయనతో భేటీ కోసం న్యూయార్క్ వెళ్లిన నారాయణమూర్తి ఆ రాత్రి డాన్ నివాసంలోనే నిద్ర పోవాల్సి వచి్చంది. ఇంట్లో నాలుగు బెడ్రూములున్నా నారాయణమూర్తి అంటే కిట్టని డాన్ మాత్రం ఆయన్ను తన సంస్థ స్టోర్ రూంలో పడుకొమ్మన్నాడు! అదీ, కనీసం కిటికీ కూడా లేని చోట, అట్టపెట్టెల మధ్య పడున్న ఓ పెద్ద బాక్స్‌పై! డాన్ వల్ల అప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇన్ఫోసిస్ కోసం భరించిన తనకు ఈ అవమానకర ఘటన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయిందంటారు నారాయణ మూర్తి. ‘‘అతిథి దేవుడితో సమానమని మా అమ్మ చెప్పేవారు. అనుకోకుండా ఎవరైనా వస్తే అమ్మ తాను తినకుండా వారికి వడ్డించేవారు. పస్తు పడుకునేవారు’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘యాన్ అన్ కామన్ లవ్: ది అర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి’ పుస్తకంలో ఇలాంటి ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి. భారతీయ అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన ఈ పుస్తకాన్ని జగ్గర్నాట్ బుక్స్ ప్రచురించింది. ఇన్ఫోసిస్ ఆవిర్భావం నుంచి వారి వివాహం, తల్లిదండ్రులవడం తదితర పరిణామాలన్నీ అందులో ఉన్నాయి. సుధా మూర్తి మంచి ఇంజినీర్ అయినా ఇన్ఫోసిస్‌లో చేరడం నారాయణ మూర్తికి తొలుత అస్సలు ఇష్టం లేదట. కుటుంబ యాజమాన్యాల్లోని సంస్థల ఇబ్బందులు ఆయన కళ్లారా చూడటమే అందుకు కారణమని రచయిత్రి వివరించారు. వారిద్దరిదీ అసాధారణ ప్రేమ కథ అని చెప్పుకొచ్చారు. సోషలిజాన్ని బాగా ఇష్టపడే మూర్తి రష్యన్ ప్రపంచ భాష అవుతుందని నమ్మేవారట. రెండేళ్లపాటు రష్యన్ తెగ నేర్చుకున్నారట. సుధా మూర్తి మాత్రం ఇంగ్లిషే ప్రపంచ భాష అవుతుందని చెప్పేవారట. -
ఇన్ఫోసిస్ మూర్తిపై మహాభారత పాత్ర ప్రభావం.. అప్పట్లో కరుడుకట్టిన వామపక్షవాది!
ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. దేశంలో సాఫ్ట్వేర్ పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేసింది ఆయనే. ఆయన తరచూ పలు వేదికలపైన పారిశ్రామిక రంగంలో ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. పలు అంశాల్లో యువతకు మార్గదర్శనం చేస్తుంటారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి అద్భుత కావ్యం మహాభారతంలో తనను అమితంగా ప్రభావితం చేసిన పాత్ర గురించి వివరించారు. అందులోని కర్ణుడి పాత్ర ప్రభావం తనపై ఎక్కువగా ఉందని చెప్పారు. కర్ణుడి దాన గుణం సాటి లేనిదని, ఆ ప్రభావంతోనే తాను పెరిగినట్లు తెలిపారు. అదే కార్యక్రమంలో మూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశలో కరుడుకట్టిన వామపక్షవాదిగా తాను తర్వత వ్యాపారవేత్తగా ఎలా మారాడో.. ఆ సైద్ధాంతిక పరివర్తన గురించి వెల్లడించారు. విఫలమైన తన మొదటి వ్యాపార ప్రయత్నం గురించి తెలిపారు. ఆ సమయంలో కంప్యూటర్లకు మార్కెట్ లేదని, అప్పట్లో భారతదేశంలో చాలా తక్కువ కంప్యూటర్లు ఉండేవని వివరించారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌ను స్థాపించినప్పుడు మార్కెట్ ఎక్కువగా ఉన్న దేశాలకు ఎగుమతులపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్‌లోనే.. యజమాని ఒకప్పటి క్రికెటర్, రాజకీయ నాయకుడు -
సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?
Infosys Narayana Murthy Success Story: భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పారిశ్రామిక వేత్తల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి.. జీవితాన్ని విజయ పథంలో తీసుకెళ్లి ఎంతో మందికి ఆదర్శప్రాయమైన వ్యక్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'ఎన్ఆర్ నారాయణ మూర్తి' (NR Narayana Murthy). చదువుకునే రోజుల్లోనే అనేక ఉద్యోగ ఆఫర్లను వదులుకుని సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాడు. నిజానికి నారాయణ మూర్తి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ నుంచి మాస్టర్స్ పూర్తి చేసారు. ఆ సమయంలోనే ఆయనకు ఎయిర్ ఇండియా, టెల్కో (Telco), టిస్కో (Tisco) వంటి పెద్ద పెద్ద సంస్థల నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయి. కానీ వచ్చిన అన్ని ఉద్యోగాలను వదిలేసి.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) అహ్మదాబాద్‌లో చీఫ్ సిస్టమ్ ప్రోగ్రామర్‌గా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. (ఇదీ చదవండి: ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక బోగీ నిర్మాణానికి అన్ని కోట్లా?) సగం జీతానికే పని చేసారు.. వచ్చిన మంచి ఉద్యోగాలను వదిలిపెట్టి నారాయణ మూర్తి మాదిరిగా నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదు. కానీ భారతదేశంలో మొదటి సారి షేరింగ్ సిస్టం ఇన్స్టాల్ చేయాలనే ఆలోచన ఉన్న మూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 16 మంది విద్యార్థులున్న బ్యాచ్‌లో సిస్టం గురించి, తెలివైన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లభించింది. కంప్యూటర్ ఉపయోగించి చాలా ఇంటరాక్టివ్ పాఠాలను రూపొందించే అవకాశం గురించి తెలుసుకోవాలనే తపనతో సగం జీతం తీసుకున్న ఏకైక వ్యక్తి నేనే అని నారాయణ మూర్తి ఒక సందర్భంలో అన్నారు. అప్పట్లో తాను తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని కూడా వెల్లడించారు. (ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!) 1981లో నారాయణ మూర్తి ఆరుగురు సాఫ్ట్వేర్ నిపుణులతో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. అప్పట్లో ఈ కంపెనీ స్థాపించడానికి పెట్టిన పెట్టుబడి కేవలం రూ. 10,000 మాత్రమే. ఈ రోజు కంపెనీ విలువ ఏకంగా రూ. 5,25,000 కోట్లు . నారాయణ మూర్తి నికర ఆస్తుల విలువ సుమారు రూ. 33,800 కోట్లు అని తెలుస్తోంది. వచ్చిన ఉద్యోగంతో సరిపెట్టుకుని ఉండి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద సామ్రాజ్యం స్థాపించి ఉండేవాడు కాదు. కావున అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నెన్నో సాహసాలు చేయాల్సి ఉంటుందని నారాయణ మూర్తి జీవితమనే మనకు చెబుతుంది. -
చాట్‌జీపీటీపై నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?
ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా వినిపిస్తున్న పేరు చాట్‌జీపీటీ. ఈ చాట్‌జీపీటీ చేయలేని పనిలేదంటూ చాలా దేశాలు ఇప్పటికే పలుమార్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే చాట్‌బాట్ ఎన్ని అద్భుతాలు చేసినా మనుషులను రీప్లేస్ చేయలేవని ఇన్ఫోసిస్ ఫౌండర్ 'నారాయణ మూర్తి' అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే అగ్రదేశాల్లో చాట్‌జీపీటీ హవా వేగంగా నడుస్తోంది. దీని వల్ల రానున్న రోజుల్లో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని కొంతమంది గతంలో వ్యాఖ్యానించారు. కానీ ఏదైనా సమాచారం సేకరించడానికి చాట్‌జీపీటీ చాలా ఉపయోగపడుతుంది, కానీ మనుషులతో పోటీ పడటం కష్టమని నారాయణ మూర్తి అన్నారు. మనిషి మెదడుని మించిన యంత్రం మరొకటి లేదని నమ్మేవారిలో నేను ఒకడినని చెప్పుకొచ్చారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ చాట్‌బాట్ ఉద్యోగుల్ని భర్తీ చేస్తుందన్న ఆందోళనల కారణంగా నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ యంత్రమైన మనిషి నుంచే తయారవుతుందని, అవి కూడా మనుషులకు కేవలం సాధనాలుగా మాత్రమే పనికొస్తాయని ఆయన అన్నారు. ఒక ప్రశ్నను ఇద్దరు మనుషులను అడిగితే వారి తమ సృజనాత్మకతతో వివిధ సమాధానాలు చెబుతారు, కానీ చాట్‌జీపీటీ ఇద్దరు వ్యక్తులు అడిగిన ఒకే ప్రశ్నకు ఒకే సమాధానం ఇస్తుంది. అది ఏ మాత్రం సృజనాత్మకతను చూపించే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చాట్‌జీపీటీ గురించి ఇప్పుడు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నారాయణ మూర్తి అన్నారు. మనిషి సృజనాత్మకత, ఆధునిక టెక్నాలజీ కలిస్తే ఎన్నో అద్భుతాలు పుట్టుకొస్తాయి, అంతే కాకుండా ఎన్నో సమస్యలకు పరిస్కారం కూడా లభిస్తుంది. గతంలో చాట్‌జీపీటీ గురించి మాట్లాడే సందర్భంలో నారాయణ మూర్తి ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో కొంతమంది నిపుణులు చాట్‌జీపీటీ వల్ల మానవాళికి ప్రమాదం ఉందని, ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడని తెలిపారు. -
స్టార్టప్‌ల తీరు ‘పొంజి స్కీమ్’ మాదిరే!: నారాయణమూర్తి
ముంబై: స్టార్టప్‌లు కేవలం ఆదాయం పెంపుపైనే దృష్టి సారిస్తూ, లాభాల గురించి ఆలోచించకుండా.. అదే సమయంలో వాటి మార్కెట్ విలువను పెంచుకోవడం అన్నది పొంజి స్కీమ్ మాదిరేనని, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందడంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, బోర్డు డైరెక్టర్ల పాత్రను తప్పుబట్టాలే కానీ, యువ పారిశ్రామికవేత్తలను కాదన్నారు. నాస్కామ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నారాయణమూర్తి మాట్లాడారు. దీర్ఘకాల ప్రయోజాల కోసం ఇన్ఫోసిస్ సైతం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. విషయాల పట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పారదర్శకంగా, నిజాయితీగా మాట్లాడాలని కోరారు. నిధులు సమీకరించినప్పుడల్లా వ్యాల్యూషన్లను పెంచుకుంటూ పోవడం ప్రమాదకరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా ఘటన వల్ల ఎదురుదెబ్బ లేదా ప్రతికూలతలు ఎదురైతే కంపెనీ ధర అదే మాదిరి పడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఐటీ కంపెనీలపై ఏ మేరకు ఉంటుందనే దానిపై మాట్లాడుతూ.. కష్ట సమయాలు ఎదురైనప్పుడల్లా భారత ఐటీ కంపెనీలు లాభపడినట్టు చెప్పారు. చాట్ జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌లతో భారత ఐటీ ఉద్యోగాలపై ప్రభావం ఉండదన్నారు. గతంలో తానూ ఈ తరహా ప్లాట్‌ఫామ్‌ల కోసం ప్రయత్నించినట్టు చెప్పారు. -
కరోనా ఉనికిని అంగీకరించాల్సిందే!
బెంగళూరు: లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు కొనసాగించడం సరికాదని ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. అలా చేస్తే.. కోవిడ్–19 మరణాల కన్నా ఆకలితో చనిపోయేవారి సంఖ్య ఎక్కువవుతుందని హెచ్చరించారు. ఇకపై కరోనా ఉనికిని అంగీకరించక తప్పదని స్పష్టం చేశారు. సాధారణ స్థితికి వెళ్లక తప్పదని, ఆరోగ్యవంతులు తమ విధులను నిర్వర్తించాలని, అదే సమయంలో, వైరస్ ప్రభావం తీవ్రంగా పడే వ్యక్తులను కాపాడుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. ‘లాక్‌డౌన్‌ను ఎక్కువ కాలం కొనసాగించకూడదు. అదే జరిగితే కోవిడ్‌తో కన్నా ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి తలెత్తుతుంది’ అని ‘ఎకనమిక్ టైమ్స్’ బుధవారం నిర్వహించిన ‘ఈటీ అన్వైర్డ్– రీఇమాజినింగ్ బిజినెస్’ అనే వెబినార్‌లో దేశ ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. -
విదేశీ పెట్టుబడులపై ‘అసహన’ ప్రభావం: కిరణ్ మజుందార్
న్యూఢిల్లీ: రచయితల ఆందోళనలకు మద్దతుగా మాట్లాడిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిని మరిన్ని ‘బిజినెస్’ గొంతుకలు సమర్థించాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై ప్రధాని చర్యలు తీసుకోకపోతే.. దేశంలోకి రావాల్సిన విదేశీ పెట్టుబడులపై ప్రభావం ఉంటుందని బిజినెస్ లీడర్ కిరణ్ మజుందార్ షా, ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ అన్నారు. ‘పెట్టుబడిదారులు సామరస్య వాతావరణాన్ని కోరుకుంటారు. ఆ పరిస్థితులు కల్పించకపోతే కష్టమే’ అని అన్నారు. హేతువాదుల హత్యకు బీజేపీతో సంబంధం లేదని, కొందరు బీజేపీ మంత్రులు, ఎంపీలు ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఈ పరిస్థితులకు కారణమయ్యాయని దేశాయ్ తెలిపారు.