
న్యూఢిల్లీ: అది ఇన్ఫోసిస్ అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న తరుణం. న్యూయార్క్‌కు చెందిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ దాని పెద్ద కస్టమర్లలో ఒకటిగా ఉండేది. దాని అధిపతి డాన్ లైల్స్‌కు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అంటే నచ్చేది కాదు. ఓసారి ఆయనతో భేటీ కోసం న్యూయార్క్ వెళ్లిన నారాయణమూర్తి ఆ రాత్రి డాన్ నివాసంలోనే నిద్ర పోవాల్సి వచి్చంది.
ఇంట్లో నాలుగు బెడ్రూములున్నా నారాయణమూర్తి అంటే కిట్టని డాన్ మాత్రం ఆయన్ను తన సంస్థ స్టోర్ రూంలో పడుకొమ్మన్నాడు! అదీ, కనీసం కిటికీ కూడా లేని చోట, అట్టపెట్టెల మధ్య పడున్న ఓ పెద్ద బాక్స్‌పై! డాన్ వల్ల అప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇన్ఫోసిస్ కోసం భరించిన తనకు ఈ అవమానకర ఘటన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయిందంటారు నారాయణ మూర్తి. ‘‘అతిథి దేవుడితో సమానమని మా అమ్మ చెప్పేవారు. అనుకోకుండా ఎవరైనా వస్తే అమ్మ తాను తినకుండా వారికి వడ్డించేవారు.
పస్తు పడుకునేవారు’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘యాన్ అన్ కామన్ లవ్: ది అర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి’ పుస్తకంలో ఇలాంటి ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి. భారతీయ అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన ఈ పుస్తకాన్ని జగ్గర్‌నాట్ బుక్స్ ప్రచురించింది. ఇన్ఫోసిస్ ఆవిర్భావం నుంచి వారి వివాహం, తల్లిదండ్రులవడం తదితర పరిణామాలన్నీ అందులో ఉన్నాయి.
సుధా మూర్తి మంచి ఇంజినీర్ అయినా ఇన్ఫోసిస్‌లో చేరడం నారాయణ మూర్తికి తొలుత అస్సలు ఇష్టం లేదట. కుటుంబ యాజమాన్యాల్లోని సంస్థల ఇబ్బందులు ఆయన కళ్లారా చూడటమే అందుకు కారణమని రచయిత్రి వివరించారు. వారిద్దరిదీ అసాధారణ ప్రేమ కథ అని చెప్పుకొచ్చారు. సోషలిజాన్ని బాగా ఇష్టపడే మూర్తి రష్యన్ ప్రపంచ భాష అవుతుందని నమ్మేవారట. రెండేళ్లపాటు రష్యన్ తెగ నేర్చుకున్నారట. సుధా మూర్తి మాత్రం ఇంగ్లిషే ప్రపంచ భాష అవుతుందని చెప్పేవారట.
Comments
Please login to add a commentAdd a comment