store room
-
Infosys Narayana Murthy: అమెరికా వ్యాపారవేత్త వల్ల... స్టోర్ రూంలో నిద్రించాను
న్యూఢిల్లీ: అది ఇన్ఫోసిస్ అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న తరుణం. న్యూయార్క్‌కు చెందిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ దాని పెద్ద కస్టమర్లలో ఒకటిగా ఉండేది. దాని అధిపతి డాన్ లైల్స్‌కు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అంటే నచ్చేది కాదు. ఓసారి ఆయనతో భేటీ కోసం న్యూయార్క్ వెళ్లిన నారాయణమూర్తి ఆ రాత్రి డాన్ నివాసంలోనే నిద్ర పోవాల్సి వచి్చంది. ఇంట్లో నాలుగు బెడ్రూములున్నా నారాయణమూర్తి అంటే కిట్టని డాన్ మాత్రం ఆయన్ను తన సంస్థ స్టోర్ రూంలో పడుకొమ్మన్నాడు! అదీ, కనీసం కిటికీ కూడా లేని చోట, అట్టపెట్టెల మధ్య పడున్న ఓ పెద్ద బాక్స్‌పై! డాన్ వల్ల అప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇన్ఫోసిస్ కోసం భరించిన తనకు ఈ అవమానకర ఘటన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయిందంటారు నారాయణ మూర్తి. ‘‘అతిథి దేవుడితో సమానమని మా అమ్మ చెప్పేవారు. అనుకోకుండా ఎవరైనా వస్తే అమ్మ తాను తినకుండా వారికి వడ్డించేవారు. పస్తు పడుకునేవారు’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘యాన్ అన్ కామన్ లవ్: ది అర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి’ పుస్తకంలో ఇలాంటి ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి. భారతీయ అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన ఈ పుస్తకాన్ని జగ్గర్నాట్ బుక్స్ ప్రచురించింది. ఇన్ఫోసిస్ ఆవిర్భావం నుంచి వారి వివాహం, తల్లిదండ్రులవడం తదితర పరిణామాలన్నీ అందులో ఉన్నాయి. సుధా మూర్తి మంచి ఇంజినీర్ అయినా ఇన్ఫోసిస్‌లో చేరడం నారాయణ మూర్తికి తొలుత అస్సలు ఇష్టం లేదట. కుటుంబ యాజమాన్యాల్లోని సంస్థల ఇబ్బందులు ఆయన కళ్లారా చూడటమే అందుకు కారణమని రచయిత్రి వివరించారు. వారిద్దరిదీ అసాధారణ ప్రేమ కథ అని చెప్పుకొచ్చారు. సోషలిజాన్ని బాగా ఇష్టపడే మూర్తి రష్యన్ ప్రపంచ భాష అవుతుందని నమ్మేవారట. రెండేళ్లపాటు రష్యన్ తెగ నేర్చుకున్నారట. సుధా మూర్తి మాత్రం ఇంగ్లిషే ప్రపంచ భాష అవుతుందని చెప్పేవారట. -
బిల్లు కట్టలేదని రోగిని స్టోర్ రూమ్ లో ఉంచిన ఆసుపత్రి వర్గాలు
-
‘మాకేం తెలీదు.. ఎలుకలే తాగాయి’
లక్నో : అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేసి స్టోర్ రూమ్‌లో భద్రపరిచారు పోలీసులు. కొన్ని రోజుల తర్వాత చూడగా ఖాళీ బాటిల్లు పోలీసులను వెక్కిరిస్తూ కనిపించాయి. స్టోర్ రూమ్‌లో భద్రపరిచిన మద్యం మాయమవడం కంటే.. దానికి పోలీసులు చెప్పిన కారణం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్టోర్ రూమ్‌లో దాచిన మద్యాన్ని ఎలుకలు తాగాయంటున్నారు పోలీసులు. అది కూడా దాదాపు 1000 లీటర్ల మద్యాన్ని. మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం అంటూ తేల్చారు పోలీసులు. బరేలీ కంటోన్మేంట్ పోలీస్ స్టేషన్లో జరిగింది ఈ సంఘటన. వివరాలు.. పిచ్చికుక్క ఒకటి పోలీస్ స్టేషన్ స్టోర్ రూమ్‌లో దూరింది. బయటకు వచ్చే దారిలేక అక్కడే మరణించింది. కొన్ని రోజుల తర్వాత స్టోర్ రూమ్ నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో స్టోర్ రూమ్‌ని తెరిచారు. ఆ సమయంలో సీజ్ చేసి అక్కడ భద్రపరిచిన అక్రమ మద్యం బాటిళ్లు ఖాళీగా కనిపించాయి. ఆ పక్కనే కొన్ని ఎలుకలు ఉన్నాయి. దాంతో ఎలుకలే మద్యం తాగాయని తేల్చారు పోలీసులు. ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్ హెడ్ క్లర్క్ నరేష్ పాల్ మాట్లాడుతూ.. ‘నేను తలుపులు ఓపెన్ చేసినప్పుడు అక్కడ కొన్ని మద్యం బాటిళ్లు ఖాళీగా కనిపించాయి. వాటి పక్కనే కొన్ని ఎలుకలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఎలుకల పనే’ అన్నారు. అయితే పోలీసులు చెప్పిన విషయం నమ్మశక్యంగా లేకపోవడానికి కారణం మాయమయ్యింది లీటరో.. రెండు లీటర్లో కాదు ఏకంగా వెయ్యి లీటర్ల మద్యం. దాంతో డిపార్ట్మెంట్లోని వారే మద్యం బాటిళ్లను స్వాహా చేసి ఎలుకల మీద తోస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ఓ రిటైర్డ్ జువాలజీ ప్రొఫేసర్ మాట్లాడుతూ.. నీరు దొరకనప్పుడు ఎలుకలు మద్యాన్ని తాగుతాయి. అయితే పోలీసులు చెప్పినంత భారీ మొత్తంలో మాత్రం తాగలేవు అన్నారు. గతంలో బిహార్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. పోలీసులు సీజ్ చేసిన అక్రమ మద్యం మాయమయ్యింది. అప్పుడు బిహార్ పోలీసులు కూడా ఎలుకలే మద్యం తాగాయని ఆరోపించారు. -
కీలకం!
పట్టుకోండి చూద్దాం ఆ ఇల్లు ఎప్పుడూ పిల్లాపాపలతో సందడిగా ఉంటుంది. అలాంటిది రెండు మూడురోజులుగా ఒంటరిదీవిలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది రవి ఒక్కడే. ఒక పెళ్లికి హాజరు కావడానికి రవి అమ్మానాన్నలు, ముగ్గురు అన్నయ్యలు, వదినలు, పిల్లలు రాజమండ్రి వెళ్లారు. పరీక్షలు ఉండడం వల్ల ఇంట్లోనే ఉండిపోయాడు రవి. కొన్ని గంటల పాటు ఏకధాటిగా చదువుకున్న తరువాత రిలాక్స్ కావడం కోసం ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం రవి అలవాటు. ఆ రోజు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న రవి దృష్టి అక్కడ ఉన్న పాత సామాను మీద పడింది. వాటన్నిటినీ ఇంటి వెనకాల ఉన్న స్టోర్‌రూమ్‌లో పెట్టడానికి కీ కోసం వెదికాడు. స్టోర్‌రూమ్‌కు సంబంధించి ఇంట్లో ఒకటే ‘కీ’ ఉంది. అది పోతే తాళం పగలగొట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు స్టోర్‌రూమ్‌లో కొన్ని వస్తువులను ఒక మూలకు పెట్టాడు. ఎంతో కాలం నుంచి ఆ రూమ్‌లో ఉన్న కొన్ని వస్తువులను చూసి బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాడు. పాత క్రికెట్ బ్యాట్‌ను చేతిలోకి తీసుకున్నాడు. ఈ బ్యాట్ కొనడానికి తాను అమ్మానాన్నలను ఎంత బతిమిలాడింది గుర్తు తెచ్చుకున్నాడు. దీంతో పాటు ఆ బ్యాట్‌తో ఎన్ని మ్యాచ్‌లు ఆడింది, ఎక్కడ ఆడింది, ఎవరెవరితో ఆడింది గుర్తు తెచ్చుకున్నాడు. గదిలో ఒక్కొక్క వస్తువు ఒక్కో జ్ఞాపకాన్ని గుర్తుతెస్తుంది. ఈ జ్ఞాపకాల్లో ఉండగానే బయట అలికిడి వినబడడంతో- ‘ఎవరూ?’ అంటూ స్టోర్‌రూమ్ నుంచి బయటికి వచ్చాడు రవి. ఎవరూ కనిపించలేదు. మళ్లీ స్టోర్‌రూమ్‌లోకి వెళ్లి పాత వస్తువులు, పుస్తకాలను చూస్తూ చాలాసేపు గడిపాడు. ఆ తరువాత స్టోర్‌రూమ్‌కు తాళం వేసి చదువుకోవడానికి స్టడీరూమ్‌కు వెళ్లాడు. ‘ఇంకా సగం వస్తువులు బయటే ఉండిపోయాయి. రేపు ఉదయం వాటి పని చూడాలి’ అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే... బయట మిగిలిన కొన్ని వస్తువులను సర్దడానికి స్టోర్‌రూమ్ తాళం తీశాడు. లోపలికి వెళ్లాడో లేదో... భయంతో గట్టిగా అరిచాడు. స్టోర్‌రూమ్‌లో ఒక మూల శవం! ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలిసులకు సమాచారం అందించాడు. ‘‘ఇతడిని ఎప్పుడైనా చూశావా?’’ శవాన్ని చూపిస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎప్పుడూ చూడలేదు’’ జవాబు ఇచ్చాడు రవి. ‘‘స్టోర్‌రూమ్ ఎన్ని రోజులకు ఒకసారి ఓపెన్ చేస్తారు? ఈ గది తాళం చెవులు ఇంకా ఎవరెవరి దగ్గర ఉన్నాయి?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘అరుదుగా మాత్రమే స్టోర్‌రూమ్‌లోకి వెళతాం. గదికి సంబంధించి ఒక్క కీ మాత్రమే ఉంది’’ చెప్పాడు రవి. ‘‘ఉన్నది ఒక్కటే కీ. అది కూడా మీ ఇంట్లోనే ఉంది. ఇది నీ పనే అని మాకు అనిపిస్తుంది’’ అని రవిని అనుమానించాడు ఇన్స్పెక్టర్. ‘‘నాకు ఎలాంటి పాపం తెలియదు’’ అని నెత్తినోరు బాదుకున్నాడు రవి. కొద్దిసేపటి తరువాత... ఏ ఇన్స్పెక్టర్ అయితే రవిని అనుమానించాడో అదే ఇన్స్పెక్టర్... ‘‘సారీ...నిన్ను అనవసరంగా అనుమానించాను. ఈ హత్య బయటివాళ్ల పనే’’ అని చెప్పాడు. వేసిన తాళం వేసినట్లుగానే ఉంది. మరి రాత్రికి రాత్రే ఆ గదిలోకి శవం ఎలా చేరింది? ఈ కోణంలో చూసినప్పుడు రవిని బలంగా అనుమానించడం తప్ప వేరే దారి లేదు. అయినప్పటికీ ఇన్స్పెక్టర్ నరసింహ ‘ఇది నీ పని కాదు...బయటి వాళ్ల పని’ అని బలంగా ఎలా చెప్పగలిగాడు? అద్దంలో ఆన్సర్ స్టోర్‌రూమ్‌లో ఏదైనా క్లూ దొరుతుందేమోనని కొద్దిసేపు వెదికాడు ఇన్స్పెక్టర్. చిన్న ఆధారం కూడా దొరకలేదు. గది నుంచి బయటికి వస్తున్నప్పుడు అతని దృష్టి తాళంపై పడింది. దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించడం ప్రారంభించాడు. ఒక చోట చిన్నగా మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ కోడ్ కనిపించింది. అది రెండు సంవత్సరాల క్రితం నాటి తాళం అనే విషయం తెలిసిపోయింది. రవి ఇంటి తాళం అయిదు సంవత్సరాల క్రితం నాటిది... చూడడానికి రెండూ ఒకేలా కనిపిస్తాయి. జరిగింది ఏమిటంటే, రాత్రి రవి స్టోర్‌రూమ్‌లో ఉన్నప్పుడు...డోర్‌కు ఉన్న తాళం చెవి స్థానంలో తాను తీసుకువచ్చిన తాళం చెవిని తగిలించాడు హంతకుడు. తన దగ్గర ఉన్న రెండో కీతో ఆ గది తలుపులు తెరిచి అందులో శవాన్ని పెట్టి తిరిగి తాళం వేశాడు. కుడివైపు నుంచి అద్దం పెట్టుకుని చదవండి -
రోగులంటే అంత చులకనా?
నేలపై చిందరవందరగా ఖరీదైన మందులు స్టోర్ రూమ్‌లో కొత్త దిండ్లు, పరుపులు చిరిగిన దిండ్లు, పరుపులపై రోగుల అవస్థలు కోడ్ పాటించకుండా విధులకు హాజరైన వైద్యుడు మండిపడ్డ కో-ఆర్డినేటర్ డాక్టర్ నాయక్ రోగుల కోసం పంపిన పరుపులు స్టోర్ రూమ్‌లో మూలుగుతున్నాయి. రోగుల మంచాలపై చిరిగిపోయిన దిండ్లు, పరుపులు దర్శనమిస్తున్నాయి. ఖరీదైన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు చిందరవందరగా నేలపై పడిఉన్నాయి. స్టాకు రిజిస్టర్లో మందుల వివరాలు అసమగ్రంగా ఉన్నాయి. నక్కపల్లి ముప్ఫయ్ పడకల ఆస్పత్రి సిబ్బంది పనితీరిది. వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ సోమవారం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన నిర్లక్ష్యమిది. నక్కపల్లి, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నక్కపల్లి 30 పడకల ఆస్పత్రి సిబ్బందిపై వైద్యవిధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల జీవితాలతో ఆటలాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఆయన సోమవారం నక్కపల్లి 30 పడకల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందులను భద్రపరిచే గదిని పరిశీలించి అక్కడ రోగులకు వాడే అత్యంత ఖరీదైన మందులు చెల్లా చెదురుగా పడి ఉండటంపై ఫార్మసిస్టు, ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు. డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న స్టోర్ రూం సీడీసీ నుంచి తీసుకొచ్చిన మందులకు రిజిస్టర్‌ను నిర్వహించకపోవడం, రోగుల కోసం ప్రభుత్వం సరఫరాచేసిన బెడ్లను స్టోర్‌రూంలో భద్రపరచడాన్ని కూడా తప్పుపట్టారు. రోగులు చిరిగిపోయిన బెడ్లపై, దిండ్లు లేకుండా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సరఫరా చేసిన పరుపులు, దిండ్లను స్టోర్‌రూంలో భద్రపరచడం సరికాదన్నారు. డాక్టర్ల గదుల్లో కొత్త పరుపులు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా ఉందని, వైద్యాధికారుల పర్యవే క్షణ కొరవడిందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఖరీదైన మందులను భద్రపరచాల్సిన స్టోర్‌రూం డంపింగ్ యార్డు ను తలపిస్తోందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన పరుపులను తక్షణమే వార్డుల్లోని మంచాలపై వేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో మూలుగుతున్న రూ.లక్షల నిధులతో రోగులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఎన్ బీఎస్ యూనిట్‌ను సందర్శించారు. పుట్టిన శిశువు పచ్చకామెర్లు, ఉబ్బసం, ఊపిరాడక, ఉష్ణోగ్రత సరిపోక ఇబ్బందిపడితే కాపాడేందుకు ప్రభుత్వం ఈ ఆస్పత్రిలో నూబోర్న్స్స్టెబిలైజేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. అసలు ఇక్కడ ఆ సౌకర్యం ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఈ సౌకర్యం ఉన్నట్లు అందరికి తెలియజేయాలని అక్కడి ఏఎన్ఎంకు సూచించారు. ఒక వైద్యుడు టీ షర్ట్, జీన్ ప్యాంట్ ధరించి విధులకు హాజరుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ దుస్తుల్లో మిమ్మల్ని రోగులు చూస్తే వైద్యుడని భావిస్తారా?, డ్రస్ కోడ్ పాటించి హుందాగా డ్యూటీ చేయండని’ డాక్టర్ నాయక్ హితవు పలికారు. డ్రస్ కోడ్ పాటించని సిబ్బందిని విధులకు హాజరుకానీయొద్దని వైద్యాధికారి పూర్ణచంద్రరావును ఆదేశించారు. సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రేపటినుంచి విధులకు రాకు యాంటీ బయాటిక్ ఇంజక్షన్లు, మందులను గదిలో ఎక్కడిపడితే అక్కడ చిందరవందరగా పడేసిన ఫార్మసిస్టుపై డాక్టర్ నాయక్ మండిపడ్డారు. ‘నువ్వు ఎంతోమందితో రికమండేషన్లు చేయిస్తే తప్పని పరిస్థితుల్లో నీకు ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చింది. ఇలా బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహిస్తావా? రేపటి నుంచి డ్యూటీకి రాకు. అవసరానికి మించి స్టాకు తీసుకొచ్చి ఇష్టానుసారం పడేసావు. ఎక్కడైనా మందుల కొరత ఏర్పడితే నేనేం చేయాలి? ఏమని సమాధానం చెప్పాలి?’ అని నిలదీశారు. తీసుకొచ్చిన మందుల వివరాలను రికార్డుల్లో రాయకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. పాము, కుక్కకాటు ఇంజక్షన్లకు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కొరత ఉంది. ఈ ఆస్పత్రిలో మాత్రం అవసరానికి, డిమాండ్‌కు మించి స్టాకు ఉన్నాయి. ఇంత ఎక్కువ మొత్తంలో స్టాకు తీసుకువచ్చి సక్రమంగా భద్రపరచ కపోవడంపై డాక్టర్ నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
గుట్టు రట్టవుతుందా?
నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్ : ట్రాన్స్ఫార్మర్లలో వినియోగించాల్సిన, వినియోగించిన పాత కాపర్ తీగను స్టోర్ రూమ్‌లో భద్రపరుస్తారు. 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లలో మాత్రమే కాపర్ ఉంటుంది. 200 కేవీ, 160 కేవీ,100 కేవీ, 60 కేవీ ట్రాన్స్ఫార్మర్లలో అల్యూమినియం ఉంటుంది. మరమ్మతుల తర్వాత ట్రాన్స్ఫార్మర్ల నుంచి తీసిన కాపర్‌ను, అల్యూమినియంను అమ్మాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. అసలు అమ్మడం సాధ్యం కాని పని. ఇక్కడి అధికారు లు మాత్రం చాలా సులువుగా వాటిని అమ్మేశారు. పాత కాపర్ వైరు 40 ట న్నులు, అల్యుమినియం 70 టన్నులు స్టోర్ రూమ్‌లో ఉన్నట్లు అధికారులు ఈ నెల 24న ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. ఎన్పీడీసీ ఎల్ సీఎండీ ఇదే విషయమై ఒక ఏడీఏ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వివరాలు చెప్పరట అసలు లెక్కపత్రం తేల్చడానికి ఎస్ఈ ముగ్గురు అధికారులతో కమిటీ వేశారు. స్టోర్‌లో ఉన్న కాపర్‌ను, అల్యూమిని యాన్ని తూకం వేయించారు. వివరాలు చెప్పడానికి మాత్రం జంకుతున్నారు. అదేమంటే ఇంకా లెక్కలు జరుగుతున్నాయంటూ తప్పించుకుంటున్నారు. నిందితులు దాదాపు 20 టన్నుల కాప ర్, 20 నుంచి 30 టన్నుల వరకు అల్యూమినియాన్ని అమ్ముకున్నట్టు సమాచారం. ఒక్క కిలో కాపర్ రూ.300 నుంచి రూ. 400 వరకు ఉంటుంది. అల్యూమినియం రూ. 150 నుంచి రూ. 170 వరకు ఉంటుంది. దీని ప్రకారం మాయమైన తీగ విలువ దాదాపు రూ. 60 లక్షలు ఉంటుంది. ఈ విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాగుతున్న లెక్కలు? అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వ్యవహారంలో విచారణ జరిపి రెండు రోజులలో నివేదిక ఇవ్వాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశించినా బేఖాతరు చేశారు. ఇంకా లెక్కలు పూర్తి కాలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాస్తవానికి ఈ నెల 27 వరకే తీగల తూకాలు పూర్తి అయ్యాయి. వివరాలను మాత్రం బయటకు రానివ్వడం లేదు. కమిటీ సభ్యులను అడిగితే ఎస్ఈని అడగమంటున్నారు. ఆయన నోరు విప్పడం లేదు. భయపడుతూనే ఈ వ్యవహారం మీద సీఎండీ కార్తికేయ మిశ్రా సీరియస్‌గా ఉన్నారని తెలిసి జిల్లా స్థాయి అధికారులు భయపడుతూనే, చేయాల్సింది చేస్తున్నారు. అక్రమార్కులను కాపాడడానికి స్టోర్ రూమ్ లో మాయమైన కాపర్‌ను గుట్టుచప్పు డు కాకుండా తిరిగి అక్కడ పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం మహారాష్ట్రలో పాత కాపర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న ట్లు సమాచారం. సీఎండీ ప్రత్యేక విచారణ జరిపితేనే ఈ విషయం తేలేలా ఉందని పలువురు పేర్కొంటున్నారు.