కీలకం! | Mirror? | Sakshi
Sakshi News home page

కీలకం!

Published Sun, May 29 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

కీలకం!

కీలకం!

పట్టుకోండి చూద్దాం
ఆ ఇల్లు ఎప్పుడూ పిల్లాపాపలతో సందడిగా ఉంటుంది. అలాంటిది రెండు మూడురోజులుగా ఒంటరిదీవిలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది రవి ఒక్కడే. ఒక పెళ్లికి హాజరు కావడానికి రవి అమ్మానాన్నలు, ముగ్గురు అన్నయ్యలు, వదినలు, పిల్లలు రాజమండ్రి వెళ్లారు. పరీక్షలు ఉండడం వల్ల ఇంట్లోనే ఉండిపోయాడు రవి. కొన్ని గంటల పాటు ఏకధాటిగా  చదువుకున్న తరువాత రిలాక్స్ కావడం కోసం ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం రవి అలవాటు. ఆ రోజు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న రవి దృష్టి అక్కడ ఉన్న పాత సామాను మీద పడింది.

వాటన్నిటినీ ఇంటి వెనకాల ఉన్న స్టోర్‌రూమ్‌లో పెట్టడానికి కీ కోసం వెదికాడు. స్టోర్‌రూమ్‌కు సంబంధించి ఇంట్లో ఒకటే ‘కీ’ ఉంది. అది పోతే తాళం పగలగొట్టడం తప్ప వేరే మార్గం లేదు.
 ఆ రోజు స్టోర్‌రూమ్‌లో కొన్ని వస్తువులను ఒక మూలకు పెట్టాడు.
  ఎంతో కాలం నుంచి ఆ రూమ్‌లో ఉన్న కొన్ని వస్తువులను చూసి బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాడు.
 పాత క్రికెట్ బ్యాట్‌ను చేతిలోకి తీసుకున్నాడు. ఈ బ్యాట్ కొనడానికి తాను అమ్మానాన్నలను ఎంత బతిమిలాడింది గుర్తు తెచ్చుకున్నాడు. దీంతో పాటు ఆ బ్యాట్‌తో ఎన్ని మ్యాచ్‌లు ఆడింది, ఎక్కడ ఆడింది, ఎవరెవరితో ఆడింది గుర్తు తెచ్చుకున్నాడు.
 
గదిలో ఒక్కొక్క వస్తువు ఒక్కో జ్ఞాపకాన్ని గుర్తుతెస్తుంది.
  ఈ జ్ఞాపకాల్లో ఉండగానే బయట అలికిడి వినబడడంతో-
 ‘ఎవరూ?’ అంటూ స్టోర్‌రూమ్ నుంచి బయటికి వచ్చాడు రవి.
  ఎవరూ కనిపించలేదు.
 మళ్లీ స్టోర్‌రూమ్‌లోకి వెళ్లి పాత వస్తువులు, పుస్తకాలను చూస్తూ చాలాసేపు గడిపాడు.
  ఆ తరువాత స్టోర్‌రూమ్‌కు తాళం వేసి చదువుకోవడానికి స్టడీరూమ్‌కు వెళ్లాడు.
 ‘ఇంకా సగం వస్తువులు బయటే ఉండిపోయాయి. రేపు ఉదయం వాటి పని చూడాలి’ అనుకున్నాడు.
   
మరుసటి రోజు ఉదయమే... బయట మిగిలిన కొన్ని వస్తువులను సర్దడానికి స్టోర్‌రూమ్ తాళం తీశాడు.
 లోపలికి వెళ్లాడో లేదో...
 భయంతో గట్టిగా అరిచాడు.
 స్టోర్‌రూమ్‌లో ఒక మూల శవం!
 ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలిసులకు సమాచారం అందించాడు.
 ‘‘ఇతడిని ఎప్పుడైనా చూశావా?’’  శవాన్ని చూపిస్తూ అడిగాడు ఇన్‌స్పెక్టర్.
 
‘‘ఎప్పుడూ చూడలేదు’’ జవాబు  ఇచ్చాడు రవి.
 ‘‘స్టోర్‌రూమ్ ఎన్ని రోజులకు ఒకసారి ఓపెన్ చేస్తారు? ఈ గది తాళం చెవులు ఇంకా ఎవరెవరి దగ్గర ఉన్నాయి?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘అరుదుగా మాత్రమే స్టోర్‌రూమ్‌లోకి వెళతాం. గదికి సంబంధించి ఒక్క కీ మాత్రమే ఉంది’’ చెప్పాడు రవి.
 ‘‘ఉన్నది ఒక్కటే కీ. అది కూడా మీ ఇంట్లోనే ఉంది. ఇది నీ పనే అని మాకు అనిపిస్తుంది’’ అని రవిని అనుమానించాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘నాకు ఎలాంటి పాపం తెలియదు’’ అని నెత్తినోరు బాదుకున్నాడు రవి.
 
కొద్దిసేపటి తరువాత...
  ఏ ఇన్‌స్పెక్టర్ అయితే రవిని అనుమానించాడో అదే ఇన్‌స్పెక్టర్...
 ‘‘సారీ...నిన్ను అనవసరంగా అనుమానించాను. ఈ హత్య బయటివాళ్ల పనే’’ అని చెప్పాడు.
   
 వేసిన తాళం వేసినట్లుగానే ఉంది.
 మరి  రాత్రికి రాత్రే ఆ గదిలోకి శవం ఎలా చేరింది? ఈ కోణంలో చూసినప్పుడు రవిని బలంగా అనుమానించడం తప్ప వేరే దారి లేదు. అయినప్పటికీ ఇన్‌స్పెక్టర్ నరసింహ ‘ఇది నీ పని కాదు...బయటి వాళ్ల పని’ అని బలంగా ఎలా  చెప్పగలిగాడు?
 
అద్దంలో ఆన్సర్
స్టోర్‌రూమ్‌లో ఏదైనా క్లూ దొరుతుందేమోనని కొద్దిసేపు వెదికాడు ఇన్‌స్పెక్టర్. చిన్న ఆధారం కూడా దొరకలేదు. గది నుంచి బయటికి వస్తున్నప్పుడు అతని దృష్టి తాళంపై పడింది. దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించడం  ప్రారంభించాడు. ఒక చోట చిన్నగా మాన్యుఫ్యాక్చరింగ్  డేట్ కోడ్ కనిపించింది. అది రెండు సంవత్సరాల క్రితం నాటి తాళం అనే విషయం తెలిసిపోయింది.

రవి ఇంటి తాళం అయిదు సంవత్సరాల క్రితం నాటిది... చూడడానికి రెండూ ఒకేలా కనిపిస్తాయి. జరిగింది ఏమిటంటే,  రాత్రి రవి  స్టోర్‌రూమ్‌లో ఉన్నప్పుడు...డోర్‌కు ఉన్న తాళం చెవి స్థానంలో తాను తీసుకువచ్చిన తాళం చెవిని తగిలించాడు హంతకుడు. తన దగ్గర ఉన్న రెండో కీతో ఆ గది తలుపులు తెరిచి అందులో శవాన్ని పెట్టి తిరిగి తాళం వేశాడు.
కుడివైపు నుంచి అద్దం పెట్టుకుని చదవండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement