
శాలిగౌరారం(నల్గొండ) : అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, తనను ఇంటిలో నుంచి బయటకు వెళ్లగొట్టి, మరో మహిళతో సహజీవనం చేస్తూ.. తన అడ్డు తొలగించుకునేందుకు అసత్య ప్రచారం చేస్తున్న తనభర్త అయిన హైదరాబాద్‌లోని ఆబిడ్స్ సీఐ(డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్) కుంభం నర్సింహపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఐ భార్య కుంభం సంధ్య కోరారు. మండలంలోని బండమీదిగూడెంలో తన తల్లిగారింటి వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తనగోడును వెల్లబోసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన కుంభం నర్సింహతో తనకు 2012 ఏప్రిల్ 18న వివాహం జరిగిందన్నారు.
వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.18.50 లక్షలు ఇవ్వడంతోపాటూ పది తులాల బంగారు ఆభరణాలను పెట్టారన్నారు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టడంతో గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు పెట్టి అదనంగా మరో రూ. 2 లక్షలు అప్పజెప్పారన్నారు. అంతటితో ఆగకుండా తన తల్లిదండ్రుల వ్యవసాయ భూమిలో భాగం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారన్నారు.
ప్రస్తుతం తమకు కుమార్తె(10), కుమారుడు(05) ఉన్నారన్నారు. తన భర్త వేధింపులు తట్టుకోలేక తన ఇద్దరు పిల్లలతో తన తల్లిగారింటి వద్ద ఉండడంతో తనపై పిల్లల కిడ్నాప్ కేసు పెట్టారని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న తనభర్త సీఐ కుంభం నర్సింహపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సీఐ నర్సింహను ఫోన్‌లో వివరణ కోరగా.. తన భార్యతో గొడవలు జరుగుతున్న విషయం వాస్తవమేనన్నారు. విడాకుల కోసం తాను కోర్టును ఆశ్రయించానని, కేసు కోర్టులో ఉండడంతో కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఈ విషయంపై మాట్లాడతానన్నారు.