
న్యూఢిల్లీ: రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దలీవాల్ అసలు సిసలైన రైతు నాయకుడని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయనకు రాజకీయ అజెండా లేదని వెల్లడించింది. రైతుల సమస్యల పరిష్కారం కోసం దలీవాల్ నాలుగు నెలలపాటు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన దీక్ష విరమించారు. ఎలాంటి రాజకీయ అజెండా లేకుండా రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న నిజమైన నేత దలీవాల్ అని సుప్రీంకోర్టు ప్రశంసించింది. పంజాబ్– హరియాణా సరిహద్దులోని ఖానౌరీ, శంభులో రైతుల నిరనసన శిబిరాలు ఇటీవల మూతపడ్డాయి.
రహదారులపై రాకపోకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పంజాబ్ అడ్వొకేట్ జనరల్ గుర్మీందర్‌సింగ్ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో దలీవాల్‌పై న్యాయస్థానం ప్రశంసల వర్షం కురిపించింది. రైతు సమస్యల పరిష్కారానికి ఆయన నిజాయతీగా కృషి చేస్తున్నారని, మరికొందరు నాయకులు మాత్రం సమస్యలు పరిష్కారం కావొద్దని కోరుకుంటున్నారని ఆక్షేపించింది. ఈ నెల 19వ తేదీన అరెస్టయిన రైతు సంఘం నేతలు పాంధర్, కోహర్, కోట్రాతోపాటు ఇతర నాయకులు శుక్రవారం జైళ్ల నుంచి విడుదలయ్యారు.