
టెక్ నిపుణులకు ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్(Infosys) తీపికబురు చెప్పింది. 40కి పైగా స్కిల్ సెట్లలో పని చేసేందుకు టెక్ వర్కర్ల కోసం చూస్తున్నట్లు పేర్కొంది. లేటరల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా అనేక పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, జావా, పైథాన్, డాట్‌నెట్, ఆండ్రాయిడ్/ఐఓఎస్ డెవలప్‌మెంట్, ఆటోమేషన్ టెస్టింగ్ వంటి వివిధ రంగాల్లో నైపుణ్యాలున్న నిపుణుల కోసం కంపెనీ అన్వేషిస్తోంది. కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పిస్తుంది.
గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కంపెనీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లోని డెవలప్‌మెంట్ సెంటర్లలో వాక్‌ఇన్ రిక్రూట్‌మెంట్ల ద్వారా నిపుణులను భర్తీ చేసింది. గత తొమ్మిది నెలలుగా ఇన్ఫోసిస్ భారీగా నియామకాలు చేపట్టలేదు. దాంతో కొన్ని విభాగాల్లో ఖాళీలు మిగిపోయాయి. తాజా నియామక ప్రక్రియ ఈ సమస్యను తీరుస్తుందని కంపెనీ భావిస్తోంది. నియామకాలకు సంబంధించి కంపెనీ అంతర్గతంగా ఉద్యోగులకు వివరాలు వెల్లడించింది.
వచ్చే ఏడాదిలో 20,000 మంది ఫ్రెషర్స్‌కు..
కంపెనీ ఏటా నిర్వహించే లేటరల్ హైరింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగానే ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్రెషర్స్, లేటరల్ నియామకాల మధ్య వ్యత్యాసాలు తలెత్తకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ ఇదివరకే ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సాఫ్ట్‌వేర్ సంస్థలో మొత్తంగా 3,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: నటి మెడికల్ వేవర్ అభ్యర్థన తిరస్కరణ
చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ ఉద్యోగుల అవసరం
అట్రిషన్ల(కంపెనీ మారడం వల్ల ఏర్పడే ఖాళీలు) వల్ల ఏర్పడిన పోస్టులతో పాటు కొనసాగుతున్న కొత్త ప్రాజెక్టుల్లో పని చేసేందుకు కావాల్సిన ఉద్యోగులను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. సంస్థ కొన్ని చిన్న ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తోందని, వీటికి మానవ వనరులు అవసరమని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment