ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా వినిపిస్తున్న పేరు చాట్‌జీపీటీ. ఈ చాట్‌జీపీటీ చేయలేని పనిలేదంటూ చాలా దేశాలు ఇప్పటికే పలుమార్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే చాట్‌బాట్ ఎన్ని అద్భుతాలు చేసినా మనుషులను రీప్లేస్ చేయలేవని ఇన్ఫోసిస్ ఫౌండర్ 'నారాయణ మూర్తి' అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇప్పటికే అగ్రదేశాల్లో చాట్‌జీపీటీ హవా వేగంగా నడుస్తోంది. దీని వల్ల రానున్న రోజుల్లో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని కొంతమంది గతంలో వ్యాఖ్యానించారు. కానీ ఏదైనా సమాచారం సేకరించడానికి చాట్‌జీపీటీ చాలా ఉపయోగపడుతుంది, కానీ మనుషులతో పోటీ పడటం కష్టమని నారాయణ మూర్తి అన్నారు. మనిషి మెదడుని మించిన యంత్రం మరొకటి లేదని నమ్మేవారిలో నేను ఒకడినని చెప్పుకొచ్చారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ చాట్‌బాట్ ఉద్యోగుల్ని భర్తీ చేస్తుందన్న ఆందోళనల కారణంగా నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ యంత్రమైన మనిషి నుంచే తయారవుతుందని, అవి కూడా మనుషులకు కేవలం సాధనాలుగా మాత్రమే పనికొస్తాయని ఆయన అన్నారు.
ఒక ప్రశ్నను ఇద్దరు మనుషులను అడిగితే వారి తమ సృజనాత్మకతతో వివిధ సమాధానాలు చెబుతారు, కానీ చాట్‌జీపీటీ ఇద్దరు వ్యక్తులు అడిగిన ఒకే ప్రశ్నకు ఒకే సమాధానం ఇస్తుంది. అది ఏ మాత్రం సృజనాత్మకతను చూపించే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చాట్‌జీపీటీ గురించి ఇప్పుడు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నారాయణ మూర్తి అన్నారు.
మనిషి సృజనాత్మకత, ఆధునిక టెక్నాలజీ కలిస్తే ఎన్నో అద్భుతాలు పుట్టుకొస్తాయి, అంతే కాకుండా ఎన్నో సమస్యలకు పరిస్కారం కూడా లభిస్తుంది. గతంలో చాట్‌జీపీటీ గురించి మాట్లాడే సందర్భంలో నారాయణ మూర్తి ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో కొంతమంది నిపుణులు చాట్‌జీపీటీ వల్ల మానవాళికి ప్రమాదం ఉందని, ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment