‘మందుల’ వాడకంలో మనమే టాప్‌ | Guest Column By Devender Sharma On Pesticide | Sakshi
Sakshi News home page

‘మందుల’ వాడకంలో మనమే టాప్‌

Published Thu, Feb 27 2020 11:57 PM | Last Updated on Thu, Feb 27 2020 11:57 PM

Guest Column By Devender Sharma On Pesticide - Sakshi

క్రిమిసంహారక మందుల తయారీ సంస్థల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా రైతుల ప్రాణాలను బలిగొంటున్నాయని,  ఆ మందులను పంటపొలాల్లో వాడుతున్న రైతులు కేన్సర్‌ వ్యాధికి గురవుతున్నారని అంతర్జాతీయ అధ్యయనాలు భయంగొలిపే నివేదికలను వెలువరిస్తున్నాయి. ప్రపంచ పురుగుమందుల్లో 59 శాతంవరకు వినియోగిస్తున్న భారతదేశం అంతర్జాతీయంగా పురుగుమందుల వినియోగంలో అగ్రస్థానం పొందినట్లు తెలిసింది. పురుగుమందుల కంపెనీలు తయారు చేస్తున్న మందుల్లో 99.9 శాతం మందులు పర్యావరణంలో కలిసిపోతుండగా 0.1 శాతం మందులు మాత్రమే క్రిములను ప్రభావితం చేస్తున్నాయని ప్రొ. డేవిడ్‌ పిమెంటర్‌ యాభయ్యేళ్ల క్రితమే తన శాస్త్ర పరిశోధనా పత్రంలో సమర్పించారు. దీన్ని ముందుగానే గ్రహించి ఉంటే ప్రపంచం పురుగుమందులకు వ్యతిరేకంగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుని ఉండేది.

అంతర్జాతీయ వ్యవసాయ రసాయనిక ఉత్పత్తుల బహుళజాతి సంస్థ బేయర్‌–మోన్‌శాంటో తయారు చేసిన రౌండప్, డికాంబా అనే క్రిమిసంహాకర మందులు కేన్సర్‌ వ్యాధికారకాలను కలిగి ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఆ సంస్థ కేసులు ఎదుర్కొం టోంది. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌ ఎన్జీఓ పబ్లిక్‌ ఐ, యూకేకు చెందిన గ్రీన్‌ పీస్‌ సంస్థలకు చెందిన జర్నలిస్టు పరిశోధనా బృందం ‘అన్‌ఎర్త్‌డ్‌’ చేసిన పరిశోధనలో.. అత్యంత ప్రమాదకరమైన పురుగుమందుల్లో 59 శాతంవరకు వినియోగిస్తున్న భారతదేశం అంతర్జాతీయంగా పురుగుమందుల వినియోగంలో అగ్రస్థానం పొందినట్లు తెలిసింది.

అయితే ది గార్డియన్‌ పత్రిక నివేదిక ప్రకారం, వ్యవసాయ రసాయన ఉత్పత్తుల కంపెనీలు ఈ డేటాతో విభేదిస్తున్నాయి. పరిశోధనా బృందం ప్రకటించిన సమాచారం తప్పుదోవ పట్టిస్తోందని బేయర్‌ కంపెనీ చెబుతోంది కానీ దాన్ని తన సొంత డేటాతో ఎదుర్కోలేకపోయింది. మరోవైపున ఆగ్రో–కెమికల్‌ పరిశ్రమకు చెందిన బలమైన లాబీ గ్రూప్‌ అయిన క్రాప్‌ లైఫ్‌ ఇంటర్నేషనల్‌ ఒక ప్రకటన చేస్తూ, తన ఉత్పత్తులలో 15 శాతం మాత్రమే అత్యంత ప్రమాదకరమైనవిగా ఉంటున్నాయని, వీటిలో కూడా 10 శాతం మందులను రైతులు సురక్షితంగా వాడుతున్నారని తెలిపింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా ఆహార, వ్యవసాయ సంస్థ అభిప్రాయం ప్రకారం అత్యంత ప్రమాదకరమైన పురుగుమందులు అంటే.. ‘అంతర్జాతీయంగా ఆమోదించిన వర్గీకరణ వ్యవస్థల ప్రకారం మానవ ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి తీవ్రమైన, దీర్ఘకాలిక హాని కలిగించేవి’ అని అర్థం.

ఇది 1980లలో నోబెల్‌ గ్రహీత నార్మన్‌ బొర్లాగ్‌తో నేను జరిపిన చర్చను గుర్తుకు తెచ్చింది. పర్యావరణ ఉద్యమానికి దారిచూపుతున్నట్లుగా అప్పట్లో ప్రచారమైన రేచల్‌ కార్ల్‌సన్‌ రాసిన ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ పుస్తకంపై నేను సంధించిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆమె ఒక దుష్టశక్తి అని అభివర్ణించారు. ఆమెలాంటి వ్యక్తులు ప్రపంచంలోనుంచి ఆకలిని తరిమివేయాలని అసలు కోరుకోరని ఆయన విమర్శించారు. పైగా పురుగుమందులు అనేవి ఔషధాల వంటివి అనేశారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుని రైతులు వాటిని ఉపయోగించాలన్నారు. ఆరోజు బొర్లాగ్‌ చెప్పిన మాటలు చర్చనీయాంశమే. కానీ ఆయన అభిప్రాయాలు క్రిములు కలిగించే నష్టాన్నుంచి పంటలను కాపాడేందుకు పురుగుమందులను ఉపయోగించే హరిత విప్లవానికి కీలక వ్యూహాన్ని ఏర్పర్చాయి. కానీ ఏళ్లు గడిచేకొద్దీ, పురుగుమందులు పర్యావరణానికి మరిం తగా హాని కలిగించాయి. రసాయనమందుల వినియోగం, దుర్వినియోగం అనేవి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ నష్టాలకు, పర్యావరణ అసమతుల్యతకు, పురుగుమందుల ప్రభావం నిరోధకతకు, మొత్తం ఆహార సరఫరా వ్యవస్థనే కలుషితం చేసిందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎంత అధికంగా పురుగుమందులు వాడితే అంత అధికంగా ఆకలిని తొలగించవచ్చనే అభిప్రాయం భ్రాంతి మాత్రమే అని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి హిలాల్‌ ఎల్వర్‌ పేర్కొన్నారు. మరింతగా పురుగుమందులు వాడితే ఆకలి సమస్యపై అంత ఎక్కువగా స్వారీ చేయవచ్చనడంలో నిజం లేదు. ఎప్‌ఏఓ ప్రకారం, ఈరోజు మనం 700 కోట్లమందికి ప్రపంచంలో తిండిపెడుతున్నాం. ఉత్పత్తి కచ్చితంగా పెరిగింది. కానీ దారిద్య్రం, అసమానత్వం, పంపిణీయే అసలు సమస్య. పురుగుమందులను దీర్ఘకాలంగా వాడటం అనేది కేన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్‌ వంటి వ్యాధులకు దారితీస్తోందని, హార్మోన్ల విచ్ఛిన్నత, మానవ శరీర అభివృద్ధి క్రమరాహిత్యం, సంతాన విహీనత వంటివి కూడా తలెత్తుతున్నాయని పై నివేదిక వివరించింది.

రౌండప్‌ పురుగుమందులో వాడుతున్న గ్లైపోసేట్‌ మనుషుల్లో కేన్సర్‌కు కారణమవుతోందన్న అంశాన్ని జతచేస్తూ ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ రీసెర్చ్‌ ఆన్‌ కేన్సర్‌ నివేదికను ప్రచురించిన తర్వాత, విషపూరితమైన పురుగుమందుల వాడకానికి వ్యతిరేకంగా అమెరికాలో అనేక వ్యాజ్యాలు ప్రారంభమయ్యాయి. గ్లిపోసేట్‌కు, కేన్సర్‌ వ్యాధికి మధ్య లింకు ఉన్నట్లు యూరోపియన్‌ కమిషన్, అమెరికా పర్యావరణ రక్షణ ఏజెన్సీ వంటి రెగ్యులేటరీ సంస్థలు చెప్పడం లేదని మోన్‌శాంటో చెప్పింది కానీ పలువురు కేన్సర్‌ రోగులు పురుగుమందుల కంపెనీలపై లీగల్‌ కేసులు పెట్టడం ప్రారంభించారు. తాజా గణాంకాలను చూస్తే ఇంతవరకు పురుగుమందుల కంపెనీలపై 42,000 కేసులు పెట్టారు.

కాగా ఫిర్యాదుదారుల సంఖ్య ఇప్పటికే లక్షకు పైగా దాటినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక్క గ్లైపోసేట్‌కు వ్యతిరేకంగానే కాకుండా, మరొక క్రిమిసంహారక మందు అయిన డికాంబాపై కూడా న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 15న మిస్సోరి రైతుకు తన పీచ్‌ ఆర్చర్డ్‌ తోటను పురుగుమందులు ధ్వంసం చేసిపడేశాయన్న ఆరోపణతో ఏకీభవిం చిన అమెరికా ఫెడరల్‌ కోర్టు 265 మిలియన్‌ డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని పురుగుమందుల కంపెనీలను ఆదేశించింది. తన పొరుగున ఉన్న పొలం యజమాని చల్లిన డికాంబా క్రిమిసంహాకర మందు పక్కనే ఉన్న తన పూలతోటకు వ్యాపించి తోట మొత్తాన్ని పాడు చేసిందంటూ ఆ రైతు బేయర్, బీఎఎస్‌ఎఫ్‌ అనే బడా ఆగ్రో–కెమికల్‌ కంపెనీలపై ఫిర్యాదు చేశారు. డికాంబా పురుగుమందు ప్రభావాన్ని తట్టుకునే పత్తిపంట కోసం పొరుగు రైతు ఈ కంపెనీల మందును చల్లగా అది పక్కనున్న తన పొలంలోని పీచ్‌ అర్చర్డ్‌ తోటలోని ఆకులను, చెట్లను చంపేసిందని ఆ రైతు వాదించి మరీ గెలిచారు.

అయితే గ్లైపోసేట్‌ పురుగుమందుకు వ్యతిరేకంగా నడుస్తున్న న్యాయపరమైన లావాదేవీని మనం నిశితంగా పరిశీలించాలి. ఇంతవరకు గ్లైపోసేట్‌కు వ్యతిరేకంగా మూడు వ్యాజ్యాలలో నలుగురు ఫిర్యాదీదారులకు న్యాయస్థానం 2.3 బిలియన్‌ డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని తీర్పు ఇచ్చింది. తన పురుగుమందులు వాడేటప్పుడు కేన్సర్‌ ప్రమాదం పొంచి ఉంటుందని వినియోగదారులను నిర్దిష్టంగా హెచ్చరించడంలో పురుగుమందుల కంపెనీ విఫలమైందని తీర్పులు స్పష్టం చేశాయి. మొట్టమొదటగా 2018 ఆగస్టు నెలలో డెవైన్‌ జాన్సన్‌ అనే తోటల పెంపకందారుకు శాన్‌ప్రాన్సిస్కో న్యాయస్థానం 289 మిలి యన్‌ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని పురుగుమందుల కంపెనీలను ఆదేశించింది. తన పొలంలో గ్లైపోసేట్‌కు చెందిన వివిధ రకాల కాంబినేషన్లను స్ప్రే చేశానని, దీంతో తాను లింపోమా వ్యాధికి గురయ్యానని ఆ రైతు చెప్పారు. 

ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 10 వేల పురుగుమందుల విషప్రభావానికి సంబంధించిన కేసులు సగటున నమోదవుతున్నాయని డౌన్‌ టు ఎర్త్‌  పత్రిక పేర్కొంది. 2015లో ప్రమాదవశాత్తూ పురుగుమందులతో విషప్రభావానికి గురై 7,060 మంది చనిపోయారని జాతీయ నేర నమోదు బ్యూరో పేర్కొంది. వాస్తవానికి దేశంలో రూ. 20,000 కోట్ల విలువైన క్రిమిసంహారక పరిశ్రమలు 2024 వరకు ప్రతి ఏటా 8.1 శాతంతో వృద్ధి సాధించనున్నాయని అంచనా. అంటే పురుగుమందుల కంపెనీల క్రమబద్ధీకరణ విషయంలో లొసుగులను పరిష్కరించడం ఎంత అవసరమో దీన్ని బట్టి తెలుస్తోంది. కేంద్రం తీసుకురానుందని చెబుతున్న పెస్టిసైడ్స్‌ మేనేజ్మెంట్‌ బిల్‌ 2020ను త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్టం క్రిమిసంహారక మందుల కంపెనీలను క్రమబద్ధీకరించడమే కాకుండా తమ మందుల వాడకం ద్వారా రైతులకు కలుగుతున్న ఆరోగ్యపరమైన నష్టాలకు కూడా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పైగా వేలాది మంది రైతులు వేయబోయే కేసులను కూడా మననంలో ఉంచుకోవలసిన అవసరం ఉంది

అయితే దాదాపు అయిదు దశాబ్దాల క్రితం 1970లలో కార్నెల్‌ యూనివర్సిటీకి చెందిన సుప్రసిద్ధ ప్రొఫెసర్‌ డేవిడ్‌ పిమెంటర్‌ చెప్పిన మాటలను ప్రపంచం పట్టించుకుని ఉంటే ఈ 50 ఏళ్లలో జరుగుతూ వచ్చిన నష్టాన్ని నివారించి ఉండేది. పురుగుమందుల కంపెనీలు తయారు చేస్తున్న మందుల్లో 99.9 శాతం మందులు పర్యావరణంలో కలిసిపోతుండగా 0.1 శాతం మందులు మాత్రమే క్రిములను ప్రభావితం చేస్తున్నాయని ఆయన ఆనాడే తన శాస్త్ర పరిశోధనా పత్రంలో సమర్పించారు. అంటే పురుగుమందుల్లోని రసాయనాలు ఒక శాతం మాత్రమే తమ లక్ష్యాన్ని తాకుతున్నాయని అర్థం. దీన్ని ముందుగానే గ్రహించి ఉంటే ప్రపంచం పురుగుమందులకు వ్యతిరేకంగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుని ఉండేది. కానీ ఇంతవరకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?
వ్యాసకర్త: దేవీందర్‌ శర్మవ్యవసాయ నిపుణులు, ఈ–మెయిల్‌ :  hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement