అరచేతి స్వర్గం ‘ఆదాయ భద్రత’ | Palm paradise on Income security | Sakshi
Sakshi News home page

అరచేతి స్వర్గం ‘ఆదాయ భద్రత’

Published Fri, Mar 4 2016 12:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అరచేతి స్వర్గం ‘ఆదాయ భద్రత’ - Sakshi

అరచేతి స్వర్గం ‘ఆదాయ భద్రత’

విశ్లేషణ
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు అల్ప ఉత్పాదకతే అనడం తప్పు. అసలు సమస్య రైతు ‘ఆదాయ భద్రతే.’ వ్యవసాయం లాభసాటి కాకపోవడానికి కారణం, దిగుబడులను పెంచడం రైతులకు తెలియక కాదు. ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం ఉద్దేశపూర్వకంగా రైతులను పేదరికంలో ఉంచి, శిక్షిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతుకు ఉత్పత్తి వ్యయంపై 50శాతం లాభం ఇస్తామన్న వాగ్దానం నుంచి వెనక్కు మళ్లి, ఐదేళ్ల తర్వాత ఉత్తుత్తి  ‘ఆదాయ భద్రత’ కల్పిస్తామనడం శోచనీయం.

 దేశంలోని 17 రాష్ట్రాలలో వ్యవసాయ కార్యకలాపాల నుంచి రైతుకు వచ్చే సగటు వార్షిక ఆదాయం రూ. 20,000. రైతు సొంత వినియోగం కోసం ఉంచుకునే ఉత్పత్తుల విలువను కూడా కలుపుకొని లెక్కించిన సగటు ఇది. మరో విధంగా చెప్పాలంటే, ఈ రాష్ట్రాలలో రైతుకు సగటున నెలకు రూ. 1,666ల అత్యల్ప వేతనం మాత్రమే లభిస్తుంది.
 మీరు వింటున్నది నిజమే, రూ. 1,666 మాత్రమే.
 ఇప్పుడిక మీరే ఆ స్థానంలో నిలిచి చూడండి. మీరే ఒక రైతైతే నెలకు మీకు రూ. 1,666 ఆదాయం మాత్రమే వస్తుంటే ఏం చేస్తారు? మరో ఐదేళ్లు వేచి చూస్తారా? ఆశను నమ్ముకునే బతుకుతూ, ఆ శుభోదయం ఎన్నటికో కదా... అని ఆలోచిస్తూ గడుపుతారా?

 ఐదేళ్లకు అక్కడికే చేరుస్తామని హామీ
 ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో 2016-17 బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ... ‘‘మనం ‘ఆహార భద్రత’కు మించి ఆలోచించి, రైతుకు ‘ఆదాయ భద్రత’ ఉన్నదనే భాననను కల్పించాల్సిన అవసరం ఉంది’’ అంటున్నప్పుడు ఊపిరి బిగబట్టి చూశాను. అయితే ఆయన 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మాత్రం వాగ్దానం చేశారు. అది ఇంకా ఐదేళ్ల సుదూరంలో ఉంది, నా ఆశలన్నీ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి.

 రైతులు మరో ఐదేళ్లు ఆగాలని ఆర్థిక మంత్రి కోరుతున్నారు. ఐదేళ్ల తర్వాత, ఆ వాగ్దానాన్ని నెరవేర్చినా, ఆ 17 రాష్ట్రాలలోని రైతుల నెలసరి ఆదాయం రూ. 3,332కు చేరుతుంది. నిరంతర కృషితో ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో సఫలమైందని సగర్వంగా 2022 ఆర్థిక సర్వే బడాయిపోతుందని అనుకుంటున్నాను. నిజమే, ఎంత గొప్ప ‘విజయం’ అని ఆర్థికవేత్తలూ అంటారు. కానీ ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసి చూస్తే అప్పటికి ఆ రూ. 3,332 సైతం నేడు రైతుకు లభిస్తున్న రూ. 1,666కు సమానమే అవుతుంది. ప్రభుత్వం కల్పించదలచుకున్న ‘ఆదాయ భద్రత ఉన్నదనే భానన’ కచ్చితంగా ఇదే.

 వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో, ఆర్థిక సర్వే సైతం సవివరంగా పేర్కొన్నట్టు గత కొన్నేళ్లుగా వ్యవసాయరంగం దుర్భర పరిస్థి తులను ఎదుర్కొంటున్న సమయంలో... ప్రభుత్వం శస్త్ర చికిత్సలాంటి తక్షణ చర్యలేమైనా చేపడుతుందేమోనని నేను ఆశించాను. రైతు ఆత్మ హత్యల పరంపర సగటున రోజుకు 42 నుంచి, 2015లో రోజుకు 52కు గంతు వేయడాన్ని పరిగణనలోకి తీసుకుంటే... వ్యవసాయరంగం పట్ల తక్షణమే శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఉంది. బడ్జెట్ ప్రసంగంలో ఓ 50 సార్లు వ్యవసాయరంగాన్ని గురించి ప్రస్తావించినంత మాత్రాన తీవ్ర నిర్లక్ష్యానికి, ఉపేక్షకు గురైన ఆ రంగానికి ఒరిగేది ఏమీ లేదు.

 ఉత్పాదకత తక్కువ నడం అబద్ధం
 నేటి వ్యవసాయ సంక్షోభం వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటం ఫలితం కాదు. పంటల దిగుబడులను పెంచడం ఎలాగో రైతులకు తెలియకపోవడం వల్ల వారి ఆదాయాలు ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోవడం లేదు. ఉత్పాదకత ముఖ్యమైనదే. కానీ దానికి తగ్గట్టుగా లాభసాటి ధరలు లేకపోతే రైతు ఆదాయం దెబ్బ తినిపోతుంది. వ్యవ సాయంలో దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రమైన పంజాబ్‌నే ఉదాహరణగా తీసు కోండి. పంజాబ్ రైతులు 99 శాతం నీటి పారుదల సదుపాయం గల ప్రాంతంలో హెక్టారుకు 4,500 కిలోల గోధుమను, 6,000 కిలోల వరిని పండిస్తున్నారు. ఇది చాలా అత్యధిక ఉత్పాతదకతే. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్  లక్ష్యాలుగా పేర్కొన్న సాగునీటి సదుపాయాల విస్తరణ సహా అన్ని సూచికలూ ఇప్పటికే అక్కడ ఉన్నాయి.

 అయినాగానీ, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) లెక్కల ప్రకారం, ఒక హెక్టారులో గోధుమ లేదా వరి సాగుచేస్తే (సాధారణ పంటల పద్ధతినే అనుసరించిన ట్టయితే) లభించే నికర ఆదాయం దాదాపు రూ. 36,000. అంటే నెలకు రూ. 3,000 మాత్రమే. 7వ పేకమిషన్ అమలు లోకి వచ్చాక ఒక బంట్రోతుకు లభించే నెలసరి మూల వేతనం రూ. 18,000తో దీన్ని పోల్చి చూడండి. కొత్తగా నియమించిన బంట్రోతు సైతం ఉద్యోగంలో చేరిన వెంటనే ఆదాయపు పన్ను చెల్లింపుదారుల పరిధిలోకి వచ్చినా నేను ఆశ్చర్యపోను.
 కాబట్టి, భారత వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు అల్ప ఉత్పాదకతేనని ఆర్థిక సర్వే-2016 అనడం తప్పు. అసలు మౌలిక సమస్య, ఆర్థిక మంత్రి సరిగ్గానే చెప్పినట్టు ‘ఆదాయ భద్రతే’.

 రైతు ఊసెత్తినే వామపక్షవాది ముద్ర
 రైతుల ఆదాయాల గురించి మాట్లాడితే చాలు ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, ప్రధాన స్రవంతి మీడియా మీమీద వామపక్షవాది ముద్రను వేసేయడానికి శత విధాలా ప్రయత్నిస్తారు. బడ్జెట్ ప్రసంగంలో ‘వ్యవసాయం’ అనే పదాన్ని కేవలం నొక్కి చెప్పినందుకే చాలా టీవీ చానళ్ల చర్చా బృందాల సభ్యులు తిరస్కార భావంతో నిర్ఘాంతపోవడం గమనించాను. వ్యవసాయం లాభసాటి కాకుండా పోవడానికి కారణం అది అనుత్పాదకమైనది కావడం కాదు, ఇన్నేళ్లుగానూ ఉద్దేశపూర్వకంగానే దాన్ని పేదరికంలో ఉంచేస్తుండటం వల్లనే అనే విషయం వారికి అర్థం కాలేదు. 1970లో రైతులకు క్వింటాలుకు (100 కిలోలు) గోధుమ కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ) రూ. 76 లభించేది. 45 ఏళ్ల తర్వాత, 2015లో గోధుమ మద్దతు ధర క్వింటాలుకు రూ. 1,450కు పెరిగింది. అంటే 19 రెట్లు పెరిగింది.  

 అదే కాలంలో ప్రభుత్వోద్యోగుల మూల వేతనం (డీఏతో కలిపి) 120-150 రెట్లు పెరిగింది. కళాశాల అధ్యాపకులు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల వేతనాలు 150 నుంచి 170 రెట్లు, పాఠశాల ఉపాధ్యాయుల వేతనాలు 280 నుంచి 320 రెట్లు, దేశంలోని అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ అధికారుల వేతనాలు ఏకంగా 1,000 రెట్లు పెరిగాయి. గత 45 ఏళ్లలో ఉద్యోగుల వేతనాలు అసాధారణంగా పెరిగిప్పటికీ, రైతులు తమకు న్యాయంగా రావాల్సిన వాటి కోసమే అల్లాడవలసి వస్తోంది. గోధుమ ధర కూడా అదే కొలబద్దతో పెరిగితే కనీసం 100 రెట్లు పెరిగి ఉండేది, గోధుమ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 7,600 కావాల్సింది. గోధుమ ధర ఆ రీతిన పెరిగితే ఆహార ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోందనేది దీనికి ప్రతి వాదన. కాబట్టి  ఇన్నేళ్లుగానూ కేవలం ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసమే రైతులను శిక్షిస్తున్నారు.

 ‘రైతుకు యాభై శాతం లాభం’ ఏది?
 అందుకే ఎన్డీఏ ప్రభుత్వం, రైతుకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభం ఇస్తామన్న వాగ్దానం నుంచి వెనక్కు మళ్లింది. కనీస మద్దతు ధర  పెరుగుదలను బట్టి చూస్తే రైతు ఆదాయం నామ మాత్రంగా ఏటా 3.2 నుంచి 3.6 శాతం మేరకు పెరుగుతూ వచ్చింది. సంఘటిత రంగంలోని ఇతరులంతా భారీగా వేతనాలలో పెరుగుదలను అందుకుంటున్నా, రైతు లను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు.

 ప్రభుత్వం, తనకు ఉన్న ‘రైతు వ్యతిరేక’ గుర్తింపును తొలగించుకోవ డానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. అందుకోసం వ్యవసాయ రంగంపై ప్రభుత్వ మదుపులను భారీగా పెంచడంతోపాటూ, వ్యవసాయ ఆదాయాన్ని వేగంగా పెంపొందింపజేయడానికి చర్యలను కూడా చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం గనుక, వ్యవసాయదారులకు రూ. 3 లక్షల కోట్ల ఆర్థిక బెయిలవుట్ ప్యాకేజీ (ఉద్దీపన పథకాన్ని) ప్రకటించి, దానిని అనుసరించి రైతులకు నెలకు తప్పక ఇంటికి తీసుకుపోగల ఆదాయం ప్యాకేజీకి హామీని కల్పించడానికి జాతీయ రైతు ఆదాయ కమిషన్‌ను ఏర్పరిస్తే... ఆర్థిక వృద్ధి చక్రాలు వేగంగా తిరిగి ఉండేవి. 60 కోట్ల మంది రైతులకు ‘ఆదాయ భద్రత’ లభించడమే కాదు, భారీ ఎత్తున దేశీయ డిమాండును కూడా సృష్టించి పారిశ్రామిక వృద్ధిని పునరుజ్జీవితం చేసి ఉండేది. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్‌ను (అందిరితో కలిసి అందరికీ సౌభాగ్యం) నిజంగానే సాధించగల ఔషధం ఇది మాత్రమే.

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు, దేవిందర్‌శర్మ
hunger55@gmail.com

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement