వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే, అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటి వరకూ ఇదమిత్దంగా తెలియదు.
మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ప్రతి ఏటా మనం చెల్లిస్తున్న ఈ ‘పరోక్ష మూల్యం’ ఎంత ఎక్కువంటే.. అది మన ఊహకు కూడా అందదు! ఏకంగా 12.7 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరుగుతోందట. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు. 20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు. 12.3%). ఆ తర్వాత స్థానం భారత్ (1.1 లక్షల కోట్ల డాలర్లు. 8.8%)దే.
మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు..
2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి, ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్.ఎ.ఓ. లెక్కతేల్చింది. పర్చేజింగ్ పవర్ పారిటీ (పిపిపి) ప్రకారం డాలర్ మార్పిడి విలువను ఎఫ్‌ఎఓ నిర్థారించింది. భారత్‌కు సంబంధించి డాలర్ మార్పిడి విలువను రూ. 21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ. 25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది. జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ. 14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ. 6.2 లక్షల కోట్ల మేరకు ఏటేటా పర్యావరణ, జీవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది.
సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1. లక్షల కోట్ల మేరకు ప్రతి ఏటా పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే, ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్‌ఎఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగుమందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని ఎఫ్‌ఎఓ పేర్కొంది.
‘పరోక్ష మూల్యా’న్ని లెక్కించేదిలా?
ఆహారోత్పత్తులను మనం మార్కెట్‌లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావాల వల్ల దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపి చూస్తేనే మనకు దానికి చెల్లిస్తున్న ‘అసలు ధర’ పూర్తిగా తెలుస్తుంది. అందుకే దీన్ని ‘హిడెన్ కాస్ట్’ అంటున్నారు. ‘ట్రూ కాస్ట్ అకౌంటింగ్’ అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ ఎఫ్‌ఎఓ లెక్కగట్టింది.
ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’ పేరిట తాజా నివేదికలో ఎఫ్‌ఎఓ వెల్లడించింది. వ్యవసాయం చేసే అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల తినే ఆహారమే మన కు దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తోంది. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవల దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్‌ఎఓ నివేదిక తేల్చింది. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్‌లో 60% మేరకు ఉంది. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్‌ఎఓ తెలిపింది.
మరింత సుస్థిరత వైపు..
సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశ్యంతో పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యం. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తాం. సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల నిర్మాణానికి ఏయే దేశాలు ఏమేమి చర్యలు తీసుకోవచ్చు.. రైతులు, వినియోగదారుల ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు ఏయే చర్యలు చేపట్టవచ్చో స్పష్టంగా సూచిస్తాం. దీని ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించగలరని ఆశిస్తున్నానని ఎఫ్‌ఎఓ డైరెక్టర్ జనరల్ డొంగ్యు క్యూ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment