వ్యక్తిగత తోట – గోర్జో విల్కోపోల్‌స్కీ, పోలండ్
ఆర్థికాభివృద్ధితో నిమిత్తం లేకుండా అభివృద్ధి చెందిన/చెందుతున్న/పేద దేశాలన్నిటిలోనూ ఏదో ఒక స్థాయిలో అర్బన్ అగ్రికల్చర్ ఊపందుకుంది. అయితే, అర్బన్ గార్డెన్లలో ఏ వనరులు వాడుతున్నారు? ఎంత ఆహారం పండిస్తున్నారు? వంటి గణాంకాలు లేకపోతే పాలకులు విధాన నిర్ణయాలు తీసుకోవటం కష్టం. ఈ లోటును పూడ్చడానికి ఐదు పాశ్చాత్య దేశాల్లో (ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా)ని 72 అర్బన్ వ్యవసాయ క్షేత్రాలను/గార్డెన్లను 15 మంది పరిశోధకులు అధ్యయనం చేయగా, పరిమితులకు లోబడి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి.
ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొందరు స్వచ్ఛందంగా కలసి సాగు చేసుకుంటున్న గార్డెన్లు, ఇళ్ల దగ్గర ఖాళీల్లో గృహస్థులు సాగు చేసుకుంటున్నవి, కేవలం అమ్మకం కోసం సాగు చేస్తున్న అర్బన్ క్షేత్రాలు వీటిలో ఉన్నాయి. మట్టిలో సాగు చేసే గార్డెన్లకే పరిమితమై అధ్యయనం చేశారు. హైడ్రోపోనిక్స్ వంటì ‘ప్లాంట్ ఫ్యాక్టరీ’ల జోలికి పోలేదు. పరిశోధకులు స్వయంగా ఈ క్షేత్రాలను, గార్డెన్లను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. అధ్యయనానికి ఎంపిక చేసిన గార్డెన్లు, అర్బన్ ఫామ్స్‌లో కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నవి వున్నాయి. ఫ్రాన్స్ గార్డెనర్లు సగటున 36 ఏళ్లుగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు.
కమ్యూనిటీ గార్డెన్ – ‘మెరైనర్స్ హార్బర్ ఫామ్’, న్యూయార్క్.
కిలో పంటకు..
దిగుబడిలో గార్డెన్లను బట్టి చాలా హెచ్చుతగ్గులున్నాయి. గ్రామీణ పొలాలతో పోల్చితే అనుభవజ్ఞులు నిర్వహించే అర్బన్ గార్డెన్లలో ఉత్పాదకత అధికంగా ఉంది. సరదా కోసం నిర్వహించే లీజర్ గార్డెన్లలో దిగుబడి అంతంత మాత్రమే. కిలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించడానికి సగటున 0.53 చదరపు మీటర్ల భూమి, 71.6 లీటర్ల నీరు, 5.5 కిలోల కంపోస్ట్ అవసరమని ఈ అధ్యయనంలో తేల్చారు. సొంతంగా నీరు పోసుకునే వ్యక్తిగత గార్డెన్లలో కన్నా డ్రిప్ వాడే గార్డెన్లలో ఎక్కువ నీరు ఖర్చవుతోంది!
వ్యక్తిగత తోట – బోషుమ్, జర్మనీ
చదరపు మీటరు స్థలంలో పండిస్తున్న ఉత్పత్తిలో వ్యత్యాసం చాలానే ఉంది. 0.2 నుంచి 6.6 కిలోల మధ్యలో ఉంది. నాన్‌టెస్ (ఫ్రాన్స్)లో అమ్మకం కోసం (గ్రీన్‌హౌస్ ఉంది) పంటలు పండిస్తున్న అర్బన్ ఫామ్‌లో చ.మీ. భూమిలో ఉత్పాదకత అత్యధికంగా 6.7 కిలోలు వస్తోంది. చ.మీ.కి ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి 2,069 కేలరీల ఆహారాన్ని పండిస్తుంటే, పోలండ్‌లో ఓ గార్డెనర్ 52.8 కేలరీలు పండిస్తున్నారు. స్థానిక వాతావరణం, వ్యక్తిగత శ్రద్ధ తదితర అంశాలపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నది తెలిసిందే.
అర్బన్ క్షేత్రం – కాలేజ్ పియర్ మెండెస్ ఫ్రాన్స్, పారిస్, ఫ్రాన్స్
పురుగు మందులు..
మొత్తం 128 రకాల పంటలు కనిపించాయి. ఒక పంట నుంచి 83 పంటలు సాగు చేసే గార్డెనర్లు, ఫామ్స్ ఉన్నాయి. సగటున 16–20 పంటలు ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. వాటంతట అవే పెరిగే తినదగిన ఆకుకూరలు, ఔషధ మొక్కలు, పూలు అదనం. 40% గార్డెన్లు/అర్బన్ ఫామ్స్‌లో ఏ ఇంధనాన్నీ వాడకపోవటం విశేషం. ఈ పాశ్చాత్య అర్బన్ క్షేత్రాల్లో, గార్డెన్లలో సేంద్రియ ఎరువులతో పాటు, రసాయనాలను కూడా వినియోగిస్తున్నట్లు గమనించారు.
కలెక్టివ్ గార్డెన్–యూకే, వ్యక్తిగత తోట – డార్ట్‌మాండ్, జర్మనీ
22% గార్డెనర్లు ..కంపోస్టుతోపాటు రసాయనిక ఎరువులు కూడా వాడుతున్నారు. 51% వ్యక్తిగత గార్డెన్లు, 22% అర్బన్ ఫామ్స్‌లో పురుగుమందులు కూడా వాడుతున్నారు. అయితే, సామూహిక అర్బన్ గార్డెన్లలో మాత్రం పురుగుమందులు అసలు వాడట్లేదు. విష రసాయనాల వల్ల కలిగే నష్టం గురించి వీటి నిర్వాహకులకు స్పష్టమైన అవగాహన, పట్టుదల ఉందని అర్థం చేసుకోవచ్చు. ఐదు దేశాల్లోని అధ్యయనం చేసిన గార్డెన్లు, అర్బన్ పొలాలు
అర్బన్ ఫామ్ – మడ్‌లార్క్స్, యూకే(హెచ్) వ్యక్తిగత గార్డెన్ – లెస్ ఎగ్లాంటియర్స్, నాంటెస్, ఫ్రాన్స్
- పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాగుబడి డెస్క్
(చదవండి: ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!)
Comments
Please login to add a commentAdd a comment