రొయ్యల పెంపకం విజయవంతానికి సీడ్ (పిల్లల) నాణ్యతే కీలకమైన అంశం. టైగర్, వెనామీ వంటి సాగుకు అనువైన రొయ్యల జాతుల వలన ప్రపంచవ్యాప్తంగా ఆక్వా ఒక ముఖ్య పరిశ్రమగా మారింది. చెరువుల్లో రొయ్యల పెరుగుదల, ఆరోగ్యం, బతుకుదల అనేవి నీటి నాణ్యత, చెరువు నిర్వహణ పద్ధతులు, సీడ్ సాంద్రత, మేత నాణ్యత వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. చెరువులో రొయ్య పిల్లలు ఎలా పెరుగుతున్నా యనేది అర్థం చేసుకోవడం దిగుబడిని పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి, సుస్థిరత్వానికి ముఖ్యమైన అంశం.
చెరువులోని నీటి వాతావరణ పరిస్థితులకు రొయ్యల సీడ్ అలవాటు పడే ప్రక్రియపై శ్రద్ధచూపటం చాలా అవసరం. ఈ ప్రక్రియనే ఎక్లిమటైజేషన్ అంటారు. హేచరీలు, చెరువుల మధ్య ఉష్ణోగ్రత, లవణీయత వంటి నీటి నాణ్యత గుణాలలో ఆకస్మిక మార్పులు గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది రొయ్యలలో శారీరక, ప్రవర్తనా సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల చెరువుకు అలవాటుచేయడం, ఈ మార్పులకు రొయ్యలు క్రమంగా సర్దుబాటు అవడానికి తోడ్పడుతుంది. ఒత్తిడి అధికమైతే మరణాలకు దారితీస్తుంది లేదా పెరుగుదల కుంటుపడుతుంది. రొయ్యల సీడ్‌ను చెరువుకు అలవాటు చేయటం ఒక క్లిష్టమైన అంశం. హేచరీలలో రొయ్యపిల్లలు స్థిరమైన, నియంత్రిత ఉష్ణోగ్రతలో పెరుగుతాయి. అయితే చెరువుల్లో వాతావరణ మార్పులు, నీటి ప్రవాహం కారణంగా క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వదిలినప్పుడు ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు రొయ్యల సీడ్‌ను ఒకవిధమైన ’షాక్’ కు గురి చేస్తుంది. వాటి జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమై వ్యాధులకు గురి చేస్తుంది.
అదేవిధంగా, హేచరీ, చెరువు మధ్య లవణీయత (సెలినిటి) హెచ్చుతగ్గులు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. క్రమంగా అలవాటు చేస్తే రొయ్య పిల్లలు చెరువు నీటి లవణీయతకు సర్దుకోగలుగుతాయి. మరో ముఖ్యమైన అంశం నీటిలోని ఆక్సిజన్ స్థాయి. రొయ్యల ఆరోగ్యం, పెరుగుదలను ప్రోత్సహించడానికి హేచరీలు ఎయిరేషన్ ద్వారా అధిక స్థాయిలో ఆక్సిజన్‌ను అందిస్తాయి. అయితే, చెరువుల్లో ఆక్సిజన్ స్థాయి నీటి ఉష్ణోగ్రత, సంఖ్య వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. రొయ్యల సీడ్‌ను చెరువులో సరిగ్గా అలవాటు చేయకపోతే అకస్మాత్తుగా తక్కువ ఆక్సిజన్ స్థాయిలున్నపుడు అవి ఒత్తిడికి గురవుతాయి.
అలాగే, పిహెచ్ హెచ్చుతగ్గులు స్టాకింగ్ సమయంలో పోస్ట్–లార్వాల బ్రతుకుదలపై ప్రభావం చూపెడతాయి. కాబట్టి వాటిని సర్దుబాటు చేయాలి. చెరువు నీటిని విత్తన సంచులకు క్రమంగా కలపడం, తరువాత నెమ్మదిగా చెరువులోకి రొయ్య పిల్లలను విడుదల చేయడం మేలు.
చెరువు నీటికి సరిగ్గా అలవాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. మెరుగైన బతుకుదల
2. మంచి పెరుగుదల
3. వ్యాధి నియంత్రణ లేదా తక్కువ వ్యాధి ప్రమాదాలు
4. పర్యావరణ ఒత్తిడి ప్రభావం తగ్గుదల
5. ఖర్చు తగ్గటం
6. మెరుగైన ఉత్పాదకత
చెరువులో రొయ్యల విత్తనాలను ప్రవేశపెట్టే ముందు, ఉష్ణోగ్రత, పిహెచ్, లవణీయత, నీట కరిగిన ఆక్సిజన్ స్థాయి వంటి కీలక నీటి గుణాలు రొయ్యలకు సరైన స్థాయిలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. వెనామీ రొయ్యలకు అనువైన పరిస్థితులు:
ఉష్ణోగ్రత: 28–32 డిగ్రీల సెల్షియస్
పిహెచ్: 7.5–8.5
లవణీయత: 15–35 పిపిటి (స్థానిక పరిస్థితులను బట్టి)
నీటిలో కరిగిన ఆక్సిజన్: 5 పిపిఎం కన్నా తక్కువ
చెరువు పరిస్థితులు, హేచరీ నీటి మధ్య ముఖ్యమైన వ్యత్యాసాలు ఉన్నట్లయితే, సీడ్ వేయడానికి ముందు సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది (ఉదా.. మంచినీరు, ఎయిరేషన్ మొదలైనవి).
రవాణా సమయంలో ఒత్తిడిని తగ్గించడానికి రొయ్యల సీడ్ ను ( పోస్ట్–లార్వాలు) శుభ్రమైన, ఆక్సిజన్ ఉన్న బ్యాగ్‌లు లేదా ఫైబర్ కంటైనర్లలో రవాణా చేయండి. బ్యాగ్‌లు/కంటెయినర్ల రవాణా సమయంలో ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు రొయ్యలకు హాని కలిగిస్తాయి. పర్యావరణ ఒత్తిడికి ఎక్కువ కాలం గురికావడం సీడ్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి రొయ్యల విత్తనాల రవాణా వేగంగా జరిగేలా చూడండి.
రొయ్యల సీడ్‌ను చెరువుకు అలవాటుచేసే ప్రక్రియ
సాగు చేసే ప్రదేశానికి రొయ్య పిల్లలను చేర్చిన తర్వాత, బ్యాగులను తాడు/కర్రల సహాయంతో చెరువు ఉపరితలంపై కట్టి ఉంచండి. ఉష్ణోగ్రతల సర్దుబాటుకు ఇది సహాయపడుతుంది. తర్వాత సీడ్ బ్యాగ్‌లను తెరిచి క్రమంగా చెరువు నీటిని సీడ్ బ్యాగ్‌లలోకి ప్రవేశపెట్టండి. ప్రతి 10–20 నిమిషాలకు 10–20% చొప్పున కంటైనర్/బ్యాగ్‌లో చెరువు నీటిని కలపండి. ఇది రొయ్యలు క్రమంగా పిహెచ్, ఉష్ణోగ్రత, లవణీయతలో తేడాలకు అనుగుణంగా మారడానికి సహకరిస్తుంది.
కొనుగోలు చేసిన పి.ఎల్. సంఖ్య నీటి గుణాల వ్యత్యాసాల పరిధిని బట్టి కొన్ని గంటల పాటు ప్రక్రియను కొనసాగించండి. ఈ సమయంలో నీటి నాణ్యత గుణాలను నిరంతరం గమనించండి. థర్మామీటర్, రిఫ్రాక్టోమీటర్, పిహెచ్ మీటర్లను ఉపయోగించండి.
చెరువు నీటిలోకి చేరిన రొయ్య పిల్లలు ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యం పాలవటం, మరణాలు పెరగడం వంటి ఒత్తిడికి సంబంధించిన ఏవైనా సంకేతాలు గమనిస్తే.. చెరువు నీటికి వాటిని అలవాటు ప్రక్రియను మరింత నెమ్మదిగా చేయండి లేదా నీటి గుణాలను తగిన రీతిలో మార్చండి. చెరువులోకి రొయ్యలను నెమ్మదిగా వదలండి. రొయ్య పిల్లలను ఒకేసారి చెరువు నీటిలోకి వేసెయ్యకుండా చిన్న బ్యాచ్‌లుగా విడుదల చేయండి.
రొయ్య పిల్లలను చెరువు అంతటా సమానంగా పంపిణీ చేయండి. వాటికి షెల్టర్, ఆక్సిజన్, తగిన ఫీడింగ్ జో¯Œ లు అందుబాటులో ఉంచండి. విడుదల చేసిన తర్వాత, మొదటి కొన్ని రోజులు చెరువు నీటి నాణ్యతను జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ఉష్ణోగ్రత, లవణీయత లేదా ఆక్సిజన్ స్థాయి స్థిరంగా ఉండేలా చూసుకోండి.
రొయ్యల పరిమాణం, వయసుకు తగిన మేత షెడ్యూళ్లను అమలుచేయండి. నీటి నాణ్యత క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి అతిగా మేత ఇవ్వడం మానుకోండి. ఫీడ్ కంపెనీల ద్వారా సరఫరా చేయబడిన ఫీడ్ చార్ట్‌లను అనుసరించండి. మేత తినే తీరు, కదలికలను గమనించడం ద్వారా రొయ్యల ఆరోగ్యాన్ని గమనించండి. ఆరోగ్యకరమైన రొయ్యలు చురుకుగా తింటాయి. ప్రశాంతంగా ఈత కొడతాయి. ఒత్తిడికి సంబంధించిన ఏవైనా సంకేతాలు ఉంటే తక్షణమే పరిష్కరించాలి. ్ర΄ారంభ రోజుల్లో రొయ్య పిల్లలు చిన్నగా ఉంటాయి. స్పష్టంగా కనిపించవు కాబట్టి ఇది చాలా కష్టమైన ప్రక్రియ.
చెరువు నీటికి అలవాటు చేసే ప్రక్రియలో రొయ్య పిల్లలు వ్యాధికారక క్రిములకు గురికాకుండా చూసుకోండి. వ్యాధుల ప్రవేశాన్ని నివారించడానికి రవాణాలో, చెరువు నిర్వహణ పద్ధతుల్లో సరైన పరిశుభ్రతను పాటించండి. చెరువు నీటి నాణ్యత గుణాలు, రొయ్యల ఆరోగ్య వివరాలను ‘రికార్డ్’ చేయండి. ఈ సమాచారం సమస్యలను పరిష్కరించడంలో, భవిష్యత్తులో రొయ్యల సాగులో తగిన మెళకువలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
మరికొన్ని సూచనలు:
నీటి గుణాలను సర్దుబాటు చేస్తే రొయ్య పిల్లలు క్రమంగా, సాఫీగా చెరువుకు అలవాటు పడతాయి.
ఆక్సిజన్ తగినంత అందేలా చూడండి.
ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ సంఖ్యలో రొయ్య పిల్లలను బ్యాచ్‌ల వారీగా రవాణా చేసి, నెమ్మదిగా చెరువు నీటిలోకి విడుదల చేయండి.
రొయ్యలు, చెరువు వాతావరణానికి బాగా సర్దుబాటు అవుతున్నాయని నిర్ధారించుకోవడానికి విడుదల చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు వాటి ఆరోగ్యాన్ని, ప్రవర్తనను నిశితంగా గమనించండి.
చాలా మంది రైతులు రొయ్య విత్తనాన్ని కొనుగోలు చేసి, త్వరగా చెరువులో వేసుకోవాలని ఆత్రంగా వ్యవహరిస్తుంటారున. నెమ్మదిగా చేపట్టాల్సిన ఈ కీలక ప్రక్రియను పట్టించుకోరు. కాబట్టి, రొయ్యల పంట విజయానికి ఉత్తమమైన ప్రారంభాన్ని ఇవ్వటం ముఖ్యం.
ఈ ప్రక్రియలో సీడ్‌ను చెరువుకు అలవాటు చేయడమే కీలకఘట్టం. రొయ్యల సీడ్ ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో హేచరీ/ల్యాబ్‌లోని ఒత్తిడి పరీక్షలు సహాయపడతాయి.
– డా. పి. రామమోహన్‌రావు
(98851 44557), కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment