SHRIMP CULTURE
-
ఉచిత రొయ్య పిల్లల పంపిణీ లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: ఉచిత రొయ్య పిల్లల పంపిణీపై నీలినీడలు అలుముకున్నాయి. అసలు ఈ ఏడాది రిజర్వాయర్లు, చెరువుల్లో రొయ్య పిల్లలు వదులుతారో, లేదో.. తెలియని పరిస్థితిల్లో మత్స్యశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించినా మత్స్యశాఖ నిర్లక్ష్యంతో పథకం నిర్విర్యం అవుతోందని విమర్శలు వస్తున్నాయి. అక్టోబర్ నెల మూడో వారం అయినా రొయ్యల పంపిణీపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో మత్య్సకారులు ఎటూ తోచని పరిస్థితుల్లో ఉన్నారు. మత్య్సకారుల ఆర్థికాభివృద్ధి కోసం గత ఆరేళ్ల నుంచి మత్స్యశాఖ ఉచితంగా రొయ్య పిల్లలను రిజరాయర్లు, చెరువుల్లో వదులుతోంది. 2017లో ప్రారంభమైన ఈ పథకం దశల వారీగా పెరుగుతూ వచ్చి0ది. ఈసారి టెండర్లు పిలవకపోవడంతో అసలు రొయ్య పిల్లల పంపిణీ ఉంటుందా? ఉండదా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రొయ్య పిల్లల పంపిణీపై మత్స్యశాఖ డైరెక్టర్ వివరణ కోసం ప్రయత్నించగా ఆమె స్పందించకపోవడం గమనార్హం. -
ఎదురీదుతున్న వనామీ.. భారీ వర్షాలతో వైరస్ల ముప్పు
భీమవరం అర్బన్: ఈ ఏడాది వనామీ రొయ్య గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. జూన్ నెల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో రొయ్యల పెంపకం రైతుకు కత్తిమీద సాములా మారింది. చెరువులలో వనామీ రొయ్య పిల్లలు వదిలిన 15 రోజుల నుంచి నెల రోజుల లోపే వైట్ స్పాట్, విబ్రియో వంటి వైరస్లు సోకి చనిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, కాళ్ల, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, ఆచంట, పాలకోడేరు తదితర మండలాల్లో సుమారు 75 వేల ఎకరాలలో వనామీ రొయ్యల పెంపకం చేస్తున్నారు. ఏడాదికి జిల్లా నుంచి 2 లక్షలకు పైగా టన్నులు చైనా, సింగపూర్, దక్షిణకొరియా, అమెరికా తదితర దేశాలకు ఎగుమతవుతున్నాయి. రూ.7 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని మత్స్యశాఖ అధికారుల అంచనా. వనామీ రొయ్యలు 2 నుంచి 3 నెలలు మధ్య పట్టుబడికి వస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువ మంది రైతులు ఈ రొయ్యలను పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధిక వర్షాలతో వైరస్ల ముప్పు జూన్ నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో వనామీ రొయ్యల పిల్లలకు వైట్‌స్పాట్, విబ్రియో వంటి వైరస్లు సోకడంతో నెల రోజులు లోపే మృత్యువాత పడుతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. కొంతమంది రైతులు ప్రత్నామ్నాయ మార్గాలైన పండుగొప్ప, శీలావతి చేపలు పెంచుతున్నారు. (క్లిక్ చేయండి: అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయ్!) భారీగా పెరిగిన రొయ్య ధరలు గత మూడు నెలలుగా జిల్లాలో పట్టుబడికి వచ్చిన కౌంట్ రొయ్యలు తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రొయ్యలకు ఆర్డర్లు రావడంతో రొయ్య ధరకు రెక్కలు వచ్చాయి. 100 కౌంట్ రూ.280, 90 కౌంట్ రూ.290, 80 కౌంట్ రూ.310, 70 కౌంట్ రూ.330, 60 కౌంట్ రూ. 340, 50 కౌంట్ రూ.360, 45 కౌంట్ రూ.370, 40 కౌంట్ రూ.400, 30 కౌంట్ రూ. 450, 25 కౌంట్ రూ.540 ధర పలుకుతుంది. రొయ్యల వ్యాపారస్తులు దూరం, టన్నుల మేరకు ధరలు మారుతున్నారు. వర్షాలతో రొయ్యకు వైరస్ అధిక వర్షాల కారణంగా వనామీ రొయ్యకు వైట్‌స్పాట్, విబ్రియో వైరస్లు సోకడంతో సీడ్ దశలోనే మృత్యువాత పడుతున్నాయి. కౌంట్‌కు వచ్చిన రొయ్యలు పట్టుబడులు లేకపోవడంతో రొయ్యల ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. – ఎల్ఎల్ఎన్ రాజు, ఏడీ, మత్స్యశాఖ, భీమవరం ధరలు ఒకేలా ఉండేలా చూడాలి రొయ్యలకు వేసే 25 కేజీల మేత రూ.2500 అయింది. ఎండాకాలంలో రొయ్యల ధరలు అమాంతం తగ్గిస్తున్నారు. అన్ సీజన్లో రొయ్యల ధరలు పెంచుతున్నారు. వనామీ పెంపకంలో ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. సన్న, చిన్నకారు రైతులు చేపల పెంపకం చేస్తున్నారు. ఎప్పుడూ రొయ్యల ధరలు ఒకేలా ఉండేలా చూసి రైతులను ఆదుకోవాలి. – జడ్డు రమేష్ కుమార్, రైతు, గూట్లపాడురేవు -
రొయ్యకు రాహుకాలం
భీమవరం/పాలకోడేరు/ఆకివీడు : రొయ్య రైతులకు రాహుకాలం దాపురించింది. ధరల పతనంతో రైతులు ఘొల్లుమంటున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం, వాతావరణ మార్పులతో రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ 70–80 కౌంట్ దశలోనే పట్టుబడులు పట్టి అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల పట్టుబడులు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితిని వ్యాపారులు అవకాశంగా తీసుకుని రొయ్యల ప్యాకింగ్‌కు ఐస్ దొరకడం లేదంటూ ధరలను దారుణంగా తగ్గించేశారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. డాలర్ల పంట డీలా జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో రొయ్యల పెంపకం సాగుతోంది. డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగుపై చేపల రైతులు సైతం మక్కువ చూపుతున్నారు. చేపల చెరువులను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. రొయ్యల సాగు పర్యావరణానికి ప్రమాదకరంగా మారిందని.. సాగునీటితోపాటు పర్యావరణం కలుషితమవుతున్నందున రొయ్యల చెరువుల్ని ధ్వంసం చేస్తామని రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. ఈ నిర్ణయంతో బెంబేలెత్తుతున్న రైతులు.. ఇదే దశలో ధరలు పతనం కావడంతో ఆందోళన చెందుతున్నారు. 15 రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకోవడంతో చెరువుల్లోని రొయ్యలు ఉన్నట్టుండి తేలిపోతున్నాయి. వాటిని రక్షించుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్లు, వివిధ రకాల మందుల్ని రైతులు వాడుతున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరిగిపోతున్నాయే తప్ప రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలగటం లేదు. ఎకరం చెరువులో రొయ్యల పెంపకానికి రూ.3 లక్షల వరకు పెట్టుబడి అవుతోందని, వాతావరణ మార్పుల వల్ల 70నుంచి 80 కౌంట్ దశలోనే అవి చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. వ్యాపారుల సిండికేట్ ఐస్ కొరతను సాకుగా చూపించి రొయ్యల వ్యాపారులంతా సిండికేట్ అయి ధరలను దారుణంగా తగ్గించేశారని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ప్రధానంగా 22 రొయ్యల ప్లాంట్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా వందలాది కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయి. 15 రోజుల క్రితం 40 కౌంట్ రొయ్యల ధర రూ.430 ఉండగా.. ప్రస్తుతం రూ.330కు తగ్గించేశారు. ఇదేం దారుణమని రైతులు అడుగుతుంటే.. ఐస్ లేక ప్లాంట్లలోని రొయ్యలు కుళ్లిపోతున్నాయని, అందువల్ల కొనలేకపోతున్నామని చెబుతున్నారు. తాము అడిగిన ధరకు ఇస్తే తీసుకుంటామని, లేదంటే సరుకును తీసుకెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. దిక్కులేని స్థితిలో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. సాధారణంగా వేసవిలో ఐస్‌కు డిమాండ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఐస్ కొరత లేదు. ఐస్ ప్లాంట్ల నిర్వాహకులు రేయింబవళ్లు పనిచేస్తూ ఐస్ ఉత్పత్తి చేస్తున్నారు. నీటికొరత లేకుండా ముందుగానే చిన్నపాటి చెరువులు, కుంటలు తవ్వి మంచినీటిని నిల్వ చేసుకున్నారు. మరోవైపు బోర్ల నుంచి నీటిని కొనుగోలు చేసి మరీ తీసుకువెళ్లి ఐస్ తయారీకి వినియోగిస్తున్నారు. అయితే, ధరను మాత్రం కొంతమేర పెంచారు. ఆక్వా ప్లాంట్ల యాజమాన్యాలు మాత్రం ఐస్ దొరకడం లేదంటూ రైతులను నిలువునా దోచేస్తున్నారు. దరల్ని తగ్గించేశారు రొయ్యల ధర దారుణంగా పడిపోయింది. మేత, లీజు, విద్యుత్, ఆయిల్ ధరలు పెరిగిపోవడంతో రొయ్యల సాగుకు భారీ వ్యయమవుతోంది. వాతావరణం బాగుండకపోవడంతో కౌంటుకు రాని రొయ్యలను కూడా పట్టి అమ్మేయాల్సి వస్తోంది. ధరలను తగ్గించేయడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. – వి.రామరాజు, ఆకివీడు సిండికేట్‌గా మారి ముంచేస్తున్నారు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి రొయ్యల సాగు చేస్తున్నాం. పంట చేతికొచ్చేసరికి కొనుగోలుదారులంతా సిండికేట్‌గా మారి అమాంతం ధరలను తగ్గించేస్తున్నారు. రైతులను నిలువునా ముంచేస్తున్నారు. ఇలాగైతే రొయ్యల సాగు చేయడం కష్టం. – మంతెన బాపిరాజు, పాలకోడేరు ప్రభుత్వం పట్టించుకోవాలి ఐస్ కొరత పేరుతో రొయ్యల ధరలను కిలోకు రూ.100 నుంచి రూ.130 వరకూ తగ్గించేస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా కావాలనే ధర తగ్గించారు. రొయ్యల ధరలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. రైతులు నష్టపోకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. – పెన్మెత్స శివరామరాజు, మోగల్లు అబ్బే.. సిండికేట్ కాలేదు మేం సిండికేట్ అవ్వలేదు. ఇతర రాష్ట్రాల్లోనూ రొయ్యలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. దీనివల్ల ఇక్కడ ధర తగ్గింది. ఐస్ కొరత అధికంగా ఉన్నమాట వాస్తవం. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. – పలయన్ అప్పన్, ఖాదర్ ఎక్స్‌పోర్ట్స్, గొల్లలకోడేరు