రొయ్యకు రాహుకాలం
రొయ్యకు రాహుకాలం
Published Sat, May 27 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM
భీమవరం/పాలకోడేరు/ఆకివీడు : రొయ్య రైతులకు రాహుకాలం దాపురించింది. ధరల పతనంతో రైతులు ఘొల్లుమంటున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం, వాతావరణ మార్పులతో రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ 70–80 కౌంట్ దశలోనే పట్టుబడులు పట్టి అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల పట్టుబడులు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితిని వ్యాపారులు అవకాశంగా తీసుకుని రొయ్యల ప్యాకింగ్‌కు ఐస్ దొరకడం లేదంటూ ధరలను దారుణంగా తగ్గించేశారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
డాలర్ల పంట డీలా
జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో రొయ్యల పెంపకం సాగుతోంది. డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగుపై చేపల రైతులు సైతం మక్కువ చూపుతున్నారు. చేపల చెరువులను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. రొయ్యల సాగు పర్యావరణానికి ప్రమాదకరంగా మారిందని.. సాగునీటితోపాటు పర్యావరణం కలుషితమవుతున్నందున రొయ్యల చెరువుల్ని ధ్వంసం చేస్తామని రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. ఈ నిర్ణయంతో బెంబేలెత్తుతున్న రైతులు.. ఇదే దశలో ధరలు పతనం కావడంతో ఆందోళన చెందుతున్నారు. 15 రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకోవడంతో చెరువుల్లోని రొయ్యలు ఉన్నట్టుండి తేలిపోతున్నాయి. వాటిని రక్షించుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్లు, వివిధ రకాల మందుల్ని రైతులు వాడుతున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరిగిపోతున్నాయే తప్ప రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలగటం లేదు. ఎకరం చెరువులో రొయ్యల పెంపకానికి రూ.3 లక్షల వరకు పెట్టుబడి అవుతోందని, వాతావరణ మార్పుల వల్ల 70నుంచి 80 కౌంట్ దశలోనే అవి చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
వ్యాపారుల సిండికేట్
ఐస్ కొరతను సాకుగా చూపించి రొయ్యల వ్యాపారులంతా సిండికేట్ అయి ధరలను దారుణంగా తగ్గించేశారని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ప్రధానంగా 22 రొయ్యల ప్లాంట్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా వందలాది కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయి. 15 రోజుల క్రితం 40 కౌంట్ రొయ్యల ధర రూ.430 ఉండగా.. ప్రస్తుతం రూ.330కు తగ్గించేశారు. ఇదేం దారుణమని రైతులు అడుగుతుంటే.. ఐస్ లేక ప్లాంట్లలోని రొయ్యలు కుళ్లిపోతున్నాయని, అందువల్ల కొనలేకపోతున్నామని చెబుతున్నారు. తాము అడిగిన ధరకు ఇస్తే తీసుకుంటామని, లేదంటే సరుకును తీసుకెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. దిక్కులేని స్థితిలో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. సాధారణంగా వేసవిలో ఐస్‌కు డిమాండ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఐస్ కొరత లేదు. ఐస్ ప్లాంట్ల నిర్వాహకులు రేయింబవళ్లు పనిచేస్తూ ఐస్ ఉత్పత్తి చేస్తున్నారు. నీటికొరత లేకుండా ముందుగానే చిన్నపాటి చెరువులు, కుంటలు తవ్వి మంచినీటిని నిల్వ చేసుకున్నారు. మరోవైపు బోర్ల నుంచి నీటిని కొనుగోలు చేసి మరీ తీసుకువెళ్లి ఐస్ తయారీకి వినియోగిస్తున్నారు. అయితే, ధరను మాత్రం కొంతమేర పెంచారు. ఆక్వా ప్లాంట్ల యాజమాన్యాలు మాత్రం ఐస్ దొరకడం లేదంటూ రైతులను నిలువునా దోచేస్తున్నారు.
దరల్ని తగ్గించేశారు
రొయ్యల ధర దారుణంగా పడిపోయింది. మేత, లీజు, విద్యుత్, ఆయిల్ ధరలు పెరిగిపోవడంతో రొయ్యల సాగుకు భారీ వ్యయమవుతోంది. వాతావరణం బాగుండకపోవడంతో కౌంటుకు రాని రొయ్యలను కూడా పట్టి అమ్మేయాల్సి వస్తోంది. ధరలను తగ్గించేయడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.
– వి.రామరాజు, ఆకివీడు
సిండికేట్‌గా మారి ముంచేస్తున్నారు
అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి రొయ్యల సాగు చేస్తున్నాం. పంట చేతికొచ్చేసరికి కొనుగోలుదారులంతా సిండికేట్‌గా మారి అమాంతం ధరలను తగ్గించేస్తున్నారు. రైతులను నిలువునా ముంచేస్తున్నారు. ఇలాగైతే రొయ్యల సాగు చేయడం కష్టం.
– మంతెన బాపిరాజు, పాలకోడేరు
ప్రభుత్వం పట్టించుకోవాలి
ఐస్ కొరత పేరుతో రొయ్యల ధరలను కిలోకు రూ.100 నుంచి రూ.130 వరకూ తగ్గించేస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా కావాలనే ధర తగ్గించారు. రొయ్యల ధరలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. రైతులు నష్టపోకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి.
– పెన్మెత్స శివరామరాజు, మోగల్లు
అబ్బే.. సిండికేట్ కాలేదు
మేం సిండికేట్ అవ్వలేదు. ఇతర రాష్ట్రాల్లోనూ రొయ్యలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. దీనివల్ల ఇక్కడ ధర తగ్గింది. ఐస్ కొరత అధికంగా ఉన్నమాట వాస్తవం. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది.
– పలయన్ అప్పన్, ఖాదర్ ఎక్స్‌పోర్ట్స్, గొల్లలకోడేరు
Advertisement
Advertisement