బడ్జెట్‌కు రైతే భారమా?
విశ్లేషణ
దేశ శ్రామికవర్గంలోని 52 శాతానికి వ్యవసాయమే ఉపాధి కల్పిస్తున్నది. మరోమాటలో చెప్పాలంటే దేశంలో అత్యధికంగా, ప్రధానంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే. కానీ కొన్ని దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారం ఈ రంగానికి ఆర్థిక వనరులు అందకుండా చేస్తున్నారు. ఈ రంగం మీద పాలకులు చూపుతున్న ఉదాసీనత కారణంగా వరస నష్టాలనే చవి చూస్తున్నది. రైతులు బలవన్మరణాలు నిరాఘాటంగా సాగిపోతూ, రోజుకు 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే లక్షణాలేవీ కనిపించడం లేదు. రష్యా, జపాన్ మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఆవిర్భవిస్తున్న బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు విపత్కర పరిస్థితులలో చిక్కు కున్నాయి. ఇక దేశీయ పారిశ్రామిక వృద్ధిని చూస్తే ప్రయోజనకరంగా కనిపించదు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాలను కల్పించే ఆర్థిక వృద్ధిని నిలకడగా ఉంచడానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏం చేస్తారన్నదానిమీదే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
ఉద్యోగాలు చూపించలేని వృద్ధి అర్థరహితం. గడచిన పుష్కరకాలంగా ఉన్నత వృద్ధి రేటే కనిపిస్తుంది. అయితే అది ఉద్యోగాలను తగినంతగా చూపించని వృద్ధి. యూపీఏ పదేళ్ల పాలనలో కోటీ యాభయ్ లక్షల ఉద్యోగాలు ఆ వృద్ధి ద్వారా సాధ్యమైనాయి. గడచిన కొన్నేళ్లుగా కర్మాగారాలలో బాగా తగ్గిపోతూ వస్తున్న ఉద్యోగాల సంఖ్య కారణంగా ఈ రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశాలు కూడా మృగ్యం. పారిశ్రామిక విధానం, విస్తరణ శాఖ (డీఐపీపీ) ప్రచురించిన గణాంకాలు దీనినే సూచిస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన కొత్త పథకాల కోసం డీఐపీపీకి అందిన ప్రతిపాదనలను చూసినా 4.11 లక్షల ఉద్యోగాలు కల్పించడమే సాధ్యమని అర్థమవుతుంది. ఉద్యోగాలను సృష్టించడమే ధ్యేయమన్న రీతిలో అరుణ్‌జైట్లీ ఎజెండా ఆర్థికవృద్ధి పెంపు చుట్టూ పరిభ్రమిస్తున్నా, ఇలాంటి అవసరాన్ని తీర్చేందుకు వ్యవసాయ రంగం కూడా ఉన్నదన్న వాస్తవాన్ని ఆయన గుర్తించడంలేదు.
గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ రంగమే, దేశీయ అవసరాలకు తగినట్టు విస్తారంగా ఉపాధి కల్పించగలదనీ, మందకొడిగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థకు పుష్టిని ఇవ్వగలదనీ జైట్లీ మరచిపోతున్నారు. మన కి ఇష్టం ఉన్నా లేకున్నా, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడానికి ఏదైనా మార్గం ఉన్నదీ అంటే అది వ్యవసాయ రంగమేనన్నది నిజం. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 15- 29 వయసు కలిగిన 153 మిలియన్ల నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారన్న వాస్తవం గమనిస్తే వ్యవసా యానికి ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. 2020 సంవత్సరానికి మరో 153 మిలియన్ల ఉద్యోగార్థులు వీరికి తోడవుతారు. అదనపు ఉపాధి అవకాశాలు చూపడానికి మార్గాలు మరింత సన్నగిల్లుతాయి. ఇది భారత్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం ఎదుర్కొనే సమస్య.
నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్న సేద్యం
ఈ దుస్థితి నుంచి విముక్తం కావడానికి 2016 బడ్జెట్ ఒక అవకాశం కల్పిస్తుంది. ఆర్థికవృద్ధి పటిష్టత ద్వారా ఉద్యోగాలు లభించే సదవకాశం ఆవిరైపోయింది. హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్‌లలో జాట్లు, గుజరాత్‌లో పటీదార్లు, మహారాష్ట్రీయులు, కర్ణాటకలో లింగాయత్‌లు- వీరంతా ఆందోళనలకు దిగుతున్నారు. ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ జరుగుతున్న వీరి ఆందోళనలు హింసాత్మకం కూడా అవుతు న్నాయి. కొన్ని దశాబ్దాలుగా సేద్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఆ రంగం లాభసాటి వ్యాపకం కాకుండా పోయిన ఫలితమే ఇది. ఇదంతా చూస్తే, కొన్ని వర్గాల వారికి పన్ను రాయితీలు కల్పించడం ద్వారా సాధ్యమయ్యే త్వరిత ఆర్థికవృద్ధి వల్ల సంపద కింది వర్గాలకు కూడా చేరి, నిరుద్యోగ సమస్య వంటివి తొలగిపోతాయన్న (ట్రికిల్ డౌన్ ) సిద్ధాంతంలోని డొల్లతనం కూడా అవగతమవుతుంది. సేద్యం ద్వారా లభించే ఆదాయం ఇప్పుడు పాతాళ ప్రమాణానికి చేరుకుంది. దీనితో వ్యవసాయాన్ని వదులుకుని చాలామంది చిన్నాచితకా ఉద్యోగాల కోసం నగరాల బాట పడుతున్నారు. ఈ ధోరణి పూర్తిగా మారాలి. ఆ ధోరణిని మార్చుకోవడం మినహా గత్యంతరం లేదు కూడా.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశ శ్రామికవర్గంలోని 52 శాతానికి వ్యవసాయమే ఉపాధి కల్పిస్తున్నది. మరోమాటలో చెప్పాలంటే దేశంలో అత్యధికంగా, ప్రధానంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే. కానీ కొన్ని దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారం ఈ రంగానికి ఆర్థిక వనరులు అందకుండా చేస్తున్నారు. ఈ రంగం మీద పాలకులు చూపుతున్న ఉదాసీనత కారణంగా వరస నష్టాలనే చవి చూస్తున్నది. రైతులు బలవన్మరణాలు నిరాఘాటంగా సాగిపోతూ, ఇప్పుడు సగటున రోజుకు 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించింది. ఇక కరువు కాటకాలు తీవ్రంగా ఉన్న బుందేల్‌ఖండ్ ప్రాంత రైతాంగం బతక డానికి రక్తం అమ్ముకుంటున్నారు. ఇదంతా చూస్తే సంవత్సరం తరువాత సంవత్సరం వ్యావసాయిక సంక్షోభం ఎంత తీవ్రమవుతున్నదో అర్థమవుతుంది.
గడచిన ఏడాది బడ్జెట్‌ను ప్రతిపాదించినప్పుడు జైట్లీ అతి పెద్ద సవాలుగా మారిన వ్యవసాయ ఆదాయాల జాబితాను చదివి వినిపించారు. కానీ బడ్జెట్ ఉపన్యాసం చివరికి వచ్చే సరికి, ఆ ఆర్థిక ఇక్కట్ల నుంచి రైతాంగాన్ని బయటపడవేయడం గురించి ఆయన మరచిపోయారు. జాతీయ నమూనాల సర్వే సంస్థ (ఎన్.ఎస్.ఎస్.ఒ.) గణాంకాల ప్రకారం 2014లో సగటు రైతు కుటుంబం నెలసరి ఆదాయం రూ. 6,000. నిజానికి ఇందులో సగం మాత్రమే సేద్యం నుంచి దక్కుతోంది. మిగతా మొత్తం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటి వ్వవసాయేతర మార్గాల ద్వారా లభిస్తున్నది. వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్ లెక్కలు కూడా ఉన్నాయి. వ్యవసాయంలో బాగా ముందడుగు వేసిన పంజాబ్ వంటి రాష్ట్రంలోనే హెక్టార్‌కు గోధుమ, ధాన్యం పంటల మీద వస్తున్న నికర ఆదాయం రూ. 3,000. పంజాబ్ వంటి రాష్ట్రంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే, దేశంలో మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో ఊహించడం కష్టం కాదు. నలుగురైదుగురు ఉండే ఒక రైతు కుటుంబం నెలసరి ఆదాయం రూ. 6,000 అయితే, ఆ కుటుంబాలలోని యువతరం ఏదో ఒక ఉద్యోగం కోసం నగరాల వైపు చూడడం వింతేం కాదు. పరిశ్రమలకు చౌకగా కార్మికులు దొరకడం కోసం శ్రామికులు వ్యవసాయ రంగం నుంచి వైదొలగడమే పెద్ద సంస్కరణ అని రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ్‌రాజన్, నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పన్గారియా పదే పదే చెప్పారు. ఇది ప్రపంచ బ్యాంక్, ప్రపంచ మార్కెట్ వ్యూహాలకు అనుగుణంగా చెప్పిన మాటే. ఈ నేపథ్యంలో జైట్లీ వ్యవసాయ రంగానికి ప్రాణం పోయడం గురించి ఆలోచించాలి.
ఈ అంశాల మీద దృష్టి పెట్టాలి
ఈ పరిస్థితులలో సేద్యానికి ఊపిరి పోయడానికి ఐదు అంశాల మీద దృష్టి పెట్టడం అవసరమనిపిస్తోంది. వరసగా రెండేళ్లు దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడం, 2015లో మున్నెన్నడూ లేని స్థాయిలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి మూడు లక్షల కోట్ల రూపాయలతో కేంద్రం ఒక ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుందని ఆశించాలి. 2008-09 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం కుంగిపోయినప్పుడు దానిని కష్టాల నుంచి గట్టెక్కించడానికి మూడు లక్షల కోట్ల రూపాయలతోనే ఒక ప్యాకేజీని ప్రకటించిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. వ్యవసాయ రంగానికి ప్రకటించే ఇలాంటి ఆర్థిక ప్యాకేజీ వల్ల పది కోట్ల రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయి.
2016-17 సంవత్సరానికి వ్యవసాయ రంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను లక్ష కోట్ల రూపాయలకు పెంచాలి. ఈ రంగానికి ఒక అర్థవంతమైన వెసులుబాటు కల్పించడానికి ప్రతి బడ్జెట్‌లోనూ కేటాయిం పులను 25 శాతం పెంచాలి. నిజానికి 52 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం కంటే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఇచ్చే పనుల కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తున్న సంగతి చాలా మందికి తెలియదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి కేటాయించిన మొత్తం రూ. 15,267 కోట్లు. అంతకు ముందు 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇంకా తక్కువగా రూ. 12,006 కోట్లు కేటాయించారు.
స్వామినాథన్ సంఘం సిఫారసు చేసిన విధంగా వ్యవసాయ ఉత్పత్తి వ్యయం మీద 50 శాతం లాభం అందించే ఉద్దేశం ఏదీ కేంద్రం దగ్గర లేదని ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలియచేసింది. ఇలా యాభయ్ శాతం లాభం కల్పిస్తే మార్కెట్‌పై చెడు ప్రభావాలు కనిపిస్తాయని కేంద్రం అభిప్రాయపడింది. కాబట్టి రైతుల ఆదాయ జాతీయ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించాలి. ఇది రైతు కుటుంబాల కనీస ఆదాయం ఎంత ఉండాలో ఆలోచిస్తుంది. ఒక బంట్రోతు ఉద్యోగానికి నెలసరి రూ. 18,000 మూలవేతనంగా ఏడో వేతన సంఘం నిర్ణయించింది. కానీ ఒక రైతు కుటుంబం నెలసరి ఆదాయం రూ. 6,000కు మించరాదు. ఇలాంటి వ్యత్యా సాలను సరిచేయడం అత్యవసరం.
మౌలిక వసతుల కల్పన పెట్టుబడులను వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వైపు మళ్లించాలి. మార్కెట్ యార్డుల నిర్మా ణానికి చాలినంత పెట్టుబడులను అందుబాటులో ఉంచాలి. ఐదు కిలో మీటర్ల పరిధిలో ఒక మార్కెట్ యార్డు వంతున అందుబాటులోకి తేవాలంటే దేశానికి 42,000 యార్డులు అవసరమవుతాయి. కానీ ప్రస్తుతం ఏపీఎంసీ ఆధ్వర్యంలో 7,000 యార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో గోదాములు, వాటిని అనుసంధానిస్తూ లింకు రోడ్ల నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టాలి. గ్రామీణ వాణిజ్యానికి కూడా ప్రోత్సాహం అవసరం. కొత్తగా ప్రారంభించే సంస్థలకు మూడేళ్ల పన్ను మినహాయింపు కల్పించాలి. ఇతర రాయితీలన్నీ కూడా వర్తింప చేయాలి. పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్టే వ్యవసాయదారులు అధిపతులుగా ఉన్న సంస్థలకు కూడా ప్రయోజనాలు కల్పించాలి.
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు: దేవిందర్‌శర్మ
hunger55@gmail.com