సాక్షి, విజయవాడ : నకిలీ విత్తనాల వల్ల నష్టపోయి ఆత్మహత్యాయత్నం చేసి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
న్యాయం కోసం వచ్చిన తమను అరెస్టు చేయడంపై రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కర్కశత్వాన్ని జీర్ణించుకోలేక ముగ్గురు కౌలు రైతులు బి.పూర్ణచంద్రరావు, వి.తిరపతయ్య, జి.రామయ్య నున్న పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకొని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రైతులు కోలుకుంటున్నారు.
వారిని ఈ రోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. కాగా ముఖ్యమంత్రిని కలిసేందుకు ‘చలో అసెంబ్లీ’కి వెళుతున్న రైతులను మధ్యలోనే అడ్డుకుని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించింది. మనస్తాపానికి గురైన అన్నదాతలు పోలీస్‌స్టేషన్‌లోనే ఆందోళన చేపట్టారు. ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది.
అయినప్పటికీ పోలీసులు రైతులపై దౌర్జన్యానికి దిగడం గమనార్హం. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన కౌలు రైతులు గతేడాది జనవరిలో విత్తనాలు కొనుగోలు చేసి మిరప పంట వేశారు. నకిలీ విత్తనాల దెబ్బకు పంట పండక తీవ్రంగా నష్టపోయారు. విచారణ చేపట్టిన అధికారులు నకిలీ విత్తనాలతోనే నష్టం జరిగిందని ధ్రువీకరించారు.
ఎకరానికి రూ.91 వేల చొప్పున బాధిత రైతులందరికీ నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడాది దాటినా బాధితులకు సాయం అందలేదు. అధికారులు, పాలకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. తమ గోడు నేరుగా ముఖ్యమంత్రికే చెప్పుకుందామని బుధవారం అమరావతికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం రైతులను రాజధానికి రాకుండా చూడాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు రైల్వేస్టేషన్‌లో దిగిన రైతులు, రైతు సంఘాల నేతలను వెంటనే అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment