ఆ హక్కులతో రైతన్నే ‘రారాజు’! | 12 new rights declarations has been formed for Agricultural farmers | Sakshi
Sakshi News home page

ఆ హక్కులతో రైతన్నే ‘రారాజు’!

Published Thu, Aug 8 2013 11:08 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఆ హక్కులతో రైతన్నే ‘రారాజు’! - Sakshi

ఆ హక్కులతో రైతన్నే ‘రారాజు’!

ముఖాముఖి: 12 కొత్త హక్కులతో కూడిన డిక్లరేషన్‌పై చర్చకు తెరలేచింది. సాగు పద్ధతిని ఎంచుకునే హక్కు, విత్తనాలు, సంప్రదాయక వ్యవసాయ విజ్ఞానం కలిగి ఉండే హక్కు, వ్యవసాయోత్పత్తుల ధర, అమ్మకంపై నిర్ణయాధికార హక్కు, భూమి హక్కుతోపాటు మేధో హక్కులను తిరస్కరించే హక్కు వీటిల్లో పొందుపరచడం విశేషం.
 
 ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యవస్థలు నానాటికీ బహుళజాతి కంపెనీల చెప్పుచేతల్లోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగసంక్షోభం తీవ్రతరమవుతున్నది. అణగారిపోతున్న వారిలో బక్కచిక్కిన బడుగు రైతులు, గ్రామీణ కూలీలు, ఆదివాసీలు ముందు వరుసలో ఉంటారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిన్న, సన్నకారు రైతులు, పాడి రైతులు, గ్రామీణ వ్యవసాయ కూలీలతోపాటు మత్స్యకారులు, ఆదివాసులు పేదరికంతో అల్లాడుతున్నారు. వీరందర్నీ కలిపి ‘రైతులు, గ్రామీణ పేదలు’ అని ఐక్యరాజ్యసమితి వ్యవహరిస్తోంది.
 
 ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గ్రామీణులకు వెన్నుదన్నుగా నిల వడానికి సాధారణ మానవ హక్కులు చాలవని, కొత్తగా కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించాలని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల మండలి (హెచ్చార్సీ) నిశ్చితాభిప్రాయంతో ఉంది. ఈ దిశగా అంతర్జాతీయ చట్టం తేచ్చేం దుకు ఇటీవల తొలి అడుగు వేయడం శుభపరిణామం. ప్రత్యేక వర్కింగ్ గ్రూప్‌ను హెచ్చార్సీ ఏర్పాటు చేసింది. 47 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. దీని తొలి సమావేశం గత నెల 15-19 తేదీల్లో జెనీవాలో జరిగింది. 12 కొత్త హక్కులతో కూడిన డిక్లరేషన్‌పై చర్చకు తెరలేచింది. సాగు పద్ధతిని ఎంచుకునే హక్కు, విత్తనాలు, సంప్రదాయక వ్యవసాయ విజ్ఞానం కలిగి ఉండే హక్కు, వ్యవసాయోత్పత్తుల ధర, అమ్మకంపై నిర్ణయాధికార హక్కు, భూమి హక్కుతోపాటు మేధో హక్కులను తిరస్కరించే హక్కు వీటిల్లో పొందుపరచడం విశేషం.
 
 చైనా, భారత్, ఇండోనేసియా సహా 23 దేశాలు సానుకూలంగా స్పందించాయి. అమెరికా, యూరోపియన్ దేశా ల కూటమి, జపాన్ వంటి 9 దేశాలు వ్యతిరేకించగా, 15 దేశాలు తటస్థంగా ఉండిపోయాయి. ఏకాభిప్రాయం కోసం వివిధ దేశాలతో హెచ్చార్సీ చర్చలు ప్రారంభించింది. వచ్చే ఏడాదిలో జరిగే వర్కింగ్ గ్రూప్ తదుపరి సమావేశంలో ఈ హక్కులకు ఆమోదముద్ర పడవచ్చు. ప్రపంచీకరణ దుష్ర్పభావాల దాడి నుంచి చిన్న రైతులు, గ్రామీణ పేదలను కాపాడుకోవాలనుకునే దేశాలకు ఈ కొత్త హక్కులు మార్గదర్శకాలుగా నిలుస్తాయి.
 
 ఐరాస దృష్టిలో రైతు...
 ఐక్యరాజ్యసమితి, ఆహార వ్యవసాయ సంస్థ దృష్టిలో రైతులంటే.. నేలతల్లితో, ప్రకృతితో నేరుగా, ప్రత్యేక అనుబంధం కలిగి ఉండి ఆహారం, ఇతర వ్యవసాయోత్పత్తులను పండించేవారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు చిన్న రైతులతో కలిసి స్వయంగా పొలం పనులు చేసేవారు. భూమిలేని వివిధ రకాల గ్రామీణులు కూడా రైతులే. వ్యవసాయదారులతోపాటు పశువులను పెంచేవారు, పశువులను మేపేవారు, గ్రామాల్లో వ్యవసాయ సంబంధమైన పనిముట్లు తయారు చేసే వృత్తిదారులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, చేతివృత్తిదారులు, సంచార జీవులు, వేట, అటవీ ఉత్పత్తులను సేకరించి జీవించే ఆదివాసులు... వీరందరూ రైతులే.
 
 వాణిజ్య దృష్టితో భారీ యంత్రాలను ఉపయోగించి వ్యవసాయం చేసే భారీ కమతాల ఆసాములను ‘రైతులు’గా ఈ డిక్లరేషన్ గుర్తించడంలేదు. అందుకే అమెరికా, యూరోపియన్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.  ఈ హక్కుల పట్ల మన దేశం సానుకూలంగా ఉన్నప్పటికీ వర్కింగ్ గ్రూప్‌లో ఎంత దృఢంగా నిలబడుతుందన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేం దుకు ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని జెనీవా సమావేశంలో అనధికార ప్రతినిధిగా పాల్గొన్న దేవీందర్ శర్మ అంటున్నారు. చండీగఢ్‌కు చెందిన శర్మ ప్రముఖ వ్యవసాయ, ఆహార, వాణిజ్య విధాన విశ్లేషకుడు, కాలమిస్టుగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రధానాంశాలు.
 
 చిన్న రైతులు, ఇతర గ్రామీణ పేదలకు కొత్త హక్కుల అవసరం ఏమిటి?
 ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో సగానికి సగం మంది అర్ధాకలితో బాధపడుతున్నారు. మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న రైతులు ఆదాయ భద్రత లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భారీగా సబ్సిడీలు ఇస్తున్న అమెరికా, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా తదితర సంపన్న దేశాల్లో కూడా రైతులు ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యలపాలవుతున్నారు. 2007-09 మధ్య ఫ్రాన్స్‌లో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతీయుల్లో 54 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికి 2.9 లక్షల మంది ైరె తులు ఆత్మహత్య చేసుకున్నారు. మన దేశం లో 2 నిముషాలకో రైతు, యూరప్‌లో నిముషానికో రైతు వ్యవసాయం వదిలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 350 మంది రైతులు సాగు వదిలేసి వలసపోతున్నారు. రైతులను రక్షించుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది. అందుకే రైతులకు ప్రత్యేక హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది.
 
 ఈ కొత్త హక్కులు ఎన్నాళ్లకు అందివస్తాయి?
 రైతులకు తమ వంగడాలపై బ్రీడింగ్ హక్కులు కల్పించడానికి 22 ఏళ్లు పట్టింది. ఈ హక్కుల విషయంలో అన్నేళ్లు కాదు గానీ, కొన్ని ఏళ్లే పట్టవచ్చు. ప్రతిపాదనలు పదేళ్ల నుంచే ఉన్నా... వర్కింగ్ గ్రూప్‌లో ఈ ఏడాది చర్చ ప్రారంభమైంది. వచ్చే ఏడాది సమావేశంలోనూ చర్చ కొనసాగుతుంది. ఐరాస చేసే హక్కుల తీర్మానాలు సభ్యదేశాల ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. వాటి ఆధారంగా ప్రభుత్వాలు తమ దేశాల్లో చట్టాలు చేస్తాయి. మన దేశంలో ఆహార హక్కు కూడా ఇలా వచ్చిందే.  
 
 కీలకమైన హక్కులపై సంపన్నదేశాలు విభేదిస్తున్నాయి కదా?
 విత్తనాలు, భూములు, సంప్రదాయ సాగు విజ్ఞానం, ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతుల ఎంపిక, వ్యవసాయోత్పత్తులకు ధర నిర్ణయించుకునే హక్కు తదితర హక్కులపై తీవ్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. యూరోపియన్ యూనియన్, అమెరికా ఈ హక్కులను వ్యతిరేకిస్తున్నాయి. చర్చల అనంతరం ఈ హక్కు లను ఎన్ని దేశాలు అంగీకరిస్తాయో చూడాలి. అయితే, రైతుల హక్కులపై ఇప్పటికైనా సమితి చర్చ ప్రారంభిం చింది కాబట్టి, రైతులు అధిక సంఖ్యలో ఉన్న మన దేశం చర్చల్లో గట్టిగా నిలబడాలి.
 
 వర్కింగ్ గ్రూప్‌లోని మనదేశ  ప్రతినిధి ఈ హక్కులకు మద్దతు పలికారు కదా.. ఇంకా చేయాల్సిందేమిటి?
 భూమి హక్కుపై మన దేశం అభ్యంతరం చెబుతోంది. రైతుల భూములను వారికి ఇష్టం లేకుండా కంపెనీల కోసం స్వల్ప ధరకు ప్రభుత్వం సేకరించి పెట్టడం ఎం దుకు? అవసరమైన కంపెనీలనే రైతులకు నచ్చిన ధర ఇచ్చి కొనుక్కోమనొచ్చు కదా? భారత్ మిగతా హక్కులపై సరే అంటున్నదే గానీ బలమైన గొంతుకను వినిపించడం లేదు. సంపన్న దేశాల ప్రభావానికి లొంగకుండా మన ప్రభుత్వం దృఢమైన వైఖరిని అవలంభించాలి.
 
 జెనీవా సమావేశంలో మీరైమైనా ప్రతిపాదించారా?
 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ సంక్షోభానికి మూలకారణం రైతులకు ఆదాయ భద్రతలేకపోవడం. ఈ హక్కులతో ఆదాయ భద్రత, సామాజిక భద్రత హక్కులు కూడా చేర్చమని నేను, కొందరు ప్రతినిధులం ప్రతిపాదిం చాం. కనీస మద్దతు ధర రైతుకు ఆదాయ భద్రతను కల్పిం చడంలేదు. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలో ‘రైతుల ఆదాయ కమిషన్’ నెలకొల్పాలి.  ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆదాయ భద్రత కల్పించడం కమిషన్ లక్ష్యంగా ఉండాలి. రైతులకు అందించే అన్నిరకాల సబ్సిడీలు ఈ కమిషన్ ద్వారానే ఛానలైజ్ అయ్యేలా చూడాలి. అంతర్జాతీయంగా పటిష్టమైన రైతుల హక్కుల చార్టర్‌ను రూపొందించుకుంటే.. ఒకటి రెండేళ్ల తర్వాతైనా దీనికి అనుగుణమైన చట్టాలు స్థానిక రైతులకు అందుబాటులోకి వస్తాయి. గ్రామీణ జనాభాలో 80 శాతం మంది రైతులు, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న మన దేశీ యులకు ఈ హక్కుల అవసరం ఇతరులకన్నా ఎక్కువగా ఉంది. ఈ హక్కులపై గట్టిగా నిలబడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత మన రైతు సంఘాలపై ఉంది.     
 - పంతంగి రాంబాబు
 ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement