రాష్ట్రంలో బీజీ–3కి ఓకే! | Ok to the BG-3 cotton seeds | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో బీజీ–3కి ఓకే!

Published Wed, Apr 25 2018 2:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Ok to the BG-3 cotton seeds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ముప్పుగా ఆందోళన వ్యక్తమవుతున్న బీజీ–3 పత్తిని రాష్ట్రంలో అనుమతించేందుకు రంగం సిద్ధమవుతోంది. పలు షరతులతో బీజీ–3కి అనుమతి ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బీజీ–2 పత్తి విత్తనాల్లో ఐదు శాతం వరకు బీజీ–3 విత్తనాలు కలిపి విక్రయించేందుకు అనుమతివ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నట్టు సమాచారం. వచ్చే నెల మూడో తేదీన ఢిల్లీలో బీజీ–3పై కేంద్ర ప్రభుత్వం ‘క్షేత్రస్థాయి తనిఖీలు, శాస్త్రీయ మూల్యాంకన కమిటీ (ఎఫ్‌ఐఎస్‌ఈసీ)’సమావేశం నిర్వహించనుంది.

ఆ భేటీలో బీజీ–3కి అనుమతిపై ప్రతిపాదన చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ యోచిస్తున్నట్టు తెలిసింది. కేంద్రం ఆమోదం తెలిపితే రాష్ట్రంలో బీజీ–3 పత్తి విత్తనానికి అధికారిక ఆమోదం లభించినట్లేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

జన్యు మార్పిడి చేసి.. 
పత్తిని పట్టి పీడించే గులాబీరంగు పురుగును తట్టుకునేలా జన్యుమార్పిడి చేసిన బీజీ–1 (బీటీ–1) టెక్నాలజీని 2002లో మోన్‌శాంటో  దేశంలో ప్రవేశపెట్టింది. కానీ బీజీ–1 విత్తనాలు 2006 నాటికే గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తిని కోల్పోయాయి. దీంతో మోన్‌ శాంటో మరిన్ని జన్యువులను మార్చి బీజీ–2 పత్తి విత్తనాన్ని తీసుకొచ్చింది. దానికి కూడా 2012 నాటికి గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి నశించింది. తర్వాత గులాబీరంగు పురుగును నాశనం చేసే విష రసాయనం పత్తి మొక్కల్లోనే ఉత్పత్తయ్యేలా జన్యు మార్పిడి చేసి బీజీ–3 పత్తి విత్తనాన్ని అభివృద్ధి చేసింది. దీంతోపాటు పత్తిలో కలుపును నాశనం చేసేందుకు గ్లైఫోసైట్‌ అనే రసాయనాన్ని తీసుకొచ్చింది. వీటివల్ల పర్యావరణం దెబ్బతింటుందని, జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుందని నిర్ధారణ కావడంతో దేశంలో బీజీ–3ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. 

బీజీ–2లో కలిపి అమ్ముకునేలా.. 
దేశంలో బీజీ–3కి అధికారికంగా ఎలాంటి అనుమతీ లేకున్నా.. మోన్‌శాంటో పలు కంపెనీల ద్వారా ప్రయోగాత్మక పరిశీలన పేరుతో బీజీ–3ని రైతులకు అంటగట్టింది. రైతులు బీజీ–3 పత్తిని పండించడం, తర్వాత ఈ పత్తి ద్వారా విత్తనాలు మరింతగా విస్తరించుకుంటూ పోవడం మొదలైంది. కొన్ని కంపెనీలు ఏవేవో పేర్లతో బీజీ–3 విత్తనాలను అమ్ముతున్నట్టు వెల్లడికావడంతో.. వాటిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. దాంతో చివరికి కంపెనీలు కొత్త కుట్రకు తెరతీశాయి. బీజీ–2 విత్తనాల్లో 10 శాతం వరకు బీజీ–3 విత్తనాలు ఉండేందుకు అనుమతించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.

వాస్తవానికి బీజీ–2లో నూటికి నూరు శాతం ఆ రకం విత్తనాలే ఉంటాయి. ఒక్క బీజీ–3 విత్తనం ఉన్నా కల్తీ కిందే లెక్క. అలాంటిది ఐదు శాతం కలపడానికి ఓకే చెబితే.. కంపెనీలు అధికారికంగా కల్తీ చేయడానికి అనుమతి ఇవ్వడమేనన్నమాట. రాష్ట్రంలో ఖరీఫ్‌లో కోటికిపైగా పత్తి విత్తన ప్యాకెట్లు వినియోగిస్తారు. ఐదు శాతానికి అనుమతిస్తే.. 5 లక్షల ప్యాకెట్ల మేర బీజీ–3 విత్తనాలు ఉంటాయి. ఇప్పటిదాకా దొంగతనంగా బీజీ–3 విత్తనాలు అమ్ముకున్న కంపెనీలు.. ఇక అధికారికంగా విక్రయించుకునేందుకు రంగం సిద్ధమైనట్టే! 

పట్టించుకోని సర్కారు 
రాష్ట్రంలో రెండు మూడేళ్లుగా బీజీ–3 పత్తి సాగవుతోందని ఇప్పటికే పలుమార్లు నిర్ధారించారు. కానీ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. బీజీ–3 నియంత్రణపై కేంద్రం ఒత్తిడి చేయడంతో వ్యవసాయ శాఖ ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి.. చేతులు దులుపుకొందనే విమర్శలు వస్తున్నాయి. అయితే బీజీ–3 విషయంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఎం.జగన్‌మోహన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందుకోసం స్టేట్‌ బయోటెక్నాలజీ కో–ఆర్డినేషన్‌ కమిటీ (ఎస్‌బీసీసీ) ఏర్పాటు చేయాలని సూచించారు.

కానీ ఇప్పటివరకు కమిటీ ఏర్పాటుకాలేదు. ఇక ప్రమాదకరమైన గ్లైపోసైట్‌ కలుపు మందును నిషేధించాలని వ్యవసాయ శాఖ కోరినా.. సర్కారు అనుమతివ్వలేదు. అయితే ‘‘బీజీ–3ని రైతులు కూడా వ్యతిరేకించడం లేదు. చాటు మాటుగా బీజీ–3 విక్రయాలు జరుగుతున్నాయి. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కేంద్రం చెబుతోంది కాబట్టి వీలైన మేర చర్యలు తీసుకుంటున్నాం..’’అని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement