
సాక్షి, హైదరాబాద్: రానున్న ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. మొత్తం 7.5 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రెండు లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. మిగతా ఐదున్నర లక్షల క్వింటాళ్లను నెలాఖరులోగా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నాయి. ముందస్తుగా రైతులకు జీలుగ, పిల్లిపెసర విత్తనాలు అవసరం. ఈ మేరకు జీలుగ విత్తనాలను 50 వేల క్వింటాళ్లను సరఫరా చేశారు. అలాగే 10 వేల క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలను అందుబాటులో ఉంచారు. వరి విత్తనాలను కూడా జిల్లాలకు పంపించారు. సోయాబీన్ విత్తనాలను మాత్రం ఇంకా సన్నద్ధం చేయలేదని తెలిసింది.
ఈనెల 15వ తేదీ నుంచి మిగిలిన విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. సోయాబీన్ విత్తనాలను మొత్తంగా 2 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. 20 వేల క్వింటాళ్ల వేరుశనగ, 80 వేల క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలను సరఫరా చేస్తారు. 20 వేల క్వింటాళ్ల కంది, 12 వేల క్వింటాళ్ల పెసర, 6 వేల క్వింటాళ్ల మినుములను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 17 రకాల విత్తనాలను ఖరీఫ్, రబీలకు ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయనుంది. మరోవైపు ప్రైవేటు విత్తన కంపెనీలు బీజీ–2, బీజీ–3 పత్తి విత్తనాలను ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయి. ఆ రెండు విత్తనాలూ గత ఖరీఫ్‌లో విఫలమైన సంగతి తెలిసిందే. అయినా రైతు ముంగిటకు అనుమతిలేని విషపూరితమైన బీజీ–3 విత్తనాలు వచ్చి చేరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment