దేశంలోని 95 శాతం ప్రజల ఆహార అవసరాన్ని దేశీయ ఉత్పత్తిద్వారానే నెరవేర్చాలని చైనా 1996లో లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2011 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారిపోయింది. మన దేశంలోనూ ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలు వ్యవసాయ సంస్కరణల పేరిట ఉన్న సౌకర్యాలను కూడా తొలగించే పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు పరివర్తన అనేది.. చైనాను నిర్వహించలేని ఆహార సంక్షోభంలోకి ఎలా నెట్టివేసిందనే అంశంపై చైనా మనకు పెద్ద గుణపాఠం నేర్పుతోంది. అదే బాటలో మనమూ నడిస్తే భారత్‌కు ఎవరు తిండి పెడతారు అనే ప్రశ్న మన భవిష్యత్ తరాలను కూడా వెంటాడుతుంది.
సరిగ్గా 150 ఏళ్ల క్రితం గ్రేట్ ఐరిష్ కరువు బారిన పడి 10 లక్షలమంది చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఐర్లండ్‌లోని యూనివర్సిటీ కాలేజి కోర్క్‌లో 1998లో నిర్వహించిన ఒక అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ సభికులు నన్ను ప్రశ్నించారు. భారత్‌కు తిండి పెట్టేది ఎవరు? ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణ పరిశోధకుడు, చింతనాపరుడు లెస్టర్ బ్రౌన్ ప్రతిపాదించిన ఒక పరికల్పనను ప్రపంచం చర్చిస్తున్న సందర్భంగా ఆ ప్రశ్న వెలువడింది. అమెరికా కేంద్రంగా పనిచేసే పర్యావరణ మేధోమధన సంస్థ వరల్డ్ వాచ్ ఇనిస్టిట్యూట్ సంస్థాపకుడు, తర్వాత ఎర్త్ పాలసీ ఇనిస్టిట్యూట్ అధ్యక్షుడు లెస్టర్ బ్రౌన్ చైనాకు ఎవరు తిండి పెడతారు (హూ విల్ ఫీడ్ చైనా) అనే పుస్తకంలో తన విశ్లేషణను తీసుకొచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక సెమినార్లు, సదస్సులలో తీవ్ర వాదోపవాదాలకు తావిచ్చింది. అగణిత మేధోపండితులు కూడా లెస్టర్ బ్రౌన్ పరికల్పనను బలపర్చారు. కాగా కొంతమంది నిపుణులు ఆయన వాదనను బహిరంగంగానే సవాలు చేశారు. కానైతే.. సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా ఆవిర్భవించింది.
ఆహార సంక్షోభ తీవ్రతను పైకి తోసిపుచ్చుతున్నప్పటికీ, గత ఏడాది ఆగస్టులో ఒక్క మెతుకు ఆహారాన్ని కూడా వృథా చేయవద్దని చైనా ప్రజలను కోరుతూ సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఆపరేషన్ క్లీన్ ప్లేట్ (ఆహార వృధాను అరికట్టే చర్య) పథకాన్ని ప్రారంభించడంతో చైనా పరిస్థితిపై ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనాలో ఒక సంవత్సరంలో 6 శాతం ఆహారం మాత్రమే వృథా అవుతుందని అంచనా వేసినా, అది 20 కోట్లమంది ప్రజలకు సరిపోయే ఆహారాన్ని అందిస్తుంది. చివరకు కస్టమర్లు కోరినంత తిండి పెట్టవద్దని చైనాలో రెస్టారెంట్లపై ఆంక్షలు విధించారు. ఉదాహరణకు విని యోగదారులు అయిదు మీల్స్ ఆర్డర్ చేస్తే నలుగురికి సరిపోయే తిండి మాత్రమే పెట్టాలని రెస్టారెంట్లను ప్రభుత్వం ఆదేశించింది.
ఆహార వృథాపై చైనా ప్రభుత్వ ఆంక్షలు.. ప్రతి సోమవారం నిరాహార దీక్ష పూనాలంటూ నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1965లో భారతీయులను కోరిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. నిజానికి 1965లో అంటే దేశంలో హరిత విప్లవం ప్రారంభానికి సంవత్సరం ముందు ఏర్పడిన తీవ్రమైన ఆహార కొరతను అధిగమించడానికి భారతదేశం కోటి టన్నుల ఆహారధాన్యాలను దిగుమతి చేసుకుంది. హరిత విప్లవం మొదలైన తర్వాత భారత్ ఆహార పదార్థాల విషయంలో స్వావలంబనను సాధించింది కానీ ఆహారం సులభంగా అందుబాటులోకి వస్తుండటంతో నిర్లక్ష్యం దేశాన్ని అలుముకుంది.
చైనా కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చాలా పెద్ద ముందంజ వేసింది. 1996లో చైనా ఒక విధానంపై దృష్టి పెడుతూ దేశంలోని 95 శాతం ప్రజల ఆహార అవసరాన్ని దేశీయ ఉత్పత్తిద్వారానే నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2011 నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకటన మేరకు, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారిపోయింది. ఆదాయాలు పెరగడంతో మధ్యతరగతి ప్రజల ఆహార ప్రాధాన్యతల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. చైనా వాడుకగా పండించే ఆహార ఉత్పత్తులనుంచి చైనా మధ్యతరగతి మాంసం, పాలతో సహా ఇతర పోషకాహార ఉత్పత్తులను డిమాండ్ చేయడం మొదలెట్టింది.
ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు చోటుచేసుకోవడంతో ఆహార స్వావలంబన విధానం నుంచి చైనా ప్రభుత్వం గమనం మార్చుకుని తగుమాత్రం ఆహార దిగుమతులను అనుమతించింది. అదేసమయంలో భారీ ఎత్తున ప్రజలు నగరాల బాట పట్టడం, వ్యవసాయరంగం నుంచి రైతాంగం భారీ స్థాయిలో పారిశ్రామిక కార్మికవర్గంలోకి పరివర్తన చెందడం అనేది ఆహార ఉత్పత్తిలో అంతరాన్ని సృష్టించింది. పైగా, రసాయన ఎరువులు అధికంగా వాడే సాంద్ర వ్యవసాయ పద్ధతులతో సాగుభూములు కలుషితమయ్యాయి. భూగర్భ జలాలు క్షీణించి పోవడంతో కాలుష్యం కూడా పెరిగిపోయింది. ఈ పర్యావరణపరమైన క్షీణత సాగు భూముల విస్తీర్ణాన్ని తగ్గించివేసింది. దీంతో తన ఆహార భద్రత కోసం 12 కోట్ల హెక్టార్ల సాగు భూమిని కాపాడుకోక తప్పదంటూ చైనా ప్రకటించింది.
చైనాలో సగటు వ్యవసాయ భూమి విస్తీర్ణం ఇప్పుడు 1.6 ఎకరాలకు పడిపోయింది. నైట్రోజన్‌తోపాటు రసాయనిక ఎరువుల వాడకం తీవ్రమవడం, రైతులకు ప్రత్యక్ష నగదు మద్దతును అందించడం కారణంగా 2017లో 60 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అదనంగా ఉత్పత్తయ్యాయి. కానీ, బీఫ్‌తో సహా ఇతర పోషకాహార పదార్థాల కోసం చైనాలో డిమాండ్ పెరిగిపోయింది. ఉదాహరణకు చైనాలో బీఫ్ ఉత్పత్తులకు డిమాండ్ 19,000 శాతానికి అమాంతంగా పెరిగిపోయింది. దీంతో భారత్, పాక్‌తో సహా ప్రపంచమంతటినుంచి చైనా ఆహార పదార్థాల కోసం అర్రులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫిచ్ రేటింగుల ప్రకారం 2020 సంవత్సరంలో మొక్కజొన్న, గోధుమ, జొన్న, బార్లీ పంటల దిగుమతులు చైనాలో వరుసగా 136, 140, 437, 36.3 శాతం వరకు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సోయాబీన్స్‌ను ఉత్పత్తి చేస్తున్న బ్రెజిల్‌నుంచి ఇప్పటికే గరి ష్టంగా సోయాబీన్ దిగుమతులు మొదలెట్టిన చైనా, ఇప్పుడు వాటికోసం అమెరికావైపు చూపు సారిస్తోంది. ప్రపంచంలోనే గోధుమలను అత్యధికంగా పండిస్తున్న రెండో దేశంగా గుర్తింపు పొందిన చైనా ప్రపంచవ్యాప్తంగా పండే మొత్తం గోధుమ నిల్వల్లో సగం మేరకు సొంతం చేసుకుంది. ప్రపంచంలోని మొక్కజొన్న నిల్వల్లో 65 శాతాన్ని చైనా ఇప్పటికే సొంతం చేసుకుంది. దేశీయంగా ఆహార అవసరాలను తీర్చలేకపోతున్న చైనా, ఇప్పుడు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాలను కొనివేయడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాల కొనుగోలుపైనా చైనా చూపు సారిస్తోంది. 2010 నుంచి చైనా విదేశాల్లో 94 బిలియన్ డాలర్లు పెట్టి 32 లక్షల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసిందని జ్చటఝl్చnఛీజట్చb.ఛిౌఝ వెబ్‌సైట్ అంచనా వేసింది.
చైనా అనుభవాల నుంచి భారత్ ముఖ్యమైన గుణపాఠాలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు చైనా పరివర్తన అనేది ఆ దేశాన్ని ఇక నిర్వహించలేని ఆహార సంక్షోభంలోకి ఎలా పడవేసిందనే అంశంపై చైనా మనకు పెద్ద గుణపాఠం నేర్పుతోంది. ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనాను మార్చివేసిన ప్రయోగం ఇప్పుడు అవసవ్య దిశలో పయనించబోతోంది. ఎందుకంటే కారుచౌకతో దొరికే శ్రామికలను అందించడంలో ఆఫ్రికా చైనాతో పోటీపడుతోంది. దీంతో చైనాలో మళ్లీ వ్యవసాయ క్షేత్రాలను పునరుద్ధరించడం అనేది అతి పెద్ద సవాలు కానుంది.
చైనా ప్రతి ఏడాది 206 బిలియన్ డాలర్ల మేరకు వ్యవసాయ సబ్సిడీలను అందిస్తోంది. దీనికి ప్రతి ఏటా ఆహార ధాన్యాల దిగుమతిపై ఖర్చుపెడుతున్న వందల కోట్ల డాలర్లను కూడా కలుపుకోవాలి. చైనాలోని చిన్న కమతాల వ్యవసాయ క్షేత్రాలను ఆర్థిక శక్తి కేంద్రాలుగా మార్చడానికి ఇంతే మొత్తం ఖర్చు పెట్టినట్లయితే, అతిపెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తిదారు అయిన చైనా ప్రపంచ అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. ఇది ఒకరకంగా ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గం. సాగుభూములపై అధికంగా వ్యయం చేయడం వల్ల దీర్ఘకాలంలో స్వావలంబన సాధ్యపడుతుంది. కానీ చైనా ఇక్కడే విఫలమైంది. భారత్ కూడా ఆ దారిలో పయనిస్తే తట్టుకోలేదు. మరోమాటలో చెప్పాలంటే భారత్‌కు ఎవరు తిండి పెడతారు అనే ప్రశ్న మన భవిష్యత్ తరాలను కూడా వెంటాడుతుంది.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ-మెయిల్ : : hunger55@gmail.com
ఆహార దిగుమతి.. చైనా గుణపాఠాలు
Published Fri, Apr 23 2021 12:40 AM | Last Updated on Fri, Apr 23 2021 4:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment