న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్లు (పీసీ), ల్యాప్‌టాప్‌ల దిగుమతి లైసెన్సు కోసం కంపెనీలు/ట్రేడర్లు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ప్రత్యేక పోర్టల్ రూపొందించింది. వివరాలన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తు చేసుకున్న 3–4 రోజుల్లోనే లైసెన్సును జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే రవాణాలో ఉన్న కన్‌సైమెంట్స్‌ను లైసెన్సు లేకుండా అనుమతిస్తారని వివరించాయి. పీసీలు, ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ డివైజ్‌లను తయారు చేసుకునేందుకు భారత్‌కు తగినంత సామర్ధ్యం ఉండటం వల్ల నియంత్రణల విధింపుతో కంప్యూటర్ల లభ్యతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
భద్రత కోసమే నియంత్రణలు..
దిగుమతైన కంప్యూటర్లలోని హార్డ్‌వేర్‌లో ఏవైనా లొసుగులు ఉంటే, వాటి నుంచి కీలకమైన వ్యక్తిగత, సంస్థాగత డేటాకు ముప్పు కలగకుండా భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇంటర్నెట్ విస్తృతి పెరుగుతుండటంతో ప్రజలు ఆన్‌లైన్ మోసాల బారిన పడే అవకాశాలూ మరింతగా పెరిగాయని చెప్పాయి. ఈ నేపథ్యంలోనే దేశం, దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతోనే ప్రభుత్వం తాజా నియంత్రణలు విధించిందని అధికారులు తెలిపారు.
అలాగే, చైనాతో వాణిజ్య సమతౌల్యం సాధించేందుకు కూడా ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. టారిఫ్‌యేతర నియంత్రణలనేవి దిగుమతులపై నిషేధం కిందికి రావని, లైసెన్సు తీసుకున్న వారు దిగుమతి చేసుకోవచ్చని వివరించారు. అటు, హార్డ్‌వేర్.. సిస్టమ్స్ విశ్వసనీయమైనవిగా ఉండేలా చూసేందుకు, దిగుమతులను తగ్గించుకునేందుకు, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు.
2022–23లో ల్యాప్‌టాప్‌లు, పీసీల దిగుమతులు 5.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య వ్యవధిలో పీసీలు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఎల్రక్టానిక్స్ దిగుమతుల విలువ 19.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి
Comments
Please login to add a commentAdd a comment