Food Industry
-
మెక్ డొనాల్డ్స్ బర్గర్ లో బ్యాక్టీరియా
-
హైదరాబాద్‌లో 100 రెస్టారెంట్ల సిబ్బందికి శిక్షణ
అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) హైదరాబాద్‌లో 100 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ‘ఇండియా సహయోగ్ ప్రోగ్రామ్’ పేరుతో ఇప్పటికే 2021లో స్థానికంగా 100 రెస్టారెంట్లలో పని చేస్తున్న వారికి ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ కల్పించింది. తాజాగా మరో 100 రెస్టారెంట్లలోని సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.ఇండియా సహయోగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎంపిక చేసుకున్న రెస్టారెంట్లలోని సిబ్బందికి ఆహార భద్రత, పరిశుభ్రత, కస్టమర్ సర్వీస్, లాభదాయకత..వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీనివల్ల స్థానిక రెస్టారెంట్లు వృద్ధి చెందడంతోపాటు కస్టమర్లకు మెరుగైన ఆహారం, సేవలందేలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, గౌహతి, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో దాదాపు 800 రెస్టారెంట్లలో సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా కేఎఫ్‌సీ ఇండియా, పార్టనర్ కంట్రీస్ జనరల్ మేనేజర్ మోక్ష్ చోప్రా మాట్లాడుతూ..‘ఆహార పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. మారుతున్న ట్రెండ్లు, కస్టమర్ ప్రాధాన్యతలు, వారి డిమాండ్లకు అనుగుణంగా సర్వీస్ అందించడం చాలా ముఖ్యం. ఇండియా సహయోగ్ కార్యక్రమంలో భాగంగా 2024 నాటికి దేశవ్యాప్తంగా 1000 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ కార్యక్రమం నిర్వహణకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ), ఎఫ్ఎస్ఎస్ఏఐకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ (ఎఫ్‌ఓఎస్‌టీఏసీ) ప్రోగ్రామ్ అధికారులతో కలిసి పని చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఈ ప్రోగ్రామ్ కింద 2021లో 100 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చాం. తాజాగా మరో 100 రెస్టారెంట్లలోని సిబ్బందికి అవగాహన కల్పించనున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా.. కొత్త పరికరం ఆవిష్కరణతెలంగాణ ఆహార భద్రత కమిషనర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ..‘ఆహార భద్రత, పరిశుభ్రతకు వినియోగదారులు పెద్దపీట వేస్తున్నారు. పట్టణ ఆర్థిక వ్యవస్థలో స్థానిక రెస్టారెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆహార భద్రత విషయంలో ప్రతి రెస్టారెంట్ యాజమాన్యం సరైన నాణ్యతాప్రమాణాలు పాటించాలి. ఈమేరకు స్థానిక రెస్టారెంట్ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న కేఎఫ్‌సీ ప్రయత్నాలు అభినందనీయం’ అన్నారు. ఆహార భద్రత పరిశ్రమ వృద్ధికి ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) మద్దతుగా ఉంటుందని సంస్థ ప్రెసిడెంట్ సురేష్ సింఘాల్ తెలిపారు. -
ఎంత చెబుతున్నా వినరు.. ఆసక్తికర గణాంకాలు!
పిల్లలకు చిరుతిండ్లు, జంక్‌ఫుడ్ రుచించినంతగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు రుచించవు. అందుకే అసలు ఆహారాన్ని పక్కన పెట్టి అనవసరమైన పదార్థాలతోనే కడుపు నింపుకొంటారు. పిల్లలే కాదు పెద్దల్లోనూ ఆ అలవాటు ఎక్కువగా ఉంది. ఆరోగ్యకరమైన జీవన విధానాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా జంక్ ఫుడ్ సేల్స్ మాత్రం భారీగా పెరుగుతున్నాయి. తాజాగా యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనీషియేటివ్ (ఏటీఎన్ఐ) రిపోర్ట్ ప్రకారం జంక్‌ఫుడ్ సేల్స్ పెరుగుతున్నాయని తెలుస్తోంది. నివేదికలోని వివరాల ప్రకారం.. టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీల సేల్స్‌లో ప్యాకేజ్డ్ ఫుడ్స్ వాటా పెరుగుతోంది. దేశంలో ప్రముఖ 20 ఎఫ్ఎంసీజీ కంపెనీలు తయారుచేస్తున్న 1,901 ప్రొడక్టుల్లో కేవలం 24 శాతం మాత్రమే ఆరోగ్యకరమైనవి. ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాల్లో ఈ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది. మొత్తం ఏడు కేటగిరీల్లో 58 ఇండికేటర్లను వాడి కంపెనీలను విశ్లేషించామని ఏటీఎన్ఐ వెల్లడించింది. ప్రొడక్ట్ వివరాలు, గవర్నెన్స్, మార్కెటింగ్, లేబులింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఏటీఎన్ఐ కంపెనీలకు హెల్తీనెస్ రేటింగ్ ఇచ్చింది. ఇందులో ఐటీసీ టాప్‌లో ఉందని పేర్కొంది. తర్వాత స్థానాల్లో హిందుస్థాన్ యునిలీవర్, నెస్లే ఇండియా, పెప్సికో ఇండియా, కోకకోలా ఇండియా ఉన్నాయి. 5 స్టార్ రేటింగ్‌లో 3.5 కంటే ఎక్కువ స్టార్స్ పొందిన ప్రొడక్ట్‌లను హెల్తీ ప్రొడక్ట్‌లుగా ఏటీఎన్ఐ వర్గీకరించింది. ఇందులో పండ్లు, కూరగాయలు, ఫైబర్, కంట్రోలింగ్ స్థాయిలో సాచ్యురేటెడ్ ఫ్యాట్, షుగర్ ఉన్నాయి. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో చాలా వాటికి చెందిన ప్రొడక్ట్‌ల రేటింగ్ 3.5 కంటే తక్కువ ఉందని ఏటీఎన్ఏ రిపోర్ట్ వెల్లడించింది. టాప్ 20 ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రొడక్ట్‌ల యావరేజ్ రేటింగ్ 1.9 ఉందని తెలిపింది. సగానికి పైగా (55.6 శాతం) కంపెనీల ప్రొడక్ట్‌ల రేటింగ్ ఐదుకు 1.5గా ఉందని, కేవలం 12 శాతం ప్రొడక్ట్‌లు చిన్న పిల్లలు తినేందుకు అర్హత పొందాయని వెల్లడించింది. ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీలో అనేక మార్పులు వస్తున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రెగ్ ఎస్ గారెట్ అన్నారు. డైట్, న్యూట్రిషన్, హెల్త్ వంటి అంశాలపై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్యగమనిక! ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు, షుగర్, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వాటాను హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, పెప్సికో వంటి కంపెనీలు వేగంగా తగ్గిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలతో తయారైన ప్రొడక్ట్‌లను హిందుస్తాన్ యునిలీవర్, ఐటీసీలు తయారుచేస్తున్నాయి. కానీ అందులోనూ చాలా సమస్యలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. హెల్తీ ఫుడ్ అంటే ఏంటో తెలియజేయడానికి ప్రామాణిక నిర్వచనం ఏమీ లేదని గుర్తు చేసింది. కంపెనీలు ఇష్టం వచ్చినట్లు ‘హెల్తీఫుడ్’ పేరుతో ఉత్పత్తులు తయారుచేస్తున్నాయని తెలిపింది. కానీ అవి అంతర్జాతీయ ప్రయాణాలకు తగినట్లు గుర్తింపు పొందడం లేదని చెప్పింది. -
విష వాయువు పీల్చి.. అయిదుగురు కార్మికులు మృతి
మొరెనా: ఫ్యాక్టరీలోని ట్యాంక్ నుంచి వెలువడిన విష వాయువు పీల్చిన ముగ్గురు సోదరులు సహా మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ధనేలలో ఉన్న సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలోని ట్యాంకు నుంచి ఉదయం 11 గంటల సమయంలో విష వాయువు లీకేజీ మొదలయింది. ట్యాంకు లీకేజీని పరిశీలిస్తుండగా మొదట ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరో ముగ్గురు అస్వస్థత పాలయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ అయిదుగురూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. మృతులంతా అక్కడికి సమీపంలోని టిక్టోలి గ్రామస్తులని చెప్పారు. ఘటన అనంతరం ఫ్యాక్టరీ నుంచి కార్మికులందరినీ ఇళ్లకు పంపించివేశారు. -
ఆహార పరిశ్రమపై కమోడిటీ ధరల ప్రభావం
కోల్‌కతా: అధిక కమోడిటీ ధరలు, అధిక వడ్డీ రేట్ల ప్రభావం ఆహార పరిశ్రమ (ఫుడ్)పై గణనీయంగా పడినట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. దీర్ఘకాలంలో ఈ అంశాల ప్రభావం అధికంగా ఉంటుందని 2022–23 వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ విధమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి సాయపడినట్టు వివరించింది. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆహార పరిశ్రమ ఎదుర్కొన్న పెద్ద సవాలు.. ముడి పదార్థాలైన గోధుమలు, పాలు, పంచదార, పామాయిల్, ముడి చమురు ధరలు పెరిగిపోవడం వల్ల ఎదురైన ద్రవ్యోల్బణమే’’అని పేర్కొంది. బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రధానంగా బిస్కట్లు, కేక్‌లు, రస్్క, బ్రెడ్, చాక్లెట్ల విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, దేశీయంగా డిమాండ్ పరిస్థితులు ఎంతో ఆశావహంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం పరిస్థితులు అన్నవి 2023–24లో ప్రధానంగా దేశీయ, అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. సరైన వర్షపాతంపైనే గ్రామీణాభివృద్ధి, ఆహార ధరలు ఆధారపడి ఉంటాయి’’అని బ్రిటానియా తన నివేదికలో తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించామని, కొత్త భౌగోళిక ప్రాంతాల్లోకి విస్తరించామని ప్రకటించింది. బ్రాండ్ బలోపేతం, కొత్త ఉత్పత్తుల విడుదలపై దృష్టి సారించనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యం, అమెరికా, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, సార్క్ దేశాలపై దృష్టి సారించనున్నట్టు ప్రకటించింది. -
కోవిడ్ సంక్షోభం చూపిన ప్రత్యామ్నాయం.. నారికేళం.. కలిసొచ్చే కాలం..
(నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘ప్రతి సంక్షోభం ఓ ప్రత్యామ్నాయం చూపుతుంది. తప్పక మేలు చేస్తుంది’ అనేది కొబ్బరి విషయంలో వాస్తవ రూపం దాల్చనుంది. అంది పుచ్చుకోవాలే కానీ ‘కల్పవృక్షం’ విశ్వవ్యాప్తంగా మెరుగైన అవకాశాలను చూపుతుందని.. కొబ్బరికి కలిసొచ్చే కాలం మున్ముందు అపారంగా ఉంటుందని మార్కెటింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విలువ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా కొబ్బరి రైతులకు, పారిశ్రామికవేత్తలకు లాభాలు సమకూరుతాయని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కోకోనట్ ప్రొడక్ట్స్, ట్రేడ్ అండ్ మార్కెటింగ్’ అంతర్జాతీయ సదస్సులో నిపుణులు ఉద్ఘాటించారు. ప్రతికూలతలు కొత్త పాఠాలు నేర్పుతున్నాయ్ రూగోస్ వైట్ ఫ్లై (తెల్లదోమ) వల్ల కొబ్బరి దిగుబడి తగ్గి ఆశించిన ధర దక్కడం లేదు. మరోవైపు క్వాయర్ ఉత్పత్తుల ధరలు నేలచూపు చూస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాలతో పోల్చుకుంటే అంతర్జాతీయ ఎగుమతుల్లో భారత్, దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ఏపీ వెనుకబడి ఉన్నాయి. ఇక్కడి నుంచి కొబ్బరి కాయ, కురిడీ కొబ్బరి, ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి రైతులు, వ్యాపారుల ఆలోచనా ధోరణిలో మార్పులొస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల వినియోగం కూడా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నందున కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, విస్తరణకు నోచుకోనున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో 3 కోట్ల మందికి కొబ్బరి దింపు, సేకరణ, ఎగుమతి, దిగుమతులు జీవనాధారంగా ఉండగా.. వారిలో రైతులు 1.20 కోట్ల మంది ఉన్నారు. డిమాండ్‌ను ఒడిసి పడితే.. అంతర్జాతీయంగా కొబ్బరి కాయ, కొబ్బరి ముక్క, కొబ్బరి నీళ్లతో తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, కోకోనట్ చిప్స్, కోకోనట్ వాటర్ ప్యాకెట్లు, నాటాడీకో వంటి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త డిమాండ్ ఉంది. కొబ్బరిని ఆరోగ్యానికి ఔషధంగా గుర్తించారు. కొబ్బరి పాలలో ఉండే ల్యారిక్ యాసిడ్ చిన్న పిల్లలకు చాలా ఉపయోగకరం. పశువులకు సంక్రమిస్తున్న విభిన్న వ్యాధులు, వైరస్ల వల్ల వాటి నుంచి వచ్చే పాల వాడకంపై అభివృద్ధి చెందుతున్న దేశాలు విముఖత చూపుతున్నాయి. ఈ మార్కెట్‌ను కొబ్బరి పాలతో భర్తీ చేసేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. కొబ్బరి పాల నుంచి తయారు చేసే వర్జిన్ కోకోనట్ ఆయిల్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని సేవించడం వల్ల శరీరంలోని తెల్ల రక్తకణాలు ఉత్సాహంగా ఉంటాయి. ఎయిడ్స్ రోగులకు ఇది ఇమ్యూనిటీ బూస్టర్ వంటిదని, ఆరోగ్యానికి దివ్య ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా తరువాత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో యూరప్ దేశాలకు కొబ్బరి ఎగుమతులు పెరిగాయి. అవకాశాలు అనేకం భారీ పరిశ్రమలు మొదలు ఫుడ్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుంటే కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు అనేకం ఉన్నాయి. డిమాండ్ పెరుగుతున్నందున ఔత్సాహికులు ఉప ఉత్పత్తులపై, కుటీర పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించాల్సి ఉంది. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉత్పత్తులతో పాటు పీచు, పెంకు, కలప వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు. ఎండు కొబ్బరి (కోప్రా), కొబ్బరి నూనె, వర్జిన్ కొబ్బరి నూనె, కొబ్బరి పొడి, కొబ్బరి పాలు/క్రీమ్, కొబ్బరి పాలతో పొడి, వెనిగర్, చిప్స్, కొబ్బరి నీటితో పాటు పలు రకాల పానీయాలు ఉత్పత్తి చేయవచ్చు. ఔత్సాహికులు ఇప్పటికే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో యువ పారిశ్రామికవేత్త గుత్తుల ధర్మరాజు వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ పరిశ్రమను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద మరో యువ పారిశ్రామికవేత్త వికాస్ సైతం వేపూరి ఆగ్రో ప్రొడక్ట్స్ పేరిట ఇవే ఉత్పత్తులను జాతీయంగా ఎగుమతి చేస్తున్నారు. వీరిని చూసి మరికొంతమంది ముందుకు వస్తున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జైకా) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రూ.3.50 కోట్లతో వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, కోకోనట్ చార్కోల్ (చిప్ప బొగ్గు) తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇటువంటివి మరిన్ని ఏర్పాటు చేసేందుకు కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) వంటి సంస్థలు రాయితీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి మార్కెట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను బేబీ మసాజ్ ఆయిల్గా పశ్చిమ బెంగాల్, చుట్టుపక్కల పట్టణాల్లో అమ్ముతున్నారు. మా కంపెనీ నుంచి ఆయిల్ కూడా ఇక్కడకు వెళ్తోంది. అక్కడి ఫార్మా కంపెనీలు సైతం వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను సిఫారసు చేస్తున్నాయి. మన ప్రాంతంలో జాన్సన్ అండ్ జాన్సన్ వాడుతున్నారు. మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాల్లో కొబ్బరి వాడకం పెరుగుతోంది. మన దేశం కన్నా ఇతర దేశాల్లో అధికంగా కొబ్బరి ఉత్పత్తులను వాడుతున్నారు. ఆరోగ్యం పట్ల నెమ్మదిగా అవగాహన పెంచుకుంటున్నారు. – గుత్తుల ధర్మరాజు, కోనసీమ ఆగ్రోస్ కంపెనీ యజమాని, ముమ్మిడివరం -
ఉక్రెయిన్ - రష్యా సంక్షోభం... సింగపూర్ లో చపాతీల కొరత
-
విజయ కీర్తి
విజయసోపానాలు అధిరోహించడానికి ఏం చేయాలా?! అని సుదీర్ఘ ఆలోచనలు చేయనక్కర్లేదు అనిపిస్తుంది కీర్తి ప్రియను కలిశాక. తెలంగాణలోని సూర్యాపేట వాసి అయిన కీర్తిప్రియ కోల్‌కతాలోని ఐఐఎమ్ నుంచి ఎంబీయే పూర్తి చేసింది. తల్లి తన కోసం పంపే ఎండు కూరగాయల ముక్కలు రోజువారి వంటను ఎంత సులువు చేస్తాయో చూసింది. తన కళ్లముందు వ్యవసాయ పంట వృథా అవడం చూసి తట్టుకోలేకపోయింది. ఫలితంగా తల్లి తన కోసం చేసిన పని నుంచి తీసుకున్న ఆలోచనతో ఓ ఆహార పరిశ్రమనే నెలకొల్పింది. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. తన వ్యాపారంలో తల్లి విజయలక్ష్మిని కూడా భాగస్వామిని చేసిన కీర్తి విజయం గురించి ఆమె మాటల్లోనే.. ‘‘ఈ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌కు ముందు చదువు, ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు మా అమ్మ నాకు వంట ఈజీగా అవడం కోసం ఎండబెట్టిన కూరగాయల ముక్కలను ప్యాక్ చేసి, నాకు పంపేది. వాటిలో టొమాటోలు, బెండ, క్యాబేజీ, గోంగూర, బచ్చలికూర, మామిడికాయ... ఇలా రకరకాల ఎండు కూరగాయల ముక్కలు ఉండేవి. వీటితో వంట చేసుకోవడం నాకు చాలా ఈజీ అయ్యేది. ఈ సాధారణ ఆలోచన నాకు తెలియకుండానే నా మనసులో అలాగే ఉండిపోయింది. వృథాను అరికట్టవచ్చు సూర్యాపేటలోని తొండా గ్రామం మాది. ఒకసారి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక, ఆ పంటను పొలంలోనే వదిలేశారు. ఇది చూసి చాలా బాధేసింది. చదువు తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆలోచనకు నా బాధ నుంచే ఓ పరిష్కారం కనుక్కోవచ్చు అనిపించింది. అమ్మ తయారు చేసే ఎండు కూరగాయల కాన్సెప్ట్నే నా బిజినెస్‌కు సరైన ఆలోచన అనుకున్నాను. ఆ విధంగా వ్యవసాయదారుల పంట వృథా కాకుండా కాపాడవచ్చు అనిపించింది. ఈ ఆలోచనను ఇంట్లోవాళ్లతో పంచుకున్నాను. అంతే, రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్ సిద్ధమైపోయింది. కుటుంబ మద్దతు మా నాన్న పోలీస్ విభాగంలో వర్క్ చేస్తారు. అమ్మ గృహిణి. ముగ్గురు అమ్మాయిల్లో నేను రెండవదాన్ని. నా ఆలోచనకు ఇంట్లో అందరూ పూర్తి మద్దతు ఇచ్చారు. దీనికి ముందు చేసిన స్టార్టప్స్, టీమ్ వర్క్ .. గురించి అమ్మానాన్నలకు తెలుసు కాబట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. కాకపోతే అమ్మాయిని కాబట్టి ఊళ్లో కొంచెం వింతగా చూస్తుంటారు. వృద్ధిలోకి తీసుకు వస్తూ.. సాధారణంగా తెలంగాణలో ఎక్కువగా పత్తి పంట వేస్తుంటారు. మా చుట్టుపక్కల రైతులతో మాట్లాడి, క్రాప్ పంటలపై దృష్టి పెట్టేలా చేశాను. రసాయనాలు వాడకుండా కూరగాయల సాగు గురించి చర్చించాను. అలా సేకరించిన కూరగాయలను మెషిన్స్ ద్వారా శుభ్రం చేసి, డీ హైడ్రేట్ చేస్తాం. వీటిలో ఆకుకూరలు, కాకర, బెండ, క్యాబేజీ.. వంటివి ఉన్నాయి. వీటితోపాటు పండ్లను కూడా ఎండబెడతాం. రకరకాల పొడులు తయారు చేస్తాం. మూడేళ్ల క్రితం ఈ తరహా బిజినెస్ ప్లానింగ్ మొదలైంది. మొదట్లో నాలుగు లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించిన ఈ పరిశ్రమ ఇప్పుడు రెండున్నర కోట్లకు చేరింది. వ్యాపారానికి అనువుగా మెల్లమెల్లగా మెషినరీని పెంచుకుంటూ, వెళుతున్నాం. మార్కెట్‌ను బట్టి యూనిట్ విస్తరణ కూడా ఉంటోంది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌తో ఈ ఐడియాను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు సూప్ మిక్స్‌లు, జ్యూస్ మిక్స్‌లు, కూరల్లో వేసే పొడులు మా తయారీలో ఉన్నాయి. ఏ పని చేయాలన్నా ముందు దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దీంతోపాటు తమ మీద తమకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు ఓ ఆలోచన వచ్చినప్పుడు, దానిని అమలులో పెట్టేటప్పుడు చాలామంది కిందకు లాగాలని చూస్తుంటారు. కానీ, మనకు దూరదృష్టి ఉండి, క్లారిటీగా పనులు చేసుకుంటూ వెళితే తిరుగుండదు. మన ఆలోచనని అమలులో పెట్టేటప్పుడు కూడా మార్కెట్‌కు తగినట్టు మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి’’ అని వివరిస్తుంది కీర్తిప్రియ. – నిర్మలారెడ్డి -
ఉడాన్ మెగా భారత్ సేల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ టు బిజినెస్ ఆన్లైన్ వేదిక ఉడాన్ మెగా భారత్ సేల్ ప్రకటించింది. ఆగస్టు 14 వరకు ఇది కొనసాగనుంది. ఎఫ్ఎంసీజీ, ఆహారోత్తుల విభాగంలో చిన్న వర్తకుల కోసం భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్, ఇన్స్టాంట్ క్యాష్ డిస్కౌంట్స్, బై వన్ గెట్ వన్‌తోపాటు ఇతర ఆఫర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. 5 లక్షల పైచిలుకు వర్తకులకు ఈ భారీ అమ్మకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని వివరించింది. వివిధ వ్యాపార విభాగాల్లో గడిచిన 18 నెలల్లో రూ.4,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు చేసినట్టు ఉడాన్ వెల్లడించింది -
ఆహార దిగుమతి.. చైనా గుణపాఠాలు
దేశంలోని 95 శాతం ప్రజల ఆహార అవసరాన్ని దేశీయ ఉత్పత్తిద్వారానే నెరవేర్చాలని చైనా 1996లో లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2011 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారిపోయింది. మన దేశంలోనూ ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలు వ్యవసాయ సంస్కరణల పేరిట ఉన్న సౌకర్యాలను కూడా తొలగించే పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు పరివర్తన అనేది.. చైనాను నిర్వహించలేని ఆహార సంక్షోభంలోకి ఎలా నెట్టివేసిందనే అంశంపై చైనా మనకు పెద్ద గుణపాఠం నేర్పుతోంది. అదే బాటలో మనమూ నడిస్తే భారత్‌కు ఎవరు తిండి పెడతారు అనే ప్రశ్న మన భవిష్యత్ తరాలను కూడా వెంటాడుతుంది. సరిగ్గా 150 ఏళ్ల క్రితం గ్రేట్ ఐరిష్ కరువు బారిన పడి 10 లక్షలమంది చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఐర్లండ్‌లోని యూనివర్సిటీ కాలేజి కోర్క్‌లో 1998లో నిర్వహించిన ఒక అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ సభికులు నన్ను ప్రశ్నించారు. భారత్‌కు తిండి పెట్టేది ఎవరు? ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణ పరిశోధకుడు, చింతనాపరుడు లెస్టర్ బ్రౌన్ ప్రతిపాదించిన ఒక పరికల్పనను ప్రపంచం చర్చిస్తున్న సందర్భంగా ఆ ప్రశ్న వెలువడింది. అమెరికా కేంద్రంగా పనిచేసే పర్యావరణ మేధోమధన సంస్థ వరల్డ్ వాచ్ ఇనిస్టిట్యూట్ సంస్థాపకుడు, తర్వాత ఎర్త్ పాలసీ ఇనిస్టిట్యూట్ అధ్యక్షుడు లెస్టర్ బ్రౌన్ చైనాకు ఎవరు తిండి పెడతారు (హూ విల్ ఫీడ్ చైనా) అనే పుస్తకంలో తన విశ్లేషణను తీసుకొచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక సెమినార్లు, సదస్సులలో తీవ్ర వాదోపవాదాలకు తావిచ్చింది. అగణిత మేధోపండితులు కూడా లెస్టర్ బ్రౌన్ పరికల్పనను బలపర్చారు. కాగా కొంతమంది నిపుణులు ఆయన వాదనను బహిరంగంగానే సవాలు చేశారు. కానైతే.. సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా ఆవిర్భవించింది. ఆహార సంక్షోభ తీవ్రతను పైకి తోసిపుచ్చుతున్నప్పటికీ, గత ఏడాది ఆగస్టులో ఒక్క మెతుకు ఆహారాన్ని కూడా వృథా చేయవద్దని చైనా ప్రజలను కోరుతూ సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఆపరేషన్ క్లీన్ ప్లేట్ (ఆహార వృధాను అరికట్టే చర్య) పథకాన్ని ప్రారంభించడంతో చైనా పరిస్థితిపై ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనాలో ఒక సంవత్సరంలో 6 శాతం ఆహారం మాత్రమే వృథా అవుతుందని అంచనా వేసినా, అది 20 కోట్లమంది ప్రజలకు సరిపోయే ఆహారాన్ని అందిస్తుంది. చివరకు కస్టమర్లు కోరినంత తిండి పెట్టవద్దని చైనాలో రెస్టారెంట్లపై ఆంక్షలు విధించారు. ఉదాహరణకు విని యోగదారులు అయిదు మీల్స్ ఆర్డర్ చేస్తే నలుగురికి సరిపోయే తిండి మాత్రమే పెట్టాలని రెస్టారెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆహార వృథాపై చైనా ప్రభుత్వ ఆంక్షలు.. ప్రతి సోమవారం నిరాహార దీక్ష పూనాలంటూ నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1965లో భారతీయులను కోరిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. నిజానికి 1965లో అంటే దేశంలో హరిత విప్లవం ప్రారంభానికి సంవత్సరం ముందు ఏర్పడిన తీవ్రమైన ఆహార కొరతను అధిగమించడానికి భారతదేశం కోటి టన్నుల ఆహారధాన్యాలను దిగుమతి చేసుకుంది. హరిత విప్లవం మొదలైన తర్వాత భారత్ ఆహార పదార్థాల విషయంలో స్వావలంబనను సాధించింది కానీ ఆహారం సులభంగా అందుబాటులోకి వస్తుండటంతో నిర్లక్ష్యం దేశాన్ని అలుముకుంది. చైనా కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చాలా పెద్ద ముందంజ వేసింది. 1996లో చైనా ఒక విధానంపై దృష్టి పెడుతూ దేశంలోని 95 శాతం ప్రజల ఆహార అవసరాన్ని దేశీయ ఉత్పత్తిద్వారానే నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2011 నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకటన మేరకు, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారిపోయింది. ఆదాయాలు పెరగడంతో మధ్యతరగతి ప్రజల ఆహార ప్రాధాన్యతల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. చైనా వాడుకగా పండించే ఆహార ఉత్పత్తులనుంచి చైనా మధ్యతరగతి మాంసం, పాలతో సహా ఇతర పోషకాహార ఉత్పత్తులను డిమాండ్ చేయడం మొదలెట్టింది. ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు చోటుచేసుకోవడంతో ఆహార స్వావలంబన విధానం నుంచి చైనా ప్రభుత్వం గమనం మార్చుకుని తగుమాత్రం ఆహార దిగుమతులను అనుమతించింది. అదేసమయంలో భారీ ఎత్తున ప్రజలు నగరాల బాట పట్టడం, వ్యవసాయరంగం నుంచి రైతాంగం భారీ స్థాయిలో పారిశ్రామిక కార్మికవర్గంలోకి పరివర్తన చెందడం అనేది ఆహార ఉత్పత్తిలో అంతరాన్ని సృష్టించింది. పైగా, రసాయన ఎరువులు అధికంగా వాడే సాంద్ర వ్యవసాయ పద్ధతులతో సాగుభూములు కలుషితమయ్యాయి. భూగర్భ జలాలు క్షీణించి పోవడంతో కాలుష్యం కూడా పెరిగిపోయింది. ఈ పర్యావరణపరమైన క్షీణత సాగు భూముల విస్తీర్ణాన్ని తగ్గించివేసింది. దీంతో తన ఆహార భద్రత కోసం 12 కోట్ల హెక్టార్ల సాగు భూమిని కాపాడుకోక తప్పదంటూ చైనా ప్రకటించింది. చైనాలో సగటు వ్యవసాయ భూమి విస్తీర్ణం ఇప్పుడు 1.6 ఎకరాలకు పడిపోయింది. నైట్రోజన్తోపాటు రసాయనిక ఎరువుల వాడకం తీవ్రమవడం, రైతులకు ప్రత్యక్ష నగదు మద్దతును అందించడం కారణంగా 2017లో 60 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అదనంగా ఉత్పత్తయ్యాయి. కానీ, బీఫ్‌తో సహా ఇతర పోషకాహార పదార్థాల కోసం చైనాలో డిమాండ్ పెరిగిపోయింది. ఉదాహరణకు చైనాలో బీఫ్ ఉత్పత్తులకు డిమాండ్ 19,000 శాతానికి అమాంతంగా పెరిగిపోయింది. దీంతో భారత్, పాక్‌తో సహా ప్రపంచమంతటినుంచి చైనా ఆహార పదార్థాల కోసం అర్రులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిచ్ రేటింగుల ప్రకారం 2020 సంవత్సరంలో మొక్కజొన్న, గోధుమ, జొన్న, బార్లీ పంటల దిగుమతులు చైనాలో వరుసగా 136, 140, 437, 36.3 శాతం వరకు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సోయాబీన్స్‌ను ఉత్పత్తి చేస్తున్న బ్రెజిల్నుంచి ఇప్పటికే గరి ష్టంగా సోయాబీన్ దిగుమతులు మొదలెట్టిన చైనా, ఇప్పుడు వాటికోసం అమెరికావైపు చూపు సారిస్తోంది. ప్రపంచంలోనే గోధుమలను అత్యధికంగా పండిస్తున్న రెండో దేశంగా గుర్తింపు పొందిన చైనా ప్రపంచవ్యాప్తంగా పండే మొత్తం గోధుమ నిల్వల్లో సగం మేరకు సొంతం చేసుకుంది. ప్రపంచంలోని మొక్కజొన్న నిల్వల్లో 65 శాతాన్ని చైనా ఇప్పటికే సొంతం చేసుకుంది. దేశీయంగా ఆహార అవసరాలను తీర్చలేకపోతున్న చైనా, ఇప్పుడు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాలను కొనివేయడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాల కొనుగోలుపైనా చైనా చూపు సారిస్తోంది. 2010 నుంచి చైనా విదేశాల్లో 94 బిలియన్ డాలర్లు పెట్టి 32 లక్షల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసిందని జ్చటఝl్చnఛీజట్చb.ఛిౌఝ వెబ్సైట్ అంచనా వేసింది. చైనా అనుభవాల నుంచి భారత్ ముఖ్యమైన గుణపాఠాలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు చైనా పరివర్తన అనేది ఆ దేశాన్ని ఇక నిర్వహించలేని ఆహార సంక్షోభంలోకి ఎలా పడవేసిందనే అంశంపై చైనా మనకు పెద్ద గుణపాఠం నేర్పుతోంది. ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనాను మార్చివేసిన ప్రయోగం ఇప్పుడు అవసవ్య దిశలో పయనించబోతోంది. ఎందుకంటే కారుచౌకతో దొరికే శ్రామికలను అందించడంలో ఆఫ్రికా చైనాతో పోటీపడుతోంది. దీంతో చైనాలో మళ్లీ వ్యవసాయ క్షేత్రాలను పునరుద్ధరించడం అనేది అతి పెద్ద సవాలు కానుంది. చైనా ప్రతి ఏడాది 206 బిలియన్ డాలర్ల మేరకు వ్యవసాయ సబ్సిడీలను అందిస్తోంది. దీనికి ప్రతి ఏటా ఆహార ధాన్యాల దిగుమతిపై ఖర్చుపెడుతున్న వందల కోట్ల డాలర్లను కూడా కలుపుకోవాలి. చైనాలోని చిన్న కమతాల వ్యవసాయ క్షేత్రాలను ఆర్థిక శక్తి కేంద్రాలుగా మార్చడానికి ఇంతే మొత్తం ఖర్చు పెట్టినట్లయితే, అతిపెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తిదారు అయిన చైనా ప్రపంచ అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. ఇది ఒకరకంగా ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గం. సాగుభూములపై అధికంగా వ్యయం చేయడం వల్ల దీర్ఘకాలంలో స్వావలంబన సాధ్యపడుతుంది. కానీ చైనా ఇక్కడే విఫలమైంది. భారత్ కూడా ఆ దారిలో పయనిస్తే తట్టుకోలేదు. మరోమాటలో చెప్పాలంటే భారత్‌కు ఎవరు తిండి పెడతారు అనే ప్రశ్న మన భవిష్యత్ తరాలను కూడా వెంటాడుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ-మెయిల్ : : hunger55@gmail.com -
ఔరా.. ముగ్గురేనా?
సాక్షి, హైదరాబాద్: కోటిమంది జనాభా ఉన్న మహా నగరంలో ఆహారకల్తీ నిరోధానికి తగిన యంత్రాంగం లేదు. కేవలం ముగ్గురంటే ముగ్గురే ఫుడ్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో అడ్డూఅదుపూ లేకుండా సాగుతోన్న కల్తీతో ప్రజలు తరచూ అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. దాదాపుగా పదినెలలుగా కరోనా నేపథ్యంలో బయటి ఫుడ్ తినేవారు తగ్గినప్పటికీ..ఇప్పుడిప్పుడే తిరిగి హోటళ్లు, తదితర ప్రాంతాల్లో ఎగబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ జరగకుండా.. తగిన పరిశుభ్రతతో, ఇతరత్రా జాగ్రత్తలతో వ్యవహరించాల్సి ఉండగా అలాంటివేమీ కనిపించడం లేదు. తగినంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేక తనిఖీలు జరగకపోవడం ఇందుకు ప్రధాన కారణం. 30 సర్కిళ్లకు 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా..పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం గత సంవత్సరం ఎంపిక చేసిన 20 మందికి శిక్షణ పూర్తికావాల్సి ఉంది. అందుకు మరో 40 రోజులు పట్టనుంది. అది పూర్తయితే కానీ వీరు విధులు నిర్వహించలేరు. జీహెచ్ఎంసీకి సంబంధించి మొత్తం 26 పోస్టులు మంజూరైనప్పటికీ , కోర్టు వివాదాలు ఇతరత్రా కారణాలతో 20 మందినే ఎంపిక చేశారు. ఆరు జోన్లకు ఆరుగురు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవసరం కాగా, ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. వీరిలో ఇద్దరు రిటైరైనా పొడిగింపుతో కొనసాగుతున్నారు, రైగ్యులర్‌గా ఉన్నది ఒక్కరే. జీహెచ్ఎంసీ లెక్కల మేరకు నగరంలో.. చిన్న హోటళ్లు, కర్రీ పాయింట్లు : 10,000 సాధారణ నుంచి స్టార్ హోటళ్లు : 3,000 ఇతరత్రా తినుబండారాల దుకాణాలు: 2,000 ఏటా 230 శాంపిల్సే.. ఇన్ని ఈటరీస్ ఉన్నా ఏటా 230 శాంపిల్స్ మించి తీయలేకపోతున్నారు. పలు పర్యాయాలు కల్తీ గుర్తించినప్పటికీ, జరిమానాలు మించి పెద్దగా శిక్షలు పడటం లేదు. హోటళ్లలో పరిశుభ్రత నుంచి అన్నీ సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో ఆటోమేటిక్‌గానే వేటికి ఎంత జరిమానానో పేర్కొంటూ చర్యలు తీసుకునేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా, కార్యరూపం దాల్చలేదు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఆర్డర్లపై జరిగే ఆహారాల్లోనూ కల్తీపై పలు ఫిర్యాదులందుతున్నాయి. పలు సంస్థల విజ్ఞప్తి.. ఆహారకల్తీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ సెక్రటరీ ఎం.పద్మనాభరెడ్డి మునిసిపల్ మంత్రి కేటీర్‌ను ఇటీవల కోరారు. కల్తీ ఫిర్యాదులకు ప్రత్యేక సెల్ ఏర్పాటుతోపాటు అదనంగా మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నివేదించారు. ఇతరత్రా సంస్థలు సైతం ఆహారకల్తీ నిరోధంతోపాటు కరోనా నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత, కనీస దూరం పాటింపు వంటివి అమలు చేయాలని కోరుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఎక్కడ? ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏ (‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2002) గ్రేటర్లో అమలుకు నోచుకోలేదు. 2011 ఆగస్టు నుంచే ఇది అమల్లోకి వచ్చినప్పటికీ, నగరంలో అమలు కావడం లేదు. ఈ చట్టం మేరకు, ఆస్తిపన్ను వివరాల మాదిరిగా ప్రతి ఆహార విక్రయ కేంద్రం వివరాలు జీహెచ్ఎంసీ వద్ద ఆన్లైన్లో జాబితా ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు జరగాలి. కల్తీని గుర్తించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి. కల్తీ నిర్ధారణ అయినప్పుడు కఠిన శిక్షలుండాలి. ఇవేవీ అమలు కావడం లేదు. అంతటా కల్తీ.. ఆహారపదార్థాలు ఉత్పత్తయ్యే ప్రాంతం నుంచి మొదలుపెడితే ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం దాకా ఎక్కడా కల్తీకి ఆస్కారం ఉండొద్దు. దీన్ని అమలు చేసేందుకు తగిన పరిపాలనాధికారులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అవసరం ఉండగా, అమలు కావడం లేదు. -
నెంబర్ వన్ సాధించడమే లక్ష్యం: బాదల్
న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్ ఉద్భవించడం వల్ల ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తర్వాత అతి పెద్ద జనాభా కలిగిన భారత్‌లో పెట్టుబడులకు అవకాశం ఏర్పడింది. చైనాలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మార్చుకోబోతున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ తెలిపారు. ఇటీవల బాదల్ ఓ ఇంటర్వ్యూల్లో స్పందిస్తూ.. ఆహార రంగానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాలలో భారత్ రెండో స్థానంలో ఉందని ఆమె గుర్తు చేశారు. భవిష్యత్తుల్లో అన్ని దేశాలకు ఎగుమతులు చేసి.. నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం కేవలం 10శాతం ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని.. కానీ మౌళిక సదుపాయాల కొరత వల్ల ఆశించిన స్థాయిలో ఎగుమతి చేయలేక పోతున్నామని అన్నారు. ఆహార ఉత్పత్తులను నిల్వ చేసే గిడ్డంగులను భారీ స్థాయిలో నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా చైనాలో జంకుతున్న దేశాలకు భారత్ వరంగా మారనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు) -
కల్తీ...మాయ..!
‘‘జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులోని ఓ దుకాణంలో సరిగ్గా ఏడు నెలల క్రితం కల్తీ నూనె విక్రయాలు జరుపుతుండగా వినియోగదారులు జిల్లా అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో సదరు అధికారులు దుకాణంపై దాడులు చేయగా కల్తీ నూనె విక్రయాలు బట్టబయలు అయింది. అంతటితో ఆగకుండా వినియోగదారులు పెద్ద ఎత్తున ఆ దుకాణం వద్ద ధర్నాకు దిగారు. అయినా జిల్లాలో నేటికీ కల్తీ నూనె విక్రయాలు ఆగలేదు.’’ సూర్యాపేట : జిల్లాలో కల్తీ మంచినూనె వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రమైన సూర్యాపేటతో పాటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి, తిరుమలగిరి, నేరేడుచర్ల ప్రాంతాల్లోనూ ఈ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. నూనె కల్తీ చేసి మార్కెట్లో విక్రయిస్తూ సదరు వ్యాపారులు రూ.కోట్లు గడిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఐఎస్ఐ మార్క్ లేకుండానే స్థానికంగా వివిధ వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన కల్తీ నూనెను మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండ్ల పేరిట విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ లోగోతో గుర్తించలేనంతగా చిన్న మార్పు చేస్తున్నారు. బ్రాండెడ్ పేరిట వాటిని అమ్ముతున్నారు. సదరు వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల మార్కెట్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీనికి తోడు ఐదు లీటర్ల క్యాన్‌కు అదనంగా వివిధ ఆఫర్లను ప్రకటించి ప్రజలకు అంటగడుతున్నారు. కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, తుంగతుర్తి, నేరేడుచర్లతో పాటు సూర్యాపేట కూరగాయల మార్కెట్ రోడ్డు, రైతుబజార్ మార్కెట్లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో, ఎంజీ రోడ్డులో ఎక్కువగా ఇలాంటి విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వలసవచ్చి తాత్కాలికంగా నివసించే కార్మికులు అధికంగా ఉంటారు. తక్కువ ధరలో ఆకర్షణీయమైన ప్యాకెట్లతో నూనె దొరుకుతుందని సదరు కార్మికులు, ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా తమ ఆరోగ్యాలను దెబ్బతీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. తూకంలో మోసాన్ని అరికడతాం.. మంచినూనె డబ్బాలు, ప్యాకెట్ల తూనికల్లో ఏమైనా తేడాలు , మోసం ఉంటే చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు పర్యవేక్షిస్తాం. తూకంలో జరిగే మోసాలపై వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కల్తీ జరిగినట్లు మాకు ఫిర్యాదులొస్తే చర్యలుతీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, తూనికలుకొలతల అధికారి, సూర్యాపేట కల్తీ నూనెలతో కేన్సర్ కల్తీ నూనెలతో గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జంతు కళేబరాలతో ఆయిల్ తయారు కావడంతో కేన్సర్ సోకే ప్రమాదం ఉంది. ఈ నూనెతో అతి రోస్కిమరోíనిస్ అనే పదార్థం ఉండడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఐఎస్ఐ మార్కు ఉన్న నూనెలనే వాడాలి.– డాక్టర్ వూర రాంమూర్తియాదవ్, సూర్యాపేట క్రిమినల్ కేసులు తప్పవు బ్రాండెడ్ కంపెనీల పేరుతో కల్తీ నూనెలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో కేసులు నమోదుచేశాం. కల్తీ నూనెల వల్ల పేద ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కల్తీ నూనెలు విక్రయిస్తే క్రిమినల్ కేసులతో పాటు జైలుకు పంపించి, భారీ జరిమానా విధిస్తాం. – తారాసింగ్, ఫుడ్ ఇన్స్పెక్టర్, సూర్యాపేట -
30 జిల్లాల్లో 100 యూనిట్లు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఆహార పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నడుంబిగించింది. పంటలకు మద్దతు ధర, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం 30 జిల్లాల్లో కనీసం 100 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పా టు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ విధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. ఆహార కల్తీ నిరోధం, ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం, పంటలకు మద్దతు ధర కల్పించడంపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మంత్రులు ఈటల రాజేందర్, హరీ శ్‌రావు, కేటీఆర్‌లతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై ఇప్పటికే కసరత్తు చేసిన ఉపసంఘం.. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లుల క్లస్టర్లు ఏర్పాటు చేయా లని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసె సింగ్‌పై చర్చించేందుకు ఉపసంఘం మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. సిద్దిపేటలో 10 ప్రాంతాల్లో.. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో క్లస్టర్లు.. హుస్నాబాద్, ముండ్రాయి, మందపల్లిలో రైస్ మిల్లులు సహా సిద్దిపేట జిల్లాలో 10 చోట్ల పరిశ్రమల స్థాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొమురవెళ్లి మండలం ఐనాపూర్, తపాస్పల్లిల్లో 1,300 ఎకరాల్లో ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ పరిశ్రమల ఏర్పాటు దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. నంగునూరు మండలం ముండ్రాయి, చిన్నకోడూర్ మందపల్లిలో 270 ఎకరాల స్థలంలో ప్లాస్టిక్ హౌసరీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. చిన్నకోడూరు మండలం జక్కాపూర్‌లో 100 ఎకరాల స్థలంలో ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. జగదేవ్‌పూర్ మండలంలోని పీర్లపల్లిలో 200 ఎకరాలు ప్లాస్టిక్ క్లస్టర్, రెడీమేడ్ గార్మెంట్స్ హౌసరీ, మునిగడపలో 412 ఎకరాల్లో ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, హుస్నాబాద్ మండలంలోని జాలిగడ్డలో 100 ఎకరాల్లో రైస్ మిల్లు, కొండపాకలో 41 ఎకరాల్లో రెడీమేడ్ గార్మెంట్స్ హౌసరీ, ములుగు మండలం కొత్యాల్లో 102 ఎకరాల స్థలంలో రెడీమేడ్ గార్మెంట్స్–హౌసరీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రూ.6 వేల కోట్లతో ప్రాసెసింగ్ జోన్ రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో 300 ఎకరాల్లో రూ. 6 వేల కోట్లతో సమీకృత ఆహార, వ్యవసాయ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు దక్షిణ్ ఆగ్రోపొలీస్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 4,000 మంది మహిళలు, 1,000 మంది పురుషులకు ఉపాధి లభించనుంది. ఆహారశుద్ధి యూనిట్ల మౌలిక వసతుల కోసం ఆగ్రోపొలీస్ రూ. 25 వేల కోట్లు వెచ్చిస్తోంది. రైతులకు వ్యవసాయ రంగంలో మెళకువలు నేర్పడం, వ్యవసాయోత్పత్తుల ఆధునీకరణ కోసం రూ. మూడున్నర వేల కోట్లతో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా 25,000 మంది రైతులకు నేరుగా సహకారం అందనుంది. ఈ మెగా జోన్లో మొక్కజొన్న, చెరకు, వరి ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. జర్మనీ అగ్రి బిజినెస్ అలయన్స్, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా జర్మనీ సాంకేతికతను రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టనున్నారు. -
డబ్బులున్నాయని ఆ పని చేయాలనుకోవడం లేదు!
బతకడం కోసం తినేవాళ్లు ఉంటారు. తినడం కోసమే బతికేవాళ్లూ ఉంటారు. త్రిష రెండో రకం. వెరైటీ వంటకాలు రుచి చూడటం ఆమె అలవాటు. షూటింగ్ కోసం విదేశాలు వెళ్లినప్పుడు అక్కడి వంటకాలను రుచి చూస్తుంటారు. ఆరేంజ్ ఫుడ్ లవర్ కాబట్టే ఎప్పటికైనా రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నారు. ఈ విషయం గురించి త్రిష చెబుతూ - ‘‘ఫుడ్ మీద నాకు ఉన్న ప్రేమ వల్లే ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాను. ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని నేను రెస్టారెంట్ పెట్టాలనుకోవడం లేదు. సీరియస్‌గానే బిజినెస్ చేస్తా. అందుకే అవగాహన కోసం రెస్టారెంట్ మ్యానేజ్మెంట్ కోర్స్ చేయాలనుకుంటున్నా. ఈ వ్యాపారం మీద పూర్తి అవగాహన వచ్చాకే రెస్టారెంట్ ప్రారంభిస్తా’’ అన్నారు. అంతా బాగానే ఉంది.. ఇష్టం వచ్చినట్లు తింటానంటున్నారు.. మరి ఇంత సన్నగా ఎలా ఉండగలుగుతున్నారు? అనే ప్రశ్న త్రిష ముందు ఉంచితే - ‘‘నా అదృష్టం ఏంటంటే... మా అమ్మమ్మ, నాన్నమ్మల నుంచి మా అమ్మగారి వరకూ అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. వాళ్లు ఆరోగ్యకరమైనవి తింటారు. నాకూ అదే అలవాటైంది. లక్కీగా ఆరోగ్యకరమైన ఆహారాలే నాకు రుచిగా అనిపిస్తాయి. నన్నూ, మా అమ్మగార్ని చూసినవాళ్లు ‘మీ ఇద్దరూ అక్కాచెల్లెళ్ళా?’ అని అడుగుతూ ఉంటారు. మా అమ్మగారు ఎంత బాగా తింటారో, అంత బాగా వర్కవుట్స్ కూడా చేస్తారు. సరిగ్గా... నేనూ అంతే’’ అన్నారు.