కోవిడ్‌ సంక్షోభం చూపిన ప్రత్యామ్నాయం.. నారికేళం.. కలిసొచ్చే కాలం.. | Ways to global marketing for Coconut | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ సంక్షోభం చూపిన ప్రత్యామ్నాయం.. నారికేళం.. కలిసొచ్చే కాలం..

Published Tue, Mar 14 2023 4:12 AM | Last Updated on Tue, Mar 14 2023 12:50 PM

Ways to global marketing for Coconut - Sakshi

(నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘ప్రతి సంక్షోభం ఓ ప్రత్యామ్నాయం చూపు­తుంది. తప్పక మేలు చేస్తుంది’ అనేది కొబ్బరి విషయంలో వాస్తవ రూపం దాల్చనుంది. అంది పుచ్చుకోవాలే కానీ ‘కల్పవృక్షం’ విశ్వవ్యాప్తంగా మెరుగైన అవకాశాలను చూపుతుందని.. కొబ్బరికి కలిసొచ్చే కాలం మున్ముందు అపారంగా ఉంటుందని మార్కెటింగ్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విలువ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా కొబ్బరి రైతులకు, పారిశ్రామికవేత్తలకు లాభాలు సమకూ­రుతాయని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కోకోనట్‌ ప్రొడక్ట్స్, ట్రేడ్‌ అండ్‌ మార్కెటింగ్‌’ అంతర్జాతీయ సదస్సులో నిపుణులు ఉద్ఘాటించారు.

ప్రతికూలతలు కొత్త పాఠాలు నేర్పుతున్నాయ్‌
రూగోస్‌ వైట్‌ ఫ్‌లై (తెల్లదోమ) వల్ల కొబ్బరి దిగుబడి తగ్గి ఆశించిన ధర దక్కడం లేదు. మరోవైపు క్వాయర్‌ ఉత్పత్తుల ధరలు నేలచూపు చూస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాలతో పోల్చుకుంటే అంతర్జాతీయ ఎగుమతుల్లో భారత్, దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ఏపీ వెనుకబడి ఉన్నాయి. ఇక్కడి నుంచి కొబ్బరి కాయ, కురిడీ కొబ్బరి, ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి రైతులు, వ్యాపారుల ఆలోచనా ధోరణిలో మార్పులొస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల వినియోగం కూడా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారు.

కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నందున కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, విస్తరణకు నోచుకోనున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో 3 కోట్ల మందికి కొబ్బరి దింపు, సేకరణ, ఎగుమతి, దిగుమతులు జీవనాధారంగా ఉండగా.. వారిలో రైతులు 1.20 కోట్ల మంది ఉన్నారు.

డిమాండ్‌ను ఒడిసి పడితే..
అంతర్జాతీయంగా కొబ్బరి కాయ, కొబ్బరి ముక్క, కొబ్బరి నీళ్లతో తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్, కోకోనట్‌ మిల్క్, డెసికేటెడ్‌ కోకోనట్‌ పౌడర్, కోకోనట్‌ చిప్స్, కోకోనట్‌ వాటర్‌ ప్యాకెట్లు, నాటాడీకో వంటి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త డిమాండ్‌ ఉంది. కొబ్బరిని ఆరోగ్యానికి ఔషధంగా గుర్తించారు. కొబ్బరి పాలలో ఉండే ల్యారిక్‌ యాసిడ్‌ చిన్న పిల్లలకు చాలా ఉపయోగకరం. పశువులకు సంక్రమిస్తున్న విభిన్న వ్యాధులు, వైరస్‌ల వల్ల వాటి నుంచి వచ్చే పాల వాడకంపై అభివృద్ధి చెందుతున్న దేశాలు విముఖత చూపుతున్నాయి.

ఈ మార్కెట్‌ను కొబ్బరి పాలతో భర్తీ చేసేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. కొబ్బరి పాల నుంచి తయారు చేసే వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని సేవించడం వల్ల శరీరంలోని తెల్ల రక్తకణాలు ఉత్సాహంగా ఉంటాయి. ఎయిడ్స్‌ రోగులకు ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌ వంటిదని, ఆరోగ్యానికి దివ్య ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా తరువాత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో యూరప్‌ దేశాలకు కొబ్బరి ఎగుమతులు పెరిగాయి. 

అవకాశాలు అనేకం
భారీ పరిశ్రమలు మొదలు ఫుడ్‌ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుంటే కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు అనేకం ఉన్నాయి. డిమాండ్‌ పెరుగుతున్నందున ఔత్సాహికులు ఉప ఉత్పత్తులపై, కుటీర పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించాల్సి ఉంది.

పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉత్పత్తులతో పాటు పీచు, పెంకు, కలప వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు. ఎండు కొబ్బరి (కోప్రా), కొబ్బరి నూనె, వర్జిన్‌ కొబ్బరి నూనె, కొబ్బరి పొడి, కొబ్బరి పాలు/క్రీమ్, కొబ్బరి పాలతో పొడి, వెనిగర్, చిప్స్, కొబ్బరి నీటితో పాటు పలు రకాల పానీయాలు ఉత్పత్తి చేయవచ్చు.

ఔత్సాహికులు ఇప్పటికే..
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో యు­వ పారిశ్రామికవేత్త గుత్తుల ధర్మరాజు వర్జిన్‌ కో­కోనట్‌ ఆయిల్, కోకోనట్‌ మిల్క్, డెసికేటెడ్‌ కోకోనట్‌ పౌడర్‌ పరిశ్రమను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ వద్ద మరో యువ పారిశ్రామికవేత్త వికాస్‌ సైతం వేపూరి ఆగ్రో ప్రొడక్ట్స్‌ పేరిట ఇవే ఉత్ప­త్తు­లను జాతీయంగా ఎగుమతి చేస్తున్నారు. వీరిని చూ­సి మరికొంతమంది ముందుకు వస్తున్నారు.

జపాన్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఏజెన్సీ (జైకా) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రూ.3.50 కోట్లతో వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్, కోకోనట్‌ మిల్క్, డెసికేటెడ్‌ కోకోనట్‌ పౌడర్, కోకోనట్‌ చార్‌కోల్‌ (చిప్ప బొగ్గు) తయారీ పరిశ్ర­మల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇటువంటివి మరిన్ని ఏర్పాటు చేసేందుకు కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), మినిస్ట్రీ ఆఫ్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడి­యం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) వంటి సంస్థలు రాయితీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.

విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి మార్కెట్‌
వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ను బేబీ మసాజ్‌ ఆయిల్‌గా పశ్చిమ బెంగాల్, చుట్టుపక్కల పట్టణాల్లో అమ్ముతున్నారు. మా కంపెనీ నుంచి ఆయిల్‌ కూడా ఇక్కడకు వెళ్తోంది. అక్కడి ఫార్మా కంపెనీలు సైతం వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ను సిఫారసు చేస్తున్నాయి. మన ప్రాంతంలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వాడుతున్నారు. మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాల్లో కొబ్బరి వాడకం పెరుగుతోంది. మన దేశం కన్నా ఇతర దేశాల్లో అధికంగా కొబ్బరి ఉత్పత్తులను వాడుతున్నారు. ఆరోగ్యం పట్ల నెమ్మదిగా అవగాహన పెంచుకుంటున్నారు. – గుత్తుల ధర్మరాజు, కోనసీమ ఆగ్రోస్‌  కంపెనీ యజమాని, ముమ్మిడివరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement