అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) హైదరాబాద్‌లో 100 రెస్టారెంట్‌లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ‘ఇండియా సహయోగ్ ప్రోగ్రామ్’ పేరుతో ఇప్పటికే 2021లో స్థానికంగా 100 రెస్టారెంట్లలో పని చేస్తున్న వారికి ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ కల్పించింది. తాజాగా మరో 100 రెస్టారెంట్లలోని సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.
ఇండియా సహయోగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎంపిక చేసుకున్న రెస్టారెంట్లలోని సిబ్బందికి ఆహార భద్రత, పరిశుభ్రత, కస్టమర్ సర్వీస్, లాభదాయకత..వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీనివల్ల స్థానిక రెస్టారెంట్లు వృద్ధి చెందడంతోపాటు కస్టమర్లకు మెరుగైన ఆహారం, సేవలందేలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, గౌహతి, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో దాదాపు 800 రెస్టారెంట్లలో సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా కేఎఫ్‌సీ ఇండియా, పార్టనర్ కంట్రీస్ జనరల్ మేనేజర్ మోక్ష్ చోప్రా మాట్లాడుతూ..‘ఆహార పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. మారుతున్న ట్రెండ్‌లు, కస్టమర్ ప్రాధాన్యతలు, వారి డిమాండ్‌లకు అనుగుణంగా సర్వీస్ అందించడం చాలా ముఖ్యం. ఇండియా సహయోగ్ కార్యక్రమంలో భాగంగా 2024 నాటికి దేశవ్యాప్తంగా 1000 రెస్టారెంట్‌లకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ కార్యక్రమం నిర్వహణకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ), ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ (ఎఫ్‌ఓఎస్‌టీఏసీ) ప్రోగ్రామ్ అధికారులతో కలిసి పని చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఈ ప్రోగ్రామ్ కింద 2021లో 100 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చాం. తాజాగా మరో 100 రెస్టారెంట్లలోని సిబ్బందికి అవగాహన కల్పించనున్నాం’ అని తెలిపారు.
ఇదీ చదవండి: ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా.. కొత్త పరికరం ఆవిష్కరణ
తెలంగాణ ఆహార భద్రత కమిషనర్ ఆర్‌వి కర్ణన్ మాట్లాడుతూ..‘ఆహార భద్రత, పరిశుభ్రతకు వినియోగదారులు పెద్దపీట వేస్తున్నారు. పట్టణ ఆర్థిక వ్యవస్థలో స్థానిక రెస్టారెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆహార భద్రత విషయంలో ప్రతి రెస్టారెంట్ యాజమాన్యం సరైన నాణ్యతాప్రమాణాలు పాటించాలి. ఈమేరకు స్థానిక రెస్టారెంట్ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న కేఎఫ్‌సీ ప్రయత్నాలు అభినందనీయం’ అన్నారు. ఆహార భద్రత పరిశ్రమ వృద్ధికి ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) మద్దతుగా ఉంటుందని సంస్థ ప్రెసిడెంట్ సురేష్ సింఘాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment