
ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ దిగ్గజం స్విగ్గీ(Swiggy) తన లాజిస్టిక్స్ సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహాత్మక చర్యలో భాగంగా కంపెనీ ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ‘స్కూట్సీ(Scootsy)’లో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థలో డిసెంబర్‌లో రూ.1,600 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఒక్కో స్కూట్సీ షేరు విలువ రూ.7,640గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో రైట్స్ ఇష్యూ ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నారు.
స్విగ్గీ క్విక్ కామర్స్ వ్యాపారం ఇన్‌స్టామార్ట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలకోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర మూలధన వ్యయాలకు ఈ పెట్టుబడిని ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. 2018లో స్విగ్గీ కొనుగోలు చేసిన స్కూట్సీ.. రెస్టారెంట్, రుచికరమైన ఆహారం, టాయ్స్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్ సహా మరెన్నో కేటగిరీల్లో ఇంట్రాసిటీ ఆన్‌లైన్ డెలివరీ అందించే ప్లాట్‌ఫామ్. ఇది హోల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్‌లకు గోదాము నిర్వహణ, వేర్ హౌస్ ప్రాసెసింగ్, ఆర్డర్ ఫుల్ ఫిల్‌మెంట్, ప్యాకింగ్, షిప్పింగ్ సేవలను కూడా అందిస్తుంది.
పెరుగుతున్న టర్నోవర్
2024 ఆర్థిక సంవత్సరంలో స్కూట్సీ రూ.5,796 కోట్ల టర్నోవర్‌ను నివేదించింది. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.3,686 కోట్లుగా, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1,580 కోట్లుగా ఉంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సప్లై చెయిన్ సేవల నుంచి స్విగ్గీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ.1,693 కోట్లకు చేరింది.
ఇదీ చదవండి: వచ్చేవారం యూఎస్ రక్షణశాఖలో 5,400 మందికి లేఆఫ్స్
క్విక్ కామర్స్‌లో భారీగా పెట్టుబడులు
వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో ఆధిపత్య మార్కెట్ వాటాను పొందడానికి స్విగ్గీ, దాని ప్రత్యర్థి జొమాటో రెండూ తమ క్విక్ కామర్స్ వ్యాపారాల్లో పెట్టుబడులను పెంచుతున్నాయి. స్కూట్సీలో తాజా పెట్టుబడి దాని లాజిస్టిక్స్ మౌలికసదుపాయాలను మెరుగుపరచడానికి, కస్టమర్లకు సమర్థవంతమైన, సకాలంలో డెలివరీలను అందించేందుకు తోడ్పడుతుందని స్విగ్గీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment