మెప్పించిన లిస్టింగ్
తొలి రోజే షేరు 17% జంప్
ముంబై: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ షేరు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు 17% లాభాలు డెలివరీ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.390)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.420 వద్ద లిస్టయ్యింది. నష్టాల మార్కెట్లో ఈ షేరుకు డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో 19.50% పెరిగి రూ.466 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 17% లాభంతో రూ.456 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.03 లక్షల కోట్లుగా నమోదైంది.
→ ఐపీఓ లిస్టింగ్‌తో స్విగ్గీ కంపెనీలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. పబ్లిక్ ఇష్యూ కంటే ముందే స్విగ్గీ తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈ–సాప్స్) కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. ఐపీఓ గరిష్ట ధర శ్రేణి రూ.390 ప్రకారం వీటి విలువ రూ.9,000 కోట్లుగా ఉంది. దలాల్ స్ట్రీట్‌లో షేరు రూ.420 వద్ద లిస్ట్ కావడంతో ఉద్యోగులకు కేటాయించిన షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో సుమారు 500 మంది ఉద్యోగులు ఒక్కొక్కరి దగ్గర షేర్ల విలువ రూ. కోటికి పైగా చేరింది.
→ స్విగ్గీ షేర్లు మార్కెట్లోకి లిస్ట్ కావడంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. స్విగ్గీ, జొమాటోకు సంబంధించిన ఒక ఫొటోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ ‘నువ్వు, నేను ఈ అందమైన ప్రపంచంలో..’ అంటూ రాసుకొచ్చారు.
5 ఏళ్లలో పటిష్ట వృద్ధి: సీఈఓ శ్రీహర్ష
వచ్చే 3–5 ఏళ్లలో పటిష్ట వృద్ధి పథంలో దూసుకెళ్తామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌స్టామార్ట్ నెట్‌వర్క్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద డార్క్ స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పెద్ద నగరాల్లో సగటు డెలివరీ సమయం 17 నిమిషాల నుంచి 12 నిమిషాలకు తగ్గిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment