సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఆహార పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నడుంబిగించింది. పంటలకు మద్దతు ధర, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం 30 జిల్లాల్లో కనీసం 100 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పా టు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ విధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది.
ఆహార కల్తీ నిరోధం, ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం, పంటలకు మద్దతు ధర కల్పించడంపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మంత్రులు ఈటల రాజేందర్, హరీ శ్‌రావు, కేటీఆర్‌లతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై ఇప్పటికే కసరత్తు చేసిన ఉపసంఘం.. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లుల క్లస్టర్లు ఏర్పాటు చేయా లని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసె సింగ్‌పై చర్చించేందుకు ఉపసంఘం మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది.
సిద్దిపేటలో 10 ప్రాంతాల్లో..
సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో క్లస్టర్లు.. హుస్నాబాద్, ముండ్రాయి, మందపల్లిలో రైస్ మిల్లులు సహా సిద్దిపేట జిల్లాలో 10 చోట్ల పరిశ్రమల స్థాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొమురవెళ్లి మండలం ఐనాపూర్, తపాస్‌పల్లిల్లో 1,300 ఎకరాల్లో ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ పరిశ్రమల ఏర్పాటు దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.
నంగునూరు మండలం ముండ్రాయి, చిన్నకోడూర్ మందపల్లిలో 270 ఎకరాల స్థలంలో ప్లాస్టిక్ హౌసరీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. చిన్నకోడూరు మండలం జక్కాపూర్‌లో 100 ఎకరాల స్థలంలో ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. జగదేవ్‌పూర్ మండలంలోని పీర్లపల్లిలో 200 ఎకరాలు ప్లాస్టిక్ క్లస్టర్, రెడీమేడ్ గార్మెంట్స్ హౌసరీ, మునిగడపలో 412 ఎకరాల్లో ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, హుస్నాబాద్ మండలంలోని జాలిగడ్డలో 100 ఎకరాల్లో రైస్ మిల్లు, కొండపాకలో 41 ఎకరాల్లో రెడీమేడ్ గార్మెంట్స్ హౌసరీ, ములుగు మండలం కొత్యాల్‌లో 102 ఎకరాల స్థలంలో రెడీమేడ్ గార్మెంట్స్–హౌసరీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రూ.6 వేల కోట్లతో ప్రాసెసింగ్ జోన్
రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో 300 ఎకరాల్లో రూ. 6 వేల కోట్లతో సమీకృత ఆహార, వ్యవసాయ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు దక్షిణ్ ఆగ్రోపొలీస్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 4,000 మంది మహిళలు, 1,000 మంది పురుషులకు ఉపాధి లభించనుంది.
ఆహారశుద్ధి యూనిట్ల మౌలిక వసతుల కోసం ఆగ్రోపొలీస్ రూ. 25 వేల కోట్లు వెచ్చిస్తోంది. రైతులకు వ్యవసాయ రంగంలో మెళకువలు నేర్పడం, వ్యవసాయోత్పత్తుల ఆధునీకరణ కోసం రూ. మూడున్నర వేల కోట్లతో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా 25,000 మంది రైతులకు నేరుగా సహకారం అందనుంది.
ఈ మెగా జోన్‌లో మొక్కజొన్న, చెరకు, వరి ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. జర్మనీ అగ్రి బిజినెస్ అలయన్స్, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా జర్మనీ సాంకేతికతను రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment