డబ్బులున్నాయని ఆ పని చేయాలనుకోవడం లేదు!
బతకడం కోసం తినేవాళ్లు ఉంటారు. తినడం కోసమే బతికేవాళ్లూ ఉంటారు. త్రిష రెండో రకం. వెరైటీ వంటకాలు రుచి చూడటం ఆమె అలవాటు. షూటింగ్ కోసం విదేశాలు వెళ్లినప్పుడు అక్కడి వంటకాలను రుచి చూస్తుంటారు. ఆరేంజ్ ఫుడ్ లవర్ కాబట్టే ఎప్పటికైనా రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నారు. ఈ విషయం గురించి త్రిష చెబుతూ - ‘‘ఫుడ్ మీద నాకు ఉన్న ప్రేమ వల్లే ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాను. ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని నేను రెస్టారెంట్ పెట్టాలనుకోవడం లేదు. సీరియస్‌గానే బిజినెస్ చేస్తా. అందుకే అవగాహన కోసం రెస్టారెంట్ మ్యానేజ్‌మెంట్ కోర్స్ చేయాలనుకుంటున్నా.
ఈ వ్యాపారం మీద పూర్తి అవగాహన వచ్చాకే రెస్టారెంట్ ప్రారంభిస్తా’’ అన్నారు. అంతా బాగానే ఉంది.. ఇష్టం వచ్చినట్లు తింటానంటున్నారు.. మరి ఇంత సన్నగా ఎలా ఉండగలుగుతున్నారు? అనే ప్రశ్న త్రిష ముందు ఉంచితే - ‘‘నా అదృష్టం ఏంటంటే... మా అమ్మమ్మ, నాన్నమ్మల నుంచి మా అమ్మగారి వరకూ అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. వాళ్లు ఆరోగ్యకరమైనవి తింటారు. నాకూ అదే అలవాటైంది. లక్కీగా ఆరోగ్యకరమైన ఆహారాలే నాకు రుచిగా అనిపిస్తాయి. నన్నూ, మా అమ్మగార్ని చూసినవాళ్లు ‘మీ ఇద్దరూ అక్కాచెల్లెళ్ళా?’ అని అడుగుతూ ఉంటారు. మా అమ్మగారు ఎంత బాగా తింటారో, అంత బాగా వర్కవుట్స్ కూడా చేస్తారు. సరిగ్గా... నేనూ అంతే’’ అన్నారు.