ఇండియన్ ఈవీ ఆటోమేకర్స్ ఆశలపై నీళ్లు జల్లేలా చైనా ప్రవర్తిస్తోంది. కరోనా వల్ల చిప్ ఫ్యాక్టరీలు మూతపడి.. క్రానిక్ చిప్ షార్టేజ్ ఏర్పడి 2021లో ఫ్యూయల్ బేస్డ్ కార్ల ఉత్పత్తి తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఉత్పత్తికీ విఘాతం కలిగించే చేష్టలకు పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ. లిథియం-ఇయాన్ బ్యాటరీల సరఫరాను భారత్‌కు గణనీయంగా తగ్గించేయడంతో ఈవీ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు.
సౌత్ కొరియా, తైవాన్‌లతో పాటుగా చైనా లిథియమ్-ఇయాన్ సెల్స్‌ను భారత్‌కు సప్లై చేస్తోంది. ఈ మూడు దేశాల్లో చైనా వాటానే అధికంగా(60 శాతంపైనే?!) ఉంది. కానీ, చైనా ఇప్పుడు భారత్ మార్కెట్ కంటే యూరప్, అమెరికాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో మనకు సప్లై తగ్గిపోయి.. అటువైపు సప్లై పెరిగింది. అక్కడి మార్కెట్‌లలో లిథియమ్-ఇయాన్ బ్యాటరీలకు భారీ డిమాండ్ ఉండడం, భారత్‌తో పోలిస్తే అధిక చెల్లింపులు చేస్తుండడమే అందుకు కారణం. ఈ ప్రభావం భారత్ ఈవీ మార్కెట్‌పై పడనుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు అప్‌డేషన్‌లో భాగంగా ఈవీ వెహికిల్స్‌కు భారత్‌లో డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఈవీ మేకింగ్ రంగంలోకి అడుగుపెడుతున్నాయి చాలా కంపెనీలు. ఇక ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉత్పత్తిని సైతం ప్రారంభించగా, మరికొన్ని ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఈ తరుణంలో భారత్‌కు కాకుండా చైనా యూఎస్, యూరప్ బేస్డ్ దేశాలకు బ్యాటరీలను తరలించడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు కొందరు ఈవీ మేకర్స్ వెనకడుగు వేసే ఆలోచన చేస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
భారత్ పూర్తిగా లిథియమ్-ఇయాన్ బ్యాటరీల కోసం దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 9 వేల కోట్ల విలువ చేసే లిథియం-ఇయాన్ సెల్స్ దిగుమతులను తెప్పించుకుంది. ఈ సెల్స్‌ను చేర్చి.. బ్యాటరీ ప్యాక్స్‌గా మార్చేసి ఈవీలలో ఉపయోగిస్తారు. కానీ, బ్యాటరీ గ్రేడ్ లిథియం కార్బొనేట్ ధర రెండువారాల్లోనే 27 శాతం పెరిగి.. గరిష్ట ధరకు చేరుకుంది. మెటీరియల్ ధరలు పెరగడం, మరోవైపు సేకరణ.. నిల్వ.. రవాణాల ఖర్చు కారణంగా సెల్స్ ధరల్ని పెంచుతున్నాయి ఉత్పత్తి కంపెనీలు. ఈ తరుణంలో ఫుల్‌డిమాండ్ ఉన్న యూరప్, యూఎస్‌లకే సప్లైకి మొగ్గు చూపిస్తోంది చైనా.
ఇంకోవైపు షిప్పింగ్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కిందటి ఏడాదితో పోలిస్తే.. నాలుగు రెట్లు పెంచేసింది చైనా. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక గగనతలం నుంచి తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నష్టాన్ని ఓర్చుకుని అయినా సరే బ్యాటరీలను తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని భారత కంపెనీలు. అయినప్పటికీ షిప్‌మెంట్ మాత్రం 10-15రోజుల ఆలస్యంగా చేరుతున్నాయట. ఇందుకు కారణం.. మెజార్టీ షిప్‌లు యూఎస్, యూరప్‌లకు తరలిపోతుండడమే.
ఇక ఆ జాప్యం ప్రభావం ఉత్పత్తిపైనా పడుతోంది. ఈవీ మేకర్స్‌కు ఇదంతా అదనపు భారం కానుంది. దీంతో బ్యాటరీ ధరల్ని పెంచాల్సిన పరిస్థితి ఎదురవుతుండగా.. వినియోగదారులపైనా భారం పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బ్యాటరీ ధరల్ని ఐదు శాతం పెంచే నిర్ణయం తీసుకుంది ట్రోంటెక్ ఎలక్ట్రానిక్స్. సెప్టెంబర్‌లో తమ కంపెనీ ఉత్పత్తి 50 శాతం తగ్గిండమే అందుకు కారణమని చెప్తున్నారు ట్రోంటెక్ ఎలక్ట్రానిక్స్ సీఈవో సమరథ్ కొచ్చర్.
ఇక ఫోన్ చేసిన ప్రతీసారి చైనా కంపెనీలు ధరలు పెంచేస్తున్నాయని వాపోతున్నారు వన్ ఎలక్ట్రిక్ సీఈవో గౌరవ్ ఉప్పల్. అమెరికా, యూరప్ మార్కెట్‌కు తరలిపోకుండా.. కన్సార్టియం(గుత్తగంప ఆర్డర్లు) ద్వారానే మన మార్కెట్ మీద చైనాకు ఆసక్తి సృష్టించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గౌరవ్. ఇదికాకుండా చైనా మనకు సృష్టిస్తున్న కొరత తీరాలంటే.. ఇతర దేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, చైనా బాటలోనే అవి కూడా యూరప్, అమెరికా మార్కెట్ మీదే దృష్టి పెడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అదనపు సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యం పెరిగితేగానీ ఈ లోటు తీరే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు 15 నుంచి 24 నెలలు పట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోనీ భారీ ఖర్చుతో స్థానిక ఉత్పత్తి మొదలుపెట్టినా.. పూర్తిస్థాయి లోటు తీరడానికి ఐదేళ్లు పట్టొచ్చనేది ఓ అంచనా. లిథియమ్-ఇయాన్ దిగుమతి విషయంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన ప్రకటన.. రాబోయే కాలంలో ఈవీ మార్కెట్ ఎదుర్కొనే గడ్డు పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment