electronic manufacturing company
-
ఎవలాన్ టెక్నాలజీస్ ఐపీవో
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ తయారీ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఏప్రిల్ 3న ప్రారంభంకానున్న ఇష్యూ 6న ముగియనుంది. తద్వారా కంపెనీ రూ. 865 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 31న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాగా.. తొలుత ఐపీవో ద్వారా రూ. 1,025 కోట్ల సమీకరణకు కంపెనీ ప్రణాళికలు వేసింది. అయితే ఇష్యూ కంటే ముందుగా షేర్ల ప్లేస్మెంట్ ద్వారా రూ. 160 కోట్లు సమకూర్చుకుంది. రూ. 80 కోట్లు తాజా ఈక్విటీ, మరో రూ. 80 కోట్లు సెకండరీ షేర్ల అమ్మకం ద్వారా ఈ నిధులు అందుకుంది. వీటిలో యూనిఫై ఫైనాన్షియల్ ప్రయివేట్ లిమిటెడ్, అశోకా ఇండియా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ నుంచి రూ. 60 కోట్లు చొప్పున లభించగా.. ఇండియా ఎకార్న్ ఫండ్ నుంచి రూ. 40 కోట్లు సమకూరినట్లు ఎవలాన్ వెల్లడించింది. 1999లో షురూ.. ఎండ్టుఎండ్ ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న ఎవలాన్ 1999లో ఏర్పాటైంది. కంపెనీ క్లయింట్లలో క్యోసన్ ఇండియా, జోనర్ సిస్టమ్స్ ఇంక్, కొలిన్స్ ఏరోస్పేస్, ఈ ఇన్ఫోచిప్స్, యూఎస్ మలబార్ కంపెనీ, మెగ్గిట్, సిస్టెక్ కార్పొరేషన్ తదితరాలున్నాయి. యూఎస్‌తోపాటు దేశీయంగా 12 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2021–22లో రూ. 840 కోట్ల ఆదాయం సాధించింది. 2022 జూన్‌కల్లా రూ. 1,039 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. -
ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగంలో రిలయన్స్, వందల కోట్లలో పెట్టుబడులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా సాన్మినా కార్పొరేషన్‌తో భాగస్వామ్య సంస్థ(జేవీ) ఏర్పాటుకు తెరతీసింది. అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఎస్బీవీఎల్) ద్వారా జేవీలో 50.1 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 3,300 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో రూ. 1,670 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుంది. యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాన్మినా కార్పొరేషన్‌కు దేశీయంగా చెన్నైలోగల యూనిట్లో ఆర్ఎస్బీవీఎల్ తాజా నిధులను ఇన్వెస్ట్ చేయనుంది. సాన్మినా కార్పొరేషన్ 49.9 శాతం వాటాను కలిగి ఉంటుంది. వెరసి జేవీగా మారనున్న సాన్మినా దేశీ యూనిట్లో ఆర్ఎస్బీవీఎల్ మెజారిటీ వాటాను పొందుతుంది. ఈ పెట్టుబడులను కంపెనీ వృద్ధి అవకాశాలకు వినియోగించనుంది. కాగా.. గతంలో ప్రకటించిన విధంగా భాగస్వామ్య లావాదేవీని పూర్తి చేసినట్లు రెండు కంపెనీలూ తాజాగా ప్రకటించాయి. తాజాగా ఏర్పాటు చేసిన జేవీని సాన్మినా యాజమాన్యమే నిర్వహించనుంది. నాలుగు దశాబ్దాలుగా అడ్వాన్స్డ్ తయారీ విధానాల్లో సాన్మినా అనుభవం, దేశీ వ్యాపార వ్యవస్థలో ఆర్‌ఐఎల్‌కున్న నైపుణ్యం, నాయకత్వ పటిమ జేవీకి లబ్ధిని చేకూర్చనున్నట్లు వివరించాయి. ఆర్ఎస్బీవీఎల్ ఇలా మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2021–22) ఆర్ఎస్బీవీఎల్ రూ. 1,478 కోట్ల ఆదాయం సాధించింది. దాదాపు రూ. 180 కోట్ల నికర లాభం ఆర్జించింది. రూ. 10,858 కోట్లవరకూ పెట్టుబడులు వెచ్చించింది. తాజా జేవీ ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా ఆవిర్భవించనున్నట్లు రెండు సంస్థలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. కమ్యూనికేషన్ నెట్వర్కింగ్, మెడికల్ అండ్ హెల్త్‌కేర్ సిస్టమ్స్, డిఫెన్స్ తదితర రంగాలకు అవసరమైన అత్యున్నత సాంకేతిక మౌలికసదుపాయాల హార్డ్‌వేర్‌ను రూపొందించనుంది. చెన్నైలోని 100 ఎకరాల క్యాంపస్‌లో తయారీ కార్యకలాపాలు చేపట్టనున్నట్లు తెలియజేశాయి. -
భారత్ కొంప ముంచేలా చైనా నిర్ణయం!
ఇండియన్ ఈవీ ఆటోమేకర్స్ ఆశలపై నీళ్లు జల్లేలా చైనా ప్రవర్తిస్తోంది. కరోనా వల్ల చిప్ ఫ్యాక్టరీలు మూతపడి.. క్రానిక్ చిప్ షార్టేజ్ ఏర్పడి 2021లో ఫ్యూయల్ బేస్డ్ కార్ల ఉత్పత్తి తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఉత్పత్తికీ విఘాతం కలిగించే చేష్టలకు పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ. లిథియం-ఇయాన్ బ్యాటరీల సరఫరాను భారత్‌కు గణనీయంగా తగ్గించేయడంతో ఈవీ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. సౌత్ కొరియా, తైవాన్లతో పాటుగా చైనా లిథియమ్-ఇయాన్ సెల్స్‌ను భారత్‌కు సప్లై చేస్తోంది. ఈ మూడు దేశాల్లో చైనా వాటానే అధికంగా(60 శాతంపైనే?!) ఉంది. కానీ, చైనా ఇప్పుడు భారత్ మార్కెట్ కంటే యూరప్, అమెరికాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో మనకు సప్లై తగ్గిపోయి.. అటువైపు సప్లై పెరిగింది. అక్కడి మార్కెట్లలో లిథియమ్-ఇయాన్ బ్యాటరీలకు భారీ డిమాండ్ ఉండడం, భారత్‌తో పోలిస్తే అధిక చెల్లింపులు చేస్తుండడమే అందుకు కారణం. ఈ ప్రభావం భారత్ ఈవీ మార్కెట్‌పై పడనుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు అప్డేషన్లో భాగంగా ఈవీ వెహికిల్స్‌కు భారత్‌లో డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఈవీ మేకింగ్ రంగంలోకి అడుగుపెడుతున్నాయి చాలా కంపెనీలు. ఇక ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉత్పత్తిని సైతం ప్రారంభించగా, మరికొన్ని ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఈ తరుణంలో భారత్‌కు కాకుండా చైనా యూఎస్, యూరప్ బేస్డ్ దేశాలకు బ్యాటరీలను తరలించడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు కొందరు ఈవీ మేకర్స్ వెనకడుగు వేసే ఆలోచన చేస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భారత్ పూర్తిగా లిథియమ్-ఇయాన్ బ్యాటరీల కోసం దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 9 వేల కోట్ల విలువ చేసే లిథియం-ఇయాన్ సెల్స్ దిగుమతులను తెప్పించుకుంది. ఈ సెల్స్‌ను చేర్చి.. బ్యాటరీ ప్యాక్స్‌గా మార్చేసి ఈవీలలో ఉపయోగిస్తారు. కానీ, బ్యాటరీ గ్రేడ్ లిథియం కార్బొనేట్ ధర రెండువారాల్లోనే 27 శాతం పెరిగి.. గరిష్ట ధరకు చేరుకుంది. మెటీరియల్ ధరలు పెరగడం, మరోవైపు సేకరణ.. నిల్వ.. రవాణాల ఖర్చు కారణంగా సెల్స్ ధరల్ని పెంచుతున్నాయి ఉత్పత్తి కంపెనీలు. ఈ తరుణంలో ఫుల్‌డిమాండ్ ఉన్న యూరప్, యూఎస్లకే సప్లైకి మొగ్గు చూపిస్తోంది చైనా. ఇంకోవైపు షిప్పింగ్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కిందటి ఏడాదితో పోలిస్తే.. నాలుగు రెట్లు పెంచేసింది చైనా. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక గగనతలం నుంచి తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నష్టాన్ని ఓర్చుకుని అయినా సరే బ్యాటరీలను తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని భారత కంపెనీలు. అయినప్పటికీ షిప్మెంట్ మాత్రం 10-15రోజుల ఆలస్యంగా చేరుతున్నాయట. ఇందుకు కారణం.. మెజార్టీ షిప్‌లు యూఎస్, యూరప్‌లకు తరలిపోతుండడమే. ఇక ఆ జాప్యం ప్రభావం ఉత్పత్తిపైనా పడుతోంది. ఈవీ మేకర్స్‌కు ఇదంతా అదనపు భారం కానుంది. దీంతో బ్యాటరీ ధరల్ని పెంచాల్సిన పరిస్థితి ఎదురవుతుండగా.. వినియోగదారులపైనా భారం పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బ్యాటరీ ధరల్ని ఐదు శాతం పెంచే నిర్ణయం తీసుకుంది ట్రోంటెక్ ఎలక్ట్రానిక్స్. సెప్టెంబర్‌లో తమ కంపెనీ ఉత్పత్తి 50 శాతం తగ్గిండమే అందుకు కారణమని చెప్తున్నారు ట్రోంటెక్ ఎలక్ట్రానిక్స్ సీఈవో సమరథ్ కొచ్చర్. ఇక ఫోన్ చేసిన ప్రతీసారి చైనా కంపెనీలు ధరలు పెంచేస్తున్నాయని వాపోతున్నారు వన్ ఎలక్ట్రిక్ సీఈవో గౌరవ్ ఉప్పల్. అమెరికా, యూరప్ మార్కెట్‌కు తరలిపోకుండా.. కన్సార్టియం(గుత్తగంప ఆర్డర్లు) ద్వారానే మన మార్కెట్ మీద చైనాకు ఆసక్తి సృష్టించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గౌరవ్. ఇదికాకుండా చైనా మనకు సృష్టిస్తున్న కొరత తీరాలంటే.. ఇతర దేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, చైనా బాటలోనే అవి కూడా యూరప్, అమెరికా మార్కెట్ మీదే దృష్టి పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అదనపు సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యం పెరిగితేగానీ ఈ లోటు తీరే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు 15 నుంచి 24 నెలలు పట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోనీ భారీ ఖర్చుతో స్థానిక ఉత్పత్తి మొదలుపెట్టినా.. పూర్తిస్థాయి లోటు తీరడానికి ఐదేళ్లు పట్టొచ్చనేది ఓ అంచనా. లిథియమ్-ఇయాన్ దిగుమతి విషయంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన ప్రకటన.. రాబోయే కాలంలో ఈవీ మార్కెట్ ఎదుర్కొనే గడ్డు పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. చదవండి: చైనా బొమ్మల్లో ‘విషం’.. అమెరికా అలర్ట్! -
ఎలక్ట్రానిక్ తయారీయే.. రూ.లక్ష కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ తయారీని పెంచడం ఒక్క చర్యతోనే జీడీపీకి ట్రిలియన్ డాలర్లు (రూ.74లక్షల కోట్లు) మేర సమకూరుతుందని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ విషయంతో తనకు ఎటువంటి సందేహం లేదంటూ, దీన్ని తప్పకుండా సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలైన యాపిల్, శామ్సంగ్ తదితర సంస్థలకు భారత్‌లో కార్యకలాపాల పట్ల ఆసక్తి ఉందని, వీటితోపాటు వీటి కాంట్రాక్టు తయారీ సంస్థలు సైతం భారత్‌లో ఉత్పత్తిని విస్తరించనున్నాయని అసోచామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.370 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థను సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ‘‘ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీలు), ల్యాప్‌టాప్‌లు, ఐవోటీ ఉత్పత్తుల విషయంలో భారత్‌కు అపార సామర్థ్యాలున్నాయి. మొబైల్ ఫోన్ల తయారీలో అంతర్జాతీయంగా అతిపెద్ద కేంద్రంగా భారత్ అవతరించాలన్నది ఆలోచన’’ అని మంత్రి ప్రసాద్ వివరించారు. దేశంలో నైపుణ్యాలు, ఆవిష్కరణల సామర్థ్యాలు, అధిక జనాభా అనుకూలతలు అన్నవి భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేసేందుకు సరిపోతాయన్నారు. కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంతర్జాతీయంగా దిగ్గజ కంపెనీలను ఆకర్షించిందని.. రూ.10 లక్షల కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు సంసిద్ధతను ప్రకటించాయని తెలిపారు. ఇందులో రూ.7 లక్షల కోట్ల మేర ఎగుమతులకు ఉద్దేశించినవిగా పేర్కొన్నారు. -
అయిదేళ్లలో 12 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న అయిదేళ్లలో భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం ప్రకటించారు. వివిధ దిగ్గజ ఎలక్ట్రానిక్ తయారీదారులు వచ్చే అయిదేళ్లలో దేశంలో భారీస్థాయిలో స్మార్ట్ఫోన్లు, విడిభాగాల తయారీ చేసేలా ప్రతిపాదించారని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల వరకు ఉద్యోగాలు సృష్టించనున్నారని వెల్లడించారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) కింద దేశంలో రాబోయే ఐదేళ్లలో11 లక్షలకు కోట్ల రూపాయలకు పైగా విలువైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు తయారు కానున్నాయని కేంద్రం మంత్రి వెల్లడించారు. పెగాట్రాన్, శాంసంగ్ , రైజింగ్ స్టార్ , ఫాక్స్ కాన్, విస్ట్రాన్ ఐదు అంతర్జాతీయ బ్రాండ్లతో సహా మొత్తం 22 కంపెనీలు ఈ పథకం కింద 22 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. ఈ కంపెనీల 7 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేయనున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు లక్షల ప్రత్యక్ష, తొమ్మిది లక్షల పరోక్ష ఉద్యోగాలు దేశీయంగా లభిస్తాయని పేర్కొన్నారు. ఈ పథకం ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహిస్తుందని, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని భావిస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో అంతర్జాతీయ బ్రాండ్ల టీవీల అసెంబ్లింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీలో ఉన్న మోటరోలా, నోకియా, వన్‌ప్లస్ వంటి దిగ్గజ సంస్థలు ఎల్ఈడీ టీవీల రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. విశేషమేమంటే ఈ కంపెనీల టీవీలు హైదరాబాద్‌లో రూపుదిద్దు కుంటున్నాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న స్కైక్వాడ్ ఇప్పటికే ప్యానాసోనిక్, లాయిడ్ వంటి ఏడు బ్రాండ్ల టీవీలను అసెంబుల్ చేస్తోంది. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్, శంషాబాద్ వద్ద ప్లాంట్లున్నాయి. ఏటా 30 లక్షల ఎల్ఈడీ టీవీలను రూపొందించే సామర్థ్యం ఉంది. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారని కంపెనీ ఎండీ రమీందర్ సింగ్ సోయిన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. అంతర్జాతీయ కంపెనీలకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో నాలుగు కొత్త బ్రాండ్లు తోడవనున్నాయని వివరించారు. రెండో దశలో రూ.1,400 కోట్లు.. స్కైక్వాడ్ భాగస్వామ్యంతో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ స్కైవర్త్ శంషాబాద్ వద్ద 50 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.700 కోట్లు పెట్టుబడి చేస్తున్నారు. ఇరు సంస్థలు కలిసి టీవీలతోపాటు వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లను అసెంబుల్ చేస్తాయని రమీందర్ వెల్లడించారు. ‘ఆరు నెలల్లో ఈ ఉత్పత్తుల తయారీ మొదలవుతుంది. కొత్త ప్లాంటు ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది. 15–20 శాతం విడిభాగాలు స్థానికంగా తయారవుతున్నాయి. దీనిని 50 శాతానికి తీసుకువెళతాం. మరో 20 దాకా అనుబంధ సంస్థలు రానున్నాయి. వీటి ద్వారా 3,000 ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నాం. రెండవ దశలో ఇరు సంస్థలు కలిసి రూ.1,400 కోట్ల పెట్టుబడి చేయాలని భావిస్తున్నాం’అన్నారు. -
మరో 6 జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు
ఇకపై ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమలకు కోతలుండవ్ ఐటీఈఅండ్‌సీ సెక్రటరీ సంజయ్ సాక్షి, హైదరాబాద్: త్వరలో రూ. వెయ్యి కోట్లతో మహేశ్వరం, ఫ్యాబీ సిటీలోని ఈ-సీటీలో రెండు ఎలక్ట్రానిక్ తయారీ సంస్థల ప్రారంభం కానున్నాయని ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సెక్రటరీ సంజయ్ జాజు చెప్పారు. వీటితో పాటు రంగారెడ్డి, మెదక్, చిత్తూరు, నెల్లూరు, వరంగల్, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. స్థల సేకరణకు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుగుతోందన్నారు. సోమవారమిక్కడ ‘ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు’ అనే అంశంపై జరిగిన శిక్షణ శిబిరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రాభివృద్ధిలో ఎలక్ట్రానిక్, ఐటీ పరిశ్రమలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి పరిశ్రమలు విద్యుత్ కోతలతో నష్టాలు చూస్తున్నాయి. దీనిపై సీపీడీసీఎల్ అధికారులతో మాట్లాడాం. మరో ఆరు నెలల్లో హైటెక్‌సిటీ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఎలక్ట్రానిక్, ఐటీ పరిశ్రమలకు కోతల్లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుంది’’ అని స్పష్టం చేశారు.