న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ తయారీని పెంచడం ఒక్క చర్యతోనే జీడీపీకి ట్రిలియన్ డాలర్లు (రూ.74లక్షల కోట్లు) మేర సమకూరుతుందని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ విషయంతో తనకు ఎటువంటి సందేహం లేదంటూ, దీన్ని తప్పకుండా సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలైన యాపిల్, శామ్‌సంగ్ తదితర సంస్థలకు భారత్‌లో కార్యకలాపాల పట్ల ఆసక్తి ఉందని, వీటితోపాటు వీటి కాంట్రాక్టు తయారీ సంస్థలు సైతం భారత్‌లో ఉత్పత్తిని విస్తరించనున్నాయని అసోచామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.370 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థను సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే.
‘‘ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీలు), ల్యాప్‌టాప్‌లు, ఐవోటీ ఉత్పత్తుల విషయంలో భారత్‌కు అపార సామర్థ్యాలున్నాయి. మొబైల్ ఫోన్ల తయారీలో అంతర్జాతీయంగా అతిపెద్ద కేంద్రంగా భారత్ అవతరించాలన్నది ఆలోచన’’ అని మంత్రి ప్రసాద్ వివరించారు. దేశంలో నైపుణ్యాలు, ఆవిష్కరణల సామర్థ్యాలు, అధిక జనాభా అనుకూలతలు అన్నవి భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేసేందుకు సరిపోతాయన్నారు. కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంతర్జాతీయంగా దిగ్గజ కంపెనీలను ఆకర్షించిందని.. రూ.10 లక్షల కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు సంసిద్ధతను ప్రకటించాయని తెలిపారు. ఇందులో రూ.7 లక్షల కోట్ల మేర ఎగుమతులకు ఉద్దేశించినవిగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment