IT Minister Ravi Shankar Prasad
-
ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయం ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఆరేళ్లుగా అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ నగరానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) లేదా దానికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆదివారం లేఖ రాశారు. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. జాతీయ సగటు 1.9 శాతంతో పోలిస్తే.. తెలం గాణ 7 శాతం వృద్ధి రేటుతో ఎగుమతులు రూ.1.4 లక్షల కోట్లకు చేరాయన్నారు. అ లాగే ఆఫీస్ స్పేస్ 8.7 మిలియన్ చదరపు అడుగులు పెరిగిందని, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్‌మాన్ సాక్స్, ఫియట్ క్రిస్లార్ ఆటోమొబైల్స్ వంటి ప్రముఖ కంపెనీలు తెలంగాణకు పెట్టుబడులతో వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీతో పాటు పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కోసం అనేక పాలసీలు రూపొందించామని తెలిపారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఐటీ రంగం వృద్ధికి అనువైన వాతావరణం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఐటీలో హైదరాబాద్‌ను ప్రోత్సహించండి హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సం బంధించి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేం ద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలిశారని, తాను కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నా రు. ఐటీఐఆర్‌పై కేంద్రం చేస్తున్న తాత్సారంతో ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆందోళన వ్య క్తం చేశారు. దేశానికి ఆర్థిక ఇంజన్లుగా పనిచేస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలన్నారు. ఐటీఐఆర్‌పై యువత ఆశలను అడియాశలు చేయొద్దని లేఖలో పేర్కొన్నారు. -
ఎలక్ట్రానిక్ తయారీయే.. రూ.లక్ష కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ తయారీని పెంచడం ఒక్క చర్యతోనే జీడీపీకి ట్రిలియన్ డాలర్లు (రూ.74లక్షల కోట్లు) మేర సమకూరుతుందని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ విషయంతో తనకు ఎటువంటి సందేహం లేదంటూ, దీన్ని తప్పకుండా సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలైన యాపిల్, శామ్సంగ్ తదితర సంస్థలకు భారత్‌లో కార్యకలాపాల పట్ల ఆసక్తి ఉందని, వీటితోపాటు వీటి కాంట్రాక్టు తయారీ సంస్థలు సైతం భారత్‌లో ఉత్పత్తిని విస్తరించనున్నాయని అసోచామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.370 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థను సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ‘‘ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీలు), ల్యాప్‌టాప్‌లు, ఐవోటీ ఉత్పత్తుల విషయంలో భారత్‌కు అపార సామర్థ్యాలున్నాయి. మొబైల్ ఫోన్ల తయారీలో అంతర్జాతీయంగా అతిపెద్ద కేంద్రంగా భారత్ అవతరించాలన్నది ఆలోచన’’ అని మంత్రి ప్రసాద్ వివరించారు. దేశంలో నైపుణ్యాలు, ఆవిష్కరణల సామర్థ్యాలు, అధిక జనాభా అనుకూలతలు అన్నవి భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేసేందుకు సరిపోతాయన్నారు. కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంతర్జాతీయంగా దిగ్గజ కంపెనీలను ఆకర్షించిందని.. రూ.10 లక్షల కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు సంసిద్ధతను ప్రకటించాయని తెలిపారు. ఇందులో రూ.7 లక్షల కోట్ల మేర ఎగుమతులకు ఉద్దేశించినవిగా పేర్కొన్నారు. -
భారత్‌లో ఐఫోన్ 11 తయారీ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా తమ ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్లను తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ప్లాంటులో ప్రారంభించింది. భారత్‌లో తయారవుతున్న ఐఫోన్ మోడల్స్‌లో ఇది అయిదోది. ‘2020లో ఐఫోన్ 11, 2019లో ఐఫోన్ 7.. ఎక్స్ఆర్, 2018లో ఐఫోన్ 6ఎస్, 2017లో ఐఫోన్ ఎస్ఈ. దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ వ్యవస్థను నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తీరుకు ఇదే నిదర్శనం‘ అంటూ కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ .. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో ఫాక్సా్కన్ గత కొన్ని నెలలుగా ఐఫోన్ 11ని అసెంబుల్ చేస్తోందని, గత నెల నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఎక్స్ఆర్ ఫోన్లను కూడా ఫాక్స్‌కాన్ తయారు చేస్తుండగా, విస్ట్రాన్ సంస్థ ఐఫోన్ 7 స్మార్ట్ఫోన్లను తయారు చేస్తోందని వివరించాయి. -
యాప్‌లో వివరాలు 30రోజుల్లో డిలీట్
న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌లో సాధారణ వినియోగదారుడి వివరాలైతే 30 రోజుల్లో, కరోనా సోకిన వ్యక్తి వివరాలైతే 45–60 రోజుల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. ఆరోగ్య సేతు యాప్ అనేది కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందించిన సోఫిస్టికేటెడ్ సర్వీలెన్స్ కలిగిన యాప్ అని తెలిపారు. ఈ యాప్‌ను ఇప్పటికే 9.5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని, దీనిపై ప్రజలకు ఎంత నమ్మకముందో దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. కరోనా సోకిన వారు దగ్గరలో ఉంటే హెచ్చరిచేందుకు ఈ యాప్‌ను వాడేవారిలొకేషన్ వివరాలను తీసుకుంటుందని తెలిపారు. ఇతర దేశాల్లో ఇలాంటి యాప్‌లు వాడుతున్నారని, దీనిపై అక్కడ మనదేశంలో వచ్చినట్లు ఆరోపణలు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయవద్దంటూ రాహుల్ గాంధీని కోరారు. ప్రజల కోసమే ఐసీఎంఆర్ వద్ద ఉన్న డేటాబేస్‌తో దాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. -
సాల్కాంప్ చేతికి నోకియా చెన్నై ప్లాంటు
న్యూఢిల్లీ: ఒకప్పటి మొబైల్స్ దిగ్గజం నోకియాకు చెందిన చెన్నై ప్లాంటును మొబైల్ చార్జర్ల తయారీ సంస్థ సాల్కాంప్ కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు ఆయన సోమవారం తెలిపారు. దాదాపు పదేళ్లుగా మూతబడి ఉన్న ఈ ఫ్యాక్టరీని సాల్కాంప్ పునరుద్ధరించనున్నట్లు, 2020 మార్చి నుంచి ఈ ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి చెప్పారు. ‘నోకియాకు సంబంధించిన అతి పెద్ద సెజ్ దాదాపు 10 ఏళ్లుగా మూతబడి ఉంది. ఈ డీల్‌తో అది మళ్లీ ప్రాణం పోసుకోనుంది. ఈ ప్లాంటులో చార్జర్లు, ఇతర పరికరాల ఉత్పత్తి జరుగుతుంది. సెజ్ నుంచి 70 శాతం ఉత్పత్తులు ఎగుమతి కానున్నాయి. ఎక్కువగా చైనాకు ఎగుమతి ఉంటుంది. దీని ద్వారా అయిదేళ్లలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 10,000 మందికి ప్రత్యక్షంగాను, సుమారు 50,000 మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభించనున్నాయి‘ అని ఆయన తెలిపారు. మొబైల్ చార్జర్ల తయారీలో సాల్కాంప్ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ఐఫోన్లకు అవసరమైన చార్జర్లను టెక్ దిగ్గజం యాపిల్‌కు సరఫరా చేస్తోంది. మేకిన్ ఇండియా ఐఫోన్ ఎక్స్ఆర్.. మరోవైపు, యాపిల్ తాజాగా ఐఫోన్ ఎక్స్ఆర్ మొబైల్స్‌ను భారత్‌లోనే తయారు చేయడం ప్రారంభించినట్లు రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. దేశీయంగా విక్రయించడంతో పాటు ఎగుమతుల కోసం వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఇది మరింత ఊతమివ్వనున్నట్లు వివరించారు. ‘ఇది భారత్ గర్వించతగ్గ సందర్భం. ఇప్పటిదాకా ఐఫోన్ బాక్స్‌లపై డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా, అసెంబుల్డ్ ఇన్ చైనా అని ఉంటోంది. ఇక నుంచి అసెంబుల్డ్ ఇన్ ఇండియా అనే కాకుండా భారత్‌లోనే తయారీ, మార్కెటింగ్ అని కూడా కనిపించనుంది‘ అని చెప్పారు. తైవాన్ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సంస్థ విస్ట్రన్ ద్వారా యాపిల్ ప్రస్తుతం ఐఫోన్ 6ఎస్, 7లను భారత్‌లో తయారు చేస్తోంది. మేకిన్ ఇండియా నినాదానికి ప్రభుత్వ ఊతంతో.. 2019–20లో మొబైల్స్, విడిభాగాల ఎగుమతులు తలో 1.6 బిలియన్ డాలర్ల స్థాయిని దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
2020లో 5జీ టెక్నాలజీ తెస్తాం: కేంద్రం
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 2020 నాటికి దేశంలో 5జీ మొబైల్ టెక్నాలజీని తీసుకొస్తామని ఐటీ మంత్రి రవిశంకర్ తెలిపారు. దేశంలోని గ్రామ పంచాయతీలను ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌తో అనుసంధానించే ప్రాజెక్టు ఈ ఏడాదిలో పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించే సిటిజన్ సర్వీస్ సెంటర్ల ద్వారా దేశవ్యాప్తంగా 12 లక్షల మందికి ఉపాధిని అందిస్తున్నామని పేర్కొన్నారు. 55 అడుగుల రోబో: సైన్స్ కాంగ్రెస్‌లో శనివారం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆవిష్కరించిన భారీ రోబో ప్రతిమ ఇది. 55 అడుగుల ఎత్తున్న ఈ రోబో పేరు మెటల్ మాగ్నా. 25 టన్నుల బరువున్న దీన్ని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థులు రెండు నెలలు శ్రమించి తయారు చేశారు. -
ప్రతీ గ్రామంలో ‘బ్యాంకింగ్’
న్యూఢిల్లీ: సాంకేతికత, ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్సీ) సహాయంతో దేశంలోని అన్ని గ్రామాల్లో బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని టెక్నాలజీ, కమ్యూనికేషన్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సీఎస్సీల కింద పనిచేస్తున్న గ్రామస్థాయి మహిళా పారిశ్రామికవేత్తల(వీఎల్ఈ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే సీఎస్సీల ద్వారా నగదు తీసుకునే అవకాశం ఉంది. తొందరలోనే ఈ కేంద్రాల్లో అకౌంట్ తెరిచే సదుపాయాన్ని కూడా ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. పాన్‌కార్డులు, పాస్‌పోర్టులు, రైల్‌టికెట్ల ద్వారా వీఎల్ఈలు రూ. 438 కోట్లు సంపాదిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన కల అయిన స్టార్టప్ విప్లవంలో వీఎల్ఈలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం, లబ్ధిదారులకు మధ్య సమన్వయానికి, అవినీతి, జాప్యం తగ్గించడానికి సీఎస్సీలు ప్రధానంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. -
15 నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత రోమింగ్
* జూలైలో పూర్తి మొబైల్ నంబర్ పోర్టబులిటీ * కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పరిధిలో ఉచిత రోమింగ్ సేవలు జూన్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. పూర్తిస్థాయి మొబైల్ నంబర్ పోర్టబులిటీ జూలై నుంచి మొదలవ్వనుందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టెలికం, పోస్టల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. 2004లో బీఎస్ఎన్ఎల్ రూ.10 వేల కోట్ల లాభాల్లో ఉండగా యూపీఏ పదేళ్ల పాలనలో రూ.7,500 కోట్ల నష్టాల్లోకి వెళ్లిందన్నారు. 2008 వరకు లాభా ల్లో ఉన్న ఎంటీఎన్ఎల్ కూడా నష్టాల బాట పట్టిం దన్నారు. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడం, టెలికం, పోస్టల్, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి లక్ష కోట్లకు పైగా ఆదాయం సమకూరిందన్నారు. దేశంలోని 100 పర్యాటక ప్రాంతాల్లో వైఫై ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని హైదరాబాద్ సహా బెంగుళూరు, వారణాసిలో ఇప్పటికే వైఫై సేవలు ప్రారంభమైనట్లు వెల్లడించారు.